ఎమ్జీయార్ జబ్బు పడతాడని అతని అభిమానులే కాదు, ఎమ్జీయార్ కూడా నమ్మలేదు. అతని అభిమానుల దృష్టిలో ఎమ్జీయార్ అజేయుడు, మృత్యువు సైతం అతన్ని ఏమీ చేయలేదు. దానికి విరుద్ధంగా ఏదైనా జరిగితే వారు ఆమోదించరు. ప్రసిద్ధ దర్శకనిర్మాత టిఆర్ రామన్న ఎమ్జీయార్ హీరోగా ''పాశమ్'' తీద్దామనుకుని అతనికి కథ వినిపించినప్పుడు 'చివర్లో నా పాత్ర చచ్చిపోవడం నా అభిమానులు జీర్ణించుకోలేరు. సినిమా ఆడదు' అని చెప్పాడు. కానీ రామన్న వినలేదు, కథకు అదే సరైన ముగింపు అన్నాడు. 'సరే నీ యిష్టం' అన్నాడు ఎమ్జీయార్. సినిమా ఫ్లాపయింది. ''దో ఆంఖే బారహ్ హాత్'' సినిమాలో హీరో చివర్లో చచ్చిపోతాడు. దాన్ని తమిళంలో ఎమ్జీయార్ హీరోగా ''పళ్లాండ్ వాళ్‌గ''గా తీసినప్పుడు హీరో చచ్చిపోడు. తనంటే యిష్టపడిన టొమ్మలమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఇలా కథలు మార్చి ప్రేక్షకులను భ్రమల్లో ముంచేత్తే క్రమంలో నటులు తాము కూడా భ్రమలో పడిపోతారు. తమ కేమీ కాదనీ, తాము ఏం చేసినా చెల్లుతుందనీ అనుకుంటారు. ఎమ్జీయార్‌కు సుగర్ వ్యాధి వుంది. డాక్టర్లు వద్దని వారించినా శుబ్భరంగా తినేవాడు. తనకు రోగం వుందని సన్నిహితులకు సైతం ఎవరికీ తెలియనిచ్చేవాడు కాదు. అంతా గుట్టే. చివరకు కిడ్నీలు చెడిపోయాయి. ఆసుపత్రిలో చేర్చి 16 రోజులు వుంచవలసి వచ్చింది. అమెరికానుంచి స్పెషలిస్టులను రప్పించారు. అవసరమైతే పేషంటును అమెరికాకు తీసుకెళ్లడానికి ప్రత్యేక విమానాలను సిద్ధం చేశారు. ఇందిరా గాంధీ ఒక రోజు మద్రాసు వచ్చి పలకరించి వెళ్లింది. ఎమ్జీయార్ ఆసుపత్రిలో వున్నాడని తెలియగానే చాలామంది అభిమానులను తమ శరీరాలను బ్లేళ్లతో కోసుకున్నారు. తమ కిడ్నీలు యిస్తామంటూ రోజూ అనేక టెలిగ్రాంలు వచ్చిపడేవి. సరిగ్గా చికిత్స చేయకపోతే డాక్టర్లను చంపుతామంటూ కూడా టెలిగ్రాంలు వచ్చాయి. గుళ్లల్లో, చర్చిల్లో, మసీదుల్లో ప్రార్థనలు, మొక్కుల మాట సరేసరి. కిడ్నీ మార్పిడి జరగాలన్నారు. ఎమ్జీయార్ అన్న చక్రపాణి కూతురు తన కిడ్నీ యిస్తానంది. ఆపరేషన్ చేయడానికి అమెరికా తీసుకెళ్లాలన్నారు. ఎమ్జీయార్, భార్య విఎన్ జానకి, చక్రపాణి కుటుంబసభ్యులు తోడు రాగా ఎమ్జీయార్ న్యూయార్క్‌కు వెళ్లాడు.
ఈ అనారోగ్యం వలన జయలలితకు కూడా నష్టం వాటిల్లింది. మనిషి ఆరోగ్యంగా వున్నంతకాలం అతని మాట చెల్లుతుంది. రోగంతో పడకవేస్తే మాత్రం కుటుంబసభ్యుల మాటో, లేక చివరిగా ఎవరి వద్ద వుంటే వారి మాటో చెల్లుతుంది. వారు ఆమోదించినవారినే దగ్గరకు రానిస్తారు, యిష్టం లేనివారిని రానివ్వరు. ఇది అనేకమంది విషయాల్లో చూస్తూంటాం. ఎమ్జీయార్ ఆరోగ్యంగా వున్నన్ని రోజులు అతను ఎవరి మాటా లెక్కచేయకుండా జయలలితకు ప్రాధాన్యత యిచ్చాడు. ఇప్పుడు జబ్బుపడ్డాక హఠాత్తుగా అందకుండా పోయాడు. ఆసుపత్రికి వెళ్లినా చూడనివ్వలేదు. ఆమె వచ్చినట్లు కూడా ఎమ్జీయార్‌కు తెలియనివ్వలేదు. జయలలితను ప్రచారసారథిగా నియమించాక ఎమ్జీయార్ తన పార్టీలో అందరికీ చెప్పాడు – సభకు ఆమె వచ్చినపుడు మంత్రులతో సహా అందరూ లేచి ఆవిడకు నమస్కరించాలని. అది యిష్టం లేక, వారెవరూ ఆమెతో పాటు సభల్లో పాల్గొనేవారు కారు. వాళ్లందరికీ జయలలితను అణగదొక్కడానికి యిప్పుడు అవకాశం చిక్కింది.
మద్రాసు వచ్చి వెళ్లిన కొన్నాళ్లకే ఇందిరా గాంధీ హత్యకు గురైంది. ఆమె స్థానంలో రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యాడు. ఇందిరపై సానుభూతి వెల్లువ దేశమంతా ముంచెత్తుతోంది. దాన్ని ఎన్‌క్యాష్ చేసుకోవడానికి రాజీవ్ వెంటనే సార్వత్రిక ఎన్నికలు ప్రకటించాడు. ఇటు ఎమ్జీయార్ అనారోగ్యంగా వున్నాడు కాబట్టి ఆ సానుభూతిని కూడా సొమ్ము చేసుకోవాలనుకుని రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని పార్లమెంటు ఎన్నికలతో బాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా గడువు కంటె కొన్ని నెలల ముందే 1984 డిసెంబర్లో జరిపించేశారు. డిఎంకె కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఏ ఎన్నికలలో నైనా ఎమ్జీయారే ప్రచారసారథి. అతని మొహం చూస్తేనే ఓట్లు పడతాయి. అలాటి సారథి మంచాన పడితే ప్రచారం ఎలా అనే బెంగతో ఎడిఎంకె నాయకులు సతమతమవుతూ వుంటే దానికి తోడు డిఎంకె నాయకులు 'ఎమ్జీయార్ యిప్పటికే చచ్చిపోయాడు. ఆ విషయం బయటపడకుండా వీళ్లు నాటకమాడుతున్నారు.' అని ప్రచారం మొదలుపెట్టారు. అసలు అప్పటికే కరుణానిధి 'నాకు సరి జోడీ ఎమ్జీయార్ లేని ఎలక్షన్ ఎలక్షనే కాదు, నేను పోటీ చేయను' అని పోటీ నుండి విరమించుకున్నాడు. ఈ సానుభూతి పవనాల్లో తను ఎగిరి ఎక్కడ పడతాడన్న భయంతోనే పోటీ చేయలేదని అనుకోవాలి.
తమిళనాడులో పుకార్లకు మంచి గిరాకీ. ఎమ్జీయార్ పోయాడని, బతికి వున్నా జీవచ్ఛవంలా వున్నాడని, అతనికి పక్షవాతం వచ్చి చెయ్యి, నోరు పడిపోయాయని జనాలు నమ్మసాగారు. ఎమ్జీయార్ లేనిపక్షంలో ఎడిఎంకెకు ఎందుకు ఓటేయ్యాలన్న ప్రశ్న రాసాగింది. ఇందిర సానుభూతిని ఎన్‌క్యాష్ చేసుకోవడానికి ఆమె కొడుకు రాజీవ్ వున్నాడు. ఎమ్జీయార్‌కు పిల్లలు లేరు. ఎమ్జీయార్ బతికే వున్నాడని చూపించడానికి వీరప్పన్ ఆసుపత్రిలో ఎమ్జీయార్ చికిత్స పొందుతున్న వీడియోను, ఫోటోలను ప్రెస్‌కు రిలీజ్ చేశాడు. దానితో బాటు ఇందిరా గాంధీ అంత్యక్రియల వీడియో కూడా కలిపి ప్రచారానికి వాడుకున్నాడు. ఆ వీడియో లింకు – Click Here For Video ఎది చూసే టైము లేనివారు దీనితో యిచ్చిన ఫోటో చూసినా అతని స్థితి అర్థమౌతుంది. ఆసుపత్రిలో బెడ్‌పై కూర్చుని ఎమ్జీయార్ భోజనం చేయడం, పేపరు చదవడం, వచ్చినవాళ్లను పలకరించి మాట్లాడడం (నిజానికి ఎమ్జీయార్‌కు గొంతు పోయింది. ఇండియాకు తిరిగి వచ్చాక చాలా శ్రమ పడితే ఓ మాదిరిగా తిరిగి వచ్చింది. కానీ యీ వీడియోలో కబుర్లు చెపుతున్నట్టు కనబడుతుంది. కనబడుతుంది కానీ వినబడదు. అందువలన అంతా నాటకమనే అనుకోవాలి) అంతా వీడియోలో కనబడుతుంది.
ఈ వీడియో ఎన్నికలలో విజయానికి పనికి వచ్చింది కానీ ఎమ్జీయార్ యూత్‌ఫుల్ యిమేజికి దెబ్బ తగిలింది. ఎమ్జీయార్ వయసు మీద పడుతున్నా తనలో శక్తి ఏమీ ఉడగలేదని చూపించుకోవడానికి చాలా శ్రమ పడేవాడు. ఏదైనా పబ్లిక్ ఫంక్షన్‌లో మెట్లెక్క వలసి వస్తే ఒ్క ఉదుటున ఎక్కేవాడు. బరువైన గజమాలల్లాటివి సునాయాసంగా ఎత్తేసేవాడు. చురుగ్గా నడిచేవాడు. ఎప్పుడూ అనారోగ్యంతో కనబడేవాడు కాదు. తనకు జుట్టు తగ్గిపోతున్నా (వీడియోలో చూడండి, బట్టతలపై జుట్టు ను దిద్దినట్లు కనబడుతుంది, చాలాసేపు క్యాప్ పెట్టేశారు) తెలియకుండా వుండడానికి ఫర్ క్యాప్ నిరంతరం ధరించేవాడు. కంటి చూపు తగ్గిపోయి సోడాబుడ్డి కళ్లద్దాలు వాడవలసి వచ్చినా (ఈ వీడియోలో అది స్పష్టంగా తెలుస్తుంది) నల్లకళ్లద్దాలతో కవరు చేసేవాడు. చివరకు శవయాత్ర కూడా అలాగే సాగింది. వాటితోనే సమాధి చేశారు. వీరప్పన్ క్యాంపు వీడియోపై ఆధారపడగా జయలలిత పార్టీ నాయకత్వం సహకారం లేకున్నా సొంతంగా కాలికి బలపం కట్టుకుని ప్రచారం చేసింది. ఎమ్జీయార్ తిరిగి వస్తాడో రాడో, వచ్చినా తనను చూడనిస్తారో లేదో తెలియదు అయినా నిజాయితీగా ఎడిఎంకె విజయానికి విపరీతంగా శ్రమించింది.
డిసెంబరు 24న ఎన్నికలు జరిగాయి. ఎడిఎంకె 155 స్థానాలకు పోటీ చేసి 37% ఓట్లతో 132 గెలిచింది (గతంలో కంటె 3 ఎక్కువ). దానితో పొత్తు పెట్టుకున్న కాంగ్రెసు 73టికి పోటీ చేసి 16% ఓట్లతో 61 గెలిచింది. (గతంలో కంటె 30 ఎక్కువ) గాంధీ కామరాజర్ కాంగ్రెస్ పార్టీ 4టికి పోటీ చేసి 2 గెలిచింది. వాళ్లకు ప్రత్యర్థులుగా డిఎంకె 167 స్థానాల్లో పోటీ చేసి 29% ఓట్లతో 24 గెలిచింది. (గతంలో కంటె 13 తక్కువ) సిపిఐ 17టికి పోటీ చేసి 2 గెలవగా (7 తక్కువ) సిపిఎం 16టికి పోటీ చేసి 5 గెలవగా (6 తక్కువ), జనతా పార్టీ 16టికి పోటీ చేసి 3 గెలిచింది. స్వతంత్రులు నలుగురు నెగ్గారు. గమనిస్తే ఎడిఎంకె కంటె కాంగ్రెసు పనితీరే బాగుంది. ఈ సానుభూతి పవనాలు లేకపోతే పరిస్థితి ఎలా వుండేదో తెలియదు. విపి సింగ్ రాజీవ్ నుంచి విడిపోయి పార్టీ పెట్టినపుడు మద్రాసు వచ్చి పెట్టిన సభకు నేను వెళ్లాను. 'మీరు రాజీవ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపించారు' అని విపి సింగ్ అంటూంటే జనతా పార్టీ నాయకుడొకతను భలే చమత్కరించాడు. 'మీరేవేవో ఆశలూ, ఆశయాలూ అంటూ పెద్ద మాటలు చెప్తున్నారు. గత ఎన్నికలలో మా ప్రజల వద్దకు ఎడిఎంకె, కాంగ్రెసు నాయకులు వచ్చి అవేమీ చెప్పలేదు. (ముష్టివాళ్ల ననుకరిస్తూ) 'తాయిల్లాద పిళ్లయ్‌క్కు ఒరు ఓటు, వాయిల్లాద పిళ్లయ్‌క్కు ఒరు ఓటు' (తల్లి లేని పిల్లవాడికి ఒక ఓటు, నోరు లేని పిల్లవాడికి ఒక ఓటు) అని అడుక్కున్నారు.' అన్నాడు. తల్లిలేనివాడు రాజీవ్, నోరు పెగలనివాడు ఎమ్జీయార్.
ఏది ఏమైతేనేం, ఆసుపత్రి మంచం మీద నుండే ఎమ్జీయార్ ఎన్నికల్లో జయించాడు. 1985 ఫిబ్రవరిలో తిరిగి వచ్చాడు. నోరు స్వాధీనంలోకి రాకపోయినా చాలాకాలంపాటు యింట్లో మంచం మీద వుంటూనే పాలన సాగించాడు. లేదు. ఏది ఏమైనా ఎమ్జీయార్ యిలాటి విషయాల్లో చాలా గుండె దిటవు, పట్టుదల కలిగిన మనిషి. 1967లో ఎమ్జీయార్‌ను ఎంఆర్ రాధా కాల్చినపుడు ప్రాథమిక చికిత్స చేసిన డాక్టరు అబ్రహాం సుకుమార్ తన బ్లాగులో ఆనాటి విషయాలు రాశారు. ఆయన రాయపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అసిస్టెంటు సర్జన్. సాయంత్రం 5 గంటలకు కాజువాలిటీ డిపార్టుమెంటు నుంచి కాల్ వచ్చింది. వెళ్లి చూస్తే ఎమ్జీయార్ బెడ్ మీద పడుక్కుని వున్నాడు. ఎంఆర్ రాధా తనను చెవిలోంచి తుపాకీతో కాల్చాడని చెప్పాడు. సినిమా షూటింగు సమయంలో జరిగిన ప్రమాదం అని యీయన మొదట అనుకున్నాడు కానీ తర్వాత కాదని తెలిసింది. చెవి పరీక్షించాడు. నా వాచీ సౌండు వినబడుతోందా అంటే ఎమ్జీయార్ వినబడుతోందన్నాడు. అంత క్లోజ్ రేంజ్‌లో కాల్చబడినా ఎమ్జీయార్ తొణకలేదు. ఆ గుండు గొంతు వెనకభాగంలో వెళ్లి ఆగింది కాబట్టి విపరీతమైన నొప్పి వుండే వుంటుంది కానీ ఎమ్జీయార్ కనబర్చలేదు. గొంతులో గుండు మొదటి రోజున తన ప్రభావాన్ని కనబరచలేదు కానీ, హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయినపుడు గొంతు బొంగురుపోయింది. (ఇదే వ్యాసంలో ఆయన ఎంఆర్ రాధా గురించి కూడా రాశారు. రాధాను కూడా అదే కాజువాలిటీకి తీసుకుని వచ్చారు. ఎమ్జీయార్‌ను కాల్చాక తన కణతల మీద కాల్చుకున్నాడతను. అక్కడ గాయమై వాచింది కానీ అతనికి స్పృహ పోలేదు. ''నేనే కాల్చాను, పోలీసులకు స్టేటుమెంటు యిచ్చేశాను కూడా'' అన్నాడు డాక్టరుతో. ''మీలో బ్రాహ్మలెవరైనా వున్నారా?'' అని కూడా అడిగాడు. పెరియార్ అనుంగు శిష్యుడు అలా అడగడం చూసి డాక్టరు విస్తుపోయాడు. రాధా వాడిన తుపాకీ చాలాకాలంగా వాడకుండా వుండిపోయింది. బుల్లెట్లు కూడా చాలా పాతవి. అందుకనే రాధా, ఎమ్జీయార్ యిద్దరూ బతికిపోయారు. కానీ యిలాటి విషమ పరిస్థితుల్లో కూడా యిద్దరూ తొణక్కపోవడం డాక్టరును ఆశ్చర్యపరచింది. ఇద్దర్నీ పక్కపక్క బెడ్స్ మీదే పడుక్కోబెట్టారు డాక్టర్లు)
1985లో తిరిగి వచ్చాక ఎమ్జీయార్ 18 ఏళ్ల నాటి గొంతు సమస్య మళ్లీ వచ్చింది. మాట్లాడలేక పోయేవాడు. అప్పుడు విదేశాల నుంచి వచ్చిన డాక్టరు అతనికి స్పీచి థెరపీ యిచ్చాడు. ఆ డాక్టరు రాసిన వ్యాసం కూడా చదివాను. ఎమ్జీయార్ ఎంత క్రమశిక్షణతో, కఠోరదీక్షతో గొంతు మళ్లీ సంపాదించుకున్నాడో రాశాడాయన. చాలాకాలం పాటు సైగలతోనే కాలక్షేపం చేయవలసి వచ్చింది. ఇంట్లోనే వుంటూ సీనియర్ నాయకులను తన వద్దకు రప్పించుకుని, వాళ్లు చెప్పినది విని, సైగలతో ఆజ్ఞలిచ్చి, పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సడలకుండా చేసుకున్నాడు. అది కూడా సామాన్యమైన విద్య కాదు. ఎమ్జీయార్ బలహీనపడ్డాడు కదాని తిరగబడడానికి ఎవరూ సాహసించలేదు. ఆ భయాన్ని అలాగే కాపాడుకోగలిగాడు. అయితే ఒకప్పుడు అనర్గళంగా, గంటల తరబడి ప్రసంగించగలిగిన ఎమ్జీయార్ కొన్ని నెలలపాటు మాట్లాడలేకపోవడం విషాదకరం. పూర్వస్థితి మళ్లీ తెచ్చుకునే ప్రయత్నంలో వుండగా అతని మాటలు ముద్దగా వచ్చేవి, మాటలు దొర్లిపోయేవి. అవతలివాళ్లకు తన మాటలు అర్థం కాక వెఱ్ఱిమొహం వేస్తే ఉక్రోషం వచ్చేసి, అరిచేసేవాడు. ఈ సందర్భంలో ఒక జోకు లాటి వాస్తవం చెప్తాను. అధికారుల సమావేశంలో మాట్లాడుతూ అతను 'పడిప్పు యిరిందా పన్బు యిరిక్కాదు, పన్బు యిరిందా పడిప్పు యిరిక్కాదు' (చదువుంటే సంస్కారం వుండటం లేదు, సంస్కారం వుంటే చదువుండటం లేదు) అని వాపోయాడట. అయితే అతని మాటలో స్పష్టత లోపించి పడిప్పు – పయిప్పు – పైపుగా వినబడింది. పన్బు – పంపుగా అర్థమైంది. 'పైపుంటే పంపు వుండటం లేదు, పంపు వుంటే పైపు వుండటం లేదని ఫిర్యాదు చేస్తున్నాడు, ఇరిగేషన్ సమస్య కాబోలు' అనుకుని గందరగోళ పడ్డారట.
ఎమ్జీయార్ అనారోగ్యాన్ని వీరప్పన్ తదితరులు పూర్తిగా వినియోగించుకున్నారు. ''అమెరికాలో చికిత్సకు రూ. 90 లక్షలు ఖర్చయింది. ఆ భారాన్ని ప్రభుత్వంపై వేయడానికి మన విప్లవనాయకుడికి యిష్టం లేదు. తనకున్నదంతా మనకోసమే ఖర్చు చేసిన నాయకుడికోసం మన వంతుగా విరాళాలు సేకరించి ప్రభుత్వానికి కట్టేసి ఆయన్ను ఋణవిముక్తుణ్ని చేయండి.'' అని వీరప్పన్ ప్రకటన చేశాడు. అంతే, అభిమానులంతా నిధులు సేకరించి యిచ్చేశారు. జయలలితను మాత్రం దూరంగా పెట్టాడు. ఏం జరుగుతోందో తెలియనీలేదు. ఎమ్జీయార్ తిరిగి వచ్చినపుడు ఎయిర్‌పోర్టులో చూడనివ్వలేదు. ఇంటికి రానీయలేదు. 'మీరు తిరిగి రారు కాబట్టి తనే ముఖ్యమంత్రి అయిపోదామనుకుంది' అని చెప్పి ఎమ్జీయార్ మనసు విరిచేశారు. అతను జయలలితకు కబురంపలేదు. రావడానికి అనుమతి కోరితే నిరాకరించాడు. ఆమె అతనికి దీనంగా ఉత్తరాలు రాసింది. 'మీ అమ్ము మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో తెలియదా? నన్ను మర్చిపోయారా? వదిలి పెట్టేశారా?' అంటూ వేడుకుంది. ఒక్కసారి కలవనీయమని ప్రాధేయపడింది. ఈ ఉత్తరాలు ఎమ్జీయార్‌కు చేరాయో లేదో కానీ వీరప్పన్ వాటిని ప్రెస్‌కు, డిఎంకెకు లీక్ చేశాడు. అందరూ జయలలిత అవస్థ చూసి నవ్వుకున్నారు, కొందరు జాలిపడ్డారు. (సశేషం) ఫోటో – హాస్పటల్‌లో ఎమ్జీయార్
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2015)