నిన్ననే బాహుబలి చూశాను. పుష్కరాలకు వెళ్లకపోతే హిందువు కావని అంటారన్న బెదురు, బాహుబలి చూడకపోతే తెలుగువాడివి కావని అంటారన్న భయం పుట్టించారీ మధ్య!
ఒక తెలుగువాడు అంతర్జాతీయ స్థాయి సినిమా తీస్తే ప్రోత్సహించడానికి బదులు టిక్కెట్టు బ్లాకులో 500, వైట్‌లో 150 అని తటపటాయిస్తే జాతిద్రోహిని అయిపోతానన్న సెంటిమెంటు తోడైంది. చూసిన ప్రతీవాళ్లూ 'ఓసారి చూడవచ్చు, పాపం కష్టపడి తీశాడు కదా' అంటున్నారు.
సినిమాను నిర్వచించమని మల్లాది రామకృష్ణశాస్త్రిగారిని అడిగితే – 'తీసేవాళ్లకు పరిశ్రమ, చూసేవాళ్లకు శ్రమ' అని చమత్కరించారట. దర్శకుడు తీసేటప్పుడు కష్టపడ్డాడు కదాని చూసేటప్పుడు మనమూ కష్టపడాలనడం ఏం భావ్యం? అయినా నిర్మాతదర్శకులపై జాలి పడితే అదేం గొప్ప సినిమా? ''ఐ'' సినిమాలో శంకర్, విక్రమ్ ఏళ్లపాటు కష్టపడ్డారు. చూశామా? సినిమాలో ఆకర్షణ వుండాలి, చూడకపోతే కొంప మునిగిపోతుంది అన్నట్టు వుండాలి తప్ప జాలి కలిగిస్తే ఎలా? వాళ్ల మీదే కాదు, ప్రేక్షకుడు తనపై తను కూడా జాలి పడ్డాడు – 'ఫుల్ టిక్కెట్టు యిచ్చి సగం సినిమా చూశాను' అని. ముగింపు చూసి, యిది రెండో యింటర్వెల్లేమో అని సందేహం వచ్చింది అందరికీ.
సినిమా, నవల, కథ, ఆఖరికి నాలుగు వాక్యాల జోక్కైనా క్లయిమాక్స్ వుండాలి, అది బాగుండాలి. ఈ సినిమాకు క్లయిమాక్సే లేదు. క్లయిమాక్స్ రెండో భాగం చివర వస్తుంది అంటున్నారు. మరి దీనికి కూడా ఏదో ఒకటి అఘోరించాలిగా. పంచతంత్రం కథలు, అరేబియన్ నైట్స్ కథలు, కాశీ మజిలీ కథలు ఒక దానిలోంచి మరో దానిలోకి వెళ్లిపోతూనే వుంటాయి. కథ ఓ పట్టాన ముగియదు. కానీ ఏ ఉపకథకు ఆ ఉపకథ ముగింపు వుంటుంది. దానికీ, తర్వాతి కథకు లింకు వుండి ఉత్సుకత పోకుండా చూస్తుంది. గతంలో డిటెక్టివ్ పుస్తకాలు వచ్చేవి. కొన్ని రచనలు ఇరవయ్యేసి భాగాలు సాగేవి. వాటిలో ఏ భాగం చదివినా తృప్తిగానే వుండేది. ఇంకో భాగం కోసం ఎదురు చూసేట్లు వుండేవి. ఈ బాహుబలి అర్ధాకలితో వున్నవాణ్ని విస్తరి నుంచి వెళ్లగొట్టినట్లు వుంది.
ఇది సినిమా సమీక్ష కాదు. నటనాకౌశలాలు, సినిమాటోగ్రఫీ, రీరికార్డింగు, గ్రాఫ్ లేవడాలు, పడిపోవడాలు, రేటింగులు – వీటి గురించి మాట్లాడడాలేవీ వుండవు. స్టోరీ టెల్లర్గా రాజమౌళి వైఫల్యం గురించి ఆవేదన మాత్రమే. రాజమౌళి సినిమాల్లో కథ బాగుంటుందనే గ్యారంటీ వుంటుంది. ఈగ లాటి అల్పజీవితో ఫుల్ లెంగ్త్ సినిమా తీసిన ఘనుడతను. దాని గురించి హీరోయిన్ను మీనియేచర్ ఆర్టిస్టుగా ముందు నుంచి ఎస్టాబ్లిష్ చేసి, కథ ఎంత పకడ్బందీగా చూసుకున్నాడు!
సగం జానపదంతో మగధీర అంత బాగా తీస్తే యిక ఫుల్ లెంగ్త్ జానపదంలో అదరగొట్టేస్తాడని అనుకున్నాను. జానపదం అనగానే మాయలు, మంత్రాలే అనుకుంటారు చాలామంది. అది తప్పు. నేను జానపదాల గురించి విస్తారంగా రాసిన సీరీస్ చూడండి. శక్తి ప్రధానం (''పాతాళభైరవి'' వంటివి), యుక్తి ప్రధానం (''మంగమ్మ శపథం'' వంటివి), భక్తి ప్రధానం (''సువర్ణసుందరి'' వంటివి), రాజనీతి ప్రధానం (''రాజమకుటం'' వంటివి) అంటూ విడగొట్టి జానపదాలు ఆబాలగోపాలాన్ని ఎలా అలరించాయో చూపాను.
జానపదాలకు కూడా కథ అవసరమే. స్టంట్లు, జంతువులు, ట్రిక్కు షాట్లు, పైట లేని హీరోయిన్లు వుంటే ఆడేస్తాయని అనుకోకూడదు. జానపదాల్లో విషాదాంతాలుండవు. శాపగ్రస్తురాలై బండరాయిగా పడి వున్న హీరో తల్లి కూడా సినిమా చివర్లో లేచి వస్తుందని, చక్రవర్తి ఐనా విలన్ ఆఖర్లో దిక్కుమాలిన చావు ఛస్తాడనీ అందరికీ తెలుసు. అయినా ఉత్కంఠకు లోటు లేకుండా సినిమా తీసేవారు. ముగింపు ముందే తెలిసిపోయిన కథలో సైతం ప్రేక్షకుడు హీరో చెలికాడి చేష్టలకు నవ్వేవాడు, హీరోయిన్ను మాంత్రికుడు ముసలిదానిగా మార్చేస్తే, హీరో తండ్రిని చెఱపాలు చేస్తే ఏడ్చేవాడు. అప్పటి దాకా స్నేహితుడుగా వున్న మంత్రి కుమారుడు అసూయతో యువరాజుకి ద్రోహం తలపెడితే కోపంతో మండిపడేవాడు. ఇంత లావు ''బాహుబలి''లో ప్రేక్షకుడు యిలాటి ఎమోషన్స్ పాలపడకుండా కథ రూపొందించిన రాజమౌళి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. పదేళ్ల తర్వాత తిరిగి చూసుకున్నపుడు స్టోరీ టెల్లర్గా ఆయన యీ సినిమా గురించి గర్వపడడని నా ఊహ.
తను తీసిన ఒక సినిమా ప్రమోషన్కై రాజ్ కపూర్ ఒకసారి మద్రాసు వచ్చాడు. ప్రివ్యూ తర్వాత జర్నలిస్టులు యథాప్రకారం ఆయన మొహం మీదే మెచ్చుకున్నారు. ఒక జర్నలిస్టు మరీ రెచ్చిపోయి 'దిసీజ్ సూపర్ హిట్. డెఫినెట్ సిల్వర్ జూబ్లీ' అని ఆవేశపడుతూ వుంటే రాజ్ కపూర్ – 'ఫర్గెట్ ఎబౌట్ సిల్వర్ జూబిలీ ఆర్ గోల్డెన్ జూబిలీ, డిడ్ యిట్ టచ్ యువర్ హార్ట్?' అని ఛాతీమీద తట్టి అడిగాడట. ద గ్రేటెస్ట్ షో మ్యాన్‌గా పేరు పొందిన రాజ్ కపూర్ పెట్టుకున్న లిట్మస్ టెస్ట్ ఒక్కటే ! కథ హృదయానికి తాకాలి.
''బాహుబలి'' సినిమా చూసి కళ్లకు విందు భోజనం అన్నవాడే తప్ప కళ్లలో తడి వూరింది అన్నవాడు ఎవడూ లేడు. దృశ్యాలతో గుండెను ఝల్లుమనిపించారు తప్ప సన్నివేశాలతో గుండెను స్పందింపచేయలేదు. పాత్రధారులు వాళ్ల పాటికి వాళ్లు నటిస్తూ పోతున్నారు. మనం కళ్లప్పగించి చూస్తూ పోయాం. ఈగ విలన్‌ను ముప్పుతిప్పలు పెడుతూ వుంటే కలిగిన గిలిగింతలు యిక్కడ ఎక్కడా కలగలేదు.
మనకు ''రాజమకుటం'', ''కంచుకోట'' వంటి కాంప్లికేటెడ్ జానపదాలు 50 ఏళ్ల క్రితమే వచ్చాయి. ఆ వారసత్వలాభం వలన యింకా ఎక్కువ చిక్కుముళ్లు వేసి కథను తయారుచేసుకునే అవకాశం మన తరానికి వుంది. కాటమరాజు కథలు, దేశింగరాజు కథలు, మదనకామరాజు కథలు వంటి జానపదసాహిత్యం ఎంతో వుంది. అందరికీ తెలిసిన కారణంగా ప్రిడిక్టబుల్ అయిపోయే ప్రమాదం వున్న పౌరాణిక పాత్రల పోలికలతో కథ అరకొరగా తయారుచేయవలసిన అవసరం ఏమాత్రం లేదు.
ఏ కథలోనైనా కథానాయకుడికి ఆటంకాలు వుంటాయి. ఉంటేనే అతని హీరోయిజం బయటపడుతుంది. ఏడుగురు రాకుమారులు తెచ్చిన ఏడు చేపలూ ఎండిపోతే కథ ఏడిసినట్టుంటుంది. ఇక్కడ శివుడికి ఒక్క ఆటంకమూ లేదు. జలపాతం వున్న కొండ ఎక్కడం తప్ప. విప్లవసంఘం తరఫున పనిచేస్తానన్నపుడు అక్కడ నుంచి ప్రతిఘటన లేదు. తను ప్రేమించిన అమ్మాయికి పూర్వప్రియుడు లేడు. వాడు అసూయతో శత్రువుతో చేతులు కలపడం లేదు. ఇక మాహిష్మతీ రాజ్యం సెట్టింగు దిట్టంగానే కట్టారు కానీ సెక్యూరిటీ లాప్సెస్ పుష్కలంగా వున్నాయి. ఇతగాడు ఎవడో పనివాణ్ని పట్టుకుని గూనివాడిగానో వృద్ధుడిగానో కోటలోపలకి దూరే సమస్య లేదు. రైట్ రాయల్ ఎంట్రీ.
మొదట్లో జానపదాలు శ్రద్ధగా తీసినా పోనుపోను 4 వారాలు ఆడితే చాలన్నట్లు కొన్ని సినిమాలు తీశారు. దానిలో హీరో కోటలోకి వెళ్లాలి అంటే గాల్లో వేళ్లాడే ఊడ పట్టుకుని కాస్త వూగేవాడు. అంతే కోటబురుజు లోపల పడేవాడు. మధ్యలో కందకం ఏమయ్యేదో తెలియదు. అలాటి సినిమాల్లో కూడా ఖైదీలను పాతాళగృహంలో పెట్టినట్లు చూపించి, దానికి ఓ స్థూలకాయుడైన కాపలాదారును పెట్టేవారు. వాడితో హీరో కత్తియుద్ధమో, లేక సెకండ్ హీరోయిన్ శృంగారమో వుండేది. ఈ సినిమాలో అనూష్కను పెద్ద ఎరీనాలో విగ్రహం నిలబెట్టినట్లు నిలబెట్టారు – 'రెడీ ఫర్ పికప్' అన్న బోర్డు పెట్టుకుని. రావణాసురుడు సీతమ్మవారిని యిలా పెట్టి వుంటే ఆంజనేయుడికి లంకలో అంతసేపు వెతకాల్సిన పని వుండేది కాదు.
సాధారణంగా ఖైదీలను పగలు బయటకు వదిలి, రాత్రి బోనులో పెడతారు. మాహిష్మతీ రాజ్యంలో పగలు బోనులో పెట్టి, రాత్రి ఆరుబయట వదిలేస్తారు కాబోలు. ఎందుకా అని ఆలోచించాను. ఆ రాజమహల్లో ఆడవాళ్లెవరూ లేరు కదా పాపం. మసిగొట్టుకుపోయినా అనూష్కను చూసి సైనికులు ఉత్సాహపడతారని ఆ వెసులుబాటు కల్పించారు కాబోలు. 'రాజకీయ బేతాళ పంచవింశతిక' ప్రారంభంలో కన్నుగీటే అందమైన అమ్మాయి బొమ్మ వేసి రాస్తారు – 'ఈ కథల్లో రాజకీయాలే తప్ప ప్రేమ, అమ్మాయిలు వగైరాలు వుండవు. ఎదరంతా ఎడారి కాబట్టి, ఆ రాజకీయాలు బోరు కొట్టినపుడు యిక్కడకు వచ్చి యీ పేజీ చూసి కాస్సేపు ఆనందించి మళ్లీ కథలు చదువుకోండి' అని. అలా కళ్లు చెదిరే మాహిష్మతీ రాజప్రాసాదంలో కంటికింపుగా రమ్యకృష్ణ (ఆవిడ పేరు శివకామి అనకుండా శివగామి ఎందుకన్నారో ఎవరైనా చెప్తారా? శివకామి అనేది పార్వతి పేరు. ఈ గామి ఎవరు? గమించడం అంటే రమించడం. తమిళవాళ్లు 'క' పలకలేక 'గ' అంటారు. – దీని సంగీతదర్శకుడు కీరవాణిగారి పేరు సరిగ్గా పలుకుతారో లేదో తెలియదు – కానీ రమ్యకృష్ణ పాత్రకు దాక్షిణాత్య కనక్షన్ వున్నట్టు చెప్పలేదు) ఆవిడ వెనక్కాల ఎవరో అమ్మాయి, మాసిపోయిన అనూష్క తప్ప మరో ఆడపురుగు కనబడలేదు.
రానా దుష్టుడే కానీ స్త్రీలోలత్వం లేనివాడేమో, భార్య లేకపోయినా ఎవరితోనూ కులుకుతున్నట్టు చూపలేదు. అందువలన సైనికుల కనువిందు కోసం అనూష్క పాపం అలా రాత్రంతా నిలబడే వుంటోంది. దానికి బదులుగా సైనికులు ఎక్కణ్నుంచో ఎండుపుల్లలు పట్టుకుని వచ్చి ఆవిడ ముందు పడేసి ఓ కాలక్షేపం కలిగిస్తున్నారు. ఖైదీల దగ్గర పదునైన వస్తువులు కూడా వుండనివ్వరు. ఇలా చితి పేర్చుకుని ఆత్మాహుతి చేసుకుంటుందేమోనన్న శంక విలన్లకు రాలేదు. అనూష్క అలా నిలువుకాళ్ల జీతంపై వుండగానే శివుడు వచ్చి తీసుకుపోయాడు. నిప్పులుమిసే బండరాళ్ల మీద నుంచి రథం పోనివ్వడం తప్ప మరే ఘనకార్యమూ చేయనక్కర లేకపోయింది. సిజి కోట కావడం బట్టేమో అది డొల్లగా వుంది. పాతికేళ్లగా దాచిన ఖైదీ దాన్లోంచి అతి చులాగ్గా బయటపడింది. అది ముందునుంచీ యిదే సరుకై వుంటుంది కాబట్టే కాలకేయులు వచ్చినపుడు దాన్ని నమ్ముకోకుండా ఆరుబయట డాళ్లతో 'వి' ఆకారంలో రక్షణవలయం ఏర్పరచుకున్నారు. పదిమంది కాలకేయులు ఒక్క దుంగతో కొడితే చెల్లాచెదరయ్యారు. మామూలు సినిమాల్లో ఏనుగుల చేత కోటగుమ్మం పగలకొట్టిస్తూంటారు.
అది డొల్ల కోట అని హీరోయిన్‌కు కూడా తెలుసనుకుంటాను. అందుకే గాఢంగా ప్రేమించిన ప్రియుణ్ని తెలియని చోటికి నిశ్చింతగా వెళ్లనిచ్చింది. అసలామె కారెక్టరే నాకు అర్థం కాలేదు. శివుడికి మాస్కు దొరికింది. విప్లవసంఘంలో మగా, ఆడా అందరికీ అదే మాస్కు. కానీ పైకి ఎక్కడానికి ఏదో ఒక మోటివేషన్ వుండాలి కాబట్టి యితను దాన్ని చూసి దేవకన్యను వూహించేసుకున్నాడు. అమ్మాయినే ఎందుకు ఊహించుకోవాలన్న ప్రశ్నకు అర్థం లేదు. ఎవరినైనా ఊహించుకోవచ్చు.
సినిమాల్లో హోమో దృశ్యాలు పెరుగుతున్నాయి కాబట్టి రాబోయే సినిమాల్లో మగాడు మగాణ్ని/తృతీయా ప్రకృతిని వూహించుకున్నట్లు చూపినా చూపవచ్చు. హీరో పైకి వచ్చి చూస్తే హీరోయిన్ అపరదుర్గలా వుంది. సరసరా పీకలు కోసేస్తోంది. అంత కమిటెడ్ అమ్మాయి, 'నీ లక్ష్యమే నా లక్ష్యం' అని శివుడు అనగానే ఐసరబజ్జా అనుకుని ఆ పని అతనికి అప్పగించేసి, రిలాక్సయి పోయింది. పాతకాలం జానపదం సినిమాల్లో అయితే అతని మాట కాదనలేక సరే అన్నా వుండబట్టలేక మారువేషంలో అతన్ని అనుసరించి వెళ్లి, పొరపాటున శత్రువులకు పట్టుబడి, యితనికి సంకటం క్రియేట్ చేసి వుండేది. దీనిలో హీరో హర్డిల్లెస్ కాబట్టి సరే నువ్వెళ్లు, నేను యింట్లో రెస్టు తీసుకుంటా అంది.
ఆ విప్లవనాయకుడు కూడా ఏ రకమో తెలియలేదు. పచ్చబొట్టు చూసి 'శరీరం మీద తీపి వున్నవాళ్లు సాహసానికి పనికిరారు' అనుకున్నవాడు హీరోయిన్ 'నా బదులు నా ప్రియుణ్ని పంపిస్తా' అంటే రైఠో ఎలా అన్నాడు? శరీరాలంకరణ కంటె మనసిచ్చేయడం బలహీనతకు మరింత చిహ్నం కదా! 'నీకు ఛాన్సివ్వడమే ఎక్కువనుకుంటే నీ బదులు నీ ప్రాక్సీని పంపుతానంటున్నావు. ఎవడికైనా పని అప్పగించేముందు రావు గోపాలరావు చెప్పినట్లు దాన్సిగదరగ, వాడి పొడుగెంత, ఛాతీ వెడల్పెంత, లోతెంత అని చూసుకోవద్దా? వాణ్నో సారి నా దగ్గరకు రమ్మనమను. శరీరదారుఢ్యం, చిత్తశుద్ధి పరీక్షిస్తా' అని అనాలా వద్దా? అలా రప్పిస్తే శివుడు బాహుబలిలా వున్నాడని అతనికి తెలిసిపోతుందని కథకుడికి భయం వేస్తే, కనీసం ఆ చెక్క మాస్కు పెట్టుకునేనా పరీక్షలు ఎదుర్కున్నట్లు చూపించాల్సింది. ఆ మాస్కు శివుణ్ని పైకి రప్పించడానికి, అతనలా వచ్చాడని హీరోయిన్ నమ్మడానికి తప్ప మరెందుకు పనికి వచ్చిందో నాకైతే అర్థం కాలేదు. విప్లవసంఘం వాళ్లు ఒక్కసారి ప్రతిజ్ఞ చేసి తీసి పారేసినట్టున్నారు. కట్టప్ప ఫ్లాష్‌బ్యాక్ చెప్పే టైములో కూడా ఒక్కడికీ మాస్కు లేదు.
అసలు అదేమి విప్లవసేనో ఏమో ఎవడో పరదేశస్తుడు వచ్చి మీ పని నేను చేస్తా అంటే నమ్మేసి కూర్చున్నారు. అతనికి అండగానో, అతనిపై నిఘాగానో వెంట కొంతమందైనా వెళ్లలేదు. రథంలో దేవసేనను తీసుకుని వచ్చేసేటప్పుడు దారిలో సాయపడలేదు. అతను ఆమెను వేరే చోటికి తీసుకుపోతాడేమోనన్న భయంతో అతన్ని కొట్టిపడేసి దేవసేనను తమ వద్దకు తెచ్చుకోలేదు. బంగారు విగ్రహం నిలబెట్టే పనిలో బానిసల్లాగానో, పనివాళ్లలాగానో వారిలో కలిసిపోయి అదను చూసి భల్లాల దేవుడిపై కత్తి విసురుదామని అనుకోలేదు. విగ్రహం నిలబెట్టే టైములో 'బాహుబలి' 'బాహుబలి' అనే మాట బయటకు వచ్చినపుడు పాతికేళ్లగా వినబడని మాట ఎలా వచ్చింది? అతని పోలికల్లో ఎవరైనా అక్కడ వున్నారా? అనే సంగతి ఆలోచిద్దామని వాళ్లకు తోచనైనా తోచలేదు. రాత్రి కట్టప్ప కథ చెప్పేటప్పుడు కట్ట ఎక్కి కూర్చుని అన్నీ ఒకేసారి తెలుసుకుందామని కాళ్లు జాపుకుని కూర్చున్నారు. ఇలాటి సోంబేరి విప్లవసేన వుంటే యిక విప్లవం వచ్చినట్లే!
భీష్ముడి మోడల్లో కట్టప్ప కారెక్టరు తయారుచేశారు. ధర్మమో, అధర్మమో సింహాసనానికి కట్టుబానిస అయినవాడు నిన్ను తప్పిస్తానని దేవసేనకు ఎలా ఆఫర్ చేశాడు? శివుడు యువరాజు తల నరికితే అతనిపై కత్తి దూసేబదులు, అతని పాదాలు నెత్తిమీద పెట్టుకుంటాడా? అదేం రాజభక్తి? ఆ కారెక్టరూ చెడింది. చివర్లో అతను బాహుబలిని కత్తితో పొడవడం రెండు భాగాలకు మధ్య పెద్ద యింటర్వెల్ బ్యాంగ్ అనుకోవాలి.
''సింహాద్రి''లో హీరో, హీరోయిన్ తండ్రిని కాల్చి చంపేస్తాడని గుర్తు. ఎందుకురా అంటే ఆయన చేతిలోని సూటుకేసులో ఆయనకు తెలియకుండా పెట్టిన బాంబుతో రైలెక్కితే రైల్లో చాలామంది ప్రాణాలు పోతాయి కనక అని చెప్పినట్టున్నారు. రైలెక్కకుండా చేయడానికి, లేదా సూటుకేసు కిందపడేట్లా చేయడానికి ఏ కాలిమీదో, చేతిమీదో కాలిస్తే సరిపోయేది కదా! హీరో మంచి షూటరు కూడా. కాలిమీద కాలుస్తూంటే వాయుదేవుడు మాయ చేసి వీపులో బుల్లెట్టు దిగేట్టు చేశాడా? ఏమో గుర్తులేదు. ఇప్పుడు కన్నప్ప విషయంలో కూడా యిలాటి ట్రిక్కు ఏదో పెట్టి వుండవచ్చు. ఇంటర్వెల్ ముందు విగ్రహ ప్రతిష్టాపన, బాహుబలి నామోచ్చరణ, క్లయిమాక్సుకు ముందు యుద్ధం పెట్టి ఆకట్టుకున్నట్లు బ్యాంగ్‌గా వెన్నుపోటు పెట్టుకున్నారు.
ఇక బాహుబలి, భల్లాల దేవుడు నైజం, వీరత్వం చూపడానికి గట్టి ఉదంతమే లేదు. ఒక గూఢచారి గురించి వెతకడానికి యిద్దరు యువరాజులు బయలుదేరడం చాలా ఫ్లిమ్జీగా వుంది. వాళ్ల వెనక్కాల తోకలా కట్టప్ప వెళ్లడం దేనికి? తనొక్కడే వెళ్లవచ్చుగా? ఐటమ్ సాంగ్ చేయడం రాదనా? అక్కడ తాడు సన్నివేశం లక్ష్యం భల్లాల దేవుని క్రౌర్యంతో బాటు బాహుబలి అమాయకత్వం (విచక్షణారాహిత్యం అందామా) కూడా చూపడమా? విదేశీయులు ఎందుకైనా దండయాత్ర చేయవచ్చు, కానీ యీ రాజ్యంలో జరిగిన కొన్ని కుట్రల లేదా ఘటనల పర్యవసానంగా… అని కల్పించి వుంటే అందంగా వుండేది. లేకపోతే ఆ యుద్ధం సినిమాలో ఎక్కడైనా పెట్టవచ్చు. క్లయిమాక్సుకే వాడవలసిన అవసరం లేదు. అలాగే శివలింగం ఎత్తడం పోస్టరు చూస్తే దానికి కథలో ఏదో ప్రాముఖ్యత వుందనే భ్రమ కలిగింది. తెరపై చూస్తే ఏమీ లేదు. పోనీ అలా కదిలించడం వలన అనర్థం జరిగిందని అందరూ అనుకునేట్లా సంఘటనలు పేర్చుకున్నా బాగుండేది. సర్కస్ ఫీటు చేసినట్లు హీరో ఓసారి లింగాన్ని పెకిలించి, మోసేశాడు.
బాహుబలి టెక్నికల్‌గా ఎంత గొప్పగా వున్నా సరే, కథ బాగా లేదు. ఆట్టే మాట్లాడితే కథే లేదు. పదేళ్ల కుర్రవాడు యింత కన్న ఎక్కువ ట్విస్టులు పెట్టగలడు. కానీ బాహుబలి వీరాభిమానులు చాలామంది వున్నారు. వారంతా ఏ సందేహం లేవనెత్తినా 'రెండో భాగంలో వస్తుంది' అని జవాబిస్తున్నారు, అక్కడికి రాజమౌళి వచ్చి వీళ్లకేదో చెవిలో చెప్పినట్లు! కథ ఏమిటో సినిమావాళ్లు బయటకు పొక్కనివ్వరు. పూర్తి కథేమిటో చాలామంది నటీనటులకే తెలియదు. అయినా మొదటి భాగంలో యింతే కథ అని యీ అభిమానులు ముందుగా మనకు చెప్పారా? భాగాలుగా వున్న హాలీవుడ్ సినిమాలు ఏ సినిమాకు ఆ సినిమా చూసేట్లు వుంటాయి. ఉదాహరణలు కోకొల్లలు. హిందీ సినిమా ''మేరా నామ్ జోకర్'' సినిమాను రెండు భాగాలుగా తీద్దామనుకున్నారు. కథానాయకుడికి మొత్తం ఏడుగురు స్త్రీలతో కలిగిన అనుభవాల సమాహారం అది. మొదటి భాగంలో 30-35 ఏళ్ల వయసు వరకు ముగ్గురు స్త్రీలతో కలిగిన అనుభవాలు చూపారు. రెండో భాగంలో తక్కిన నలుగురు రావాలి, వారిలో ఒకరు భానుమతి అని ప్రకటన కూడా వచ్చింది.
మొదటి భాగంలో 35 ఏళ్ల వయసులో పద్మిని ఎపిసోడ్ తర్వాత ఫ్లాష్ ఫార్వార్డ్ చేసి 70 ఏళ్ల వయసులో ముసలాణ్ని చూపించి చివర్లో 'పాజిబ్లీ నాట్ – ద ఎండ్' లాటిదేదో చూపారు. కానీ మొదటి భాగం ఫెయిలు కావడంతో రెండో భాగం తయారీ ఇంపాజిబుల్ అయిపోయింది. మొదటిభాగం మాత్రమే చూసినా, సినిమా అసమగ్రం అనే ఫీలింగు రాదు. నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ ఏదో చెప్పకుండా వదిలేశాడు అనే భావం కలగదు. బాహుబలి కూడా అలా తీసి వుండాలి. కథ పూర్తిగా చెప్పేస్తే రెండో భాగానికి రారు అనే అపనమ్మకం దేనికి? బాగా తీస్తే రాక ఛస్తామా?
కథ లేకుండా సినిమా తీయగలనని పూరీ జగన్నాథ్ ఆ మధ్య స్టేటుమెంటు యిచ్చారు. దాన్ని రాజమౌళి అమలులో పెడదామని చూస్తే మాత్రం నాబోటి వాళ్లు రెండో భాగం చూడడానికి ఆత్రపడం. తెలుగువాణ్ని ఒకసారి ప్రోత్సహించాం చాల్లే అని మమ్మల్ని మేం సముదాయించుకుంటాం. అంతమాత్రాన అది ఆడదని కాదు. దీనిలాగే దాన్నీ కథతో కాకుండా మార్కెటింగ్‌తో విజయవంతం చేయగల సమర్థులు దీని నిర్మాతలు, పెట్టుబడిదారులు!
– ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2015)