దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్లలో ఒకరు జ్యోతిరాదిత్య సింధియా. గ్వాలియర్ సంస్థానం వారసుడు అయిన జ్యోతిరాధిత్య ప్రస్తుతం బీజేపీ నేత. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కూడా! వాస్తవానికి సింధియాల గురించి ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. వీరి రాజవైభోగం అలాంటిలాంటిది కాదు. వీరి కుటుంబం ప్రస్తుతం నివాసం ఉండే భవంతి విలువే కనీసం నాలుగు వేల కోట్ల రూపాయలు అని అంచనా! ఈ రాచకుటుంబం రాజకీయాల్లో కూడా దశాబ్దాలుగా ఉనికిని చాటుకుంటూ ఉంది.
మరి ఫ్యామిలీ రేంజ్ ఇలా ఉన్నా.. జ్యోతిరాదిత్య తనయుడు మహాన్ఆర్యమాన్ సింధియా మాత్రం తన సొంత సత్తాను నిరూపించుకుంటున్నాడు. కేవలం 11 లక్షల పెట్టుబడితో ఇతడు తన వ్యాపారాన్ని సాగిస్తూ ఉన్నాడు. మైమండీ పేరుతో ఒక అప్లికేషన్ ను ఈ జూనియర్ సింధియా రన్ చేస్తూ ఉన్నాడు.
రెండేళ్ల కిందట 11 లక్షల పెట్టుబడితో మండీ నుంచి వినియోగదారులకు కూరగాయలను అందజేసే అప్లికేషన్ ను ప్రారంబించాడు మహాన్ఆర్యమాన్. అది తొలి ఏడాదికే మంచి లాభాల బాటపట్టిందట. ఏడాదిలో 60 లక్షల టర్నోవర్ స్థాయికి చేరిందట దీని టర్నోవర్. ఇటీవల దానికి అదనంగా 4.1 కోట్ల రూపాయల ఫండింగ్ కూడా చేశారట. దీంతో.. దీని మార్కెట్ వ్యాల్యూ ఐదు కోట్ల రూపాయలకు చేరిందట.
ఇలా కేవలం 11 లక్షల పెట్టుబడితో ఆ రాజకుమారుడు మొదలుపెట్టిన కూరగాయల సరఫరా అప్లికేషన్ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోందట. మొత్తానికి మన రాజకుటుంబం ఏమిటీ.. కూరగాయల సప్లై ఏమిటి.. అనే లెక్కలు వేయకుండా.. సింధియాల వారసుడు యువ వ్యాపారవేత్తగా ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నాడు.