టీడీపీకి (అ) ‘శోక’మేనా…!

అభద్రతాభావంలో అధినేత పెరిగిన దూరం రాజు గారిపై బాబు గుస్సా ప్రత్యామ్నాయం అవుతారనా..? నిజాయితీపరుడికి అవమానం Advertisement విజయనగరం సంస్ధానాధీశుడు, నిజాయితీకి మారు పేరు, మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో అవినీతి మకిలి అంటని…

అభద్రతాభావంలో అధినేత
పెరిగిన దూరం
రాజు గారిపై బాబు గుస్సా
ప్రత్యామ్నాయం అవుతారనా..?
నిజాయితీపరుడికి అవమానం

విజయనగరం సంస్ధానాధీశుడు, నిజాయితీకి మారు పేరు, మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో అవినీతి మకిలి అంటని నేత ఆయన. తెలుగుదేశం పార్టీ అంటే కిట్టని మేధావులు సైతం ఆయనంటే ఇష్టపడతారు. ముక్కు సూటి వైఖరే కాదు, చేసే పనిలే కచ్చితత్వం ఆయన సొంతం. చిల్లర రాజకీయాలకు ఆమడ దూరం. పార్లమెంటరీ సంప్రదాయాలకు ఎంతో గౌరవం ఇచ్చే నాయకుడు. అరుదైన వ్యక్తిత్వం కలిగి వర్తమాన రాజకీయాలలో శిఖరాయమానంగా భాసిల్లుతున్న ఆయనే అశోక్‌గజపతిరాజు. ఆయన తెలుగుదేశం పార్టీలో ఇపుడు ఉన్న వారిలో అత్యంత సీనియర్. ఇంకా చెప్పాలంటే అధినేత బాబు కంటే కూడా. ఎన్టీఆర్ పిలుపు అందుకుని తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన ఎన్నెన్నో పదవులు నిర్వహించారు. ఏనాడూ వాటికి మచ్చ రానీయలేదు సరికదా మరికాస్తా వన్నెచిన్నెలు అద్దారు. తాజాగా కేంద్రంలో నరేంద్రమోడీ మెచ్చి ఇచ్చిన మంత్రి పదవికి న్యాయం చేస్తున్న అమాత్య శేఖరుడాయన. టీడీపీ రాజకీయాలలో ఉత్తరాంధ్రలో పెద్ద దిక్కుగా ఉంటున్న అశోక్ గజపతిరాజు తొలిసారిగా ఆ పార్టీ రాజకీయాలకు తీవ్ర మనస్తాపం చెందారు. రాజీనామా చేసేస్తా ఒక్క క్షణంలో అంటూ ఏకరగా అధినేతేక సవాల్ చేసే స్ధాయికి వెళ్లారు. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించని ఘటన ఇది. ఎందుకిలా దూరం పెరిగింది. అశోక్‌కు, బాబుకు మధ్యన పొగ పెట్టిందెవరు, టీడీపీలో ఆయన స్ధానాన్ని కదుపుతున్నదెవరు, అజాత శత్రువైన రాజు అంటే సీఎం బాబుకు ఎందుకు గుస్సా. ఇవన్నీ ఇపుడు ఉత్తరాంధ్ర ప్రజానీకాన్నే కాదు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలించే  ప్రతీ వారి మదిలోనూ రేగుతున్న ప్రశ్నలు.

రాజకీయాలంటే ఆయనవే

రాజకీయం చేయాలంటే ఇలాగే చేయాలి అన్నది విజయనగరం సంస్ధానాధీశుల నుంచే నేర్చుకోవాలి. పైసా కూడా సొంతంగా లేకుండా రాజకీయాలలోకి వచ్చి కోటానుకోట్ల సంపాదన వెనేకసుకునే బాపతు గాళ్లకు మరీ ఈ సంగతి తెలియాలి. విజయనగరం మహరాజుల వంశంలో పుట్టిన అశోక్‌గజపతిరాజు తనకున్న ఆస్తులన్నీ సమాజానికి, ప్రజలేక అంకితం చేశారు. ఈ రోజు విజయనగరం పట్టణంలో ప్రతీ అణువూ రాజులదే. కానీ, వారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా వాటిని అభివృద్ధి కోసం అలా వదిలేసుకున్నారు. గజం జాగాకు కూడా కబ్జా చేసే రాజకీయ నాయకులు ఉన్న ఈ రోజులలో దీనిని ఎక్కడా ఊహించలేం. మన భూమి, పర భూమి అని చూడకుండా ఎక్కడపడితే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, దందాలు చేసే వారి బుర్రలకు ఇది అసలు తోచని వ్యవహారమే. కేవలం ప్రజాభిమానమే పెట్టుబడిగా గెలుస్తూ ప్రతీ ఎన్నికలలో అంతకు సమానంగా ఆస్తులను కోల్పోతూ వచ్చిన వంశం అశోక్‌ది. పదవులు ఏనాడూ ఆయనకు వన్నె తేలేదు. వాటికే ఆయన వన్నె తెచ్చారు. అసెంబ్లీలో ఉన్న పుస్తకాలు ఆయనకు కంఠోపాఠాలు. చట్ట సభలలో సెక్షన్లు ఆయనకు కరతలామలకం.

అశోక్ చెబితే అది కరెక్ట్, ఇంక బుక్ చూడనక్కరలేదని స్పీకర్లు కూడా అనుకోవడం కద్దు. ఆయన పక్కనుంటే చాలు, నిజాయితీని వెంట పెట్టుకున్నట్లేనని నాటి ఎన్టీఆర్ నుంచి నేటి చంద్రబాబు వరకూ నమ్మిన సత్యం. బాబు తలలో నాలుకలా అశోక్ మెలిగారు. ఆయన విపక్షాలకు కూడా చాలా ఇష్టుడు. ఏనాడూ కువిమర్శల జోలికి పోలేదు. కావాలని ఎవరినీ దూషించలేదు. క్లాస్‌లో మాస్‌గా, మాస్‌లో క్లాస్‌గా రాజకీయం చేసిన నాయకుడు. విజయనగరం మహారాజు పూసపాటి విజయరామగజపతికి ఇద్దరు కుమారులు ఆనంద్, అశోక్. ఇద్దరూ జనతా ప్రభంజనంలో రాజకీయ ప్రవేశం చేశారు. 1978 లో తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన అశోక్ 1983 లో టీడీపీలో చేరిపోయారు. ఆయన కాంగ్రెసేతర రాజకీయాలు బాగా ఇష్టపడడం, విజయనగరం సంస్ధానాధీశుడు కావడం వంటి వాటి వల్ల టీడీపీలో బాగా కీలకమైన స్ధానంలో ఉండేవారు. 1995 ఎపిసోడ్‌లో బాబు వెంట ఉన్న ఆయన గత ఇరవై ఏళ్లుగా అదే మైత్రీసూత్రాన్ని కొనసాగిస్తూ వచ్చారు.

ఎక్కడ చెడింది…?

బాబు, అశోక్ అంటే సొంత అన్నదమ్ములన్నదే టీడీపీ రాజకీయాలు తెలిసిన వారికి తెలిసిన మాట.  బాబు ఏ రోజూ అశోక్‌ను తక్కువ చేయలేదు. అశోక్ కూడా ఏనాడూ హద్దులు దాటలేదు.  విజయనగరం జిల్లా రాజకీయాలలో కూడ కనీసం వేలు కూడా పెట్టి ఎరగని సుగుణం ఆయనది. తన నియోజకవర్గం ఏమిటో, తానేమిటో అన్నట్గుగానే సాగింది రాజకీయమంతా. బాబు పోటీ చేయమంటే చేయడం, లేకపోతే లేదు అన్నట్లుగా అశోక్ ఉండేవారు. బాబు కూడా ఆయన మాటకు విలువ ఇచ్చేవారు. కీలకమైన సమయాలలో ఆయన సలహా సంప్రదింపులు తప్పనిసరిగా తీసుకునే వారు. టీడీపీకి పెద్ద దిక్కుగా అశోక్ ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు.

అటువంటిది అశోక్ అంటే తొలిసారిగా బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. అదీ బహిరంగంగా. ఇదే ఇపుడు పెద్దాయన రాజు గారికి తీరని మనస్తాపాన్ని కలిగించింది. విజయవాడలో ఇటీవల తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. బాబు అధ్యక్షతన జరిగిన  ఈ సమావేశానికి ఇద్దరు కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో బాబు కాస్తా ఘాటుగానే అశోక్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఎటువంటి సాయం లేదని, ఇద్దరు మంత్రులు ఉన్నారంటూ ప్రస్తావించిన బాబు మెల్లగా అశోక్‌పై తన బాణాలను సంధించడం మొదలుపెట్టారు. విమానాయాన మంత్రిత్వ శాఖ చేతులో ఉన్నా కూడా ఏపీకి ఏమీ జరగడంలేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పరిస్థితి ఉందని బాబు మండిపడ్డారు.

విజయనగరం జిల్లా భోగాపురం విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్ధాయిలో నిర్మించాలని తపెట్టినా అడుగు ముందుకు కదలలేదని, స్వయాన జిల్లాకు చెందిన వారే పౌర విమానయానం శాఖ చూస్తున్నారంటూ విసుర్లు విసిరారు. ఇలా బాబు అనడంతోనే అశోక్ మనస్తాపం చెందారు.

పేరుకు స్వతంత్య్ర శాఖ అయినా ప్రతీ ఫైలూ ప్రధాని వద్దేక వెళ్తుందని, అక్కడ అధికారులు కొర్రీలు వేస్తున్నారని, తన వంతు ప్రయత్నం త్రికరణ శుద్ధిగా చేస్తున్నానని అశోక్ చెప్పుకొచ్చినా ఫలితం లేకపోయింది. ఏడాది గడచిపోయింది, ఏం చేయలేకపోతున్నాం, మంత్రులు కేంద్రంలో ఉండి కూడా ఏం జరగడంలేదని బాబు అసహనం వ్యక్తం చేయడంతోనే అశోక్ మీరు అలా బాధ పడితే క్షణం ఆలస్యం కూడా చేయకూడా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. తన కృషి లోపం ఉందని భావిస్తే తప్పుకుంటానని కూడా హెచ్చరించారు. ఈ ఎపిసోడ్ అక్కడ ఉన్న వారికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. ఎపుడూ ఆవేశపడని అశోక్ అలా అనడమూ వింత కొలిపింది. ఆ తరువాత బాబు కలుగచేసుకుని అశోక్‌ను శాంతింపచేయాల్సివచ్చింది. ఇది జరిగిన తరువాత విజయవాడ ఇఫ్తార్ విందుకు అశోక్ గైర్ హాజరు కావడం ఆయన లోపలి మనిషి ఇంకా బాధ పడుతున్నాడన్నది స్పష్టం చేసిన విషయం. మీడియాలో పెద్దగా ఇది రాకుండా టీడీపీ మీడియా మేనేజర్లు కృషి చేసినా మెల్లగా బయటకు పొక్కింది కానీ, రావాల్సిన ప్రాధాన్యత రాకుండా చేశారు.

అసలు విషయమేమిటో…!

అశోక్‌పై బాబు ఇలా బహిరంగంగా అసహనం వ్యక్తం చేయడానికి కేవలం ఏపీ అభివృద్ధి కోసమేనా ఇంకా వేరు ఏమైనా ఉందా అన్న ఆలోచనలు టీడీపీ రాజకీయ శిబిరంతో పాటు, బయట కూడా చర్చకు వస్తున్న అంశం. ఈ మధ్య ఓటుకు నోటు కుంభకోణంలో బాబు పేరు బయటకు వచ్చి ఆయన ఏ క్షణానైనా అరెస్ట్ అవుతారని పూటకో రకంగా ప్రచారం అవుతున్న వేళ టీడీపీలో ప్రత్యామ్నాయ రాజకీయ నాయకునిగా అశోక్ పేరు సహజంగానే తెర మీదకు వచ్చింది. కేంద్రంలో కేబినెట్ మంత్రిగా బాబుతో సమాన ెదా ప్రస్తుతం అనుభవిస్తున్న అశోక్ పేరు సీఎం రేసులో చాలా ముందుకు రావడం బాబుకు కలవరపాటు కలిగించిందన్నది ఓ కధనం. బాబు సీఎం కుర్చీ ఖాళీ చేస్తారని కాదు కానీ, ఆ విధంగా జరిగితే ఆయనకు పోటీ ఎవరన్న దానిపైన మాత్రం ఓటుకు నోటు వ్యవహారం ఓ క్లారిటీని ఇచ్చేసింది.

ఇంకా చెప్పాలంటే ప్రతిపక్షాలు, ఏపీ ప్రజలు సైతం బాబు కంటే అశోక్‌కే ఓటు వేసే పరిస్థితి కూడా అపుడు వచ్చింది. నిజాయితీకి మారుపేరుగా, ఉన్న ఆస్తులను ప్రజల కోసం త్యాగం చేసి రాజకీయాలలోకి వచ్చి అన్ని పోగొట్టుకున్న అశోక్ అంటే ఏపీ ప్రజలకు ఎంతో గౌరవం ఉంది. ఆయన సీఎం అయితే బాగుణ్ణు అని అంతా భావించారు.  టీడీపీలోని మెజారిటీ ఎమ్మెల్యేలు సైతం అశోక్ పట్ల చాలా మొగ్గు చూపారు. మరి, బాబు గారు తలచినట్లుగా ఆయన కుమార రత్నం పేరు వారసుల జాబితాలో ఎక్కడా రాలేదు కూడా. అంటే టీడీపీలో తనకు ప్రధాన పోటీదారు అశోక్ అన్న సంగతి బాబుకు స్పష్టంగా అర్ధమైందన్నమాట. ఇది జరిగిన తరువాత ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన అశోక్‌గజపతిరాజు తనకు సీఎం పదవిపై ఆసక్తి లేదని ఖరాఖండీగా తేల్చిచెప్పారు. అలా ఆయన చెప్పారా, చెప్పించారా అన్నది కూడా ఇప్పటికీ తెలియని విషయమే. మొత్తం మీద అశోక్ పేరు అలా బహుళ ప్రాచుర్యం పొందడం బాబును బాగా బాధించిందని, నాటి నుంచే తెలియని ద్వేషమేదో ఆయన పట్ల కలిగిందని కూడా టీడీపీ రాజకీయాలు ఎరిగిన వారు గ్రహిస్తున్న వాస్తవం.

సీఎం కోరీ పితూరీలు

బాబుకు కోటరీ అంటే మహా ఇష్టం. ఏపీలో ఇపుడు ఆ కోటరీయే రాజ్యమేలుతోంది. రెండేళ్ల క్రితం సీనియర్ నేత దాడి వీరభద్రరావుకు ఎమ్మెల్సీ రెండవమారు రాకుండా చేసింది ఈ కోటరీయే. నాడు దాడి పత్రికా సమావేశం పెట్టి నేరుగా కోటరీని కడిగిపారేశారు. ఇపుడు అదే కోటరీ మెల్లగా బాబు చుట్టూ అల్లుకుపోతూ టీడీపీలోని సీనియర్లను పక్కన పెడుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఢిల్లీలో చూసుకుంటే అశోక్‌గజపతిరాజుకు కేంద్ర కేబినెట్ మంత్రిగా మోడీ వద్ద ఎంతో పలుకుబడి, గౌరవం ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మోడీయే స్వయంగా ఆయనను ఎంచుకున్నారని కథనం కూడా ఉంది టీడీపీ నుంచి సుజనా చౌదరి, మరో ఇద్దరి పేర్లను బాబు సూచించగా తనతో పాటు ప్రమాణం చేసే వారిలో అశోక్‌ను టీడీపీ నుంచి మోడీయే ఎంచుకున్నారు.

ఇందుకు ఆయన నిజాయితీయే అర్హతగా మోడీ భావించారు. అంటే అశోక్ కేంద్ర మంత్రి కావడానికి బాబు చేసిన సిఫార్సు ఏమీ లేదన్నది తేటతెల్లమైన సత్యం.  తరువాత విస్తరణలో సుజనా చౌదరిని బాబు సిఫార్సు చేసి మంత్రిని చేసినా సహాయ మంత్రే దక్కింది. అశోక్ ఉండగా కేబినెట్ పదవి టీడీపీకి దక్కదు. దాంతో, పొమ్మనకుండా పొగపెట్టడానికే టీడీపీలోని కోటరీ బాబుకు అశోక్‌పై పితూరీలు చెప్పిందన్న ఆరోపణలూ ఉన్నాయి. దానికి ఓటుకు నోటు ఎపిసోడ్, అశోక్ సీఎం అభ్యర్ధిత్వం కలసివచ్చాయని అంటున్నారు.  ఏది ఏమైనా నియమ నిబంధనను తు.చ. తప్పకుండా ఆచరించే అశోక్ వంటి వారు బాబు చెప్పే పనులను చేయలేరు. సుజనా చౌదరి లాంటి వారికి మోడీ దగ్గర పలుకబడి లేదు. దీంతో, కేంద్రంలో టీడీపీ ఉన్నా కూడా బాబుకు అనుకున్నంతగా సహాయం అందడంలేదు. ఇదీ టీడీపీ నాయకులు చెప్పే మాట.

అంటే నిజాయితీ, సీనియారిటీ ఉన్న నాయకులను పక్కన పెట్టాలని బాబు అనుకుంటున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాజా పరిణామాల నేపధ్యంలో అసలు రాజకీయాలంటేనే వైరాగ్యాన్ని అశోక్ పెంచుకున్నారని టాక్. ఆయన అయిదేళ్లూ కేంద్ర కేబినెట్‌లో కొనసాగితే అది  ఓ వింతేనని, రాజీనామా తన జేబులోనే ఉంచుకునే నాయకుడు ఆయన అని తెలిసిన వారు అనే మాట. ఏదేమైనా టీడీపీలో మరో సీనియర్ నేత శకం తొందరలోనే ముగియబోతోందా  అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

పివిఎస్‌ఎస్ ప్రసాద్,
విశాఖపట్నం.