ఎమ్బీయస్‌: ఎమర్జన్సీ ఎట్‌ 40 – 39

1967 ఎన్నికలలో దెబ్బ తిన్నాక నెహ్రూ మార్కు సోషలిజం నుండి దూరంగా జరగడం వలననే ఓడామన్న ఆలోచనతో ఎన్నికల అనంతరం మేలో కాంగ్రెసు పార్టీ బ్యాంకుల జాతీయకరణ, జనరల్‌ ఇన్సూరెన్సు జాతీయకరణ వంటి 10…

1967 ఎన్నికలలో దెబ్బ తిన్నాక నెహ్రూ మార్కు సోషలిజం నుండి దూరంగా జరగడం వలననే ఓడామన్న ఆలోచనతో ఎన్నికల అనంతరం మేలో కాంగ్రెసు పార్టీ బ్యాంకుల జాతీయకరణ, జనరల్‌ ఇన్సూరెన్సు జాతీయకరణ వంటి 10 అంశాల కార్యక్రమాన్ని ప్రకటించింది. సిండికేటు నాయకులు అది అమలు కాకుండా చూశారు. మొరార్జీ ఆర్థికమంత్రి అయ్యాక రైటిస్టు భావజాలానికి అనుగుణంగా కొన్ని ప్రతిపాదనలు చేశారు. అవి 1) ప్లానింగ్‌ కమిషన్‌ ప్రాధాన్యత తగ్గించాలి, పబ్లిక్‌ సెక్టార్‌ను తగ్గించాలి, ప్రయివేటు సెక్టార్‌ను, విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించాలి 2) విదేశాంగ విధానంలో పశ్చిమదేశాలతో, ముఖ్యంగా అమెరికాతో బంధం పెంచుకోవాలి (నిజానికి  అమెరికా సహాయం తగ్గిస్తూ వచ్చింది. 1968 వచ్చేసరికి 1964-65 మధ్య యిచ్చిన దానిలో సగమే యిచ్చింది) 3) దేశంలో వామపక్షాల పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి, ఆందోళనలను చట్టవిరుద్ధంగా ప్రకటించాలి, గ్రామీణ ప్రాంతాల్లో పుంజుకుంటున్న రైతు సంఘాలను కట్టడి చేసి, స్వతంత్ర, జనసంఘ్‌ పార్టీలకు అనుకూలంగా మారిన ధనిక రైతులను తిరిగి కాంగ్రెసు వైపుకి మరల్చాలి. కాంగ్రెసు వర్కింగ్‌ కమిటీలో సిండికేటుకు మెజారిటీ వుండేది కాబట్టి వర్కింగ్‌ కమిటీ పాలసీలు తయారుచేస్తుందని, ప్రధాని వాటిని ఆర్థికమంత్రి ద్వారా అమలు చేసి, ప్రోగ్రెసు రిపోర్టును పార్టీకి విన్నవిస్తూ వుండాలని పట్టుబట్టసాగారు. 

గత నాలుగైదు సంవత్సరాలుగా దేశంలో ద్రవ్యోల్బణం, నల్లధనం ఎక్కువ అయిపోవడంతో ప్రజలు అనేకరకాలుగా ఉద్యమాలు చేసేవారు. గతంలో వున్న సత్యాగ్రహాలు, బంద్‌లకు తోడుగా కార్మికులు, విద్యార్థులు కొత్తగా ఘొరావ్‌ అని మొదలుపెట్టారు. ఫ్యాక్టరీ జనరల్‌ మేనేజర్‌ను, లేదా కాలేజీ ప్రిన్సిపాల్‌ను గుంపుగా చుట్టుముట్టేసి, నినాదాలు యిస్తూ తమ కోర్కెలకు అంగీకరించేదాకా అక్కణ్నుంచి కదలనిచ్చేవారు కారు. చెయ్యెత్తి కొట్టరు కానీ తినడానికి, తాగడానికి, మరే పనికీ కదలనీయకుండా, కూర్చోనీయకుండా గంటల తరబడి సతాయించేవారు. దాంతో ఉన్నతోద్యోగులందరికీ దడగా వుండేది. ఫ్యాక్టరీలు మూతపడేవి. రెండు యూనియన్ల మధ్య విభేదాలు వున్నా వాటి ప్రభావం ఫ్యాక్టరీ ఉత్పత్తిపై పడేది. గ్రామాలలో రైతుకూలీలు కూడా సంఘాలుగా ఏర్పడి కూలీ పెంచమని అడగసాగారు. ప్రభుత్వం చేతకానితనం వలననే యిదంతా సాగుతోందని,  కార్మికులకు, కర్షకులకు ముకుతాడు వేసే రైటిస్టు ప్రభుత్వం ఏర్పడాలని పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు కోరుకుంటున్నారు. సహజంగానే వారంతా సిండికేటుకు అండగా నిలిచారు. 

సిండికేటు నాయకులు యిలా నిష్కర్షగా రైటిస్టు విధానాలను చాటుకుంటున్న కొద్దీ ఇందిర వాళ్లకు ప్రతిగా లెఫ్ట్‌కు మళ్లింది. యంగ్‌ టర్కుల ద్వారా వారిపై దాడి చేయించింది. మొరార్జీ స్వయంగా నీతిమంతుడే అయినా అతని కుమారుడు కాంతి దేశాయి, వ్యవహారాలు మాత్రం సవ్యంగా వుండేవి కావు. అతను అనేకమంది పారిశ్రామికవేత్తలతో వ్యాపారబంధాలు పెట్టుకున్నాడు. కానీ మొరార్జీది ధృతరాష్ట్రుణ్ని మించిన పుత్రప్రేమ. అతనే తప్పూ చేయలేదని వాదించేవాడు. తర్వాతి రోజుల్లో మొరార్జీ ప్రధాని అయినపుడు కాంతి దేశాయి వ్యవహారాలు మితిమీరి జనతాకు యిబ్బందులు తెచ్చిపెట్టాయి. అయినా మొరార్జీ అతన్ని వెనకేసుకుని వచ్చేవాడు. ప్రతిపక్షాలే కాదు, జనతాలోని యితర నాయకులు కూడా మొత్తుకునేవారు. 1969లో ఇందిర కాంతి దేశాయిని యిరికించే కొన్ని డాక్యుమెంట్లను యంగ్‌ టర్కులకు అందేట్లా చేసింది. అవి పట్టుకుని వాళ్లు మొరార్జీని అల్లరి పెట్టేవాళ్లు. వాళ్లకు తోడుగా సిపిఐ వారు, సిపిఐ నుంచి కాంగ్రెసులో చేరి ఇందిరకు మద్దతుగా నిలిచినవారు పని చేసేవారు. మంత్రులైన దినేశ్‌ సింగ్‌, రఘునాథ రెడ్డిలు అందించిన సమాచారం ఆధారంగా ప్రతిపక్షాలు లోకసభలో మొరార్జీపై సెన్సూర్‌ మోషన్‌ పెట్టాయి. అది వీగిపోయినా మొరార్జీ ప్రతిష్ఠ మసకబారింది. దేశం రెండు క్యాంపులుగా చీలిందనుకోవచ్చు. కమ్యూనిస్టులు ఇందిరను బలపరచగా, స్వతంత్ర పార్టీ ప్రత్యక్షంగా, జనసంఘ్‌ పరోక్షంగా సిండికేటును బలపరచేది. ఇలాటి సమయంలో  అనుకోకుండా రాష్ట్రపతి ఎన్నిక వచ్చిపడింది. 

1969 మే 3 న జాకీర్‌ హస్సేన్‌ హఠాత్తుగా మరణించారు. ఉపరాష్ట్రపతిగా వున్న వివి గిరి తాత్కాలిక రాష్ట్రపతి అయ్యారు. జాకీర్‌ హుస్సేన్‌ స్థానంలో జగ్జీవన్‌రామ్‌ను నిలబెడదామని ఇందిర అనుకుంది. మహాత్మా గాంధీ శతజయంతి సంవత్సరంలో హరిజనుణ్ని రాష్ట్రపతి చేస్తున్నామంటే ప్రతిపక్షం కూడా కలిసి వస్తుందని ఇందిర వాదన. కామరాజు, యితర సిండికేటు నాయకులు సంజీవరెడ్డిని నిలబెడదామనుకున్నారు. లోకసభ స్పీకరుగా ప్రతిపక్షాలను కూడా లుపుకుని వెళ్లాడు కాబట్టి వాళ్లూ సమర్థిస్తారని సిండికేటు వాదన. ఏ విషయం తేల్చవలసిన కాంగ్రెసు పార్లమెంటరీ బోర్డులో వున్న 8 మంది సభ్యుల్లో సిండికేటుకు నాలుగు ఓట్లున్నాయి. ఇందిర వద్ద మూడే వున్నాయి. ఒకవేళ చవాన్‌ కూడా ఆమె వైపు తిరిగినా నాలుగు-నాలుగు వచ్చి టై-అప్‌ అవుతుంది తప్ప ఇందిర మాట నెగ్గే అవకాశం లేదు. అందుకని 1969 జులై 11-13 మధ్య బెంగుళూరు లాల్‌బాగ్‌లోని గ్లాస్‌ హౌస్‌లో ఎఐసిసి సమావేశం జరిగినపుడు కాంగ్రెసు తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా సంజీవరెడ్డి పేరును ఇందిర ఆమోదించింది. దానికి ప్రతిగా ఇందిర ''కొన్ని ఆలోచనలు'' (స్ట్రే థాట్స్‌) పేర ఒక నోట్‌ విడుదల చేసింది. దానిలో అయిదారు పెద్ద బ్యాంకులను జాతీయం చేయాలని, ముడి ఖనిజాలను దిగుమతి చేసుకోవాలని, గ్రామీణ ప్రాంతాల్లో సర్వీస్‌ కోఆపరేటివ్స్‌ తెరవాలని, కౌలుదారులు, భూమిలేని పేదల స్థితి బాగుపరచాలని.. యిలాటి కొన్ని సూచనలున్నాయి. ఇవన్నీ వామపక్షపు ఆలోచనలే అయినా ఇందిర తమ అభ్యర్థి పేరుకు అంగీకరించి కదాని సిండికేటు తృప్తి పడింది.  (సశేషం)

ఫోటో – సంజీవరెడ్డి

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2015) 

[email protected]

Click Here For Archives