ఒక మంత్రి గారు హటాత్తుగా ఫేమస్ అవాలనుకున్నారు. వెంటనే తన కలెక్షన్ ఏజెంట్ కం పీఏని పిలచారు.
ఒరేయ్ -నేను ఫేమస్ అవాల్రా-కాని పైసా ఖర్చు అవకూడదు ఏమ్చేస్తే బాగుంటుంది?
మన దేశంలో ఫేమస్ అవలనుకునే వాళ్ళందరూ చేసే పని ఒకటే సార్
ఏంటది ?
ఎవర్నైన రేప్ చేయండి సార్!
నీకేమైనా మెంటలా ? నిర్భయ కింద ఉరేస్తారు
మీరు మైనర్ అని సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తాం కద్సార్ ఇంకా కేసేముంటుంది ?
అదొద్దులే గాని ఇంకో అయిడియా చెప్పు
సింపుల్ సార్ -మీరు హెల్త్ మినిస్టర్ కదా – మన ప్రభుత్వ దవాఖానాలో పరిస్తితులగురించి మీడియా అంటా గగ్గోలుగా ఉంది. అందుకని మీరు మన ప్రభుత్వ దవాఖానా లో పరిస్తితులను స్టడీ చేయడానికి ఒక రోజు గడదలచు కున్నట్లు ప్రెస్ రిలీజ్ ఇద్దాం. దాంతో మీకు మంచి పేరు ప్లస్ మన దిక్కు మాలిన ‘న్యూసెన్స్’ ఛానల్స్ ఫుల్ పబ్లిసిటీ ఇస్తాయ్ – ప్రజలు కూడా మెచ్చు కుంటారు నాకు మన ప్రధాన మంత్రి మోడీ ఇన్స్పిరేషన్ అని కూడా అన్నారను కోండి బ నేషనల్ లెవల్లో పబ్లిసిటీ –
అంటే ప్రజలు అంత వెర్రి వెధవలన్టావా?
మెజారిటీ అంతే సార్ అందుకే మనం ఎప్పుడూ గెలుస్తున్నాం కదా –
సరే రేపే నైట్ ఇన్ దవాఖానా ప్లాన్ చేసేయ్
xxxxxxxxxxxxxxxxxxx
మర్నాడే మంత్రి గారు నైట్ ఇన్ దవాఖానా స్టార్ట్ చేసారు.
హాస్పిటల్లో ఈగలు దోమలు మురికి వాసనలతో ఆయనకు వాంతులు మొదలైనాయ్ . వెంటనే డాక్టర్లు పరుగెత్తుకొచ్చి వాంతులకు మందులేసారు. దాంతో వాంతులు తగ్గకపోగా వాటితోపాటు విరోచనాలు ఎక్కిళ్ళు కూడా మొదలైనాయ్.
ఇదేమిటి? వాంతులు తగ్గక పోగా ఇవన్నీ మొదలైనాయ్? కోపంగా అడిగారు మంత్రి గారు.
మనకి సప్లయ్ అయే మందు లంతే సార్ అన్నీ చెత్త కంపెనీలు రోడ్డు మీద చెత్త వేరుకునే వాళ్ళే చెత్తలోనుంచి తయారు చేస్తారు-
ఆ మాట వినగానే మంత్రి గారికి మళ్ళీ వాంతులు వచ్చేసినాయ్.
నీయమ్మ మీరు మనుషులా పశువుల్రా? ఏ నాకోడుకురా అలాంటి వాటిని కొనమంది ?
మీరే సార్
మంత్రి ఉలిక్కిపడ్డాడు.
నేనా? అల్లాంటి చెత్త కొనమని నేనెప్పుడు చెప్పాన్రా ?
డాక్టర్లు డవుటుగా పీఏ వేపు చూసారు.
పీఏ వెంటనే మంత్రి చెవిలో గోణిగాడు-సార్ మనకు కమిషన్ ఎవడెక్కువ ఇస్తే వాడి దగ్గరే మందులు కొనాలని మనమే ఆర్డర్స్ ఇచ్చాం సార్
కాని అవి ఇలా ప్రాణం మీదకొస్తే ఎలా మరి?
చచ్చేది చెత్త ప్రజలే కద్సార్ మనం కాదుగా?
సరే సరే ముందు నాకు మంచి కంపెనీల మందులు మన డబ్బుతో తెప్పించు చిరాగ్గా అరచాడాయన.
వెంటనే మంచి మందులు తెప్పించి వేసారు .
ఆ రోగాలన్నీ కొంతవరకు తగ్గాయి గాని అప్పటికే దోమలు వాయించేస్తున్నాయ్.
ఇక్కడ దోమతెరలు లేవా? కోపంగా అడిగాడు మంత్రి-
డాక్టర్లు షాక్ అయ్యారు
దోమ తెరలా? అంటే ఏమిటి సార్ ?
మంత్రి జుట్టు పీక్కో బోయాడు గానీ జుట్టు కనిపించలేదు.
అమ్మో నా జుట్టు బంగారం లాంటి నా జుట్టేమయిందిరా? అరగంట కిందటి వరకు ఉంది కదురా?
వెంటనే డాకర్లు ఆయన చెవిలో ఊదారు-సార్-మనకి సప్లయ్ అయే మందులు వాడే వాళ్ళందరికీ అంతే సార్ కావాలంటే మిగతా బెడ్స్ మీదున్న పేషెంట్స్‌ని చూడండి-
మంత్రి మిగతా బెద్స్ వేపు చూసాడు పేషెంట్స్ అందరికీ గుండ్లు కనిపించాయ్.
మంత్రికి నోట మాట రాలేదు
వెంటనే పీఏ చెవిలో అరచాడు-అరేయ్ నేనింకొక్కక్షణం కూడా ఇక్కడుండను పద ఇంటి కెళ్ళి పోదాం అన్నాడు ఏడుపు మొఖంతో
సరిగ్గా అప్పుడే టీవీ చానల్స్ వాళ్ళందరూ వచ్చేశారు కెమెరాలతో
నమస్తే సార్-మీరు ఈ నైట్ అంతా దవాఖానాలో వీరవిహారం చేసి ప్రభుత్వ దవాఖానా లన్నిటినీ ప్రక్షాళన చేయబోతున్నారని తెలిసింది. ఇక్కడ మీకేమైనా లోటుపాట్లు కనిపించాయా సార్?
కొన్ని ప్రాబ్లెమ్స్ ఉన్నాయ్ గాని మరీ మీరు ఏకిపారేసెంత అధ్వాన్నంగా మాత్రం లేవు అన్నాడు పీఏ.
అవునవును అతన్ని సపోర్ట్ చేసాడు మంత్రి.
ఇక్కడ డాక్టర్లు అసలు ఉండరనీ అందరూ దవాఖానా టైములో మల్టీప్లెక్సుల్లో ఉంటారని పేషెంట్లు అంటున్నారు-
రుజువుల్లేకుండా మీ ఇష్టమొచ్చింది టెలికాస్ట్ చేస్తుంటారు మీరు – ఇరుగో డాక్టర్లన్దరూ ఇక్కడే ఉన్నారు- చూడండి ఇదిగో అటండేన్స్ రిజిస్టర్
అందరూ ఘొల్లున నవ్వారు వాళ్ళెందుకు నవ్వారో మంత్రికి అర్ధం కాలేదు.
ఈ దవాఖానాలో కుక్కలు ఎక్కువగా వున్నాయని పేషెంట్‌లు అంటున్నారు నిజామేనా సార్?
అంతా అబద్దం నాకు ఇక్కడ ఒక్క కుక్క కూడా కనపడ లేదు.
అప్పుడే ఓ పాతిక కుక్కలు అప్పుడే పుట్టిన ఓ పాపాయిని ఎత్తుకుపోతూ వాటిల్లో అవి వీర ఫైటింగ్ చేస్తూ పేషెంట్స్ మీద నుంచి దూకుతూ దొరికినవాడిని కరుస్తుంటే అందరూ హా హా కారాలు చేస్తూ బయటకు పరుగెడుతున్నారు.
మంత్రి గారు, డాక్టర్‌లూ అందరూ బాత్రూమ్ల లోపలికి పరుగెత్తారు కాని బాత్రూమ్స్ లోని కండిషన్స్ ఎంత నికృష్టంగా ఉన్నాయంటే మంత్రి సృహ తప్పాడు. పీయే ఆ పాకుడికి ఉచ్చలు పోసుకునే కుండీలలో అడ్డంగా పడిపోయాడు. వెంటనే విరిగిపోయిన స్ట్రెచర్ మీద అతనిని తీసుకెళ్ళి ఓ బెడ్ మీద పడేసి ఆక్సిజెన్ పెట్టారు. కాని అందులోనుంచి ఆక్సిజెన్ వచ్చే వాల్వ్ పనిచేయక పోయేసరికి కోమాలోకి వెళ్లిపోయాడు. టీవీ ఛానల్స్ వాళ్ళందరూ కెమెరాలతో దవాఖానా బయటకు పరుగెత్తి చెట్లు ఎక్కేసారు.
డాక్టర్లందరూ కలసి మంత్రి గారిని స్పెషల్ రూమ్‌లోకి చేర్చారు.
మంత్రి గారికి అర్ధ రాత్రి దాకా నిద్ర పట్టలేదు. చాల సేపటికి నిద్ర పడుతుండగా ఒక అందమైన సినిమా సెక్సీ ఐటమ్ గర్ల్ వచ్చి పక్కలో పడుకుంది. మంత్రి షాకయ్యాడు. ఆహా మన దవాఖానాలో ఈ సౌకర్యం కూడా ఉందన్నమాట మనకి తెలీనే తేలీదే తెలుస్తె రోజూ వచ్చేసే వాడినే అనుకుని ఆ గాళ్ ని వాటేసు కోబోయే సరికి ఆ అమ్మాయి కుక్క లాగ అరచి మంత్రి గారిని కరిచేసింది.
ఉలిక్కిపడి నిద్ర లేచి చూ స్తే అది నిజంగా కుక్కే. భయంతో గావు కేక లేసాడాయన. మళ్ళీ అందరూ పరుగెత్తు కొచ్చారు.
ఓర్నాయనో ఎంత పెద్ద కుక్క రా ఇది ఇది ఈ రూమ్ లోకి ఎలా వచ్చిన్దసలు
సార్- నిజం చెప్పాలంటే ఈ దవాఖానా కట్టిన దగ్గర్నుంచి ఈ బెడ్ దానిదే సార్-దీనిమీద ఇంకెవ్వరినీ పడుకోనీదు సార్ – ఇవాళ అది వేరే వార్డులో పడుకుందని మనవాళ్ళు చెప్పారు. అందుకని ఆ బెడ్ మీ కిచ్చాం –
వెంటనే మంత్రి గారు పిచ్చి కుక్క ఇంజక్షన్ ఇవ్వమని డాక్టర్‌ని అడిగారు
ఆ ఇంజెక్టన్లు లేవు సార్ !
ఎందుకు లేవు?
సప్లయ్ చేయలేదు సార్!
ఎందుకని?
వాళ్లకు పాత బిల్స్ పాస్ చేయలేదు సార్!
వెంటనే అధికారులను పిలిపించారు మంత్రి గారు.
వాళ్ళు మాకు కమిషన్ ఇవ్వలేదు సార్ అన్నారు వాళ్ళు
మీకు జీతాలు ఇస్తున్నాం కదా – మళ్ళి కమిషన్లు ఎందుకు
అవి వస్తేనే మీకు షేర్ ఇవ్వగలం గద్సార్ –
మంత్రి గారు ఖంగారు పడ్డారు
ఆ విషయం ఓపెన్‌గా చెప్తారేం – ఓ పక్క టీవీ వాళ్ళుండగా –
వాళ్ళంతా మన వాళ్ళే సార్ -వాళ్లకూ షేర్ ఉంటుంది కదా –
సరే సరే -ఇప్పుడు నాకు ఇంజక్షన్ ఎలా ?
వెంటనే డాక్టర్లు మందుల కంపెనీకి ఫోన్ చేసి ఇంజక్షన్ తెప్పించారు. కాని ఆ ఇంజక్షన్ ఇచ్చేసరికి ఆయన కండిషన్ సీరియస్ అయి పోయింది.
ఇదేమిటి -ఇలా అయింది ? భయంగా అడిగారాయన.
మనకు సప్లయ్ ఆయే మందులింతే సార్ -వాటిల్లో కెమికల్స్ ఉండవ్ ఎక్స్పయిరీ అయిపోయిన జొన్న పిండి వేస్తారు.
మరి ఇప్పుడు నా గతేమిటి ?
కార్పోరేట్ హాస్పిటల్‌కి త్వరగా వెళ్తే బతుకుతారు సార్ –
మంత్రి గారు వెంటనే కార్లో కార్పోరేట్ దవాఖానా కి పరుగెత్తారు.
నీతి-ఉచిత ‘పబ్లిసిటీ’ ఒక్కోసారి ప్రాణం మీదకు వచ్చును
యర్రంశెట్టి సాయి