రాజేంద్ర కుమార్ గురించి మరి కాస్త చెప్పాలంటే – తెలుగు దర్శకుడు తాతినేని ప్రకాశరావు ఒక తమిళ సినిమా ఆధారంగా కాబోలు ''కాలేజీ గర్ల్'' (1960) అనే సినిమాని షమ్మీ కపూర్, వైజయంతిమాల హీరో హీరోయిన్లుగా శంకర్-జైకిషన్ల సంగీతంతో దర్శకత్వం వహించారు. అప్పుడే ఆయన తెలుగులో దర్శకత్వం వహించిన ''ఇల్లరికం'' (1959) హిట్ అయింది. ప్రకాశరావు గురువుగారైన ఎల్వీ ప్రసాద్ దాన్ని హిందీలో ''ససురాల్'' (1961) పేరుతో ప్రకాశరావు డైరక్షన్‌లోనే తీస్తానన్నారు. తెలుగులో నాగేశ్వరరావు వేసిన పాత్రను హిందీలో షమ్మీ కపూర్ చేత, రేలంగి వేసిన పాత్రను హాస్యం తగ్గించి కాస్త హీరోయిజం అద్ది శశి కపూర్ చేత వేయిద్దామని ప్లాన్ చేశారు. దీనికి కూడా శంకర్ జైకిషనే సంగీతం. షమ్మీ కపూర్ తన సినిమాలలో సంగీతం గురించి బాగా పట్టించుకుంటాడు కాబట్టి, తనపై చిత్రీకరించే 'తేరీ ప్యారీ ప్యారీ సూరత్‌కో..'' పాటను దగ్గరుండి జైకిషన్ చేత బాణీ కట్టించుకున్నాడు.
ఇంతలో షమ్మీ కపూర్ తనపై మాట తూలడంతో ప్రకాశరావుకి కోపం వచ్చింది. ''దీనిలో హీరోగా షమ్మీని తీసేసి రాజేంద్ర కుమార్‌ను పెట్టుకుందాం. షమ్మీతో బాటు అతని తమ్ముడు శశిని కూడా డ్రాప్ చేసేసి, ఆ స్థానంలో మెహమూద్‌ను పెట్టుకుందాం. మెహమూద్ కాబట్టి కాస్త హాస్యం పెట్టినా ఫర్వాలేదు…'' అన్నాడు నిర్మాత ఎల్వీ ప్రసాద్‌తో. ఆయన సరేననడంతో బి.సరోజా దేవి హీరోయిన్‌గా సినిమా తయారై సూపర్ హిట్ అయింది. నోటి దురద వలన షమ్మీకి ఓ హిట్ చేజారిపోయింది. సినిమా పోయినందుకు అతను బాధపడలేదు కానీ, 'తేరీ ప్యారీ ప్యారీ సూరత్..' పాట (తెలుగులో యీ ట్యూన్ తీసుకుని 'తీయతీయని తేనెల మాటలతో' అనే పాటను ''ఖైదీ కన్నయ్య'' సినిమాకై చేశారు) తనపై చిత్రీకరించబడనందుకు చాలా బాధపడ్డాడు. అప్పటికీ జైకిషన్‌కి చెప్పి చూశాడు. ఆ పాట వెనక్కి పెట్టేయ్, నా సినిమాలో వుపయోగించు, రాజేంద్ర కుమార్ దాన్ని సరిగ్గా చేయలేడు అని.. జైకిషన్ వినలేదు. దాంతో కొంతకాలం షమ్మీ జైకిషన్‌పై అలిగాడు. ఆ అలక ఎక్కువసాగం కొనసాగలేదనుకోండి. ఎందుకంటే వారి అనుబంధం అలాటిది.
***********
రాజేంద్ర కుమార్, తాతినేని ప్రకాశరావుల కాంబినేషన్ బాగా కలిసి వచ్చింది. ''ససురాల్'' హిట్ అయ్యాక ఎల్వీ ప్రసాద్ ప్రత్యగాత్మ దర్శకత్వంలో తెలుగులో తయారైన ''భార్యాభర్తలు'' ఆధారంగా ''హమ్ రాహీ'' ప్లాన్ చేశారు. దాని డైరక్షన్ తనకు శిష్యుడు, ప్రత్యగాత్మకు గురువు అయిన ప్రకాశరావుకి అప్పగించారు. దానిలో రాజేంద్రకుమార్, జమున హీరోహీరోయిన్లు. అదీ హిట్ అయింది. అది తయారవుతూండగానే దక్షిణాదికే చెందిన వీనస్ పిక్చర్స్ వారు ప్రకాశరావు దర్శకత్వంలో వైజయంతీమాల, రాజేంద్ర కుమార్ నాయికానాయకులుగా, శంకర్ జైకిషన్ సంగీతదర్శకత్వంలో ''సూరజ్'' (1966) అనే జానపద సినిమా ప్లాన్ చేశారు. ఆ సినిమాలో విలన్ పాత్రకు సరైనవారు ఎవరాని ఆలోచిస్తూండగా రాజేంద్ర కుమార్ అజిత్‌ను వెళ్లి అడిగాడు.
''జంజీర్'', ''యాదోం కీ బారాత్'', ''కాళీచరణ్'', ''కహానీ కిస్మత్ కీ'', ''జుగ్ను'', ''చరస్'' వంటి సినిమాల్లో విలన్‌గా నటించాడు కాబట్టి అజిత్ మనకు విలన్‌గానే తోస్తాడు కానీ రాజేంద్రకుమార్ అడిగే నాటికి అతను హీరో లేదా సెకండ్ హీరో పాత్రలు వేస్తూన్నాడు. అప్పటికే 80 సినిమాల్లో వేసి వున్నాడు. అజిత్ అసలు పేరు హమీద్ ఆలీ ఖాన్. వాళ్లు పఠాన్లు. అతని కుటుంబం అఫ్గనిస్తాన్‌లోని కాందహార్ నుండి ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌కు తరలి వెళ్లింది. అజిత్ తాత అక్కణ్నుంచి నిజాం కొలువులో పని చేయడానికి హైదరాబాదు వచ్చి స్థిరపడ్డాడు. అజిత్ వరంగల్ కాలేజీలో చదువుకున్నాడు. చదువుల్లో ఓ మాదిరిగా వుండడంతో అతని ఇంగ్లీషు ప్రొఫెసర్ ''ఇంత చక్కటి శరీరసౌష్టవం వుంది. ఫుట్‌బాల్ వంటి ఆటలు బాగా ఆడుతున్నావు. ఆర్మీలో చేరిపో, లేదా సినిమాల్లో చేరిపో.'' అని సలహా యిచ్చాడు. అజిత్‌కి రెండోదే బాగా నచ్చింది. తండ్రి అనుమతి తీసుకుని బొంబాయి రైలెక్కాడు.
చాలాకాలం పాటు హ్రస్వచిత్రాల్లో రోజుకి 5 రూ.ల కూలిపై జూనియర్ ఆర్టిస్టుగా పనిచేశాడు. ఆ తర్వాత చిన్న చిన్న సినిమాల్లో పాత్రలు వచ్చాయి. అతని ఫిజిక్ చూసి ముచ్చటపడిన గోవిందరామ్ సేథీ ''షా ఎ మిస్ర్'' అనే స్టంట్ సినిమాలో ఓ పాత్ర యిచ్చాడు. ఆ తర్వాత ''హాతింతాయి'', ''ఆప్‌బీతీ'' వంటి జానపద, సాంఘిక సినిమాల్లో వేషాలు వచ్చాయి. ఇవన్నీ తన స్వంతపేరుతోనే వేశాడు. ''బేకసూర్'' సినిమాలో వేస్తూండగా దాని డైర్టర్ కె.అమర్‌నాథ్ ''నీ పేరు పొడుగ్గా వుంది, ఏదైనా చిన్నపేరు పెట్టుకోరాదా'' అంటే అప్పుడు అజిత్‌గా మార్చుకున్నాడు.
ఆ తర్వాత చాలా సినిమాలే వచ్చాయి. నర్గీస్, నూతన్ తప్ప తక్కిన పెద్ద హీరోయిన్లందరి పక్కనా అతను కథానాయకుడిగా వేశాడు. వనమాల (''సికందర్''), ఖుర్షీద్ (''తాన్‌సేన్''), నళినీ జయవంత్ (''నాస్తిక్''), మధుబాల (''బేకసూర్''), గీతా బాలి (''బరాదరీ''), సురయ్యా (''మోతీ మహల్''), కామినీ కౌశల్ (''బడా భాయ్''), మీనా కుమారి (''హాలాకు''), నిమ్మి (''చార్ దిల్ చార్ రాహే''), బి సరోజాదేవి (''ఒపేరా హౌస్''), బీనా రాయ్ (''మెరైన్ డ్రైవ్'').. యిలా అనేకమందితో వేశాడు. 'ఆజాకే ఇంతజార్ మే', వంటి గొప్ప పాటలు అతనిపై చిత్రీకరించబడ్డాయి.
ఇన్ని సినిమాలు వేసినా ''నాస్తిక్'' ఒకటే చెప్పుకోదగ్గ హిట్. అందుకే ''పానిక్ ఇన్ బాగ్దాద్'' (1966) అనే సినిమాలో హీరోగా వేస్తూ వుండగా రాజేంద్ర కుమార్ విలన్ ఆఫర్ యివ్వగానే అజిత్ తటపటాయించకుండా సరేననేశాడు. అది అతని కెరియర్‌లోనే గొప్ప మలుపు అయింది. ఆ తర్వాత 120 సినిమాల దాకా ఎదురులేకుండా నటించేశాడు. విలన్‌గా వేసిన తర్వాత ''మిస్టర్ నట్వర్‌లాల్'', ''ధర్మా'', ''శంకర్ శంభు'' వంటి సినిమాల్లో కారెక్టర్ రోల్స్ కూడా వేశాడు. కానీ తన మొహం విలన్‌గా పనికి వస్తుందని ఒప్పుకుని, అటువైపు మరలడంలోనే అతని విజ్ఞత కనబడుతుంది.
అజిత్ హీరోగా వేసే రోజుల్లోనే సెకండ్ హీరోగా దిలీప్ కుమార్‌తో వేసిన సూపర్ హిట్లు ''నయా దౌర్'', ''మొఘలే ఆజమ్'' చెప్పుకోదగ్గవి. ''మొఘలే ఆజమ్''లో పూర్తిగా మంచివాడిగానే వున్నా ''నయా దౌర్'' (1957) లో అతను దిలీప్‌కు స్నేహితుడిగా వుండి ''యే దేశ్ హై వీర్ జవానోంకా..'' పాటలో దిలీప్‌తో బాటు అతనూ నర్తించినా, మధ్యలో అసూయతో దుష్టుడిగా మారి చివర్లో మళ్లీ మంచివాడిగా మారతాడు. అంటే అతనిలో విలన్ అంశ వుందని ముందుగా గుర్తించినవాడు బి ఆర్ చోప్డా అన్నమాట. (సశేషం) (ఫోటోలు- ''ససురాల్'', ''సూరజ్''లో అజిత్, వైజయంతిమాల)
-ఎమ్బీయస్ ప్రసాద్