కరవు ప్రాంతమైన కడపలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిశ్రమలను నెలకొల్పాలనే నిర్ణయానికి సానుకూల వాతావరణం తోడైంది. వైఎస్సార్ జిల్లాలోని కడపకు సమీపంలోని కొప్పర్తిలో వైఎస్సార్ – జగనన్న మెగా ఇండస్ట్రీయల్ హబ్‌లో మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటుకు అన్నీ కలిసొస్తున్నాయి.
ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్ టైల్స్ రీజియన్ అండ్ అపెరల్ (పీఎం మిత్ర) పథకం కింద కొప్పర్తిలో టెక్స్టైల్స్ పరిశ్రమ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పరిశ్రమల శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఏపీకి శుభపరిణామం.
జగన్ సర్కార్ గొప్పగా చెప్పుకునే అంశం కూడా. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలో రూ.1,100 కోట్లతో పరిశ్రమ నెలకొల్పాలని ముందడుగు వేయడం జగన్ ప్రభుత్వ చొరవకు నిదర్శనం. ఇదిలా ఉండగా కొప్పర్తిని టెక్స్టైల్స్ ప్రతినిధులు హెచ్‌కె నంద, డిప్యూటీ సెక్రటరీ పూర్ణేందుకాంత్, ఏపీఐఐసీ ఈడీ సుదర్శన్‌బాబు, రాష్ట్ర పరిశ్రమల శాఖ సలహాదారుడు రాజోలు వీరారెడ్డి పరిశీలించారు.
ముఖ్యంగా పార్క్ అభివృద్ధికి పత్తి ఉత్పత్తి, రవాణాకు పక్కనే విమానాశ్రయం, అలాగే కృష్ణపట్నం, చెన్నై పోర్టులు అందు బాటులో ఉండడం ఎంతో కలిసొచ్చే అంశంగా కేంద్ర బృందం ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. అలాగే విద్యుత్, నీటి సౌకర్యా లు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అందుబాటులో ఉన్నట్టు గుర్తించారు. రవాణా సౌకర్యం నిమిత్తం కొప్తర్తికి కూతవేటు దూరంలో ఉన్న కృష్ణాపురం వరకు రైల్వేలైన్ కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రతినిధులు సూచించారు.
ఎగుమతుల కోసం ఏవియేషన్ అధికారులతోనూ రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని కేంద్ర టెక్స్టైల్స్ అధికారులు సూచించారు. పరిశ్రమ ఏర్పాటుకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండడంతో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో 1,186 ఎకరాల్లో మెగా టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటుకు నిర్ణయించారు.
ఈ పరిశ్రమ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం 30 శాతం, రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 70 శాతం పెట్టుబడులు పెట్టనున్నాయి. ఈ టెక్స్టైల్ పార్క్ వల్ల 10 వేల మందికి పైగా ఉద్యోగాలు లభించనున్నాయి. భారీ సంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగుమం చేసిన సీఎం జగన్‌ను మెచ్చుకుందాం.