బుల్లితెరపై పెద్ద నిర్మాతల పండగ.!

ఒకప్పుడు వెండితెరపై అద్భుతాలు చేసిన బ్యానర్లు అవి. ఇప్పుడేమో వాటిల్లో చాలావరకు కనుమరుగైపోయాయి. కొన్ని బ్యాన్లు అడపా దడపా సినిమాలు ‘భాగస్వామ్యం’తో నిర్మిస్తుంటే, ఇంకొన్ని బ్యానర్లు ఓ పక్క సినిమాలు, ఇంకోపక్క టీవీ షోలతో…

ఒకప్పుడు వెండితెరపై అద్భుతాలు చేసిన బ్యానర్లు అవి. ఇప్పుడేమో వాటిల్లో చాలావరకు కనుమరుగైపోయాయి. కొన్ని బ్యాన్లు అడపా దడపా సినిమాలు ‘భాగస్వామ్యం’తో నిర్మిస్తుంటే, ఇంకొన్ని బ్యానర్లు ఓ పక్క సినిమాలు, ఇంకోపక్క టీవీ షోలతో ఉనికి చాటుకుంటున్నాయి. తెలుగు సినిమా వంద కోట్ల క్లబ్‌లో ఓ పక్క చేరుతుంటే, ప్రెస్టీజియస్‌ బ్యానర్లు, పెద్ద పెద్ద బ్యానర్లు మాత్రం.. ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కాలం తెచ్చిన మార్పులకు ఇదో నిదర్శనం. వైజయంతీ బ్యానర్‌పై అనేక అద్భుతాలు తెరపైకొచ్చాయి. ప్రెస్టీజియస్‌ కాంబినేషన్స్‌ సెట్‌ చెయ్యడంలో అశ్వనీదత్‌ తర్వాతే ఎవరైనా. కానీ, ఆయనిప్పుడు సినిమాలు చేయడంలేదు. ఆయన బ్యానర్‌ వైజయంతీ బుల్లితెరపైకొచ్చింది. ఓ మ్యూజిక్‌ షో చేస్తోంది. మల్లెమాల బ్యానర్‌ పేరు చెబితే సంచలన విజయాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అనే అంటారు ఎవరైనా. కానీ ఆ బ్యానర్‌లోనూ సినిమాలు తగ్గిపోయాయి. ప్రస్తుతం ఓ డాన్స్‌ షో, రెండు కామెడీ షోస్‌తో బుల్లితెరపై మల్లెమాల హల్‌చల్‌ చేస్తోంది.

అన్నపూర్ణా బ్యానర్‌నే తీసుకుంటే, అడపా దడపా సినిమాలు చేస్తూనే, బుల్లితెరపైనా సీరియల్స్‌ నిర్మాణంలోనూ, ఇతర షోస్‌ నిర్మాణంలోనూ బిజీగా వుంది ఆ బ్యానర్‌. రానున్న రోజుల్లో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ కూడా ఇవే ప్రయోగం చేయొచ్చు. నిర్మాత దిల్‌ రాజు కూడా బుల్లితెరవైపు దృష్టి సారించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

‘చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడం..’ అనే చందాన తయారైందిప్పుడు పెద్ద బ్యానర్ల పరిస్థితి. ఫలానా సంస్థ సమర్పించు.. అని పెట్టి, ఆ పెద్ద బ్యానర్‌ పేరుతో వెనుక చిన్న నిర్మాత ఓ సినిమాని రూపొందిస్తున్నాడిప్పుడు. పెరిగిపోయిన ఖర్చులు, తగ్గిపోయిన సక్సెస్‌లు, హిట్‌కి మినిమమ్‌ ‘గ్యారంటీ’ లేకపోవడం.. ఇవన్నీ పెద్ద బ్యానర్ల పరిస్థితి బుల్లితెరకు పడిపోవడానికి కారణాలుగా చెబుతున్నారు.

అయితే, బుల్లితెరపై కాస్త దృష్టి పెడితే ఏ ప్రోగ్రామ్‌ చేసినా అది మినిమమ్‌ గ్యారంటీ అనిపించుకోవడం విశేషమిక్కడ.