పవర్ స్టార్…భలే చమక్కులు

గబ్బర్ సింగ్ 2 ఏ ముహుర్తాన ప్రారంభించారో..ఆ ముహుర్తం కూడా పవన్ కళ్యాణ్, ఆయన స్నేహితుడు త్రివిక్రమ్ నమ్మే స్వామీజీ ఏ ముహుర్తం పెట్టారో మరి, అది అలా అలా డిలే అవుతూనే వుంది.…

గబ్బర్ సింగ్ 2 ఏ ముహుర్తాన ప్రారంభించారో..ఆ ముహుర్తం కూడా పవన్ కళ్యాణ్, ఆయన స్నేహితుడు త్రివిక్రమ్ నమ్మే స్వామీజీ ఏ ముహుర్తం పెట్టారో మరి, అది అలా అలా డిలే అవుతూనే వుంది. దీంతో డైరక్టర్ బాబి, నిర్మాత శరద్ మురార్ కక్కలేక మింగలేక కిందా మీదా అవుతున్నారట. ఎవరికీ నేరుగా పవన్ ను వెళ్లి అడిగే ధైర్యం లేదు. ఆయన చెప్పరు..దాంతో అలా పడివుందీ ప్రాజెక్టు. తాజాగా ఆగస్టు 5 అన్నది డేట్.

ఇదిలా వుంటే ఆ మధ్య పవన్ వున్నట్లుండి..రేపట్నించి రెడీ అయిపోదాం..డిస్కషన్ కు రండీ అని, కీలక యూనిట్ సభ్యులకు చెప్పాడట. కానీ అసలు విషయం తెలిసి గుండె గుభేల్ మందిట. అదేమిటంటే..వెళ్లాల్సింది పవన్ ఫార్మ్ హవుస్ కు, టైమ్ తెల్లవారు ఝాము అయిదు గంటలకు. అక్కడికి అయిదుకు చేరుకోవాలంటే ఇక్కడ మూడు గంటలకు బయల్దేరాలి. కిందా మీదా పడి ఆఖరికి శరద్ మురార్ ఈ సమస్య పవర్ స్టార్ చెవిన వేసాడట. సరే..అయితే ఆరుకు రండి…అని కనికరించారట. 

అలాగే ఆ మధ్య  షూటింగ్ ప్రారంభించినపుడు, ఆర్ట్ డైరక్టర్ ఆనంద్ సాయికి కొన్ని పనులు చెప్పారట. దాని కోసం ముంబాయి నుంచి స్పెషలిస్టులను రప్పించడమో, ఇతరత్రా వ్యవహారాలను చేయడమో చేస్తే తడిపి మోపెడయిందట. ఈ బిల్లు, ఈ ఖర్చు, పవన్ దృష్టిలో పెట్టాలా వద్దా..అన్నదానిపై పాపం శరద్ మురార్ చాలా రోజులు కిందామీదా పడ్డారట.

అన్నింటికి మించి అసలు గుసగుస మరోటుంది. ఇప్పుడు సడెన్ గా ఫార్మ్ హవుస్ కు ఎవరన్నా వెళ్లగలిగితే, పవన్ ను గుర్తుపట్టలేరట. తెల్లటి గడ్డంతో, అచ్చం ఓ స్వామీజీలా కనిపిస్తారని తెలుస్తోంది. బయటకు వచ్చినపుడు మాత్రం రంగు వేస్తున్నారట. లేదంటే లేదట. కానీ ఎందుకు ఇలా పెంచేస్తున్నారన్నది మాత్రం ఎవరికీ తెలియదు. సినిమాలో పాత్ర మేరకు ఏమైనా అవసరమా అన్నది దర్శకుడు బాబికి, పవన్ మాత్రమే తెలియాలి. 

మొత్తం మీద ఈ ప్రాజెక్టు అనుకున్నట్లు ఆగస్టు 5న ప్రారంభమైనా కనీసం ఆరు నెలలు పడుతుంది. అప్పటి వరకు గబ్బర్ సింగ్ 2 యూనిట్ కు నిత్యం టెన్షనే. ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు ఆగుతుందో..ఎప్పటికి పూర్తవుతుందో అని. 

ఆర్వీ