ఎమ్బీయస్‌ : వినోద్‌ మెహతా – 13

ఇలాటిదేదో వస్తుందని వినోద్‌ ముందే వూహించాడు. ఎందుకంటే 1989 ఏప్రిల్‌లో రామకృష్ణ హెగ్డే అతన్ని ఓ రోజు డిన్నర్‌కు పిలిచి పేపరు చాలా బాగుందని మెచ్చుకుంటూనే మీ పబ్లిషరు దాని గురించి గర్వపడకపోవడం మాత్రం…

ఇలాటిదేదో వస్తుందని వినోద్‌ ముందే వూహించాడు. ఎందుకంటే 1989 ఏప్రిల్‌లో రామకృష్ణ హెగ్డే అతన్ని ఓ రోజు డిన్నర్‌కు పిలిచి పేపరు చాలా బాగుందని మెచ్చుకుంటూనే మీ పబ్లిషరు దాని గురించి గర్వపడకపోవడం మాత్రం బాగాలేదన్నాడు. 'మీకెలా తెలుసు?' అని అడిగితే 'ఓసారి మేం యిద్దరం విమానంలో పక్కపక్కన కూర్చున్నాం. ఈ పేపరు వలన నాకు చాలా యిబ్బందులు వస్తున్నాయి. అమ్మేద్దామనుకుంటున్నానన్నాడు.' అని చెప్పాడు. ఇది జరిగిన నెలన్నరకు వినోద్‌కు విజయ్‌ నుండి ఓ లేఖ చేరింది – 'ఇటీవలి కాలంలో మన పేపర్లో వస్తున్న వార్తలు నాకు చాలా సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ఆ వార్తలు నిజమోకావో మీకు తెలియాలి కానీ పాఠకులకు మాత్రం వూహాజనితంగా, అతిశయోక్తులతో నిండినట్లుగా అనిపిస్తున్నాయి. మన పేపరు విశ్వసనీయత దెబ్బతినేట్లు కనబడుతోంది. సంపాదకుడిగా మీ స్వేచ్ఛను నేను హరించే ఉద్దేశం లేకపోయినా, కింద యిస్తున్న నాయకుల గురించిన కథనాలు తాత్కాలికంగానైనా ఆపమని కోరుతున్నాను. లేకపోతే మన వ్యాపారప్రయోజనాలు దెబ్బ తింటాయి. నా పరిస్థితిని అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను.' అని రాసి వుంది. కింద యిచ్చిన జాబితా – ప్రధానమంత్రి, అమితాబ్‌ బచ్చన్‌, సతీశ్‌ శర్మ, లలిత్‌ సూరి, ధీరూభాయ్‌ అంబానీ, విపి సింగ్‌, మురళీ దేవ్‌రా, శరద్‌ పవార్‌.

ఈ సంగతి విజయ్‌ స్వయంగా చెప్పి వుండవచ్చు. కానీ ఎందుకోగానీ లిఖితపూర్వకంగా యిచ్చాడు. దీనికి సమాధానంగా వినోద్‌ 'మీ ఉత్తరంలో ప్రస్తావించిన పెద్దమనుష్యులెవరి వ్యతిరేకంగా మన పత్రిక పగబట్టి రిపోర్టులు వేయలేదు. ఇతర నాయకులు చేసిన ఆరోపణలను ప్రచురించామేమో, అంతే. అమితాబ్‌, శరద్‌ పవార్‌, మురళీ దేవ్‌రాల గురించి మనం ఎప్పుడూ బాగానే రాశాం. రేమాండ్స్‌ ప్రయోజనాలకు హాని కలిగించకూడదన్న యింగితజ్ఞానంతోనే నేను మెలిగాను. ఇలాటి పరిస్థితుల్లో నేను రాజీనామా చేయడమే మంచిదనుకుంటున్నాను. మీరిన్నాళ్లూ చూపిన ఆదరానికి కృతజ్ఞతలు.' అని రాశాడు. ఇది పంపిన రెండు రోజులకు విజయ్‌ ఒబరాయ్‌ హోటల్‌లో లంచ్‌కు పిలిచాడు. జరిగిందేమిటో చెప్పాడు – రాజీవ్‌ గాంధీకి సన్నిహితంగా వుండే సతీశ్‌ శర్మ, ఆర్‌ కె ధవన్‌ పేపరుపై పగబట్టారు. నిజానికి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా ప్రభుత్వ భజనలో మునగగా, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రభుత్వాన్ని ఎప్పుడూ విమర్శించేది. ఇండియన్‌ పోస్ట్‌ మధ్యలో వుండేది. ఫీచర్స్‌పై ఎక్కువగా ఆధారపడుతూ పొలిటికల్‌ డైరీ అనే కాలమ్‌ను ఎడిటరే స్వయంగా నిర్వహించేవాడు. దీనిలో 60% వాస్తవాలు, తక్కినవి జరిగిందని అనుకోవడానికి అవకాశం వున్న సంఘటనలు (లాజికల్‌ స్పెక్యులేషన్‌) అని ముందే చెప్పి విషయాలు రాసేవాడు. పాఠకులు ఆసక్తితో చదివేవారు. నమ్మేవారు. ఆ కాలమ్‌లో సతీశ్‌ శర్మ, ఆర్‌ కె ధవన్‌ల గురించి చాలా సార్లు వచ్చింది. 

మార్చి నెలలో సతీశ్‌ విజయ్‌ను ఢిల్లీ రమ్మన్నాడు. గంటసేపు వెయిట్‌ చేయించి, ఆ తర్వాత గదిలోకి వచ్చాక అతనికి వీపు పెట్టి, తలకాయ దువ్వుకోవడం మొదలెట్టాడు. తర్వాత కుర్చీలో కూర్చుని నాన్‌స్టాప్‌గా తిట్టనారంభించాడు. చివరిగా ఆజ్ఞ జారీ చేశాడు – 'ఇండియన్‌ పోస్ట్‌' మూసేయ్‌ అని. తన ఆజ్ఞ పట్టించుకోకపోతే ఏమవుతుందో విజయ్‌కు తెలియపరచడానికి రెండు నెలల తర్వాత ఎకనమిక్‌ టైమ్స్‌లో ఒక రిపోర్టు వేయించాడు – 'రేమాండ్స్‌ ఉలెన్‌ మిల్స్‌ వారి రూ.546 కోట్ల రూ.ల ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగులో వున్నాయి. వాటి విషయమై ప్రభుత్వం ఏ నిర్ణయమూ తీసుకోలేదు' అని. ఇక విజయ్‌ ఏదో ఒకటి చేయక తప్పని పరిస్థితి వచ్చింది. విజయ్‌ వినోద్‌తో లంచ్‌ టైములో తన డైలమాను, తన విచారాన్ని రెండూ వ్యక్తం చేశాడు. డైలమా ఏమిటంటే – పత్రికను నడపాలా? లేక వ్యాపారం గురించి రాజీ పడాలా? విచారం ఏమిటంటే – సతీశ్‌ శర్మను లాగి ఒకటి యిచ్చుకోలేక పోయినందుకు. ఉన్న విషయాలన్నీ చెప్పేసి 'నా పరిస్థితిలో నువ్వుంటే ఏం చేస్తావ్‌?' అని అడిగాడు. వినోద్‌ అప్పటికి ఏమీ మాట్లాడలేదు కానీ మర్నాడు ఉత్తరం రాశాడు – 'మీ కష్టాలు నా కర్థమయ్యాయి. కానీ నా కష్టాల గురించి కూడా ఆలోచించి చూడండి. నా తప్పేమీ లేకపోయినా మీ పేపర్లో చేరడం వలన వృత్తిపరంగా నేను ఎంతో నష్టపోయాను. అందరి మన్ననలు పొందే స్థాయిలో పేపరును రూపొందించాను. కానీ యిప్పుడు పేపరు మూతపడడంతో నా మీద 'వైఫల్యం' ముద్ర పడుతుంది. నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు, మన చుట్టూ వున్న రాజకీయ వాతావరణాన్ని నిందిస్తున్నాను. రేపే ఎడిటరుగా రిజైన్‌ చేస్తున్నాను.' అని.

వినోద్‌ రాజీనామా చేయగానే దేశంలోని పేపర్లన్నీ రాజకీయ వ్యవస్థను, విజయ్‌ సింఘానియా పిరికితనాన్ని దుమ్మెత్తిపోశాయి. జరిగినది ఏమిటో విజయ్‌ బహిరంగంగా చెప్పుకోలేడు కాబట్టి – 'వినోద్‌ మెహతా సంపాదకత్వంలో పేపర్లో ఆధారాలు లేని కథనాలు ముద్రించడం జరిగింది' అని సంజాయిషీ చెప్పుకున్నాడు. 'ఇండియన్‌ పోస్టు' సిబ్బంది యావత్తూ ఆ స్టేటుమెంటును ఖండిస్తూ 'పేపరును యీ స్థాయికి తెచ్చిన వినోద్‌ను రాజకీయకారణాలతో తీసివేయడం మాకు మనస్తాపం కలిగిస్తోంది' అని చైర్మన్‌కు లేఖ రాశారు. ఎంవి కామత్‌, కులదీప్‌ నయ్యర్‌, ఖుశ్వంత్‌ సింగ్‌, ఎంఆర్‌ మసానీ, ఆర్‌కె కరంజియా – వీళ్లందరూ వినోద్‌ను తీసివేయడాన్ని నిరసిస్తూ ప్రకటనలు చేశారు. జనతా దళ్‌ లీడరు చంద్రశేఖర్‌ 'ఇది ఎమర్జన్సీ రోజుల్ని తలపిస్తోంది' అన్నాడు. అరుణ్‌ శౌరీ 'ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌'లో గొలుసు కథనాలు వేసి రాజీవ్‌ను, సతీశ్‌ శర్మను దులిపేశాడు. విజయ్‌ రాసిన ఉత్తరం కాపీ 'మిడ్‌ డే' సంపాదించి వేసేసింది. కులదీప్‌ నయ్యర్‌ పియుసిల్‌ (పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌) ద్వారా ఐకె గుజ్రాల్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలో ఓ సెమినార్‌ ఏర్పరచి వినోద్‌ను పిలిచాడు. అప్పుడే రాజీవ్‌ ప్రభుత్వం నుంచి రాజీనామా చేసిన విపి సింగ్‌ ఎవరూ పిలవకుండానే వచ్చి రాజీవ్‌ ముఠాను తిట్టిపోశాడు. అందరూ కలిసి వినోద్‌ను పత్రికా స్వేచ్ఛ కోసం ఆత్మార్పణ చేసుకున్న వీరుడిగా ఆకాశానికి ఎత్తేశారు. 

వినోద్‌ చనిపోయిన తర్వాత కులదీప్‌ నయ్యర్‌ ''వీక్‌''లో రాసిన నివాళిలో యీ సమావేశం గురించి రాసి అందరూ అంత దృఢంగా మాట్లాడినా వినోద్‌ తన స్పందనలో పబ్లిషరుకు వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదని రాశారు. ఈయన చాలా నిరుత్సాహపడి, మీటింగు అయిపోయాక అదేమిటని అడిగాడట. వినోద్‌ నిక్కచ్చిగా చెప్పాడట – ''నన్ను ఉద్యోగంలో పీకేయడం గురించి మీరు మాట్లాడినదంతా కరక్టే. దానికి కృతజ్ఞుణ్ని కూడా. కానీ మీ తరహాలో నేను మాట్లాడలేను. ఎందుకంటే రేపు నేను యిలాటి పెట్టుబడిదారుడి దగ్గరకే వెళ్లి ఉద్యోగం అడగాలి. పబ్లిషరును తిడతాననేమాట బయటకు వచ్చిందంటే నాకు మళ్లీ పని దొరకదు. ఇది కఠోరవాస్తవం. దీన్ని మనం ఆమోదించాల్సిందే'' అని. 'డిస్క్రిషన్‌ యీజ్‌ బెటర్‌ పార్ట్‌ ఆఫ్‌ ద వేలర్‌' అని ఆంగ్లసామెత. సాహసం చూపేముందు యింగితం కూడా ప్రదర్శించాలి. ఇది ''హాసం''రోజుల్లో మాకూ అనుభవంలోకి వచ్చింది. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

mbsprasadgmail.com

Click Here For Previous Articles