బాహుబలి వర్సెస్ భజరంగి భాయీజాన్…

రాబోయే తెలుగు సినిమాలకే కాదు హిందీ సినిమాలకు కూడా బాహుబలి టెన్షన్ పట్టుకునేట్టుంది. విడుదలైన ప్రతి పెద్ద సినిమానీ బాహుబలితో పొల్చే కార్యక్రమం అప్పుడే మొదలైపోయింది. తాజాగా విడుదలైన కండల వీరుడు సల్మాన్ ఖాన్…

రాబోయే తెలుగు సినిమాలకే కాదు హిందీ సినిమాలకు కూడా బాహుబలి టెన్షన్ పట్టుకునేట్టుంది. విడుదలైన ప్రతి పెద్ద సినిమానీ బాహుబలితో పొల్చే కార్యక్రమం అప్పుడే మొదలైపోయింది. తాజాగా విడుదలైన కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిందీ చిత్రం భజరంగి భాయిజాన్ సూపర్ డూపర్ హిట్టయిన నేపధ్యంలో అప్పుడే ఈ రెండు సినిమాల కలెక్షన్స్‌నూ పోల్చడం మొదలుపెట్టారు. 

సల్మాన్ చిత్రం 3రోజుల్లో రూ.102 కోట్లు కలెక్ట్ చేసిందని, అయితే బాహుబలి రెండ్రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్ దాటేసిందంటూ ట్రేడ్ ఎనలిస్ట్‌లు లెక్కలు కడుతున్నారు. ఎన్డీటీవీ వంటి పాప్యులర్ జాతీయ చానెల్స్ సైతం ఈ కంపేరిజన్‌కి దిగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత సోమవారం ఈ చానెల్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో పలువురు విశ్లేషకులు ‘భాయిజాన్’, బాహుబలిని ఓవరాల్‌గా క్రాస్ చేయలేకపోవచ్చునని అంచనా వేశారు. 

మరో ఎనలిస్ట్ అయితే షోలే తర్వాత అంత స్థాయి ఆదరణను బాహుబలికి మాత్రమే చూడగలిగా అంటూ పోల్చాడు. అమెరికాలో 30డాలర్లు టిక్కెట్ ధర పలికిన ఏకైక చిత్రం బాహుబలి అంటూ పొగడ్తలు కురిపించాడు. ఓ వైపు ఒక తెలుగు సినిమా ఇంత స్థాయిలో కీర్తి ప్రతిష్టలు ఆర్జించడం ఆనందంగానే అనిపిస్తున్నా… మరోవైపు అదీ ఇదీ అని లేకుండా ప్రతి సినిమానీ బాహుబలితో పోల్చడం వల్ల దీర్ఘకాలంలో లాభం కన్నా  నష్టమే ఎక్కువ వచ్చే అవకాశం ఉందేమోననే సందేహం పలువురిలో వ్యక్తమవుతోంది. 

ఇకపై వచ్చే ప్రతి తెలుగు సినిమానీ దేశంలో ప్రతి ఒక్కరూ బాహుబలితో పోల్చి మాట్లాడుతూ పోతే… అది ఎంత మాత్రం మన చిత్ర పరిశ్రమకి మంచిది కాదనేది నిస్సందేహం.

-ఎస్బీ