మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదివారం శ్రీకాళహస్తికి వెళుతున్నారు. శ్రీకాళహస్తి పక్కనే ఉన్న ఊరందూరు గ్రామంలో మాజీ మంత్రి ఆయన సహచరుడు బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు. కేవలం తన స్నేహితుడి అంత్యక్రియల కోసమే చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా ఊరందూరు గ్రామానికి వెళుతున్నారు. అందుకు ఆయనను అభినందించాలి.
ఇదే రోజున మరో కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటున్నారు. రామోజీరావు వియ్యంకుడు, సుందరనాయుడు పెద్దకర్మ కూడా ఆదివారమే చిత్తూరులో జరగనుంది. బొజ్జల అంత్యక్రియల తరువాత.. చంద్రబాబు చిత్తూరుకు వెళ్లి అక్కడ పెద్దకర్మ కార్యక్రమం చూసుకుని తిరిగి వెళతారు.
ఆత్మీయులు పరమపదించినప్పుడు.. వారి అంతిమ సంస్కారాల కోసం సమయం కేటాయించడం అనేది మంచి విషయమే. అయితే.. చావుకు వెళుతున్న ఈ మాజీ నాయకుడికి మీడియా కవరేజీ మీద మోజు ఏమిటి? మీడియా దృష్టిలో పడకపోతే.. మీడియా తన గురించి కవరేజీ ఇవ్వకపోతే తనను జనం మరచిపోతారనే భయం చంద్రబాబులో అణువణువునా ఉంటుందనే విమర్శ ఒకటుంది.
అది నిజమే అనిపించేలా.. చావు- కర్మ కార్యక్రమాలకు వెళుతున్న చంద్రబాబు.. తన పరామర్శల మీడియా కవరేజీ కోసం చాలా పెద్ద స్కెచ్చే వేశారు. తిరుపతిలోని పాత్రికేయులు అందరికీ ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటుచేశారు. ఆయన టూర్ పొడవునా.. ఈ మీడియా వాహన శ్రేణి కూడా ఫాలో అవుతుందన్నమాట. వెళుతున్నది చావుకు అనే స్పృహ కూడా లేకుండా.. సదురు మీడియాకు సకల సదుపాయాలు కల్పిస్తారనడంలో సందేహం లేదు.
చంద్రబాబుకు ఎందుకింత మీడియా పిచ్చ? ఎటూ ఆయన ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. ఆయన వస్తున్నారంటే.. లోకల్ మీడియా వాళ్లు ఎటూ ఆ ప్రదేశంలో ఉంటారు. శ్రీకాళహస్తి, చిత్తూరు విలేకరులు తన స్థాయికి చాలరని అనుకున్నారో లేదా.. తాను చావు పరామర్శలకు వెళుతోంటే.. ఆయా ఊర్లలో ఉండని జాతీయ మీడియా ప్రతినిధులందరూ కవర్ చేయాలని ఉత్సాహపడుతున్నారో తెలియదు గానీ.. చంద్రబాబు తిరుపతి నుంచి ప్రెస్ వారికోసం ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేయించడం చాలా లేకిగా ఉంది.
బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి అంటే.. చంద్రబాబు వైస్రాయి కుట్రతో గద్దె ఎక్కడానికి, రామారావును వెన్నుపోటు పొడవడానికి కీలకంగా సహకరించిన స్నేహితుడు. చంద్రబాబు వెంట ఉన్నందుకు.. అలిపిరి బాంబు పేలుడులో మరణం అంచుదాకా వెళ్లివచ్చారు. అలాంటి స్నేహితుడు మరణిస్తే స్వయంగా అంత్యక్రియలకు వెళ్లడం మంచిదే.. కానీ.. ఆ పర్యటనకు కూడా మీడియా కవరేజీ కోరుకోవడమే లేకి వ్యవహారం.
బాబుగారూ.. తమరు చావు ఇళ్లకు వెళుతున్నారు. మహా అయితే ఆ కుటుంబాలకు సాంత్వన మాటలు చెబుతారు. అంతే కదా. వాటి కవరేజీ కోరుకోవడం అంత ముఖ్యమా? లేదా, అక్కడ కూడా జగన్ ను తిట్టడానికి ఏదైనా కారణాలు ప్లాన్ చేసుకుని వెళుతున్నారా?