చంద్రబాబు త్యాగంపై జనసేనాని పవన్‌కల్యాణ్ ఎలా స్పందిస్తారు? ప్రస్తుతం దీనిపై ఉత్కంఠ నెలకుంది. ఇటీవల చంద్రబాబు మాట్లాడుతూ జగన్‌ను ఓడించేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. తాము త్యాగానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అయితే జగన్‌పై వ్యతిరేక పోరాటానికి టీడీపీ నాయకత్వం వహిస్తుందని చెప్పారు. చంద్రబాబు పిలుపు తర్వాత జనసేనాని పవన్‌కల్యాణ్ జనంలోకి ఇవాళ వస్తున్నారు.
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని శిరివెళ్ల మండలంలో ఆదివారం పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు. రచ్చబండ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎటూ జగన్‌పై విమర్శలు గుప్పించే కార్యక్రమమే కాబట్టి, చంద్రబాబు పొత్తు పిలుపుపై పవన్ ఏమంటారో అనే ఆసక్తి నెలకుంది. బీజేపీతో పొత్తులో ఉన్న పవన్‌కల్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చకూడదనే అభిప్రాయంతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పొత్తుకు సై అని ప్రకటిస్తారా? లేక కాలానికే నిర్ణయాన్ని వదిలేస్తారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. చంద్రబాబుకు తమ అవసరం ఉందని, ఇంకా ఎన్నికలకు రెండేళ్ల గడువు వుందని, తొందరెందుకనే అభిప్రాయంలో జనసేన నాయకులున్నారు. అయితే ముందే ఒక నిర్ణయానికి వస్తే, ఎన్నికల నాటికి సమస్యలు లేకుండా అధికార పక్షాన్ని ఢీకొట్టొచ్చని టీడీపీ వాదన.
పొత్తుపై టీడీపీ, జనసేన దాగుడు మూతలు ఆడుతున్నాయనేది స్పష్టం. బీజేపీ మాత్రం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. మిత్రుడు నమ్మక ద్రోహం చేస్తాడా లేక తమతో కలిసి వస్తారా? అనేది బీజేపీకి అంతు చిక్కడం లేదు.
రోడ్‌మ్యాప్ తమను అడిగి, చంద్రబాబు చెప్పినట్టు నడుచుకుంటున్నారనేది బీజేపీ ఆరోపణ. అందుకే ముసుగు తొలిగితే తమకు మంచిదని బీజేపీ భావిస్తోంది. మరి పవన్ మనసులో మాట ఏంటో, దాన్ని వెల్లడించడానికి తగిన సమయం ఎన్నడో? అని బీజేపీ నేతలు అంటున్నారు.