నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్న టెంపర్ సినిమా పూర్తి కావస్తోంది. తరువాతి ప్రాజెక్టు ఏమిటన్నదానిపై ఆయన క్లారిటీతోనే వున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఎన్టీఆర్ తో సహా ఏ హీరో ఖాళీ లేరు. ఈ గ్యాప్ లో ఓ చిన్న సినిమా చేయాలని అనుకుంటున్నారని వినికిడి.
అయితే ఇది మెటీరియలైజ్ కాకపోతే, కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ పెద్ద సినిమా చేయాలన్నది ప్రయత్నమట. ఇంతవరకు డైరక్టర్ రిపీట్ అయ్యారు కానీ, బండ్ల బ్యానర్ లో పవన్ మినహా మరే హీరో రిపీట్ కాలేదు. రామ్ చరణ్ తో అవకాశం వస్తే సినిమా చేయాలన్నది బండ్ల గణేష్ ఆలోచనగా తెలుస్తోంది.
గోవిందుడు అందరి వాడేలే విషయంలో మొదటి నుంచి చివరి వరకు రామ్ చరణ్ సహకరించిన తీరు బండ్ల గణేష్ కు చాలా నచ్చిందట. అందుకే రామ్ చరణ్-శ్రీనువైట్ల సినిమా తరువాతి సినిమా అవకాశం వుంటే తాను నిర్మించాలని అనుకుంటున్నారని వినికిడి. వీలైతే త్రివిక్రమ్ ను జోడించాలనే భారీ ఆలోచనలో కూడా వున్నారట.