మద్రాసులో జనసమ్మర్దాన్ని తగ్గించడానికి శివారు ప్రాంతాల్లో టౌన్‌షిప్పులు ఏర్పాటు చేశారు. అక్కడ నివాసం వుంటే బస్సు చార్జీలు ఎక్కువవుతాయనే జంకు వుంటుంది కాబట్టి వాటికి దూరంతో సంబంధం లేకుండా చాలా తక్కువ టిక్కెట్టు రేట్లు పెట్టారు. ఆ సబర్బన్ బస్సుల ప్రత్యేకత సూచించడానికి నెంబర్ల చివర 'సఫిక్స్'గా వి లేదా జె అనే అక్షరం పెట్టేవారు. సబర్బన్, రూరల్, మఫ్‌సిల్ యిలాటి ఏ రకమైన వర్ణనకైనా సరిపోని ఆ అక్షరాలను ఎలా అన్వయించాలో ఎవరికీ అర్థమయేది కాదు. అన్నిటికీ ఒకే అక్షరం వాడకుండా రెండు అక్షరాలు ఎందుకు? అందువలన జనాలు వి అంటే వీరప్పన్ అని, జె అంటే జయలలిత అని, యిరువర్గాలను తృప్తి పరడానికి సగం యిలా, సగం అలా పేరు పెట్టారని చెప్పుకునేవారు. జయలలితకు యింత పాప్యులారిటీ రావడం కూడా వీరప్పన్ వర్గం సహించలేకపోయేది. పార్టీలో వారిదే మెజారిటీ. సినిమాతారగా కెరియర్ ముగిసిపోయిన ఒక మహిళ మళ్లీ రాజకీయాల్లోకి దూసుకు రావడం, చేపట్టిన పదవిలో రాణించడం వారు జీర్ణించుకోలేక పోయారు. నిజానికి మేల్‌షావనిజం విపరీతంగా వున్న తమిళ సమాజంలో ఒక గ్లామరస్ మహిళ రాజకీయనాయకురాలిగా నెగ్గుకురావడం చాలా కష్టం. ఎడిఎంకెలో చేరిన కొత్తల్లో ఎడిఎంకె జండా అంచుతో తెల్లచీర, జాకెట్టు ధరించి జయలలిత ప్రచారనిమిత్తం జనం మధ్యలోకి వెళితే ఆమెపై అభిమానులు విరుచుకుపడిపోయారట. కార్యకర్తలు ఎలాగోలా విడిపించి బయటకు తీసుకుని వస్తే దుస్తులపై ఎక్కడ పడితే అక్కడ చేతిముద్రలున్నాయట. ఇలాటి భౌతికమైన దాడులే కాదు, ఆమె గురించి డిఎంకె నాయకులు బహిరంగంగాను, ఆమెకు వ్యతిరేక వర్గంలోని ఎడిఎంకె నాయకులు నర్మగర్భంగాను వ్యక్తిగతంగా నీచమైన వ్యాఖ్యలు చేసేవారు. ఆమెను 'పప్పత్తి' (బాపనమ్మ) అని వెటకరించేవారు, యీసడించేవారు. కొన్నాళ్లకు ఆమెకు చికాకేసి 'అవును నేను బాపనమ్మనే' అంది. వెంటనే ''చూశారా, ఆమె తన అగ్రకులాన్ని చాటుకుంటోంది'' అని అల్లరి పెట్టారు.
ఇలాటి తమిళ సమాజంలో ఆమె అవమానాలు సహిస్తూ, భరిస్తూ అవరోధాలు లెక్క చేయకుండా పట్టుదలతో, కసితో, కఠోర పరిశ్రమతో ఉన్నతస్థానం చేరింది. ఆ విషయం అందరికీ తెలిసి రావాలని వాళ్ల చేత సాష్టాంగ నమస్కారాలు చేయించుకుంటుంది. మెత్తగా వుంటే తనను తొక్కేస్తున్నారని గ్రహించిన జయలలిత ప్రాపగాండా సెక్రటరీగా పార్టీలో సముచిత స్థానం సంపాదించుకున్నాక, ఓటర్ల చెంత, పార్టీ కార్యకర్తల చెంత పాప్యులారిటీ పెరుగుతున్నకొద్దీ తనను తను ప్రమోట్ చేసుకోవడానికి ఒక తమిళ పత్రికలో తన ఆత్మకథను సీరియల్‌గా రాయసాగింది. దానిలో ఎమ్జీయార్‌తో తను వేసిన సినిమాల గురించి, ఎమ్జీయార్ మార్గదర్శకత్వం గురించి ప్రస్తావించి ఎమ్జీయార్‌కు ఆత్మీయురాలుగా ఓటర్ల మనసులో స్థానం సంపాదించుకుంటుందని వీరప్పన్ వర్గం భయపడింది. ఎమ్జీయార్‌తో చెప్పి దాన్ని ఆపించేసింది. మద్రాసులో వుంటే ఆమెను తట్టుకోవడం కష్టమనుకుని ఎమ్జీయార్‌కు దూరంగా, రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఢిల్లీ పంపించివేస్తే మంచిదనుకున్నారు. అందుకే ఎమ్జీయార్ ఆమెను రాజ్యసభకు పంపించాడు. అయితే అక్కడ ఆమె తన అద్భుత వాగ్ధాటితో జాతీయ నాయకులకు ఎడిఎంకె పార్టీ గురించి సదభిప్రాయం కలిగించింది. అది ఎమ్జీయార్‌ను మరింత మెప్పించింది. ఇలా ప్రతీ అవరోధాన్ని జయలలిత అవకాశంగా మలచుకుంది. అది ఆమె ప్రత్యర్థులను మరింత మండించింది.
ఎమ్జీయార్ పార్టీ గొడవ యిలా వుండగా తక్కిన పార్టీలెలా వున్నాయో చూదాం. 1980 పార్లమెంటు ఎన్నికలలో 20 సీట్లు తెచ్చుకున్న కాంగ్రెసు వెనువెంటనే వచ్చిన అసెంబ్లీ ఎన్నికలలో 31 మాత్రమే ఎందుకు తెచ్చుకుంది అంటే దానికి కారణం వుంది. డిఎంకె పార్టీ మొదటి నుంచి బిసిలను మచ్చిక చేసుకుంటూ వచ్చింది. ఎడిఎంకె కూడా అదే బాటలో నడిచింది. 31% రిజర్వేషన్ కల్పించింది. అయితే బిసిలలో ధనికవర్గాలు మాత్రమే అన్ని ప్రయోజనాలు పొందుతూండడంతో రిజర్వేషన్ ఫలాలు పేదలకూ అందాలనే సదుద్దేశంతో ఎమ్జీయార్ బిసి రిజర్వేషన్‌లకు ఆర్థికపరమైన సీలింగ్ (యిప్పుడు క్రీమీ లేయర్ అంటున్నారు) పెట్టాడు. ఏడాదికి రూ.9 వేల రూపాయల కంటె ఎక్కువ ఆదాయం వచ్చేవారికి రిజర్వేషన్ వర్తించదన్నాడు. ఈ రూలు పెట్టిన తర్వాత వచ్చిన ఎన్నికలలో ఘోరంగా ఓడిపోవడంతో బిసిలకు కోపం వచ్చి పార్టీకి వ్యతిరేకమయ్యారని భావించి వెంటనే సీలింగు ఎత్తివేయడంతో బాటు బిసిల కోటాను ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా 50%కు పెంచివేశాడు. కులపరమైన జనగణన ఏమీ లేకుండానే ఆ పని చేశాడు. ఇక ఆ తర్వాత ఆ కోటాను తగ్గించడం ఎవరి తరమూ కాలేదు. ఏమైతేనేం అసెంబ్లీ ఎన్నికలలో ఎడిఎంకెకు బాగా ఓట్లు పడి కాంగ్రెసు, డిఎంకె దెబ్బ తిన్నాయి. బిసిల ప్రాబల్యం పెరుగుతూ పోయింది. కులరహిత సమాజం నెలకొల్పుతామంటూ కులసూచకాలు తీసేసి హంగామా చేసిన ద్రవిడదేశంలోనే కులం ఆధారంగా పిఎంకె వంటి పార్టీలు పుట్టుకుని వచ్చి ముఖ్యపార్టీలకు దడ పుట్టించాయి. ఇవన్నీ తర్వాతి రోజుల్లో జరిగాయి.
కాంగ్రెసు పార్టీకి గతంలో 40% ఓట్లుండేవి. ద్రవిడ పార్టీల విధానాలను వ్యతిరేకించే వారందరూ కాంగ్రెసుకే ఓటేసేవారు. ఎడిఎంకె పార్టీ పేరుకే ద్రవిడ పార్టీ కానీ ద్రవిడత్వం ఏమీ లేని పార్టీగా తయారు కావడంతో ఆ ఓటర్లకు ఎడిఎంకె నచ్చసాగింది. పైగా డిఎంకెను ఓడించే సత్తా కాంగ్రెసుకంటె ఎడిఎంకెకే వుందని వాళ్లు గ్రహించారు. అందుచేత కాంగ్రెసు ఓటు బ్యాంకు 40% నుండి 20%కి పడిపోయింది. 1977, 1989లలో కాంగ్రెసు స్వతంత్రంగా పోటీ చేసినపుడు 17% కంటె ఎక్కువ ఓట్లు రాలేదు. డిఎంకె, ఎడిఎంకె బలాబలాలు 35% ఓట్లతో యించుమించు సమానం కావడంతో కాంగ్రెసు ఎవరివైపు మొగ్గితే వారు గెలిచే పరిస్థితి కొంతకాలం పాటు వుంది. కాంగ్రెసు బలాన్ని, అవసరాన్ని ఎమ్జీయార్ బాగా గుర్తించాడు. ఢిల్లీలో అధికారం కావాలంటే కాంగ్రెసుకు తమిళనాడు నుంచి ఎక్కువ ఎంపీ సీట్లు కావాలి, ఇక ఎడిఎంకెకు కేంద్రంలో ఎన్ని ఎంపీలున్నా ఒనగూడే లాభం ఏమీ లేదు. రాష్ట్రంలో అధికారం దక్కితే చాలు. అందువలన ఎమ్జీయార్ ఇందిరతో ఒక ఫార్ములా పెట్టుకున్నాడు. పార్లమెంటు సీట్లలో 75% సీట్లు కాంగ్రెసుకి యిచ్చేవాడు, అసెంబ్లీ సీట్లలో తను 75% తీసుకునేవాడు. దీన్ని ఎమ్జీయార్ ఫార్ములా అనేవారు. ఎమ్జీయార్ తర్వాత డిఎంకె కూడా అదే ఫార్ములాను అవలంబించింది. డిఎంకె, ఎడిఎంకెలతో మార్చిమార్చి పొత్తు పెట్టుకోవడానికి కాంగ్రెసు ఎటువంటి సంకోచాలు పెట్టుకోలేదు. డిఎంకెతో 1976, 1989, 2004, 2006, 2009, 20011లలో పొత్తు పెట్టుకుంటే ఎడిఎంకెతో 1980, 1984, 1996, 1999లలో పెట్టుకుంది. 1996లో కాంగ్రెసు పార్టీ నుంచి విడిపోయి మూపనార్ తదితరులు తమిళ మానిల కాంగ్రెస్ (టిఎంసి) పార్టీ పెట్టారు. అప్పణ్నుంచి డిఎంకె, ఎడిఎంకె కాంగ్రెసు కోటా తగ్గించేశాయి. తర్వాత టిఎంసి కాంగ్రెసులో విలీనమైనా కోటా పెంచలేదు. ఎందుకంటే యీ లోపున అనేక స్థానిక పార్టీలు పుట్టుకుని వచ్చి కాంగ్రెసు ఓటు బ్యాంకును, కొన్ని చోట్ల ద్రవిడ ఓటు బ్యాంకును తినివేశాయి. పొత్తు కూడా అన్నివేళలా సరిగ్గా పనిచేయలేదు. ఎందుకంటే కాంగ్రెసు తన బలాన్ని ఎక్కువగా వూహించుకుని ఎక్కువ సీట్లు కోరడమూ, ఎదుటి పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి రగిలి సరిగ్గా పనిచేయకపోవడమూ జరిగింది. కామరాజ్ నాడార్ చనిపోయిన తర్వాత ఆయన అనుయాయులందరూ ఇందిరా కాంగ్రెసులో చేరిపోసాగారు. నాయకులు జాతీయ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తూ పార్టీని బతికించుకుంటూ వచ్చారు.
ఇక డిఎంకె పార్టీ ఎడిఎంకెతో పోరాడుతూ తన ఉనికిని కాపాడుకుంది. కరుణానిధి చాకచక్యంతో పార్టీనుంచి కార్యకర్తలు నిరాశతో వీడిపోకుండా చూశాడు కానీ నాయకుల పార్టీ ఫిరాయింపులు ఆపలేకపోయాడు. ఎమ్జీయార్‌కు సర్వాధికారాలు తన చేతిలోనే పెట్టుకున్నాడు. మంత్రులందరూ కీలుబొమ్మలే. వాళ్లు ఎక్కడ తిరగబడతారో అని ఎమ్జీయార్‌కు నిరంతరం భయం. అధికారులకు, పోలీసులకు స్వేచ్ఛ వుండేది కాదు. ప్రతిపక్ష పార్టీలపై నిఘా వేసి వుంచేవారు. మానవహక్కుల విషయంలో, పత్రికా స్వేచ్ఛ విషయంలో ఎమ్జీయార్ ప్రభుత్వానికి అస్సలు మార్కులు పడవు. అసభ్యకరమైన రాతలు రాసిన జర్నతీలస్టులకు 2 నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష వేయవచ్చని చట్టం తెచ్చాడు. ఏది అసభ్యమో తేల్చేది పోలీసులు, అధికారపక్ష నాయకులు, ఎడిఎంకె గూండాలు! చిత్తం వచ్చినట్లు కేసులు బనాయించడం, లాకప్పులో మరణాలు, కేసులు మోపకుండానే జైల్లో పెట్టడం – యిలాటివి ఎన్నో వున్నాయి. దీనికి దడిసి చాలామంది డిఎంకె నాయకులు అధికార పార్టీలోకి మారిపోయారు. (ఈ పరిస్థితిని వెక్కిరిస్తూ రుణానిధి 1987లో ''నీతిక్కు దండనై'' (న్యాయానికి శిక్ష) పేరుతో సినిమా కథ రాస్తే సినిమా విడుదలై బాగా ఆడింది. వెంటనే ఎమ్జీయార్ ఎమ్మెల్యేలను, మంత్రులను విమర్శించే సినిమాలను నిషేధించే బిల్లు పాస్ చేయించాడు. అదీ ''విప్లవనటుడు'' ముఖ్యమంత్రిగా మారిన తర్వాత వ్యవహరించిన తీరు!) 1982లో 29 ఏళ్ల తన కొడుకు స్టాలిన్‌ను యూత్ వింగ్‌కు నాయకుడిగా నియమించాడు. అతను పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ కొన్ని నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ హంగామా చేస్తూండేవాడు. ఎమ్జీయార్ బతికున్నంతకాలం అతని కున్న సినిమా గ్లామర్ వలన తాము తిరిగి అధికారంలోకి రావడం, అతని తదనంతరం తమకు అవకాశం వుంది అనుకుంటున్న సమయంలో ఎక్కణ్నుంచో జయలలిత రంగస్థలంపైకి వచ్చి వెలిగిపోవడం వారికి దుర్భరంగా తోచింది. జయలలితకు గ్లామర్‌కు తోడు, రుణానిధికి దీటుగా మాట్లాడగలిగే వాగ్ధాటి వుండడం వారిని నివ్వెరపరిచింది. ఇటువంటి సమయంలో 1984 అక్టోబరులో ఎమ్జీయార్ జబ్బు పడ్డాడు. (సశేషం) ఫోటో – ఎడిఎంకెలో ప్రచార సారథిగా జయలలిత
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2015)