రానున్న సార్వత్రిక ఎన్నికలు అధికార, ప్రతిపక్ష పార్టీలకు సవాల్‌గా నిలిచాయి. అధికారం కోసం వైసీపీ, టీడీపీ సర్వశక్తులు ఒడ్డనున్నాయి. ఇక జనసేన విషయానికి వస్తే ఎటూ తేల్చుకోలేకపోతోంది. బీజేపీతో పొత్తు ఉన్నప్పటికీ, వైసీపీని మరోసారి అధికారంలోకి రానివ్వకూడదనే పట్టుదలతో పవన్‌కల్యాణ్ ఉన్నారు.
చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ప్రతిపక్ష నాయకులెవరైనా మాట్లాడేదల్లా ఒకటే… ఈ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని. వైసీపీని అధికారం నుంచి కూలదోస్తే తప్ప రాష్ట్రానికి భవిష్యత్ ఉండదని ప్రతిపక్ష నేతలు చెబుతుండడం విశేషం. అయితే అసలు విషయం అది కాదు.
వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే తమ పార్టీలకు భవిష్యత్ ఉండదనే భయం ప్రతిపక్ష నాయకులను నీడలా వెంటాడుతోంది. తాజాగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ టీడీపీ, జనసేన పార్టీలు కలిస్తే తమ పార్టీ తప్పక ఓడిపోతుందని అన్నారు. అంటే ఈ రెండు పార్టీలు కలవకపోతే తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని రఘురామ చెప్పకనే చెప్పారు.
వైసీపీ అత్యంత శక్తిమంతమైందని రఘురామ పరోక్షంగా చెప్పినట్టైంది. చంద్రబాబు వ్యాఖ్యలు కూడా అట్లే ఉన్నాయి. జగన్‌ను ఓడించడానికి, తనను సీఎం గద్దె ఎక్కించడానికి మిగిలిన పార్టీలన్నీ కలిసి రావాలని చంద్రబాబు పదేపదే పిలుపునిస్తున్నారు. తాము లేకపోతే టీడీపీకి అధికారం కలే అని జనసేన నేతలు అంటున్నారు.
జగన్‌ను అధికారం నుంచి దించేయడం సరే, మరి చంద్రబాబును ఎందుకు అధికార పీఠంపై కూచోపెట్టాలని జనసేన నాయకులు అనుకుంటే టీడీపీ పరిస్థితి ఏంటి? జగన్‌పై పవన్, చంద్రబాబుకు ఉన్నంత అక్కసు, జనసేన కార్యకర్తలు, నాయకులు ఎందుకుండాలి? ఎందుకుంటుందనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్ చేస్తున్న విమర్శల్లోని డొల్లతనాన్ని వారి మాటలే ప్రతిబింబిస్తున్నాయి. నిజంగా జనాల్లో జగన్‌పై విపరీతమైన వ్యతిరేకత ఉంటే, టీడీపీ లేదా జనసేనకు ఏకపక్షంగా ఎందుకు పట్టం కట్టరనే వైసీపీ ప్రశ్నకు సమాధానం?