నగ్నంగా నర్తిస్తున్న పచ్చ మీడియా!

సాధారణంగా మీడియా రాతలకు ఒక అందమైన ముసుగు ఉంటుంది. ఎంతటి నాణ్యమైన పాత్రికేయులు పనిచేస్తోంటే ఆ ముసుగు అంత అందంగా ఉంటుంది. ఎవరిమీదనైనా బురద చల్లాలని మీడియా అనుకుంటే కూడా.. అది చూపరులకు బురదలాగా…

సాధారణంగా మీడియా రాతలకు ఒక అందమైన ముసుగు ఉంటుంది. ఎంతటి నాణ్యమైన పాత్రికేయులు పనిచేస్తోంటే ఆ ముసుగు అంత అందంగా ఉంటుంది. ఎవరిమీదనైనా బురద చల్లాలని మీడియా అనుకుంటే కూడా.. అది చూపరులకు బురదలాగా కనిపించదు.. గంధం అలదినట్లుగా దాన్ని పులిమేస్తారు. ఎవడి పరువు అయినా తీయాలనుకుంటే.. వారి దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంటుంది.. దాని పేరు నర్మగర్భాలంకారం. ఆ నర్మగర్భాలంకారం వేసి ఎడాపెడా విమర్శలు చేసేస్తారు. ప్రతి నిందకూ ఒక ముసుగు తొడుగుతారు. ఇది మీడియా తమకు కిట్టని వారి గురించి చేసే దుష్ప్రచారాల్లో చాలా చాలా సహజమైన సంగతి.

కానీ పచ్చ మీడియా ఇప్పుడు బరితెగించిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయంలో అడ్డగోలుగా తెగించిన ధోరణిలో తమ కథనాలను వండి వారుస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే.. ముసుగు తొలగించేసింది. తమ కుట్రలకు, కుత్సితాలకు, కూహకాలకు ఉండే బట్టల తొడుగులను విప్పేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజల్లో అనుమానాలు పెంచడానికి, ఉద్యోగుల్లో అపోహలు పెంచడానికి, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయడానికి ఎన్నిరకాల దిక్కుమాలిన కథనాలు వండి ప్రజల మెదళ్లలోకి విషంగా చొప్పించగలమో అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది. కుట్రప్రచారాలలో పచ్చమీడియా నగ్నస్వరూపం ఇప్పుడు తెలుగు ప్రజలకు కనిపిస్తోంది. ఆ వైఖరిపై గ్రేటాంధ్ర విశ్లేషణాత్మక కథనం ఇది.

పచ్చమీడియా జీవిత పరమావధి ఎప్పటికీ  ఒక్కటే. వారి దైవం చంద్రబాబునాయుడు. తమ దైవాన్ని మాత్రమే ప్రజలందరూ ఆదరించాలి.. పూజించాలి. తమ దైవానికి మాత్రమే నిత్యపూజలు జరగాలి. తమ దైవం మాత్రమే ఆచంద్రతారార్కమూ పదవీ పీఠంపై అధిష్ఠించి రాష్ట్రాన్ని దోచుకుంటూ ఉండాలి. యథోరీతిగా.. తమకు కూడా తమ దైవం అనుగ్రహ ప్రాప్తంగా తృణమో పణమో దక్కుతూనే ఉండాలి. 

ఈ  పచ్చమీడియా జీవితాశయం అదొక్కటే. అందుకోసం వారు ఎన్ని వేషాలైనా వేయగలరు. ఎంతకైనా దిగజారగలరు. చంద్రబాబునాయుడు కాకుండా ఏ ఇతరులు అధికారంలో ఉన్నా కూడా వారికి అన్నం సహించదు, నిద్ర పట్టదు. ఊపిరి ఆడదు. అందుకే, చంద్రబాబును తిరిగి అధికార పీఠం మీద ప్రతిష్ఠించడం కోసం, ‘అక్షరాలతో’ అనుచితయజ్ఞం సాగిస్తుంటారు. 

పచ్చమీడియాకు ఇది జన్మవైరం

చంద్రబాబుకు ఎవరు ప్రత్యర్థి అయినా వారు ఈ పచ్చమీడియాకు శత్రువులే. కులం అనే అసహ్యకరమైన ప్రాతిపదిక మీద చంద్రబాబును ప్రేమిస్తూ, ఆయనను మహానుభావుడని శ్లాఘిస్తూ.. ఆయన అడుగులకు మడుగులొత్తుతూ ఉండే ఈ పచ్చమీడియా పుట్టుకనుంచి ఇదే ధోరణిని అలవాటు చేసుకుంది. చంద్రబాబుకు వ్యతిరేకం గనుక కాంగ్రెసును ద్వేషించింది. ఏపీ కాంగ్రెసు పార్టీకి వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ఏకధ్రువ నాయకుడిగా, పర్యాయపదంగా మారిన తర్వాత.. వైఎస్ఆర్ పతనాన్ని కోరుకుంది. అ నాదిగా ఇదే ధోరణితోనే ఉంది. వైఎస్ కడప ఎంపీగా పోటీచేస్తే ఎంత దారుణమైన దుష్ప్రచారాలకు ఒడిగట్టారో అందరికీ తెలుసు. అప్పట్లో కడప జిల్లా ఎస్పీగా ఉమేష్ చంద్ర ఉన్నారు. ఎన్నికలు ముగిసి వైఎస్ విజయం సాధించిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి.. ‘ఈసారి నేను ఎన్నికల్లో కేవలం రాజకీయ ప్రత్యర్థితో మాత్రమే కాదు, ఈనాడుతో, ఎస్పీతో కూడా తలపడాల్సి వచ్చింది’ అని అర్థం వచ్చే కామెంట్ నవ్వుతూనే చేశారంటే.. ఈ పచ్చమీడియా పిచ్చివేషాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు. 

2004 ఎన్నికల సమయానికి అప్పటికే పాదయాత్ర పూర్తిచేసి ఫుల్ స్వింగ్ మీదున్న వైఎస్ఆర్ ప్రజాదరణను పచ్చమీడియా పసిగట్టలేకపోయింది. అంత చేతగాని దద్దమ్మల వ్యవస్థను కలిగిఉన్న ఈ పుచ్చు మీడియా.. చంద్రబాబు గెలిచినట్టుగా తమలో తామే ఊహించుకుని, ‘‘చంద్రహాసం’’ పేరుతో ఫలితాలరోజు వెలువరించడానికి డమ్మీ పేపర్లు ప్రింటింగ్ కూడా చేయించి అపహాస్యం పాలైన సంగతి కూడా అందరికీ తెలుసు. అంతటి విద్వేష విష రాజకీయాలను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కురిపిస్తున్నారు. 

వైఎస్ జగన్ అధికారంలోకి రాకపూర్వం నుంచి జగన్ మీద విషం చిమ్మడం ఈ పచ్చమీడియాకు అలవాటుగానే సాగుతూ వచ్చింది. తాము ప్రజల మెదళ్లను ఎంతగా విషతుల్యం చేసినా.. జగన్ అధికారంలోకి రావడాన్ని వారు సహించలేకపోయారు. అధికారంలోకి వచ్చిననాటినుంచి కాస్త డోసేజీ పెంచి విషం కక్కడానికి వారి వంతు కష్టం వారు పడుతున్నారు. 

సాధారణంగా మీడియా అంటే రంధ్రాన్వేషణ చేస్తుంది. చేయాలి కూడా. తప్పులు జరుగుతూ ఉంటే వారు ఊరుకోకూడదు. ఆ తప్పులను ఎండగట్టాలి. ప్రజలకు ఆ తప్పుల వల్ల చేటు జరగకుండా కాపలా కాయాలి. తప్పులు తమకు తెలిసి వచ్చినప్పుడు వాటి గురించి అడ్డుకోవడం మాత్రమే కాదు. తప్పులు జరుగుతున్నాయేమో అనే అనుమానంతో శోధించాలి. రంధ్రాన్వేషణ చేయాలి. మీడియా బాధ్యత అది. అయితే సదరు శోధనకు ఇవాళ కాలం చెల్లింది. జరుగుతున్న తప్పుల గురించి రాయడం తమ బాధ్యత అనేది వారు మరచిపోయారు. తప్పులు వెతికి పట్టుకుని రాయాలనేది కూడా మర్చిపోయారు. ప్రభుత్వం ఏం చేసినా కూడా దానిని తప్పుగా అభివర్ణిస్తూ, రంగుపులుముతూ రాయడమే తమ నిత్యకృత్యంగా ఇప్పుడు చెలరేగుతున్నారు. 

ముసుగు తొలగిపోయింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఇదే తరహా మొదలైంది. అయితే తాము ఎన్ని వంకర రాతలు రాస్తున్నప్పటికీ జగన్ ప్రతిష్ఠ ప్రజల్లు పదిలంగా ఉండడాన్ని చూసి పచ్చ మీడియా సహించలేకపోతున్నది. అందుకే మరింతగా తెగించేస్తున్నారు. కొన్ని నెలలుగా దూకుడు పెంచారు. అడ్డమైన రాతలు రాస్తున్నారు. అర్థసత్యాలు రాయడం కూడా మీడియాలో చాలా సహజంగా జరిగే విషయం కానీ.. అసత్యాలకంటె దుర్మార్గమైన విషయాలను రాయడం ఇప్పుడు జరుగుతోంది.

ఇది జర్నలిజమేనా?

ఒక పని జరిగితే.. అందులో ఉండే లోపాలను గురించి చెప్పే జర్నలిజం కాలగర్భంలో కలిసిపోయింది. ‘వార్త’లు చెప్పే జర్నలిజం ఇప్పుడు లేదు. పూర్తిగా వ్యాఖ్యలు చెప్పే జర్నలిజం మాత్రమే ఉంది! సాధారణంగా వ్యాఖ్యలు చేసే జర్నలిస్టులు వేరే ఉంటారు. ప్రధానమైన వెబ్ సైట్లు కూడా వ్యాఖ్యలను అభిప్రాయాలను ఎక్కువగా వెల్లడిస్తుంటాయి. పత్రికల్లో ఒక స్పష్టమైన విభజన ఉంటుంది. వ్యాఖ్యలకు విడిగా ఒక స్పేస్ ఉంటుంది. ఆ విభజనరేఖను ఇప్పుడు పచ్చమీడియా పత్రికలు చెరిపేశాయి. ప్రతి విషయాన్ని వ్యాఖ్య ధోరణిలోనే అందిస్తున్నాయి. తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే పిచ్చి వారికి బాగా ఎక్కింది. 

వైఎస్ రాజశేఖర రెడ్డి జమానా సాగినప్పుడు కూడా ఇలాంటి విషపు రాతలే వస్తుండేవి. వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా మర్యాదగా.. ఆ రెండు పత్రికలూ అంటూ ‘ఈనాడు, ఆంధ్రజ్యోతి’ అను ఉద్దేశించి.. పదేపదే అంటుండే వారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఏ మాత్రం మొహమాటం లేకుండా ‘ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5’ లను తన మాటల్లో ప్రస్తావిస్తున్నారు. వాళ్లు ప్రభుత్వానికి నష్టం చేయడానికి ఎంతగా తెగిస్తున్నారో ఆయన పదేపదే ప్రజలకు చెబుతూనే ఉన్నారు. పచ్చ మీడియా అంటే ఈ మూడూ మాత్రమేనా? కాదా? ఇవి మాత్రమే కాకుండా ఇంకా ఉన్నాయా? అనే అంశాలను వివరించడం ఈ వ్యాసం ఉద్దేశం కాదు. పచ్చమీడియా అనేకానేక సంస్థలు రకరకాల రూపాల్లో పచ్చ రంగు పులుముకుంటూ సాగిస్తున్న విష ప్రచారాన్ని గురించి ప్రజలకు అవగాహన కలిగించడం మాత్రమే. 

ఇంత నీచపు రాతలా?

తెలుగుదేశం ప్రభుత్వం పాలన సాగించిన రోజుల్లో ప్రజలకు చంద్రన్న కానుక సంచులు ఇస్తే కూడా వాటికి పచ్చ రంగు వేశారు. అన్న క్యాంటీన్ లకు పచ్చరంగు పులిమారు. ఈ రంగుల గోల ఏ ప్రభుత్వం వచ్చినా ప్రతిసారీ ఉండేదే. జగన్ రాగానే.. ప్రభుత్వ భవనాలకు, పంచాయతీ ఆఫీసులకు పార్టీ రంగులు వేస్తున్నారనేది చాలా పెద్దపాపంగా వారందరికీ కనిపించింది. ఎందుకూ కొరగాని.. ఏ రంగు ఉంటే ఏముంది? ఆ ఆఫీసు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తోందా? లేదా? అనేది కాకుండా ఇతర విషయాల మీద మీడియా శ్రద్ధ పెరిగింది.

జగన్ అధికారంలోకి వచ్చిన తొలిరోజుల నుంచి ఇదే ధోరణి. చివరికి తాజాగా జీతాల విషయంలో ప్రభుత్వం మీద విషం చిమ్మడం కూడా. పొరుగున ఉన్న తెలంగాణలో ఆరోతేదీ పూర్తయినా సగం మంది టీచర్లకు జీతాలు  అందలేదు. ఆ రాష్ట్రంలో కూడా ఉన్న ఈ పచ్చపత్రికలకు అది కనిపించదు. మరో పొరుగు రాష్ట్రం కర్ణాటకలో బిల్లులు రాక కాంట్రాక్టర్లు బోరుమని విలపిస్తున్నారు. అవేవీ వీరి చెవులకు వినపడవు. ఏపీలో మాత్రం చీమ చిటుక్కు మనగానే.. బ్రహ్మాండం బద్ధలైనంత రాద్ధాంతం చేస్తూ రాసేస్తారు. ఏదో ఒక నెల జీతాలు పూర్తిగా ఎగవేస్తే తప్పుపట్టాలి గానీ. ఒకటిరెండు రోజులు ఆలస్యం కాగానే.. ప్రతిరోజూ ‘జీతాల్లేవ్’ అనే వార్తలు రాయడం సిగ్గు మాలిన వ్యవహారం కాక మరేమిటి.?

ఇవి కేవలం ఒక తాజా ఉదాహరణ మాత్రమే. ప్రతివిషయంలోనూ ఈ మీడియాది ఇదే ధోరణి. అమరావతి, పోలవరం విషయాల్లో ఎన్నెన్ని అసత్యాలను ప్రచారంలో పెట్టారో అందరికీ తెలుసు. చంద్రబాబు నమ్ముకునే సిద్ధాంతమే.. వీరందరికీ కూడా సిగ్గుమాలిన ఆదర్శ సిద్ధాంతం. గోబెల్స్ వీరికి ఆరాధ్యుడు. ఒకే అబద్ధాన్ని పదిసార్లు చెప్పడం, పది మందితో చెప్పించడం, ఆ పదిమంది ద్వారా తలో పదిమందితో చెప్పించడం ద్వారా.. నిజంగా నమ్మించేయవచ్చు అనుకునే మూర్ఖత్వం ఈ పచ్చమీడియా సొంతం. తమకున్న లక్షల కాపీల సర్కులేషన్ ద్వారా.. కనీసం కోట్ల మెదళ్లలోకి విషాన్ని ప్రవేశ పెడితే.. ఆ విషప్రభావానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతరించిపోవాలనేది వారి వాంఛ! కానీ జనం అంత అమాయకంగా లేరు. 

పచ్చ రాతలు.. ఆత్మహత్యలే!

పచ్చ మీడియా ఏదో తాము దేశాన్ని ఉద్ధరించేస్తున్నాం అని అనుకోవచ్చు గాక.. కానీ.. మీడియా యొక్క నిష్పాక్షికతను చంపేసుకుంటూ వెళితే వారి రాతలు ఆత్మహత్యా సదృశాలు అవుతాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీకి స్వయంగా అధ్యక్షుడు గనుక, ఆయన కుటుంబానికి చెందిన సొంత పత్రిక గనుక.. ఒక పత్రికకు తటస్థ ప్రజల్లో విశ్వసనీయత లేదు. ఆ పత్రికలో వచ్చే సమస్త వార్తలు, వ్యాసాలు అన్నీ జగన్మోహన రెడ్డికి అనుకూలంగా మాత్రమే ఉంటాయని అందరూ అంటూ ఉంటారు. ఆయనను అభిమానించే వారు మాత్రమే ఆ పత్రికను కొంటారు కూడా. నిజానికి ఆయన గానీ, ఆ పార్టీ గానీ, ఆ పత్రిక యాజమాన్యం గానీ అంతకుమించి కోరుకోవడం లేదు. 

అయితే పచ్చమీడియా ఇతర పత్రికల విషయం అలాకాదు. వాళ్లు వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారం అన్ని ఇతర వ్యాపారాల్లాంటిది కాదు. ప్రజలకు నిజం చెప్పే వ్యాపారం. నిజం చెప్పవలసిన వ్యాపారంలో దారి తప్పి వ్యవహరిస్తే సిగ్గుపోతుంది. ప్రజల దృష్టిలో పరువు పోగొట్టుకోకుండా ఉండడం వారికి అత్యావశ్యకం. ఒకసారి క్రెడిబిలిటీ పోతే వారు ఎప్పటికీ దాన్ని పునర్నిర్మించుకోలేరు. చంద్రబాబు సారథ్యంలోనే కుక్కలు చింపిన విస్తరిలాగా తయారవుతున్న తెలుగుదేశం పార్టీని తమ భుజస్కంధాల మీద మోస్తూ అధికారంలోకి తేవడానికి ఆరాటపడుతున్న ఈ పచ్చ మీడియా పెద్దలు.. ఆ పనిచేయగలరో లేదో గానీ.. ఈలోగా తమను తామే ఆత్మహత్య చేసుకుని.. తమ పత్రికలను  ప్రజల మధ్యలోంచి అదృశ్యం చేసేస్తారు. అది తథ్యం!