ఇదో సిల్లీ క్వశ్చనులా అనిపించవచ్చు. మాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం మీద నిర్మించిన ఈ సినిమాకు మెగా స్వంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణ. ఆ సంస్థకు అధినేత మెగాస్టార్ సతీమణి.
అయితే సైరా సినిమా ఫలితం తరువాత స్వంత నిర్మాణాలకు మెగాస్టార్ దాదాపు స్వస్తి చెప్పారు. బ్యానర్ వుంది కనుక ఇవ్వడమే తప్ప, పెట్టుబడులు పెట్టడం లేదు. రెమ్యూనిరేషన్ మేరకే చిరు తన సినిమాలు చేస్తున్నారు అని ఇండస్ట్రీ టాక్.
ఇదిలా వుంటే ఆచార్య సినిమా నిర్మాణ సమయంలోనే ఈ సినిమాలో మెగా ఫ్యామిలీ నిర్మాణ భాగస్వామి కాదు అంటూ వార్తలు రావడం, అలా వచ్చినపుడల్లా మాట్నీ సంస్థ నుంచి వివరణ వస్తూ వుండడం మామూలు అయిపోయింది. సినిమాలో అయితే నిర్మాతగా నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ల పేర్లే వున్నాయి. పబ్లిసిటీ అంతా ఇలాగే జరిగింది.
కానీ సినిమా విడుదలకు రెండు రోజుల ముందు ఓ గమ్మత్తు జరిగిపోయింది. అది ఎవ్వరూ గమనించకుండా జరిగిపోయింది. బుక్ మై షో లో సినిమా వివరాల నుంచి నిర్మాత నిరంజన్ రెడ్డి అన్న పేరు సడెన్ గా మాయం అయిపోయింది.
ఆ పేరు ప్లేస్ లో రామ్ చరణ్ పేరు వచ్చి చేరింది. ఇలా ఎందుకు జరిగింది అన్నది తెలియదు. నిర్మాత నిరంజన్ రెడ్డినే స్వయంగా బుక్ మై షో తో మాట్లాడి ఇలా మార్పు చేయించారన్నది గ్యాసిప్. ఆయన ఎందుకు అలా చేసారన్నది వారికే తెలియాలి.
మొత్తం ఇప్పుడు తేలింది ఏమిటంటే బుక్ మై షో చెబుతున్న వివరాల ప్రకారం ఆచార్య నిర్మాత రామ్ చరణ్ అన్నమాట. మరి ఇంతకీ కేవలం నిర్మాత పేరుకేనా? డిస్ట్రిబ్యూటర్ల నష్టాలు అన్నీ రామ్ చరణ్ నే రీ పే చేస్తారా? వేచి చూడాలి.