తమిళ సినిమాల డబ్బింగ్ ద్వారా తెలుగువారికీ చిరపరిచితమైన కుర్రహీరో ధనుష్‌కు ఇప్పుడు గొప్ప చిక్కొచ్చింది. ఇటీవల ఈ కొలవెర్రి బాబు తను నటించిన ‘మారి’ సినిమాలో సిగిరెట్టు మీద సిగిరెట్టు కాలుస్తూ, రింగు రింగులుగా పొగ వదులుతూ అందర్నీ ఆకట్టుకున్నాడు. ‘స్టైలు స్టైలులే నీది సూపర్ స్టైలులే’ అంటూ ‘అబ్బాయే వచ్చాడు…అచ్చం మామలాగే చేశాడు’ అంటూ అభిమానుల అభినందనలు సైతం అందుకున్నాడు.
ఇక తెరపై స్టైల్స్‌ను ‘పొగే’యడంలో మామ రజనీని ఈ స్లిమ్ స్టార్ బీట్ చేసేస్తాడని పలువురు సినీ పండితులు, మీడియా జోస్యం చెప్పేశారు. అంత వరకూ బానే ఉంది. అయితే తాజాగా గత ఆదివారం ధనుష్‌కి ఓ ఉత్తరం అందింది. నీ సినిమా చూసి యువత చెడిపోనున్నారని మాజీ కేంద్ర ఆరోగ్యమంత్రి, పిఎంకె నేత రాందాస్ ధనుష్‌కి రాసిన లేఖ అది.
‘‘తమిళనాడు యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆన్ స్క్రీన్ స్మోకింగ్‌ను వదిలేయాలి. అంతేకాదు ఇకపై అటువంటి దృశ్యాల్లో కనిపించననే విషయాన్ని ప్రకటించాలి. కొన్నేళ్ల క్రితం మీ మామ తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ పొగతాగవద్దు అని అభిమానులకు చెప్పారు. ఆన్ స్క్రీన్ స్మోకింగ్ మానేశారు. ఇప్పటికే కమల్ హాసన్, విజయ్, సూర్య, విక్రమ్‌లు సైతం అలాంటి సన్నివేశాల్లో నటించమని అంగీకరించారు. ఇక నుంచీ నువ్వు కూడా మామ అడుగుజాడల్లో నడు ’’ అంటూ ఆయన వార్నింగిచ్చిన స్థాయిలో లెటర్ రాశారు.
దీనికి జతగా తారలు సినిమాల్లో స్మోకింగ్ సన్నివేశాల్లో పొగతాగుతూ కనిపించడం యువతపై తప్పనిసరిగా ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని నిర్ధారించిన లాన్సెట్ అనే మెడికల్ జర్నల్ సర్వేతో పాటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించిన ప్రతుల్ని, సినిమాల్లో పొగతాగే సన్నివేశాలు స్మోకింగ్‌కు పరోక్ష ప్రకటనల్లాంటివేనని స్పష్టం చేస్తూ వాటిని ఆపేయాలని కేరళ హైకోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రతిని కూడా ఆయన ధనుష్‌కి పంపారు. మారి సినిమా సక్సెస్‌తో మాంఛి జోష్ మీదున్న ధనుష్… మామ నేటి స్టైల్‌ని ఫాలో అయి ఆన్‌స్క్రీన్ స్మోకింగ్‌ని ఆపేస్తాడో, కుర్రరజనీని గుర్తు చేసుకుంటూ తనదారి పొగదారి అంటాడో చూడాలి.
-ఎస్బీ.