భారత మాజీ ప్రధాని, జేడీఎస్ నేత దేవేగౌడ మనవడు హీరోగా ఒక సినిమా రానుంది. దేవేగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అయిన హెచ్ డీ కుమారస్వామి గౌడ కుమారుడు నిఖిల్ గౌడ శాండల్ వుడ్ కు హీరోగా పరిచయం కానున్నాడు. ఈ సినిమాకు ఏకంగా 60 కోట్ల రూపాయల బడ్జెట్ ను పెడుతుండటం విశేషం. కన్నడ సినీ చరిత్రలోనే ఇది భారీ బడ్జెట్ చిత్రంగా రికార్డులు సృష్టించబోతోంది.
కుమారస్వామి గౌడ ఆది నుంచి కన్నడ చిత్రపరిశ్రమతో టచ్ లో ఉన్నాడు. నిర్మాతగా కొన్ని సినిమాలు నిర్మించాడు. ఒక హీరోయిన్ ను పెళ్లి కూడా చేసుకొన్నాడు. తన తొలిభార్య సంతానం అయిన కుమారుడిని ఇప్పుడు ఆయన హీరోగా పరిచయం చేస్తున్నాడు. దీనికి ఆయనే నిర్మాతగా వ్యవహరించనుండటం విశేషం.
మరింత విశేషం ఏమిటంటే.. ఈ సినిమాకు తెలుగు దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయి. పూరికి కన్నడ నాట మంచి ఇమేజే ఉంది. ఇడియట్ , ఆంధ్రవాలా , అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి.. వంటి సినిమాలు కన్నడలో నిర్మితమయ్యాయి. అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యాయి. స్ట్రైట్ గా తమిళ సినిమాలు చేసిన చరిత్ర కూడా ఉంది ఈ దర్శకుడి. ఈ నేపథ్యంలో కుమారస్వామి తన తనయుడిని గ్రాండ్ గా ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి పూరిని నమ్ముకొన్నట్టుగా తెలుస్తోంది. మరి ఆరంగ్రేటంతోనే కన్నడ చిత్ర పరిశ్రమలోని రికార్డులను తిరగరాస్తున్న నిఖిల్ గౌడ తొలి సినిమా ఎలా ఉంటుందో!