వారికి ‘హీరో’లు కరువు! వీరికి ‘మార్కెట్టు’ బరువు!!

ఒకప్పుడు కొలిచేందుకు ఇలవేల్పులు సరిపోయేవారు; ఇప్పుడు ‘తెర’ వేల్పులు కూడా అవసరమయ్యారు. సినీ తారల మీద వున్న భక్తి అంతా ఇంతా కాదు. కొందరయితే తాము ఆరాధించే తారలను నిత్యమూ సేవించుకోవటానికి ‘గుడులు’(కుష్బూకి కట్ట…

ఒకప్పుడు కొలిచేందుకు ఇలవేల్పులు సరిపోయేవారు; ఇప్పుడు ‘తెర’ వేల్పులు కూడా అవసరమయ్యారు. సినీ తారల మీద వున్న భక్తి అంతా ఇంతా కాదు. కొందరయితే తాము ఆరాధించే తారలను నిత్యమూ సేవించుకోవటానికి ‘గుడులు’(కుష్బూకి కట్ట లేదూ!) కూడా కడతారు. 

కానీ ఈ ‘తెర’వేల్పులు అన్ని ప్రాంతాలలోనూ, అన్ని సామాజిక వర్గాలలోనూ, అన్ని మత విశ్వాసాలలోనూ వెలిస్తే ఇబ్బంది వుండేది కాదు. ఒకే ప్రాంతంలోని, రెండు మూడు జిల్లాల్లో, రెండు మూడు సామాజిక వర్గాలలోనే వెలిస్తే, మిగిలిన వారు ఎవరికి మొక్కాలి. తెలంగాణ ఉద్యమం ఉదృ్ధతంగా వున్న రోజుల్లో, తెలంగాణ వాదులు తరచు ఈ చర్చ చేస్తుండేవారు. ఇప్పుడు రాష్ర్టం విడిపోయింది. 

నీళ్ళనీ, ఆస్తుల్నీ, నిధుల్నీ, పంచేసుకున్నారు. కడకు దేవుళ్ళను కూడా వదల్లేదు. ఎవరి దేవుణ్ణి వారు జాగ్రత్తపెట్టేసుకున్నారు.  ఏడుకొండల వెంకన్న ఎప్పటిలాగే ఆంధ్రప్రదేశ్‌లో వుండిపోతే, భద్రాద్రి రాముడు తెలంగాణకు వచ్చేశాడు.

కానీ తెలుగు ‘తెర’ను రెండు ముక్కలుగా చీల్చుకోలేరుకదా! చీల్చుకుంటే మాత్రం తెలంగాణకు మిగిలేదేముంది? తెలంగాణ నుంచి హీరోలేరీ? అగ్రశ్రేణిలో ఒకప్పుడు కాంతారావు వుండేవారు. తర్వాత ఉదయ్ కిరణ్ ఆశాకిరణంలా వచ్చాడు. కానీ మృత్యువు అతనిని అపహరించింది. ఇప్పుడు నితిన్. మిగిలిన వారికి ఎదిగే అవకాశమే దక్కలేదు. హీరోయిన్ అవకాశాలు తెలుగు వారికే తక్కువ అంటే, ఇక వెనుకబడిన తెలంగాణ వారికి ఎక్కడ నుండి వస్తాయి? అయినప్పటికీ విజయశాంతి ‘లేడీ హీరో’గా ఎదిగి పేరు తెచ్చుకున్నారు. 

ఇక దర్శకులు కూడా అంతంత మాత్రమే. అయినప్పటికీ, బి.నర్సింగరావు, శ్యామ్ బెనగళ్‌లు అవార్డు చిత్రాల దర్శకులు ఇక్కడనుంచి రావటం విశేషం.  ఎగ్జిబిటర్లపై వుండే శ్లాబ్ విధానం (2004లోనే) వెళ్ళిపోయినా, సినిమాను హీరోలే శాసిస్తున్నారు. సినిమా నిజానికి దర్శకుడి మాధ్యమమే కావచ్చు. అయినే హీరోల రాజ్యం కొనసాగుతూనే వుంది. హీరోలకు వున్నంత మంది అభిమానులు దర్శకులకు వుండవు. దర్శకుల అభిమాన సంఘాలు ఎక్కడో కాని కనిపించవు. 

కాబట్టి హీరో కేంద్రంగా వున్న సినిమా రంగంలో తమ రాష్ర్టం నుంచి హీరోలు లేరన్నది పెను సవాలుగా మారింది. అయితేనేం? ఇప్పుడు తెలంగాణ తన సినిమాను తాను నిర్మించుకునే పనిలో వున్నది. అందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా, రెండువేల ఎకరాల భూమిని కేవలం ఫిలింసిటీకి కేటాయించాలనే పంతం మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వున్నారు. అంతే కాదు, ఇంతవరకూ అవకాశం రాని తెలంగాణ నటులనూ, కళాకారులనూ ప్రోత్సహించాలని కూడా కంకణం కట్టుకున్నారు. 

ఇదంతా సామాజిక, సాంసృ్కతిక మైన అంశం. దీని వెనుక ఆర్థికాంశాలు కూడా వున్నాయి. ఇప్పటికిప్పుడు, చిత్రపరిశ్రమ ఆంధ్రప్రాంతానికి( ఏ విశాఖపట్నానికో) తరలి వెళ్ళిపోతే, తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా పడిపోతుంది. అందుచేత, ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రాంతపు హీరోలూ, నిర్మాతలూ, స్టుడియో యజమానులూ వెళ్ళలానే ధోరణిలో తెలంగాణ సర్కారు కూడా లేదు.

అయితే సమస్య ఒక వైపు మాత్రమే లేదు. ఆ మాట కొస్తే ఆంధ్ర చిత్రపరిశ్రమ ఎక్కడా ఒక్క చోట కుదురుగా వుండలేక పోతుంది. సర్ ఆర్థర్ కాటన్, జనరల్ ఆర్‌లో గోదావరి, కృష్ణా నదులపై కట్టిన ఆనకట్టల వల్ల, అక్కడి భూములు సస్యశ్యామలమై, పెట్టుబడులను అందించాయి. ఈ పెట్టుబడులు పెద్దయెత్తున ఉమ్మడి మద్రాసు రాష్ర్ట రాజధాని చెన్నై కు వెళ్ళాయి. అక్కడ ఈ పరిశ్రమ అభివృధ్ధి చెందిన తర్వాత, మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ర్టం వేరు పడింది. అనతి కాలంలోనే, తెలంగాణను కలుపుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా అవతరించింది. అయినా పరిశ్రమ చాలా కాలం చెన్నైలోనే వుండిపోయింది. తర్వాత మెల్ల మెల్లగా హైదరాబాద్‌కు చేరుకున్నది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌నుంచి తెలంగాణ వేరుపడింది. ఇవాళ కాకపోతే, రేపయినా, ఆంధ్ర చిత్రపరిశ్రమ ఆంధ్రప్రాంతానికి వలస వెళ్ళాలి. 

మాకు హీరోలు లేరు అని తెలంగాణ అంటూంటే, మాకు స్వస్థలమే లేదు అంటూ ఆంధ్ర అంటోంది. అయితే ఇక్కడ చిన్న సౌకర్యం కూడా లేక పోలేదు. తెలంగాణ చిత్రపరిశ్రమ అయినా, ఆంధ్ర  చిత్రపరిశ్రమ అయినా, తీసేవి తెలుగు సినిమాలే. ఇక్కడి సినిమాలను అక్కడ చూస్తారు; అక్కడి సినిమాలను ఇక్కడ చూస్తారు. పరిశ్రమలు ఎక్కడ కేంద్రీకృతమైనా, మార్కెట్టు రెండు రాష్ట్రాలలోనూ విస్తరించి వుంటుంది. ఈ రహస్యాన్ని గమనించి, తెలుగు ‘తెర’ను చించుకోకుండా, కొత్త వన్నెలు అద్దుకోవటానికి పరస్పరం సహకరించుకోవటం మంచిది. 

సతీష్ చందర్