అసలు విఐపిలు యిలాటి వాటికి వెళ్లాలా వద్దా? 1954లో కుంభమేళాలో దాదాపు 800 మంది చచ్చిపోయినపుడు అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ యిచ్చిన సలహా గుర్తుంచుకోవాలి. గంగానది సడన్‌గా తన ప్రవాహదిశను మార్చుకోవడం వలన మేళాకు కేటాయించిన స్థలం తగ్గిపోయిందన్న మాట నిజమే అయినా, అనేకమంది మంత్రులు, రాజకీయనాయకులు రావడం వలన తొక్కిసలాట జరిగి వందలాది మంది చచ్చిపోయారు. అప్పుడు నెహ్రూ యిటువంటి మేళాలకు రాజకీయ నాయకులు, విఐపిలు దూరంగా వుండాలని సూచించారు. వారి వలన ఘోరం జరిగిందని అందరికీ తెలిసినా విచారణలో వారిని ముద్దాయిలుగా పేర్కొనరు. ఆ ఘటనపై వేసిన జస్టిస్ కమలకాంత్ వర్మ కమిషన్ కుంభ మేళాను ఎలా నిర్వహించాలో చాలా సూచనలు చేసింది. వాటిని చక్కగా అమలు చేయడం వలన మళ్లీ ఎలాటి దుర్ఘటన అక్కడ జరగలేదు.
నెహ్రూగారు అలా చెప్పినా 1992 ఫిబ్రవరిలో కుంభకోణంలో జరిగిన మహామహం ఉత్సవానికి జయలలిత హాజరయ్యారు. అప్పట్లో కూడా జయేంద్ర సరస్వతే వాటిని ప్రారంభించారు. ముహూర్త సమయంలోనే జయలలిత, తన స్నేహితురాలు శశికళతో కలిసి గుడి చెరువులో కాస్సేపు స్నానాలు చేశారు. ఆమె పాప్యులారిటీ వున్న నాయకురాలు, పైగా సినీనటి. చూడడానికి జనం విరగబడ్డారు. చెరువులో కొంతభాగం జయలలితకు కేటాయించి తక్కినది జనాలకు వదిలారు. చెరువుకు దక్షిణ, పడమర దిక్కుల సెక్యూరిటీ కారణాలు చెప్పి మూసేశారు. తూర్పు, ఉత్తర దిక్కుల నుంచే వేలాదిమంది భక్తుల రాకపోకలు సాగాలి. ఇంకేముంది, తొక్కిసలాట జరిగింది. 50 మంది చనిపోయారు, 74 మంది గాయపడ్డారు. జయలలిత మళ్లీ అలాటి ఉత్సవంలో పాల్గొనలేదు.
చరిత్ర యిన్ని ఉదాహరణలు యిస్తున్నా మన నాయకులు పట్టించుకోవటం లేదు. ఎక్కడ జనం మూగితే అక్కడ ప్రత్యక్షమై పబ్లిసిటీ తెచ్చుకుందామని చూస్తున్నారు. కెసియార్ తెలంగాణలో మునిగితే, బాబు ఆంధ్రలో మునిగారు. ఆచారాలు, నమ్మకాలు గాఢంగా చాటుకునే కెసియార్ అరగంటలో పూజ ముగిస్తే బాబు గంటన్నరసేపు వున్నారు. కెసియార్ శాస్త్రోక్తంగా పంచె, ఉత్తరీయంతో గోదావరిలో దిగారు కానీ ప్యాంటు, చొక్కాతోనే మునిగారు. ఛాతీ చూపించడానికి సిగ్గుపడేవారు ధోవతి, లాల్చీతో స్నానం చేసినా బాగుండేది. ప్యాంటు, చొక్కాతో పిండప్రదానాలంటే కాస్త ఎబ్బెట్టుగా వుంది. అసలు ముఖ్యమంత్రి పుష్కరాలకు రావాలా? వచ్చినా నీటిలో మునగాలా? ఇక్కడ మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి గుండూరావు కథ గుర్తుకు వస్తోంది. ఓ స్విమ్మింగ్ పూల్ ఆవిష్కరణకు ఆయన్ని పిలిచారు. రిబ్బన్ కత్తిరించాక ఆయన స్విమ్మింగ్ డ్రెస్ వేసుకుని కొలనులోకి దూకి, కాస్సేపు యీది ఆవిష్కరించినట్లు ప్రకటించాడు. అప్పుడు చాలా విమర్శలు వచ్చాయి. మెటర్నటీ హోమ్ ఆవిష్కరణకు పిలిస్తే వెళ్లి పురుడు పోసుకుని వస్తాడా? అని అడిగారు. పుష్కరం ప్రారంభమైంది అని ప్రకటించి శంఖం వూది వచ్చేస్తే సరిపోయేది. స్నానం చేయడం దేనికి?
ఒకవేళ చేసినా సరిగ్గా ముహూర్త సమయానికి స్నానం చేయాలా? నేదురుమల్లి జనార్దనరెడ్డిగారు 1991లో 4 రోజుల తర్వాత వెళ్లారు. 2003లో బాబు సిఎంగా వుండగా స్థానిక కలక్టరు జవాహర్ రెడ్డి చేత నాయకులందరూ నియమాల ప్రకారం నడుచుకునేట్లు చేశారు. అప్పుడు వెంకయ్యనాయుడు సాధారణ భక్తుల ఘాట్‌లో స్నానం చేస్తామంటే కుదరదని, విఐపి ఘాట్‌లోనే చేయాలని జవాహర్ రెడ్డి ధైర్యంగా చెప్పగలిగారు. ఆయనకు ఆ ధైర్యం కలిగించినది బాబే. అదే బాబు యీరోజు తనే నియమాలు ఉల్లంఘించారు. డాక్యుమెంటరీ కోసం సినిమా వాళ్లు చెప్పినట్టల్లా 'ఆడారు'. ముందురోజు నిత్యహారతి షాటు బోయపాటి శ్రీను డైరక్షన్‌లో జరిగిందని, షూటింగుకి పుష్కర ఘాట్ అనువుగా వుంటుందని వాళ్లు అనడం చేత కొన్ని గంటల్లో పుష్కరం ప్రారంభమవుతుందనగా, ఆఖరి నిమిషంలో వెన్యూ మార్చేశారు. (ఈ డాక్యుమెంటరీ నిర్మాణ వార్తలను టిడిపికానీ ప్రభుత్వంకానీ ఎవరూ ఖండించలేదు. అందువలన దాన్ని నమ్మవలసి వస్తోంది). అలా చేస్తే కుదరదని గట్టిగా చెప్పగల అధికారి లేకుండా చేసుకున్నారు బాబు. అది రాజుకి వుండవలసిన లక్షణం కాదు.
నాకు అర్థమైనంత వరకు జరిగింది క్లుప్తంగా చెప్పాలంటే – ముహూర్తం కంటె ముందే నాలుగు గంటల నుంచి కొందరు వచ్చి కూర్చున్నారు. ఆ ఘాట్ మూడు విభాగాలుగా వుంది. సిఎం వస్తున్నారని విన్నాక 5 గంటల నుంచి మధ్య దాన్నుంచి జనాలను వెనక్కి పంపేశారు. 5.30కు జయేంద్ర సరస్వతి, 6.00 గంటలకు చంద్రబాబు వచ్చారు. 6.30 నుంచి 7.30 వరకు బాబు పూజలు చేశారు. ఆ తర్వాత వ్యాన్‌లోకి వెళ్లి బట్టలు మార్చుకుని వెనక్కి వెళ్లటానికి కొంత టైము పట్టింది. ఆయన వెళ్లాక 8.10కి జనాల్ని లోపలకి అనుమతించారు. అప్పటిదాకా లోపల వున్న జనాలను బయటకు, బయటి జనాలను లోపలకి ఒకేసారి వదిలారు. ఇన్, ఔట్ గేట్లు పక్కపక్కనే వున్నాయి. బయట 5 గం||ల నుంచి కొందరు జనం వెయిట్ చేస్తున్నారు. ప్రతీ రైలును గోదావరి స్టేషన్ వద్ద ఆపడం చేత, గోకవరం బస్టాండ్ దగ్గరలో వుండడం చేత బస్సు, రైలు దిగిన ప్రయాణీకులందరూ అక్కడికే వచ్చి చేరారు. స్థానికుల మాట సరేసరి. ఇంకో రేవు దగ్గర్లోనే వుంది, వెళ్లండి అని చెప్పడానికి మనుష్యులూ లేరు, యిండికేటర్సు లేవు. ఎక్కువమంది ఎటు నడిస్తే తక్కినవాళ్లూ అటే నడిచారు.
డాక్యుమెంటరీలో వెనక్కాల ఎక్కువమంది జనం కనబడితే బాగుంటుందనే వూహతో వాళ్లను కావాలనే వేరే ఎక్కడికీ పంపలేదన్న వాదనా వుంది. ఏమైతేనేం, వేలాది మంది అక్కడే వుండిపోయారు. దాహం. తాగడానికి నీళ్ల సప్లయి లేదు. వాళ్లను అదుపు చేయడానికి వున్న పోలీసులు 5గురు కానిస్టేబుళ్లు, ఒక యిన్‌స్పెక్టరు. సిఎం రెండు గంటల పాటు వుండి వెళ్లడంతో అధికారులు ఒక్కసారిగా రిలాక్సయ్యారు. ఒక్కసారిగా వదలడంతో అందరూ తోసుకుంటూ ముందుకు వెళ్లారు. ఇది 25 ని||లు సాగింది. బారికేడ్లు అడ్డుపడుతున్నాయని ఒక అధికారి బారికేడ్లు తీసేయమని ఆజ్ఞాపించారట. తోపుడులో కొందరు కింద పడ్డారు. జనం తొక్కేయడంతో చచ్చిపోయారు. సహజంగా పోయినవారిలో స్త్రీలు ఎక్కువ, 23 మంది. ఈ ఘాట్‌కు ఎదురుగా యిల్లు వున్నాయన మొన్న టీవీలో మాట్లాడారు. అయిదున్నరకు రోడ్లన్నీ ఖాళీగానే వున్నాయట. ఆ తర్వాత ఎంతమంది జనం వచ్చిపడ్డారంటే వాళ్ల యింటి తలుపు కూడా తీయలేకపోయారు. సంఘటన తర్వాత చావు వార్త బయటకు పొక్కకుండా చూడాలనో ఏమో 11.20 వరకు టీవీ ప్రసారం ఆపేశారట. ఇలాటి చర్యల వలన పుకార్లు మరింత బలంగా వ్యాపిస్తాయి. ఇప్పటికే పోయినవారు 27 కాదు, 40 కంటె ఎక్కువే అంటున్నారు కొందరు! (సశేషం)
-ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2015)