తెలుగు మహిళకు టికెట్ల ఇక్కట్లు

ఆమె ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ తెలుగుదేశంలో ఆమెకు విశేష ప్రాధాన్యత దక్కుతోంది. ఆమెను తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా చంద్రబాబు ఎంపిక చేశారు. ఆమె కంటే సీనియర్లు ఈ విషయంలో గుర్రుగా ఉన్నా…

ఆమె ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ తెలుగుదేశంలో ఆమెకు విశేష ప్రాధాన్యత దక్కుతోంది. ఆమెను తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా చంద్రబాబు ఎంపిక చేశారు. ఆమె కంటే సీనియర్లు ఈ విషయంలో గుర్రుగా ఉన్నా బాబు పట్టించుకోవడం లేదని అంటున్నారు.

అనిత విశాఖ జిల్లా పాయకరావు పేట నుంచి 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 నాటికి ఆమెను గోదావరి జిల్లాలోని కోవూరు నుంచి పోటీ చేయించారు. ఆమె అక్కడ ఓడారు. 2024లో పాయకరావుపేట నుంచి మళ్ళీ పోటీకి అనిత రెడీ అవుతున్నారు.

ఆమెకు టికెట్ ఇవ్వవద్దు అని స్వపక్షంతో పాటు మిత్ర పక్షంగా మారనున్న జనసేన నుంచి కూడా డిమాండ్లు వస్తున్నాయి. స్వపక్షంలో అయితే ఆమె సీనియర్లను లెక్కచేయడంలేదని, ఏకపక్షంగా పోతున్నారు అన్న విమర్శలతో ఆమె అభ్యర్ధిత్వాన్ని అడ్డుకుంటూంటే.. జనసేన నాయకులు అయితే బాహాటంగా చెప్పేసారు.

అనితకు తప్పించి ఎవరికైనా టికెట్ ఇచ్చుకోండి పొత్తులు ఉంటే మాత్రం ఆమెకు మేము పనిచేయమని. ఈ విషయాన్ని జనసేన నేత గడ్డం బుజ్జి స్పష్టం చేశారు. అనిత మహిళా అధ్యక్ష పదవిలో ఉన్నారు. ఆమెకు టికెట్ ఇచ్చి తీరాల్సిందే అన్నది ఆమె వర్గం వాదన.

అనిత పాయకరావుపేట నుంచి గెలిచి వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే మంత్రి కావాలని చూస్తున్నారు. అయితే ఆదికి ముందే అన్నట్లుగా టికెట్ల దగ్గరే ఆమెకు ఇబ్బందుకు ఎదురవుతున్నాయి. పాయకరావుపేటకు మరో అభ్యర్ధి ఇప్పటికిపుడు ఎన్నికల వేళ అంటే కుదిరే వ్యవహారం కాదు, పొత్తులలో జనసేన కూడా ఈ సీటు కోరవచ్చు అన్నది మరో న్యూస్ గా ముందుకు వస్తోంది. ఈ పరిణామాల నేపధ్యంలో తెలుగు మహిళకు టికెట్లు ఇక్కట్లు మొదలయ్యాయని అంటున్నారు.