ఎమ్బీయస్‌ కథలు – 24

సెలూన్‌ చంద్రయ్య  Advertisement సెలూన్‌ చంద్రయ్య నడిపే సెలూన్‌ పేరు సెలూనే! ముందూ, వెనకా ఏ పేరూ లేదు. ఏభయి యేళ్ల క్రితం సెలూన్‌ ఆరంభించిన కొత్తలో 'మాస్కో సెలూన్‌' అని పేరు పెడతానన్నాట్ట.…

సెలూన్‌ చంద్రయ్య 

సెలూన్‌ చంద్రయ్య నడిపే సెలూన్‌ పేరు సెలూనే! ముందూ, వెనకా ఏ పేరూ లేదు. ఏభయి యేళ్ల క్రితం సెలూన్‌ ఆరంభించిన కొత్తలో 'మాస్కో సెలూన్‌' అని పేరు పెడతానన్నాట్ట. 'అదేం పేరు!' అంటే 'ఏం? న్యూయార్కు టైలర్సు లేదూ? అలాగే ఇదీనూ! అన్నాట్ట. అయినా సాటి కామ్రేడ్స్‌కు అందులో విపరీతార్థం తోచి మాస్కో పేరు వద్దన్నారుట. 'అయితే దీని పేరు వట్టి సెలూనే' అన్నాట్ట చంద్రయ్య.

నిజానికి సెలూనే అతని జీవనాధారం, కర్మాగారం, విజ్ఞానకోశం, విశ్వవిద్యాలయం. కమ్యూనిజానికి సంబంధించిన పత్రికలు, పుస్తకాలు అక్కడ దొరికేవి. వచ్చినవాళ్లు దేశవిదేశాల రాజకీయాల గురించి ఘాటు ఘాటు చర్చలు సాగించేవారు. చంద్రయ్య పనిలో మహాచురుకు, వచ్చినవాళ్లకి చకచకా తలపనిచేస్తూనే అందరి అభిప్రాయాలూ వినేవాడు, తన అభిప్రాయాలు చెప్పేవాడు. గాంధీ, నెహ్రూలను జనాలు దేవుళ్ల స్థాయిలో కొలిచే రోజుల్లో సైతం వాళ్ల విధానాలని సెలూన్‌ వాసులు దుయ్యబడుతూండేవారు. కమ్యూనిస్టు పార్టీ మీద నిషేధం ఉన్న రోజుల్లో కూడా చంద్రయ్య సెలూన్‌ మూతబడలేదు. చర్చలు ఆగలేదు. పోలీసులు అతని జోలికి రాకపోవడానికి కారణం చంద్రయ్య మీద ఊళ్లో ప్రతీవాడికీ గల గౌరవమే.

చంద్రయ్యకు రష్యా అంటే గల వెర్రి భక్తి చూసి కొందరు నవ్వుకున్నా, కొందరు విస్తుపోయినా, అందరూ అతని నిజాయితీని మెచ్చుకొనేవారు. చంద్రయ్య తమ్ముడు పొద్దున్న తలపని చేసి, మధ్యాహ్నం బాజా వాయించడం ప్రాక్టీసు చేసి బాండ్‌ మేళంలో బాగానే సంపాదించాడు. కానీ చంద్రయ్య పనిలేని సమయమంతా పుస్తకాలు చదవడంలో గడిపేసేవాడు. వామపక్ష సిద్ధాంతాల గురించి ఏ పుస్తకం వెలువడినా, చదివేవాడు. చదివి చదివి వాటిలోని కృతకమైన భాష అలవడింది కానీ అతని భాష క్రమంగా బాగుపడింది. అప్పుడప్పుడు 'చ' బదులు 'స' అంటాడు కానీ, లేకపోతే కొత్తవాళ్లు తెలుగులో విద్యాధికుడనుకొంటారు.

చదవడం, చర్చించడం ఎవరైనా చేస్తారు. ఆచరణలో పెట్టడం మాత్రం చంద్రయ్యకే చెల్లు. పనివాళ్లను తన కుటుంబ సభ్యుల్లా చూసుకొని వాళ్లకి లాభంలో వాటాలిచ్చేవాడు. వ్యాపారంలో, వ్యవహారంలో దగా అన్నది చేసి ఎరగడు. అంతేకాదు కొడుకు కాలేజీలో చదివే రోజుల్లో కూడా సెలవుల్లో అతని చేత సెలూన్లో పని చేయించేవాడు.

అతని కొడుకు అరుణ్‌కుమార్‌ నాకు క్లాస్‌మేట్‌. కార్మికరాజ్యం నెలకొన్నాకే పిల్లల్ని కంటానని చంద్రయ్య చాలాకాలం వాయిదా వేసాడు కానీ చివరికి భార్య పట్టుదలకు లొంగాల్సి వచ్చింది. అందువల్లనే అరుణ్‌కుమార్‌ చంద్రయ్యకు ముఫ్పై అయిదో యేట పుట్టాడు. క్లాసులో బాగానే చదివేవాడు. సెలవొస్తే సెలూన్లో పని చేయమనేవాడు వాళ్ల నాన్న. చదువుకునే కుర్రాడు కదా అని భార్య అభ్యంతరం పెడితే 'శ్రామికశక్తిని తక్కువగా చూడకు బుద్ధిశక్తికీ, శ్రామికశక్తికి గల అంతరం పోయే రోజు దగ్గర్లోనే వుంది' అనేవాడు చంద్రయ్య.

తండ్రి చెప్పినమాట జవదాటేవాడు కాదు అరుణ్‌. కానీ నేను కనక సెలూన్‌కి వచ్చి తలపని చేయించుకొంటుంటే సిగ్గుపడేవాడు. కాలేజీలో వచ్చాక కూడా తండ్రి సెలూన్‌ పనికి రమ్మంటే విసుక్కునేవాడు – తను 'లైట్‌' కొట్టే అమ్మాయిలు ఎక్కడ చూస్తారోనన్న భయం చేత.

చంద్రయ్య ఆ మాత్రం గ్రహించుకోలేకపోలేదు. ''ఇలాంటి సెలూన్లో పనిచేస్తే నామోషీ అనుకొంటారు. అదే 'హెయిర్‌ డ్రెస్సింగ్‌' అని పేరు పెట్టి ఓ డిప్లోమా ఇస్తారంటే ఈ కుర్ర పిల్లలందరూ ఆడనక, మగనక, ఎగబడి డిప్లోమాలు సదివేసి షాపులెట్టేస్తారు. ఇదంతా అమెరికావోడి మాయ. దాంట్లో మనవాళ్లందరూ పడి కొట్టుకుపోతున్నారు'' అనేవాడు.

అమెరికా వాడన్నా, వాడి ట్రిక్కులన్నా చంద్రయ్యకు తగని మంట. సి.ఐ.ఎ. చేసే అకృత్యాలన్నీ అతనికి కంఠోపాఠం. అమెరికావాడు అలీన రాజ్యాల్ని ఎలా బుట్టలో పెట్టేస్తున్నాడో సోదాహరణంగా చెప్పేవాడు.

కానీ రష్యాగానీ, కె.జీ.బీ, గానీ ఏదైనా పొరబాటు చేసిందంటే ఛస్తే ఒప్పుకునేవాడు కాడు. ''కార్మిక రాజ్యం సార్‌. పుట్టినప్పటి నుండీ దాని గొంతు నులిమి చంపేద్దామని ఇంగ్లీషోడి కాడి నుంచి ప్రతీవోడూ ప్రయత్నించేవోడే! ఆత్మ సంరక్షణార్థం ఏదో ఒకటి చెయ్యక తప్పతుందేటి?'' అని వాదించేవాడు.

కాలక్రమేణా ఎన్నో మార్పులు వచ్చాయి. కృశ్చేవ్‌ వచ్చాడు. స్టాలిన్‌ చేసినవన్నీ తప్పులన్నాడు. (''అక్కడ కాబట్టి అది చెల్లిందండి. ఇక్కడ గాంధీగార్ని విమర్శించి చూడండి. జనాలు రాళ్లెట్టి కొట్టేస్తారు'') తర్వాత అతను కనుమరుగయ్యేడు… తర్వాత మరొకడు… మరొకడు… కానీ చంద్రయ్య విధానంలో మార్పులేదు. ''కార్మికుడి కొడుకు అక్కడ కాబట్టి దేశాధినేత అయ్యాడు. ఇక్కడేముంది? నెహ్రూగారు పోతే ఆయన కూతురు, ఆ తర్వాత మనవడు, ఇంకొన్నాళ్లకి మునిమనవడు. ఇంతేనండి మనకు రాజవంశాలే గతండి. నా బోటివాడి కొడుకు ఎప్పటికైనా ఢిల్లీ గద్దె నెక్కగలడా? గుండె మీద సెయ్యేసుకొని చెప్పండి''

xxxxxxxxxxxxxx

భారతదేశపు కమ్యూనిస్టుల్లోనూ మార్పులొచ్చాయి. చీలికలొచ్చాయి; ముక్కలు చెక్కలయ్యేరు. వాళ్లలో వాళ్లు కలహించుకొన్నారు. బలహీనపడ్డారు. కొంతమంది పార్టీకి దూరమయ్యారు. కాపిటలిస్టులయ్యారు. ఇవన్నీ చూసి చంద్రయ్య నొచ్చుకున్నాడు కానీ ఎవర్నీ నిందించేవాడు కాదు.

''పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క పతనావస్థండి ఇది. పరిసర ప్రభావం అందరిమీదా పడకుండా వుంటుందా? పూర్తి కార్మికరాజ్యం ఏర్పడేవరకూ ఈ పురిటి నొప్పులు తప్పవండి. అందుకే మావోణ్ణి పై సదువులకు మాస్కో పంపిద్దామని చూస్తున్నానండి. తోటివాడితో కలిసి సంపద పంచుకోవడం ఆ వయస్సులో కళ్లారా చూస్తే మనిషి వ్యక్తిత్వం కూడా అలా రూపుదిద్దుకుంటుంది కదండి'' అనేవాడు.

అరుణ్‌కి మాస్కో వెళ్లడం గురించి అంత పట్టుదల లేదు. మాస్కో డిగ్రీలంటే ఎవరికీ మంచి అభిప్రాయం లేదేమోనన్న భయం వాడిది. నేను ఐ.ఐ.టి.కి వెళుతూ వాడినీ కట్టించమని చంద్రయ్యతో పోట్లాడాను.

''అక్కడ చదివిన వాళ్లందరికీ కళ్లకు గంతలు కట్టేస్తారు బాబూ, చదువు పూర్తయ్యాక పేదప్రజల కష్టాలు తీర్చడానికి ఒక్కడూ సిద్ధపడడు. అందరూ అమెరికాకి పరిగెత్తి డబ్బు నొల్లుకుందామని చూస్తారు. మావాడి చదువు పదిమందికి ఉపయోగపడాలని నా ఉద్దేశ్యం'' అన్నాడు చంద్రయ్య.

ఎట్టకేలకు చంద్రయ్య పార్టీ పెద్దల సహకారంతో కొడుకుని మాస్కో పంపగలిగాడు. కానీ అరుణ్‌ మాస్కో వెళ్లాక తాగుడికీ, డ్రగ్స్‌కీ, వ్యభిచారానికీ అలవాటు పడ్డాడని విని నిర్ఘాంతపోయాడు.

డ్రగ్స్‌ లాటివి రష్యాలో సులభంగా దొరుకుతాయని అంతకుముందు ఎవరైనా చెబితే అదంతా 'పశ్చిమ దేశాల ప్రచార యుద్ధం, అదేంటది… 'డిస్‌ఇన్‌ఫర్మేషన్‌'' అని కొట్టిపారేసేవాడు చంద్రయ్య. ఈ రోజు తన కొడుకే సాక్ష్యంగా నిలిస్తే ఏం చేస్తాడు?

గోర్బచేవ్‌ గతాన్ని తవ్విదీసి, కప్పెట్టినవన్నీ లోకానికి చాటి చెప్పడంతో చంద్రయ్య తికమకపడ్డాడు. 

''అయినా కమ్యూనిస్టు రాజ్యం ఇంకా ఏర్పడలేదు కదా! సోషలిస్టురాజ్యం కాబట్టి ఇన్ని అవకతవకలు జరిగాయి. అవన్నీ దిద్దుకొంటున్నప్పుడు మనం హర్షించాలి కానీ, తప్పుబట్టకూడదు'' అని సర్దిచెప్పుకున్నాడు.

మాస్కో నుండి కొడుకు సప్తవ్యసనాలతో దిగడం చంద్రయ్యను కృంగదీసింది. ''ఈ క్యాపిటలిస్టు నాకొడుకులు రష్యాలో ప్రవేశించి అందర్నీ భయపెట్టి చెడగొట్టేసారండీ. మావోడు బలైపోయాడు'' అని బాధపడేవాడు.

ఇంటిపట్టున ఓ ఏడాది వుండడంతో అరుణ్‌ బాగుపడ్డాడు. కానీ చంద్రయ్య మానసికంగా దెబ్బతిన్నాడు. శారీరకంగా బలహీనుడయ్యాడు. తనతో ఇన్నాళ్లూ పనిచేసినవాళ్లకే షాపు అమ్మేసి ఇంటిపట్టున వుండిపోయాడు. కొడుక్కి పెళ్లి చేసి, వున్న వూళ్లోనే ఉద్యోగం చూసుకోమన్నాడు, లేదా ఏదైనా ఫ్యాక్టరీ పెట్టి పదిమందికి తిండి చూపించమన్నాడు.
కానీ పెళ్లవగానే బొంబాయిలో ఉద్యోగం చూసిపెట్టమని అరుణ్‌ నాకు రాసాడు. బాల్యమిత్రుడు తోడుగా వుంటాడు కదాని మంచి కంపెనీలో ఉద్యోగం ఇప్పించేను.

ఓ రోజు ఆఫీసుకి ఫోన్‌ చేస్తే అరుణ్‌ ఊరెళ్లాడన్నారు. తిరిగొచ్చాక ఇంటికొచ్చి విషయం చెప్పాడు. ''నాన్నకు పక్షవాతం వచ్చిందిరా''

''అరెరే, ఎప్పుడు? ఎలా వచ్చింది? ఇప్పుడెలా వుంది?''

''రష్యా విచ్ఛిన్నమైందన్న వార్త తెలియగానే నాన్నకు స్ట్రోక్‌ వచ్చిందట''

''డోంట్‌ బీ సిల్లీ''

''నిజంగారా. నాన్న సంగతి తెలుసుకదా. రష్యా అజేయమైన శక్తితో దాన్ని ఆదర్శంగా పెట్టుకొనే తక్కిన దేశాల్లోని కార్మికోద్యమాలన్నీ ముందుకు సాగుతాయనీ ప్రగాఢంగా నమ్మేవాడు. ఆయనకు నిలుచున్నా, కూచున్నా రష్యా జపమే. అలాటిది అంత పెద్ద సామ్రాజ్యం పేకమేడలా కుప్పకూలిపోయిందంటే తట్టుకోలేకపోయాడు.''

'మీ నాన్న రష్యా భక్తి నాకు తెలియనది కాదు. ఇంకా అంతకంటే వీరాభిమానులు కూడా వున్నారు. వాళ్లెవరికీ ఏమీ కాలేదు. ఇతనికి మాత్రం…''

''అలాక్కాదు. అంతకుముందే ఓ సంఘటన జరిగింది. నాన్న దగ్గర సెలూన్‌ కొనుక్కున్న పనివాళ్లు కొత్త పనివాళ్లను పెట్టుకుని చాలా హింసిస్తున్నారట. జీతాలివ్వరట. సరిగ్గా పనిచేయటం లేదని ఓ కుర్రాణ్ణి ఒక పార్టనర్‌ కాల్చి వాత పెట్టాడట. ఇదంతా విని 'నా దగ్గిర ఇన్నాళ్లూ వీళ్లు నేర్చుకున్నది ఇదా? కార్మికుడు యజమానైతే సాటి కార్మికుడికి మేలు చేస్తాడనుకున్నాను కానీ ఈ విధంగా శ్రమ దోపిడీ చేస్తాడా?' అని నాన్న ఎంతో బాధపడి బీపీ తెచ్చుకున్నాట్ట.

''నా విషయంలో నాన్న ఎంత కుమిలిపోతున్నాడో వేరే చెప్పక్కర్లేదు. నేను సుఖాలు మరిగి, కాపిటలిస్టు తత్వం వంటబట్టించుకొంటున్నానని ఎంతో బాధపడతాడు. అందరూ ఆయనలాగే వుండరన్న విషయం ఆయనకూ తెలుసనుకో. అయినా తన కొడుకూ, కొడుకులా చూసుకున్న పనివాళ్లూ ఇలా తయారవ్వడమే ఆయన భరించలేకపోయాడు.

పులిమీద పుట్రలా రష్యా విచ్ఛిత్తి వార్త ఒకటి – మనదేశంలో ఇన్ని జాతులున్నా విడిపోకుండా వున్నాం కదా. అరవై యేళ్లు కార్మిక నియంతృత్వంలో కలిసి మెలిసి వున్నా సోవియట్‌ యూనియన్‌లో వున్న వివిధ జాతులవాళ్లు ఏకం కాలేకపోగా ఒకళ్లతో మరొకరు పోట్లాడ్డం నాన్నకు జీర్ణం కాలేదు.

ఇన్నాళ్లూ నమ్ముకున్న ఊతకర్ర విరిగిపోయినట్టు, దీపస్తంభం కూలిపోయినట్టూ అనిపించింది. చదువుకుని ప్రపంచం పోకడలు గమనిస్తున్న కామ్రేడ్లు ఎప్పటికో ఇలా జరగబోతుందని ఊహించి మానసికంగా సిద్ధపడి వుంటారు. మా నాన్నలాటి మూఢభక్తులదే బాధంతా. వాస్తవాల్ని తట్టుకోలేక మంచం పట్టాడు.''

ఈసారి ఊరెళ్లినప్పుడు చంద్రయ్యను తప్పకుండా చూడాలనుకున్నాను. ఏడాదిన్నర దాకా వీలుపడలేదు. ఈలోపున ఓ మల్టీ నేషనల్‌ కంపెనీలో ఉద్యోగానికి అరుణ్‌ దరఖాస్తు పడేశాడు. నన్ను సిఫార్సు చేయమన్నాడు.

xxxxxxxxxxxxxxx

దాని ఛైర్మన్‌ హూవర్‌ నాకు బాగా తెలుసు. మా కంపెనీ హెడ్‌ క్వార్టర్సు కూడా న్యూయార్కులోనే వుంది కాబట్టి ఆర్నెల్లకోసారి ఆయన్ని అక్కడ కలుస్తూంటాను. హూవర్‌కి భారతదేశం అంటే మహా ఆసక్తి. ఇండియా వచ్చి మన నదులూ, పల్లెటూళ్లూ చూస్తానంటూండేవాడు. వచ్చే నెలలో ఇండియాకు వచ్చినప్పుడు ఉద్యోగం విషయం మాట్లాడతానని అరుణ్‌కి మాట ఇచ్చాను.

వేరే ఎక్కడికో ఎందుకని హూవర్‌ని మా ఊరికే తీసుకెళ్లాను. ఆయన్ని హోటల్లో బస చేయించి చంద్రయ్యను చూడబోయాను. మనిషి చాలా పాడయ్యాడు. మాట కూడా  ముద్దగా వస్తోంది. అరుణ్‌ ఉద్యోగ ప్రయత్న విషయం అతనికి చెప్పడం భావ్యమనిపించింది. తనకు చెప్పకుండా అమెరికన్‌ కంపెనీలో తన కొడుకుని చేర్చినందుకు నన్ను తప్పు పట్టవచ్చు!

అందువల్ల బెదురుతూనే 'అరుణ్‌ చెప్పాడో, లేదో' అంటూ మొత్తం విషయమంతా చెప్పాను.

చంద్రయ్య మొహం మ్లానయింది. ''మీరు అమెరికావోడికి ఊడిగం సేయడమే కాకుండా మావోడినీ దింపుతున్నారన్నమాట!'' అన్నాడు కటువుగా.

''చంద్రయ్యా, కాపిటలిజమ్‌ కాపిటలిజమ్‌లా లేదు. కమ్యూనిజం కమ్యూనిజంలా లేదు. అన్నీ కలగాపులగమైపోయి కొత్త విధానానికి దారి తీస్తున్నాం మనం..'' అంటూ ఏదో చెప్పబోయాను నేను.

''ఏటీ బాబూ కొత్త విధానం? సోడాకాయలూ, వేరుశెనక్కాయలూ, బఠాణీలూ రంగురంగుల పాకెట్లలో పెట్టి మనలాటి బీదదేశాల్ని దోసుకుతినడమా? వాళ్ల టెక్నాలజీ మనకు నేర్పుతారా బాబూ! వాళ్ల బూట్లూ, బాడీలూ లేకపోతే మనకు తెల్లారదా?'' అంటూ ఆవేశపడ్డాడు చంద్రయ్య.

''ఊరుకో, ఊరుకో'' అంటూ వారించాను.

''బాబూ, నే నొక్కటి చెప్తున్నాను వినండి. కమ్యూనిస్టోడంటే అమెరికావోడికి ఎప్పటికీ హడలే. ఈ రోజు రష్యా చితికిపోవచ్చు. కానీ కమ్యూనిస్టు భావాలు వంటబట్టినవాడన్నా, వాడి తాలూకు వాళ్లన్నా ఒణికిసస్తారు ఆమెరికా నాకొడుకులు. మీరు సిఫార్సు చేసినా సరే, వాళ్లు వాకబు చేయకమానరు. అరుణ్‌బాబు ఓ కమ్యూనిస్టు కొడుకని తెలియగానే బెదిరిపోయి ఉద్యోగం ఇవ్వరు. అంచాత మా అబ్బాయి అమెరికా వాడి తొత్తు కావడం కల్ల'' అని తెగేసి చెప్పాడు దర్పంగా.

చంద్రయ్య మాటల్లో నిజం వుందనిపించింది. హూవర్‌కి అరుణ్‌ కుటుంబ చరిత్ర చెప్పడం నా విధి, ధర్మం అనిపించింది. అందుకనే సాయంత్రం కృష్ణానది చూపించాక, ఎవరిదైనా ఇల్లు చూస్తానని హూవర్‌ అన్నప్పుడు చంద్రయ్య ఇంటికే తీసుకొచ్చాను. ఆయన ఇల్లంతా ఆసక్తిగా పరిశీలించాక నెమ్మదిగా చెప్పాను.

''మీకు అరుణ్‌కుమార్‌ అనే కాండిడేట్‌ గురించి చెప్పాను కదా. అతని తండ్రే ఇతను. నరనరాలా కమ్యూనిజం జీర్ణించుకొన్న వ్యక్తి. అరుణ్‌ కూడా మాస్కోలో చదివేడు. మీకేదైనా అభ్యంతరం వుందంటే స్పష్టంగా చెప్పేయండి. మేమేమీ అనుకోము'' అని చెప్పాను.

సంభాషణ ఇంగ్లీషులో సాగినా చంద్రయ్యకి అర్థమయ్యింది. నేను చెప్పడం పూర్తయ్యాక నవ్వుతూ నాకేసి చూసి ''చూసావా బాబూ, నేను కమ్యూనిస్టని తెలీగానే తెల్లోడి మొహం ఎలా తెల్లబోయిందో? వాళ్లకి తెలుసు – కమ్యూనిస్టులు ఇవాళ కాకపోతే రేపైనా వాడి కొంపకి అగ్గెట్టగలరని తెలుసు. అందుకే ఆ భయం!'' అన్నాడు.

కానీ హూవర్‌ చెప్పిందే వేరే – ''అరుణ్‌ కమ్యూనిస్టయి వుంటే మరీ మంచిది. కమ్యూనిజానికి ఇక భవిష్యత్తు లేదని అర్థమయిపోయింది! కాబట్టి మా అందర్నీ మించిన కేపిటలిస్టు అవుతాడు. మంచి పోస్టులో రిక్రూట్‌ చేసుకొని మాస్కోలోనే పోస్టు చేద్దాం. రష్యన్‌ భాష తెలుసు కాబట్టి బాగా పనికొస్తాడు.''

చంద్రయ్య ఇది వినగానే పక్కలోంచి ఎగరబోయాడు. తెల్లోడికి కమ్యూనిస్టుల భయం పోయిందన్నమాట నమ్మలేక నాతో హూవర్‌ అన్నమాటలు మళ్లీ తెలుగులో చెప్పించుకొన్నాడు. శత్రువుకి తమ గురించి గల తూష్ణీభావం, తేలిక అభిప్రాయం అతన్ని ఆశనిపాతంలా తాకింది. తను కమ్యూనిస్టునని తెలిసినా బెదురు లేకుండా కొడుక్కి ఉద్యోగం ఇవ్వజూపుతున్న అమెరికా వాడి గుండెనిబ్బరం అతన్ని కదిలించి వేసింది.

ఏదో గొణిగాడు. సణిగాడు.. చూస్తుండగానే వెర్రి చూపు పడింది. కోమాలోకి జారిపోయాడు.

రాత్రి ఫ్లయిట్‌లో అరుణ్‌ వచ్చేసరికే చంద్రయ్య ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

(ఆంధ్రజ్యోతి వీక్లీ దీపావళి ప్రత్యేకసంచిక అక్టోబరు 1998)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]