కరోనా వ్యాక్సిన్ బహిరంగ మార్కెట్లోకి వస్తుందనే వార్త చాన్నాళ్లనుంచి వినిపిస్తూనే ఉంది, అది తాజాగా నిజమైంది కూడా. ఆయితే ఇన్నాళ్లూ ఉచితంగా ఇచ్చినా దానివైపు కన్నెత్తి చూడని జనాలు, ఇప్పుడు అమ్మకానికి పెడుతున్నామంటే ఎగబడి కొనేస్తారా? అసలు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని ఎవరు అనుకుంటున్నారు? కొని మరీ ప్రాణాలమీదకు తెచ్చుకోవాలని ఎందుకు ఆలోచిస్తారు?
వ్యాక్సిన్ విషయంలో మనమే నెంబర్-1, మేకిన్ ఇండియా వల్ల వచ్చిన గొప్ప ఫలితం ఇది, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాం, బ్రెజిల్ కి ఎగుమతి చేస్తున్నామంటూ.. గొప్పలు చెప్పుకుంది కేంద్ర ప్రభుత్వం. హడావిడిగా కొవాక్సిన్, కొవిషీల్డ్ కి అనుమతిచ్చింది. ఇందులో భారత్ బయోటెక్ తయారీ కొవాక్సిన్, ప్రయోగాల దశ పూర్తి చేసుకోలేదనే వార్తలు రావడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఆ వ్యాక్సిన్ మాకొద్దు బాబోయ్ అంటూ కొన్నిచోట్ల వైద్యులే ఎదురు తిరిగిన పరిస్థితి.
కొన్నిరోజులకు ఈ వివాదం సమసిపోయినా, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని మరో పుకారు మొదలైంది. అది పుకారేనా, నిజం కాదా అని తెలుసుకునే ప్రయత్నాలు జనం చేసే లోపే.. వ్యాక్సిన్ తో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయని ప్రచారం చేస్తే తాట తీస్తామంటూ కేంద్రం హెచ్చరించింది.
కొంతమంది వ్యాక్సిన్ వేసుకున్నవారికి కూడా కరోనా వచ్చిందనే వార్తలు విన్నాం, వ్యాక్సిన్ వేసుకున్నా మాస్క్ వేసుకోవాల్సిందేనంటూ వైద్యులు చేస్తున్న హెచ్చరికలూ వింటున్నాం. ఈ నేపథ్యంలో సగటు భారతీయుడికి టీకాపై నమ్మకం సన్నగిల్లిందనడంలో ఎలాంటి అనుమానం లేదు.
వ్యాక్సినేషన్ మొదలైన తొలినాళ్లలో అంతమందికి వేశాం, ఇంతమందికి వేశాం, భారత్ లో వ్యాక్సినేషన్ రికార్డు స్థాయికి చేరుకుందని కేంద్రం లెక్కలు చెప్పింది. అయితే వైద్య సిబ్బందిలోనే సగానికి సగం మంది వ్యాక్సినేషన్ కి దూరంగా ఉన్నారనేది బహిరంగ సత్యం.
ఇక రెవెన్యూలో ఉన్నతాధికారులు హెచ్చరికలు చేసినా అక్కడ కూడా వ్యాక్సినేషన్ టార్గెట్ 60శాతం మించలేదు, పోలీస్ డిపార్ట్ మెంట్ లో మాత్రం ఎందుకొచ్చిన తంటా అంటూ ఎక్కువశాతం మంది ఉద్యోగులు వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు.
ఈ దశలో టీకాని మార్కెట్లోకి తీసుకొస్తున్నామని, సింగిల్ డోసు రూ.250పెట్టి కొనుక్కుని వేయించుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. అయితే కేవలం 60ఏళ్లు పైబడినవారికి 45 సంవత్సరాలు మించి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మాత్రమే ఈ వ్యాక్సినేషన్ ఇస్తామని చెప్పింది. ఉచితంగా టీకా కావాలనుకునేవారు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి వేయించుకోవచ్చు, అంతసేపు వేచి చూడలేం, ఖర్చు భరించగలం అనుకునేవారు ప్రైవేట్ ఆస్పత్రుల్లో డబ్బులిచ్చి టీకా వేయించుకోవచ్చు. ఆప్షన్ ప్రజలదే.
రేపట్నుంచి టీకా ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఇన్నాళ్లూ అధికారుల అనధికారిక హెచ్చరికల ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం ముందుకు సాగింది. ఇప్పుడు జనసామాన్యంలోకి వ్యాక్సిన్ వచ్చేసింది కాబట్టి నిజంగానే జనంలో వ్యాక్సిన్ పై నమ్మకం ఉందా లేదా అనే విషయం ఇప్పుడు తేలిపోతుంది.