తెలుగు సినిమాను తెలుగువాళ్లే కాపీ కొడితే!

సాధారణ సినీ ప్రేక్షకులు అయితే ఏవైనా తెలుగు సినిమాల్లోని సీన్లు హాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తే ఆశ్చర్యపోతారు.. మనోళ్లు ఆ సీన్లను భలే కాపీ కొట్టారే.. అని వీరు అనుకొంటారు. అదే సినిమాలను బాగా చూసే…

సాధారణ సినీ ప్రేక్షకులు అయితే ఏవైనా తెలుగు సినిమాల్లోని సీన్లు హాలీవుడ్ సినిమాల్లో కనిపిస్తే ఆశ్చర్యపోతారు.. మనోళ్లు ఆ సీన్లను భలే కాపీ కొట్టారే.. అని వీరు అనుకొంటారు. అదే సినిమాలను బాగా చూసే వాళ్లు అయితే.. తెలుగు సినిమాలను చూడగానే అందులో ఏయే సీన్లు ఏయే హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టబడ్డాయో వివరించేస్తూ ఉంటారు. ఇప్పటి వరకూ ఉన్న ఇలాంటి పరిశీలనల ప్రకారం.. మన తెలుగు దర్శకుల్లో ఎవ్వరూ కాపీలు కొట్టడానికి మినహాయింపులు కాదు. మనం టాప్.. దర్శకులు అనుకొనేవారు.. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాల్లో చాటుతున్నారు.. అనుకొనే వాళ్లు కూడా అనేక హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో సినిమాలు రూపొందిస్తున్నారు అనడానికి అనేక ఆధారాలున్నాయి. పక్కా వీడియో ఆధారాలతో వీరు దొరికిపోతూ ఉంటారు.

మరి అలాంటి వన్నీ ఒకలెక్క అయితే… కొన్ని తెలుగు సినిమాల్లోని సీన్లే మరో తెలుగు సినిమాలో కనిపిస్తూ ఉంటాయి! యాజిటీజ్‌గా ఆ కథాంశాలను దించేస్తూ ఉంటారు. బాగా పాపులర్ అయిన తెలుగు సినిమాలను కూడా తెలుగు వాళ్లే కాపీ కొట్టడం లేదా.. ఆ స్ఫూర్తితో సినిమాలు రూపొందించేయడం జరుగుతూ ఉంటుంది. తెలిసి అలాంటి సీన్లను అనుకరించినా.. తెలియక ఆ సీన్లను సృష్టించినా.. మొదట వాటిని సృజించిన వారిని రెండోవారు అనుకరించినట్టే అవుతుంది! తెలుగు సినిమాలను తెలుగువారే కాపీ కొట్టినట్టుగా అవుతుంది. స్ఫూర్తి అనుకొంటేనేమీ.. కాపీ అయితేనేమీ.. అనేక పాత సినిమాల చాయలు కొత్త సినిమాల్లో కనిపిస్తూ ఉంటాయి.

విశేషం ఏమిటంటే.. ఇలాంటి సినిమాలే టాలీవుడ్‌లో సూపర్ హిట్లు అయ్యాయి. ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేశాయి. వాటిల్లో కొన్నింటిని చెప్పాలంటే.. ‘‘వర్షం’’ సినిమాను ప్రస్తావించాలి. ప్రభాస్, త్రిషలు హీరో హీరోయిన్లుగా.. శోభన్ దర్శకత్వంలో ఎమ్‌ఎస్ రాజు నిర్మాతగా వచ్చిన ఈ సినిమా 2004లో విడుదలై సంచలన విజయాన్ని సాధించింది. బాహుబలితో జాతీయ స్థాయి గుర్తింపును సొంతం చేసుకొన్న ప్రభాస్‌కు తొలి విజయం ఈ సినిమా. త్రిషను స్టార్‌గా చేసింది ఈ సినిమా. ఎమ్‌ఎస్ రాజును టాలీవుడ్‌లో ఒకనొక సమయంలో ఒక వెలుగు వెలిగేలా చేసినదీ ఈ సినిమా. అప్పటి వరకూ ఉన్న కలెక్షన్ల రికార్డులను.. శతదినోత్సవ కేంద్రాల రికార్డులను వర్షం తుడిచిపెట్టింది. కొత్త రికార్డులను సృష్టింపజేసింది.

మరి ‘‘వర్షం’’ సినిమాకూ ‘టూ టౌన్ రౌడీ’ సినిమాకూ ఎన్నో పోలికలున్నాయి. ప్రధానంగా కథ విషయంలో…. హీరోయిన్, హీరోలు ప్రేమలో పడటం.. హీరోయిన్‌పై ఒక విలన్ కన్నేసి ఉండటం.. హీరోయిన్‌ని ఆమె తండ్రి సినిమానటిగా చేయాలని అనుకోవడం… ఆమెను మోహించిన విలన్ ఆమెను కిడ్నాప్ చేయడం.. ఆ విలన్ బారి నుంచి హీరోయిన్‌ని రక్షించి హీరో ఆమెను ఆమె తండ్రికి అప్పగించడం.. ఆ తర్వాత విలన్‌ను పూర్తిగా అంతంచేసి హీరో, హీరోయిన్లు తమ ప్రేమను ఫలప్రదం చేసుకోవడం… ఇది ‘వర్షం’ సినిమా కథ. దీంట్లో వారి ప్రేమ కథ పెజెంటేషన్ అంతా భిన్నంగా ఉంటుంది కానీ మూల కథ మాత్రం ‘టూ టౌన్ రౌడీ’ సినిమాలోనిదే. వెంకటేష్, రాధాలు హీరోహీరోయిన్లుగా నటించగా, దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన టూ టౌన్ రౌడీ సినిమా హిందీలో వచ్చిన ‘తేజాబ్’కు రీమేక్‌గా వచ్చింది. 

బాలీవుడ్‌లో అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్‌లు హీరోహీరోయిన్లుగా నటించిన ఆ సినిమా అక్కడ సంచలనాత్మక విజయం సాధించింది. అందులో ‘డింగ్ డాంగ్ డింగ్..’ సాంగ్ మొత్తం భారతదేశాన్నే హుషారెత్తించింది. ఆ స్ఫూర్తితో ఆ సినిమాను మనోళ్లు రీమేక్ చేశారు. ‘వర్షం’ సినిమాకు కథ వీరు పోట్ల రచించాడు. పరుచూరి బ్రదర్స్ ఈసినిమాకు రచనా సహకారంచేశారు. మరి ఈ ప్రముఖుల ఆధ్వర్యంలో ఒక పాత కథకు తిరగమోత సబ్జెక్టుగా రావడం విశేషం.

ఇక ‘పోకిరి’ సినిమా కథకు స్ఫూర్తి ‘స్టేట్ రౌడీ’ సినిమా అనే వాదన కూడా ఉంది. స్టేట్ రౌడీలో చిరంజీవి ఒక అండర్ కవర్ COP. అయితే తెరపై అంతా ఒక రౌడీగా కనిపిస్తూ ఉంటాడు. అయితే ఒక పోలీసాఫీర్ చిరంజీవిని అండర్ కవర్ COP గా పెట్టాడని.. క్లైమాక్స్‌లో రీవిల్ చేస్తారు. అయితే టీట్‌మెంట్‌లో ఎలాంటి ఛాయలూ కనిపించవు కానీ.. పూరీ దర్శకత్వం వచ్చిన ‘పోకిరి’ సినిమా కథలో ‘స్టేట్ రౌడీ’ తాలూకు ఛాయలు ఉంటాయి. ఇక వీరూ పోట్ల కథ రచయితగా పనిచేయగా వచ్చిన సినిమా ‘నువ్వు వస్తానంటే నేనొద్దంటానా’లో కూడా ఒక పాత, సూపర్ హిట్ సినిమా పోలికలు ఉంటాయి. 

బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ‘హమ్ ఆప్ కే హై కౌన్’ సినిమాకూ ‘నువ్వొస్తానంటే నేనొద్దాంటానా’ కథకూ చాలా పోలికలే ఉంటాయి. హమ్ ఆప్ కే హైకౌన్ సినిమా యావత్ దేశాన్నీ ఒక ఊపు ఊపిన సినిమా. అప్పట్లోనే తెలుగులోకి కూడా డబ్ అయిన ఆ సినిమా ఇక్కడా సూపర్ హిట్. ధనిక కుటుంబం నుంచి వచ్చిన ఒక కుర్రాడు.. హీరోయిన్‌ను చూసి ప్రేమలో పడటం… ఆమెను వివాహం చేసుకొంటాను అంటూ ఆమె అన్నయ్యను అడగడం.. డబ్బున్న వాళ్లు అంటే అంత సదాబిప్రాయంలేని ఆ అన్నయ్య చెల్లెలిని అతడికి ఇవ్వడానికి ఇష్టపడకపోవడం.. చివరకు ఆ అన్నయ్య మనసును హీరో గెలుచుకొని అతడి చెల్లినివివాహం చేసుకోవడం.. ఈ కథాంశం అంతా ‘హమ్ ఆప్ కే హై కౌన్’ సినిమాలోనూ ‘నువ్వు వస్తానంటే నేనొద్దాంటానా’ సినిమాలోనూ కామన్‌గా కనిపించేదే. ట్రీట్‌మెంట్ విషయంలో దేనికదే ప్రత్యేకం! 

అలాగే ‘సీతారామయ్య గారి మనవరాలు’ సినిమాకూ ‘గోవిందుడు అందరివాడూలే’కు ఉన్న పోలికల గురించి వేరే చెప్పనక్కర్లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. మనవరాలు కాస్తా.. మనవడుగా మార్చి ట్రీట్‌మెంట్‌ను ఇప్పటికి తగ్గట్టుగామార్చి.. క్లైమాక్స్‌ను కొంచెం మార్చారు అంతే. క్రెడిట్ ఇచ్చినా ఇవ్వకపోయినా.. కాపీ కాదు అని నొక్కి వక్కాణించినా… ‘గోవిందుడు అందరివాడూలే’ సినిమా మూల కథకు  ‘సీతారామయ్యగారి మనవరాలు’ సినిమానే స్ఫూర్తి అనుకోవాల్సి వస్తుంది.  

పైన పేర్కొన్న సినిమాల్లో విశేషం ఏమిటంటే.. ఎప్పుడో సూపర్ హిట్ అయిన సినిమాల్లోని పాయింట్ ఆధారంగానే కొత్త సినిమాలు కూడా వచ్చాయి. మొదట వచ్చిన సినిమాలూ సూపర్ హిట్సే.. వాటిని ఆధారంగా చేసుకొని తీశారేమో అనిపించే సినిమాలూ సూపర్ హిట్సే! ఇవన్నీ స్థూలంగా చూసినప్పుడు కనిపించే పోలికలు. వీటిని కొందరు సమర్థిస్థారు.. మరి కొందరు.. సమర్థించరు. దేనికదే ప్రత్యేకం అని అంటారు. 

మరి వీటితో పాటు ఇక్కడ మరో సీన్‌ను ప్రస్తావించుకోవచ్చు. అదే విక్రమార్కుడు సినిమాలోని ఒకానొక హైలీ ఎమోషనల్ సీన్. సూపర్ అంటూ ప్రేక్షకుడి చేత చప్పట్లు కొట్టించుకొన్న సీన్. పోలిసోడే కాదు.. పోలిసోడి బెల్టు కూడా డ్యూటీ చేస్తుంది..’’ అంటూ హీరో రవితేజ డైలాగ్ చెప్పి వావ్ అనిపించే సీన్ ఒకటి ఉంటుంది విక్రమార్కుడు సినిమాలో. పరమ ద్రుష్టుడు అయిన విలన్. వాడి కొడుకు మరింత దుర్మార్గుడు.. శాడిస్టు..సైకో. కనపడ్డ ఆడవారితోనూ కాపురం చేయాలని ప్రయత్నిస్తాడు. ఇలాంటి ప్రయత్నంలో ఆ దుష్టుడు ఒక పోలీసాఫీసర్ భార్యను చంపేసి ఉంటాడు. ఈ కేసులో అతడిని పోలీసులు బంధించి.. కోర్టుముందుకు తీసుకెళితే తనకు పిచ్చి అని చెప్పి దాన్నుంచి బయటపడతాడు వాడు. అలాంటి వాడి బర్త్ డే పార్టీ.. దానికి మంత్రిగారు ముఖ్య అతిధిగా రావడంతో పోలీసులు అంతా అక్కడికి కాపలాగా వెళతారు. తమ సహచరుడి భార్యను హింసించి చంపిన వాడి పుట్టిన రోజు వేడుకలకు కాపలాగా వెళ్లాల్సిన పరిస్థితులను తిట్టుకొంటూ అక్కడికి వెళ్లిన పోలీసులను వాడు మరింత వేధిస్తాడు. 

తను ఎవరిని టచ్ చేస్తే వాళ్లు షర్ట్ విప్పి నాట్యంచేయాలని అంటూ ఒక పిచ్చి గేమ్ పెట్టుకొని పోలీసోళ్లతో ఆడుకొంటాడు.  హీరో అయిన పోలీసు క్యారక్టర్ బెల్టును అప్పటికే విప్పించి మెడలో వేసుకొన్న ఆ పిచ్చాడు.. తన చేష్టలతో భవనం మీద నుంచి కిందకు పడి బెల్ట్ ఉరిగా మారడంతో ప్రాణాలు వదులుతాడు.. అంత వరకూ హింసకు లోనైన పోలీసులు వాడుచావడంతో మనసులోనే ఎంతో అనందపడతాడు. ఆ సీన్ ముగింపులో నిఖార్స్రన పోలీసోడే కాదురా.. వాడి బెల్ట్ కూడా డ్యూటీ చేస్తుంది..’’ అంటూ హీరో డైలాగ్ చెబుతాడు. ఈ సీన్ ఎలాంటి ఫ్రేమింగూ లేకుండా రెండు తెలుగు సినిమాల్లో ఉంది. అందులో ఒకటి విజయశాంతి లేడీ పోలీసాఫీసర్‌గా నటించిన ‘శాంభవీ ఐపీఎస్’లో కాగా.. రెండోది రవితేజ నటించిన ‘వికమార్కుడు’ సినిమాలో. రెండు సినిమాల్లోని ఈ సీన్‌కు తేడాలు చెప్పాలంటే అందులో పోలీసాఫీసర్ విజయశాంతి.. రెండో దాంట్లో పోలీసాఫీసర్ రవితేజ.. ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులు వేరే వాళ్లు. మిగతాదంతా సేమ్ టూసేమ్. విజయశాంతి ప్రధానపాత్ర పోషించిన సినిమాకు పరుచూరి బ్రదర్స్ రచయితలు. మరి ఈ సీన్ విషయంలో రాజమౌళికి స్ఫూర్తి ఏమిటో!