యాకూబ్ మెమన్‌కు ఉరి వేసేదాకా నా ప్రాణం బిక్కుబిక్కుమంటూనే వుంది, ఏదో ఒకటి జరిగి ఉరి ఆగిపోతుందేమోనని! ఉరి గురించి చర్చలు, ప్రకటనలు జోరుగా సాగాయి మరి. నాగరికత యింత పెరిగిన తర్వాత కూడా యింకా ఉరి వేయడమేమిటి? వేసినా మానినా టైగర్ మెమన్‌కు వెయ్యాలి తప్ప యితని కేమిటి? ఇలా వేస్తే భారత దేశాన్ని, న్యాయవ్యవస్థను, పోలీసు వ్యవస్థను యింకెవరైనా నమ్ముతారా? అతను ముస్లిం కాబట్టి వేస్తున్నారు కానీ హిందువైతే వేసి వుండేవారా? హిందువే అయినా అగ్రకులస్తుడైతే వేసేవారా? పోలీసు విచారణలో సహకరించాడు కదా, అలాటివాణ్ని ఉరి వేయడం సబబా? విద్యావంతుడు, జైల్లో యితరులకు చదువు చెప్పాడు, యిలాటివాణ్ని ఉరేసి మనం ప్రపంచానికి ఏం సందేశం పంపుతున్నా? వేసి వుంటే ఎప్పుడో వేయాలి కానీ యింత ఆలస్యమా? ఇన్నాళ్లూ బతకనిచ్చి, అతనిలో ఆశ రగిలించి యిప్పుడు చంపేయడం అమానుషం – ఇలా రకరకాల వ్యాఖ్యలు చేసినవారిలో మేధావులు, ఉదారవాదులు, రాజకీయనాయకులు, పని కట్టుకుని భిన్నంగా ఆలోచించడంలో అనురక్తి కలిగినవారు అందరూ వున్నారు. వీళ్లందరి కృషి ఫలితంగా, గగ్గోలు ఫలితంగా ఆఖరి నిమిషంలో క్షమాభిక్ష పెట్టేస్తారేమో అనుకున్నాను. ఎందుకంటే స్వాతంత్య్రం వచ్చిన దగ్గర్నుంచి ఉరిశిక్ష పడిన వారిలో 1% మందిని మాత్రమే ఉరి తీశారట.
ఇలాటి విషయాల్లో ఎవరి అభిప్రాయాలు వారివి. నా మటుకు నేను ఉరిశిక్ష రద్దు చేయాలని వాదించను. 'ప్రాణం పోసే భగవంతుడికి మాత్రమే ప్రాణం తీసుకునే హక్కు వుంది, మానవమాత్రుడికి లేదు' అనేది సినిమా డైలాగుగా బాగుంటుంది. మరి సాటి మనిషి ప్రాణాలు హరించే మనిషి దగ్గర యీ డైలాగు పేలుతుందా? వాడు ఎడాపెడా చంపేస్తూన్నా, మనం మాత్రం వాణ్ని నిలవరించకూడదా? వాడికి వేసే ఉరిని కొందరు సమాజం చేస్తున్న హత్యగా వర్ణించడం ఏం సబబు? వాడిలా సమాజం వ్యక్తిగత కక్షతో, ప్రతీకారేచ్ఛతో చంపటం లేదు, చాటుమాటుగా చంపటం లేదు, చంపేసి పారిపోవడం లేదు. ఈ తీర్పు ద్వారా మళ్లీ యిలాటి నేరం చేయబోయేవాడికి హెచ్చరిక యిచ్చి, తన పౌరులను రేపటి దాడుల నుంచి రక్షించుకుంటోంది. తీర్పు యిచ్చే న్యాయాధీశుడికి ముద్దాయితో ఏ మాత్రం పరిచయం వున్నా అతను కేసు నుంచి తప్పుకుంటాడు. ఇరువైపుల వాదోపవాదాలు విని, సాక్ష్యాలు పరిశీలించి, పరీక్షించి, నిగ్గు తేల్చి చివరకు నిర్మోహంగా, రాగద్వేషాలకు అతీతంగా వున్న మనసుతో తీర్పు యిస్తాడు. చాలా సందర్భాల్లో ఆ తీర్పు వెలువడడానికి ఏళ్లూ, పూళ్లూ పడుతుంది. అప్పటివరకు ఖైదీకి ఆ ఆయుర్దాయం బోనస్‌గా లభించినట్లే. అప్పుడు మళ్లీ కొందరు 'ఖైదీ వృద్ధుడు, శిక్ష అనుభవించలేడు' అని అప్పీలుకి వెళతారు.
నిజానికి తీర్పు యిచ్చేటప్పుడు న్యాయమూర్తులు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. ముఖ్యంగా ఆవేశంలో నేరం చేశాడా, పథకం వేసి చేశాడా అనేది అతి ముఖ్యమైన పాయింటు. ఆత్మరక్షణకో, ఆత్మీయుల రక్షణకో, లేక ఆత్మీయుల చెడునడత కారణంగానో ఆవేశానికి లోనై (క్రైమ్స్ ఆఫ్ పేషన్) అప్పటికప్పుడు చేతికి ఏది అంది వస్తే దానితో ఎదుటి వ్యక్తిని చంపేస్తే దానికి శిక్ష ఒకలా వుంటుంది. ఎందుకంటే ఆవేశం అనేది మానవదౌర్బల్యం. అలా కాకుండా మనోబలంతో కుట్ర పన్ని, పథకం వేసి చంపాడంటే దాని అర్థం అతనికి సాటి మానవుల పట్ల జాలి, దయ లేవని. దానికి శిక్ష వేరేలా వుంటుంది. బొంబాయి పేలుళ్ల వంటివి ప్లాను చేయడానికి ఎన్నో రోజులు పడుతుంది. మనుష్యులు కావలసి వస్తారు, డబ్బు కావలసి వస్తుంది. ఇవన్నీ సమకూర్చుకునే టైములో మానవసహజమైన ఆవేశం వుంటే చల్లారిపోతుంది. చల్లారలేదంటే అతనిలో రాక్షసత్వం వున్నట్లే! ఇలాటి రాక్షసులను చంపితే చచ్చినవాళ్లు బతికి వస్తారా, దానికి బదులు వాళ్లను జైలులోనే వుంచి సంస్కరిస్తే మంచిది అని హితోక్తులు పలుకుతారు కొందరు. జైళ్లలో దుర్భరమైన పరిస్థితులున్నాయని, సంస్కరించ వలసిన అవసరం వుందని అందరికీ తెలుసు. ప్రతిపక్షంలో వుండగా వాటిని ఎత్తిచూపిన నాయకులు అధికారంలోకి రాగానే మర్చిపోతారు. మేమన్‌ను ఉరి వేసినా, వేయకపోయినా ఆ సంస్కరణలు అమలు చేయవచ్చు. నేరారోపణ ఏదీ లేకుండా జైల్లో మగ్గుతున్న వారిని విడిచిపెట్టవచ్చు. జైళ్లలో సకలభోగాలు అనుభవిస్తున్న సంఘవిద్రోహులను అణచవచ్చు. అవేమీ చేయటం లేదు. జైళ్లు నరకకూపాలుగా, మెత్తటి స్వభావం గల ఖైదీలు కూడా కరడుగట్టిన నేరస్తులుగా మారే ప్రమాదస్థలాలుగా వున్నాయని ఒప్పుకుంటూనే ఉరి తీయదగిన వ్యక్తులను అక్కడే వుంచి సంస్కరించాలనడం ఎలా పొసుగుతుంది? జైళ్లను చక్కదిద్దాక అప్పుడు వీళ్లను చక్కదిద్దడం గురించి మాట్లాడండి.
'వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు' అనే కొటేషన్ కూడా వినడానికి బాగానే వుంటుంది. కానీ కాస్త ఆగి ఆలోచించండి – వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్వాలేదా? తప్పించుకుని వాళ్లు ఏం చేస్తారు? శెనక్కాయలు అమ్ముతారా? వెయ్యిమంది కొత్త దోషులను తయారుచేస్తారు, పదివేలమంది నిర్దోషులను చంపుతారు. అది ఓకేనా? ఉరి తీయాల్సిన ఉగ్రవాదులను జైల్లో పెట్టి ప్రజలకు చెందవలసిన డబ్బుతో మేపుతున్నారు. ఎన్నాళ్లు? జైల్లో వుంచడం ఎంత ఖర్చుతో, మ్యాన్‌పవర్ వినియోగంతో, ఎంత రిస్కుతో కూడుకున్నది! అతను తమను మరీ అదలిస్తూ వుంటే అతని కాపలాదారులే కసి కొద్దీ విషం పెట్టి చంపేయవచ్చు. అతన్ని కోర్టుకి తీసుకెళుతూంటే, లేదా వేరే వూళ్లోని జైలుకి మారుస్తూ వుంటే అతని అనుచరులు తప్పించాలని ప్లానులు వేసి, రక్షణగా వున్న సెక్యూరిటీని చంపేయవచ్చు. అది కుదరకపోతే అమాయకులను కిడ్నాప్ చేసి, యితన్ని విడుదల చేయమని బేరాలు పెట్టవచ్చు. ఇతను బయటకు వచ్చి ఇంకొంతమందిని చంపుతాడు. ఉరి పడాల్సినంత ఘోరం చేసిన ఉగ్రవాదులను ఎంతకాలం సజీవంగా వుంచితే అంతకాలమూ రిస్కే. అయితే అతను నికార్సయిన ఉగ్రవాదా కాదా అని తేల్చే ప్రక్రియ మాత్రం నిర్దుష్టంగా వుండాలి.
నిర్దోషికి శిక్ష పడాలని అన్నం తినేవాడు ఎవడూ అనడు. కానీ అలా శిక్ష పడే అవకాశమైతే వుంది. క్లాసులో అల్లరి చేసినవాడు ఎవడో తేలకపోతే టీచరు క్లాసు మొత్తానికి శిక్ష విధిస్తాడు. ఒక్కోప్పుడు వూరు మొత్తానికి జరిమానా విధిస్తారు. సమూహంలో వుంటున్నపుడు ఒనగూడే లాభాలతో బాటు యిలాటి నష్టాలూ వుంటాయి. చట్టాల్లో లొసుగులు వుంటాయి, అధికారాన్ని దుర్వినియోగం చేసేవారుంటారు. న్యాయమూర్తులు పక్షపాతంతో వ్యవహరించిన సందర్భాలూ వుంటాయి. నీటిలోని మాలిన్యాలను తొలగించడానికి రకరకాలుగా వడపోసినట్లే, కేసులోని అసత్యాలను తొలగించడానికి భారతీయ న్యాయవ్యవస్థ ఎన్నో వడపోతలను, అంచెలంచెలుగా పొరలను ఏర్పాటు చేసింది. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఆగస్టు 2015)