జగమంత కుటుంబం నాది…

‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది..’ Advertisement చక్రి సంగీత దర్శకత్వం వహించిన పాట ఇది. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా రూపొందిన ‘చక్రం’ సినిమాలోని ఈ పాట అప్పట్లో ఓ ఊపు…

‘జగమంత కుటుంబం నాది.. ఏకాకి జీవితం నాది..’

చక్రి సంగీత దర్శకత్వం వహించిన పాట ఇది. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా రూపొందిన ‘చక్రం’ సినిమాలోని ఈ పాట అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. కేవలం ఈ పాట కోసమే ‘చక్రం’ సినిమాని తెరకెక్కించానని అప్పట్లో కృష్ణవంశీ చెప్పారు. ఆ సినిమా ఫ్లాప్‌ అయినా, అందులోని ఈ పాట ఎప్పటికీ సంగీత ప్రియుల్ని అలరిస్తూనే వుంటుంది.. ఆలోచింపజేస్తుంది.

సినీ సంగీత దర్శకుడు చక్రి కూడా ‘జగమంత కుటుంబం నాది..’ అనుకునేవారు. కానీ ‘ఏకాకి జీవితం నాది’ అంటూ జీవితాన్ని అర్థాంతరంగా ముగించారు. గుండెపోటుతో చక్రి ఇటీవలే మరణించారు. అయితే ‘సస్పీషియస్‌ డెత్‌’ అని డాక్టర్లు తేల్చారట. అయితే సినీ పెద్దలు, కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుదుర్చడంతో.. ఎలాంటి వివాదమూ లేకుండా.. చక్రి మరణానంతరం జరగాల్సిన కార్యక్రమాలు జరిగిపోయాయి.

కానీ మూడో రోజునే చక్రి భార్య మీడియా ముందుకొచ్చారు. హెచ్చార్సీని ఆశ్రయించారు. చక్రి మరణంపై సందేహాలు వ్యక్తం చేశారు. ఈలోగా మళ్ళీ సినీ పెద్దలు, ఇతర కుటుంబ సన్నిహితుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ‘గతం గతః మేమంతా ఒకటే కుటుంబం..’ అని చక్రి భార్య, చక్రి కుటుంబ సభ్యులు మళ్ళీ మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు. తాజాగా మరోమారు వివాదం తలెత్తింది. ఈసారి సద్దుమణిగేలా కన్పించడంలేదు.

తన భర్త మరణంపై అనుమానాల్ని వ్యక్తం చేస్తూ, చక్రి భార్య శ్రావణి పోలీసులను ఆశ్రయిస్తే, చక్రి కుటుంబ సభ్యులూ చక్రి మరణంపై సందేహాలు వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఇరువురూ చక్రి మరణానికి సంబంధించి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. చక్రి భౌతిక కాయాన్ని పూడ్చిపెట్టలేదు, దహనం చేశారు గనుక, ఇప్పుడు కొత్తగా పోస్ట్‌మార్టమ్‌ చేయడానికి వీల్లేని పరిస్థితి. అయితే ఇప్పటికీ అవకాశం వుందనీ, అయితే అది చాలా కష్టంతో కూడిన వ్యవహారమని చక్రి మరణంపై నిగ్గుతేల్చడంపై న్యాయ నిపుణులు అభిప్రాయపడ్తున్నారు.

అసలేం జరిగింది.? చక్రి ఎలా చనిపోయాడు.? ఇదీ ఇప్పుడు సాధారణ ప్రజానీకానికి కలుగుతున్న అనుమానం. మృగ్యమైపోతున్న మానవ సంబంధాలకు చక్రి మరణం అనంతరం తలెత్తిన పరిణామాలు ఓ ఉదాహరణగా చెప్పుకోవాలేమో. చక్రి తల్లి, ఇతర కుటుంబ సభ్యులే అతని మరణానికి కారణమన్నది శ్రావణి ఆరోపణ. తల్లి ఎక్కడన్నా కొడుకు చావుని చూడాలనుకుంటుందా.? అన్నది సాధారణంగా అందరికీ కలిగే ప్రశ్న. అలాగే, చక్రి భార్య శ్రావణే, చక్రిని చంపేసిందన్నది చక్రి కుటుంబ సభ్యుల ఆరోపణ. భర్తని ఏ భార్య అయినా చంపేసుకుంటుందా? అనేదీ చాలామందికి కలిగే ప్రశ్న.

మీడియాలో నిత్యం సవాలక్ష క్రైమ్‌ స్టోరీస్‌ని చూస్తున్నాం. తల్లిని చంపిన కొడుకు, కొడుకుని మట్టుబెట్టి తల్లి. భార్యను చంపిన భర్త, భర్తను చంపిన భార్య.. ఇవన్నీ మన చుట్టూ జరుగుతున్నవే. ఆ సమాజంలోనే మనమూ వున్నాం.. చక్రి కుటుంబమూ వుంది. అయితే చక్రి తన కుటుంబ సభ్యుల్ని చాలా బాగా చూసుకుంటాడనే విషయం అందరికీ తెల్సిందే. అలాగే, చక్రి తన భార్యను ప్రేమించి పెళ్ళాడాడు. ఇక వివాదానికి తావెక్కడ.?

‘వాళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత నామీదే వుంది..’ అని చక్రి మరణం తర్వాత మూడో రోజు హెచ్చార్సీని ఆశ్రయించిన అనంతరం వివాదం సద్దుమణిగా శ్రావణి వ్యాఖ్యానించారు. ‘ఆమె మా వదిన. తల్లిలాంటిది.. ఆమె బాధ్యత మాదే..’ అని చక్రి సోదరుడు మహిత్‌ నారాయణ్‌ కూడా చెప్పారు. అంటే కుటుంబంలో ఒకరి మీద ఒకరికి గౌరవం వుందనే కదా. మరి, ఇప్పుడెందుకు పరిస్థితులు దిగజారిపోయినట్టు.?

‘ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో వున్నాం.. ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి.. ఏడాదిలో అన్ని సమస్యలూ గట్టెక్కుతాయి..’ అని చక్రి తనతో చెప్పినట్లు శ్రావణి వివరించారు ఆ మధ్య. మరి, ఆస్తి కోసం కుటుంబ తగాదాలు జరుగుతున్నట్లు ఇప్పుడు ఆమె ఎలా చెప్పగలుగుతున్నారు.? మహిత్‌ నారాయణ్‌ మాటల్లో అయితే, చక్రికి ఆర్థిక ఇబ్బందుల్లేవు. ‘నా అన్న నా దృష్టిలో ఆకాశం. ఆర్థిక ఇబ్బందుల్లో వున్నాడన్నది అవాస్తవం. అది అతని స్థాయిని తగ్గించే ఆరోపణ. యాభై ఐదు లక్షలు ఓ బిల్డర్‌ దగ్గర వున్నాయి. ఫ్లాట్స్‌ వున్నాయి. ప్లాట్స్‌ వున్నాయి. బ్యాంక్‌ బ్యాలెన్స్‌ ఉంది. సినీ పరిశ్రమలో ఆయన సాధించిన విజయాలేమిటో అందరికీ తెలుసు..’ అని మహిత్‌ నారాయణ్‌ చెబుతున్నారు.

ఎటునుంచి ఎటు చూసినా అంతా గందరగోళమే. ఒకరి మాటలకూ ఇంకొకరి మాటలకూ పొంతన లేదు. అంతెందుకు, మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్న వారి మాటల్లోనే గందరగోళం. ఈ గందరగోళం నుంచి స్పష్టత కావాలంటే ఖచ్చితంగా, చక్రి మరణానికి సంబంధించి మిస్టరీ వీడాలి. ఎలాగూ పోలీస్‌ కేస్‌ నమోదైంది గనుక, చట్టం తన పని తాను చేసుకుపోవాల్సి వుంటుంది. 

ఏది ఏమైనా.. చక్రి తన జీవితంలో చూడని విషాదం, మరణానంతరం చూడాల్సి వస్తోంది. జగమంత కుటుంబం ఆయనది.. ఏకాకి జీవితం ఆయనది.. ఆస్తి కోసం చక్రిని చంపేశారా.? లేదంటే, ఆస్తి కోసం కుటుంబ సభ్యులు కుమ్ములాడుకుంటున్నారా.? సన్నిహితులు కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెడుతున్నారా.? ఏమో.. అందరికీ దూరంగా వెళ్ళిపోయిన చక్రికీ.. తన వద్దకు చక్రిని తీసుకెళ్ళిపోయిన ఆ దేవుడికీ తెలియాలి.