కింజరాపు అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్. ఆయన ఉంటే చాలు ఉత్తరాంధ్రా జిల్లాలలో పసుపు పార్టీ పదిలం అని అధినేత చంద్రబాబు తలచారు. ఆయనను ఏరి కోరి ఎంపిక చేసి మరీ కిరీటం పెట్టారు.
అయితే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి కంచుకోట లాంటి శ్రీకాకుళంలో ఫలితాలు తేడా కొట్టాయి. ఇక అక్కడితో అది ఆగేలా కనిపించడంలేదు. ఇపుడు మునిసిపాలిటీల్లోనూ సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది.
ఏకంగా నలుగురు టీడీపీ కౌన్సిలర్ అభ్యర్ధులు సడెన్ గా వైసీపీ జెండా కప్పుకోవడం ద్వారా పలాసా టీడీపీని పరేషాన్ చేశారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత కండువాలు మార్చడం పాత ట్రెండ్ అయితే ఇపుడు ఏకంగా అభ్యర్ధులే మూకుమ్మడిగా పార్టీ మారడం నయా ట్రెండ్.
మొత్తానికి పలాసాలో కులాసాగా గెలుద్దామనుకున్న టీడీపీకి ఇది మాస్టర్ స్ట్రోక్ అనే చెప్పాలి. సొంత జిల్లాలో టీడీపీ కోట ఇలా కూలిపోతూంటే అచ్చెన్నకు అతి పెద్ద దిగులే అంటున్నారు. మరో వైపు మాజీ మంత్రి, పలాస మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ అయితే ఇది దారుణం అన్యాయం అంటున్నారు.
ఎవరు అరచి గావు కేకలు పెట్టినా ఇది రాజకీయం. ఇలాగే ఉంటుంది. నాడు 23 మంది వైసీపీఎమ్మెల్యేలను టీడీపీ లాగేసినపుడు ఈ గావుకేకలు ఏమయ్యాయని వైసీపీ నేతలు అంటున్నారంటే రాజకీయ చదరంగంలో టీడీపీ తడబాట్లు పొరపాట్లు అలా బయటపడుతున్నాయి అనుకోవాలేమో.