మహేష్‌ వాటాల థియరీ.. మిగిలిన స్టార్లకు నచ్చేనా?

సినిమా బడ్జెట్‌ ఎందుకు అంచనాలకు మించి పెరిగిపోతుంది. దర్శకుడు నిర్మాత కలిసి కథను ముందుగా ఫైనలైజ్‌ చేసుకున్నప్పుడు.. బడ్జెట్‌ గురించి లెక్కలు వేస్తారు కదా.. మరి లెక్కకు రెండు మూడు రెట్లు నిర్మాణ వ్యయం…

సినిమా బడ్జెట్‌ ఎందుకు అంచనాలకు మించి పెరిగిపోతుంది. దర్శకుడు నిర్మాత కలిసి కథను ముందుగా ఫైనలైజ్‌ చేసుకున్నప్పుడు.. బడ్జెట్‌ గురించి లెక్కలు వేస్తారు కదా.. మరి లెక్కకు రెండు మూడు రెట్లు నిర్మాణ వ్యయం పెరిగిపోవడం.. కొన్ని సందర్భాల్లో నిర్మాతలు ఆత్మహత్యలు చేసుకునే వరకు వెళ్లడం.. చాలా సందర్భాల్లో సినిమాను వదిలేసి ఎవ్వరికీ దొరక్కుండ పరారైపోవడం ఎందుకు జరుగుతూ ఉంటుంది.. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెబుతుంటారు. అయితే ఒక విషయం మాత్రం నిజం. హీరోలు ఎవరికి వారు బీభత్సంగా తమ రెమ్యూనరేషన్లు పెంచేయడం.. దానికి తగ్గ హంగుల పేరిట నిర్మాణాన్ని మార్చేయడం జరుగుతోంది. దీనికి తాజాగా హీరో మహేష్‌బాబు ప్రతిపాదిస్తున్న వాటాల సిద్ధాంతం పరిష్కారం అవుతుందా అనే చర్చ ఫిలింనగర్లో మొదలైంది. 

స్టార్‌ హీరోలుగా క్రౌడ్‌ పుల్లింగ్‌ శక్తి ఉన్న వారు… 10-15 కోట్ల మధ్యలో తమ రెమ్యునరేషన్‌ మాట్లాడుకుంటూ.. ఒప్పందం కుదిరినంత పుచ్చుకుంటూ.. ఆ సొమ్ము వస్తే చాలు.. సినిమా క్వాలిటీ ఎలా పోయినా పర్లేదనుకోవడం ఒక పోకడగా.. మన ఇండస్ట్రీలోకి చొరబడిపోయింది. ఇప్పుడు శ్రీమంతుడు విజయాన్ని ఎంజాయ్‌ చేస్తున్న మహేష్‌బాబు ఇటీవలి ఇంటర్వ్యూల్లో కొత్త కాన్సెప్టును ప్రతిపాదించారు. నిజానికి ఆయన ఎవ్వరికీ ప్రతిపాదించలేదు గానీ.. తన అభిప్రాయంగా వెల్లడించారు. ఈ సినిమాతో సహనిర్మాతగా కూడ మారిన మహేష్‌బాబు.. సినిమా నిర్మాణ వ్యయం అదుపులో ఉండాలంటే.. ఎవ్వరూ భయపడకుండా.. అందరూ లాభపడేలా ఉండాలంటే.. ఏం చేయాలో చెబుతున్నారు. 

''ఎవరో ఒకరు ఎక్కడో ఒకచోట రాజీపడాలి. పారితోషికం తగ్గించుకుని.. సినిమాల్లో వాటా తీసుకుంటే సినిమా తక్కువలో అయిపోతుంది కదా?'' అని మహేష్‌బాబు ప్రశ్నిస్తున్నారు. సిద్ధాంతం చాలా బాగుంది. మహేష్‌బాబుకు ఓపిక ఉన్నది గనుక.. శ్రీమంతుడు విడుదల అయ్యేదాకా ఆగి.. ఆ సక్సెస్‌లో తన కష్టానికి ఫలితాన్ని రాబట్టుకునే పనిలో ఉన్నాడు. కానీ.. రెమ్యూనరేషన్‌ తగ్గించుకుని.. సినిమా విడుదల అయి రిజల్టు వచ్చే వరకు తమ డబ్బుకోసం నిరీక్షించే ఓపిక అందరు హీరోలకు ఉన్నదా? తమ సొంత మనుషులైన నిర్మాతల వద్దే.. ఆస్తులు అమ్మించి రెమ్యూనరేషన్లు వసూలు చేసుకునే హీరోలున్న మన ఇండస్ట్రీలో.. ఇంత ఔదార్యం ఎందరు అంగీకరించగలరు? అనేది ప్రశ్న. 

ఏది ఏమైనప్పటికీ మహేష్‌ చెప్పిన సిద్ధాంతాన్ని ఫాలో అయితే మాత్రం.. చాలా మంది అగ్ర నిర్మాతలకు కష్టాలు తొలగుతాయని.. పెద్దహీరోల చిత్రాలు రెగ్యులర్‌గా వస్తాయని.. సినిమా పరిశ్రమ కష్టాల సుడినుంచి బయటపడడంలో క్రమంగా దారి ఏర్పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.