ఫిక్సింగ్‌ కేసులో శ్రీశాంత్‌కి విముక్తి

స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు క్రికెటర్లకు ఆ కేసు నుంచి విముక్తి లభించింది. ఫిక్సింగ్‌ వ్యవహారంలో ఆధారాలు చూపించలేకపోయారని పేర్కొన్న ఢిల్లీ న్యాయస్థానం, ఆ ముగ్గురు క్రికెటర్లకూ ఈ కేసు నుంచి…

స్పాట్‌ ఫిక్సింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు క్రికెటర్లకు ఆ కేసు నుంచి విముక్తి లభించింది. ఫిక్సింగ్‌ వ్యవహారంలో ఆధారాలు చూపించలేకపోయారని పేర్కొన్న ఢిల్లీ న్యాయస్థానం, ఆ ముగ్గురు క్రికెటర్లకూ ఈ కేసు నుంచి విముక్తి కల్పించింది. శ్రీశాంత్‌, అంకిత్‌ చవాన్‌, చండీలా ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో ఇరుక్కుపోయిన విషయం విదితమే. 

ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిలో శ్రీశాంత్‌ పరిస్థితి మరీ దారుణం. టీమిండియాలో 'కేరళ స్పీడ్‌ స్టర్‌'గా పేరు తెచ్చుకున్న శ్రీశాంత్‌, తొలి వన్డే వరల్డ్‌ కప్‌ సాధించిన జట్టుకి ప్రాతినిథ్యం వహించాడు. బౌలర్‌గా ఆ సిరీస్‌లో శ్రీశాంత్‌ బాగానే రాణించాడు. ఆ తర్వాత పలు మ్యాచ్‌లలోనూ శ్రీశాంత్‌ తనదైన శైలిలో ప్రత్యర్థుల్ని కట్టడి చేయగలిగాడు. అయితే తక్కువ వయసులో వచ్చిన పేరు ప్రఖ్యాతులు, దానికి తోడు అతని ఎగ్రెసివ్‌ నేచర్‌.. ఇవన్నీ సీనియర్ల ఆగ్రహానికి అతను బలయ్యేలా చేశాయి. 

ఐపీఎల్‌లోనే ఓ సారి తోటి ఆటగాడితో చెంపదెబ్బ కూడా తిన్నాడు శ్రీశాంత్‌. ఇక అప్పటినుంచీ అతని కెరీర్‌ అగమ్యగోచరంగా మారింది. ఫిక్సింగ్‌ ఆరోపణలతో ఐపీఎల్‌ నుంచే కాక, క్రికెట్‌ కెరీర్‌ నుంచే తప్పుకోవాల్సి వచ్చింది శ్రీశాంత్‌కి. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నాడీ ఒకప్పటి యంగ్‌ క్రికెటర్‌. తాజాగా ఢిల్లీ కోర్టు విముక్తి కల్పించిన నేపథ్యంలో శ్రీశాంత్‌, తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకుంటాడా.? ఏమోగానీ, ఓ యంగ్‌ క్రికెటర్‌ క్రీడా జీవితాన్ని ఫిక్సింగ్‌ కుంభకోణమే కాదు, కొందరు బీసీసీఐ పెద్దలూ చిదిమేశారన్నది కాదనలేని వాస్తవం.