ఎమ్బీయస్‌: సిబిఐ చేతికి వ్యాపమ్‌ – 05

ఇంత దారుణాలు జరుగుతున్నా ఆరెస్సెస్‌ ఖండించకపోవడమేమిటి అనే ప్రశ్న ఉదయిస్తోంది. వ్యాపమ్‌ స్కామ్‌ మాట ఎలా వున్నా  సమర్థుడైన చౌహాన్‌కు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే దాన్ని బిజెపి-ఆరెస్సెస్‌ ఘర్షణగా చూస్తారనే శంకతో ఆరెస్సెస్‌ మౌనంగా…

ఇంత దారుణాలు జరుగుతున్నా ఆరెస్సెస్‌ ఖండించకపోవడమేమిటి అనే ప్రశ్న ఉదయిస్తోంది. వ్యాపమ్‌ స్కామ్‌ మాట ఎలా వున్నా  సమర్థుడైన చౌహాన్‌కు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే దాన్ని బిజెపి-ఆరెస్సెస్‌ ఘర్షణగా చూస్తారనే శంకతో ఆరెస్సెస్‌ మౌనంగా వుందని కొందరు అంటారు. అబ్బే, అదేం కాదు, ఆరెస్సెస్‌ మూలాలనుంచి వచ్చిన అనేకులు దీనిలో నిందితులు కాబట్టి.. అని కొందరంటారు. అలా వచ్చినవారిలో ఒకరు సుధీర్‌ శర్మ. అతను 1990లో ఆరెస్సెస్‌ కు చెందిన సరస్వతీ శిశు మందిర్‌లో టీచరు. అతని తండ్రి డెయిరీ కార్పోరేషన్‌లో గుమాస్తాగా పనిచేస్తూ సాయంత్రాల్లో పాలు అమ్మేవాడు. ఈ రోజు సుధీర్‌ మైనింగ్‌, విద్య, మీడియాకు విస్తరించిన రూ.20 వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి. ఇదంతా పుష్కరకాలంలో సంపాదించినదే. 2003లో టెక్నాలజీ యూనివర్శిటీలో ఉద్యోగం మానేసి తన స్నేహితుడు, గనుల, ఉన్నత విద్య శాఖల మంత్రి అయిన లక్ష్మీకాంత్‌ శర్మ వద్ద ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీగా చేరిన దగ్గర్నుంచి కోట్లకు పడగెత్తాడు. వ్యాపమ్‌ స్కాముతో బాటు మైనింగ్‌ స్కాములో కూడా యిరుక్కున్న అతను యిప్పుడు  జైల్లో వున్నాడు. అతని రికార్డులు పరిశీలిస్తే అతను తన ఒకప్పటి బాస్‌లకు ఎంతెంత యిచ్చాడో లెక్క తెలుస్తోంది. ఆరెస్సెస్‌ సీనియర్‌ లీడర్లు సురేశ్‌ సోనీ, ప్రభాత్‌ ఝా, బిజెపి ఎంపీ అనిల్‌ దవే లకు ప్రయాణ ఖర్చులు, వసతి ఖర్చులు కింద లక్షలు లక్షలు ఖర్చయ్యాయి. 

ఇప్పుడు జైల్లో వున్న లక్ష్మీకాంత్‌ కూడా సోనీ శిష్యుడే. సోనీ, ఆరెస్సెస్‌ అధినేత దివంగత కెయస్‌ సుదర్శన్‌లు కొంతమంది అభ్యర్థులను సిఫార్సు చేశారని లక్ష్మీకాంత్‌ వద్ద ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీగా పనిచేసిన ఒ.పి.శుక్లా ఎస్‌టిఎఫ్‌కు చెప్పాడు. మిహిర్‌ కుమార్‌ అనే అభ్యర్థి తన ఒప్పుదలలో ''నేను సుదర్శన్‌జీ వద్ద స్టీవార్డ్‌గా పనిచేసేవాణ్ని. ఆయన చేత లక్ష్మీకాంత్‌కు ఫోన్‌ చేయించాను. తర్వాత సుదర్శన్‌గారు నన్ను పరీక్షలో వేటికైతే ఆన్సర్లు కచ్చితంగా తెలుసో అవి మాత్రమే రాయమని, తక్కినవి వదిలేయమని చెప్పారు. నేను అలాగే చేశాను. నేను ఖాళీగా వదిలేసినవి తర్వాత నినిపించారు.'' అన్నాడు. ఇవి పత్రికల్లో రాగానే యిదంతా రాజకీయ కుట్ర అని సోనీ నాగపూరు నుంచి ఒక ప్రకటన చేశారు. అవును, ఆరెస్సెస్‌ వాళ్లకు దీనితో సంబంధం లేదు అంటూ చౌహాన్‌ మరో ప్రకటన చేశారు. మధ్య ప్రదేశ్‌ పోలీసుల చేత కూడా యిప్పించారు. మిహిర్‌ కుమార్‌ బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నపుడు ఎస్‌టిఎఫ్‌ అభ్యంతర పెట్టలేదు. సోనీని ప్రశ్నించడానికి కూడా పిలవలేదు. 

జగదీశ్‌ దేవ్‌డా రవాణా మంత్రిగా వుండగా అనేకమంది లంచాలిచ్చి ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుళ్లగా ఉద్యోగాలు పొందారని, వారిలో కొందరు ముఖ్యమంత్రి భార్య సాధనకు లంచాలిచ్చారని కాంగ్రెస్‌ నాయకుడు కెకె మిశ్రా ఒక న్యూస్‌ కాన్ఫరెన్సులో ఆరోపించాడు. ఆమె మహారాష్ట్రకు చెందిన గోండియా జిల్లాకు చెందినవారు. ఆ అభ్యర్థులు ఆ ప్రాంతానికి చెందినవారట. వారి కోసమే ఏమో కానీ అస్మదీయులను చేర్చుకోవడానికి వ్యాపమ్‌ అనేక నిబంధనలను నీరు కార్చింది. మధ్యప్రదేశ్‌ డొమిసిల్‌ సర్టిఫికెట్టు అక్కరలేదని, పోలీసు వుద్యోగాల్లో కూడా ఎత్తు, బరువు వంటివి పట్టించుకోనక్కరలేదని రూల్సు మార్చేసింది. 2012లో 198 మందిని రిక్రూట్‌ చేసుకుంటామని నోటిఫికేషన్‌ యిచ్చినా ఫైనల్‌గా 332 మందిని చేర్చుకుంది. ఆ 17 మంది అభ్యర్థుల పేర్లు యిస్తూ ఆమె సుధీర్‌ శర్మకు పంపిన ఎస్సెమ్మెస్‌ను శర్మ బయట పెట్టారు. ముఖ్యమంత్రి సిబ్బంది కాల్‌ రికార్డును కూడా చూపించాడు. ఆ విషయంపై ప్రతిపక్షాలు నిలదీసినపుడు ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ పంకజ్‌ త్రివేది యిద్దరు ఆరెస్సెస్‌ సీనియర్‌ నాయకుల పేర్లు బయట చెప్పాడట. చౌహాన్‌ మిశ్రాపై పరువునష్టం దావా వేశారు. ఆ కేసులో పోలీసులు 50 మందిని అరెస్టు చేశారు. దేవ్‌డా పర్శనల్‌ అసిస్టెంటైన రాజేంద్ర గుర్జార్‌ తనే పోలీసులకు లొంగిపోయాడు. అయినా ఎస్‌టిఎఫ్‌ మంత్రి జోలికి వెళ్లలేదు, ముఖ్యమంత్రి భార్య జోలికి అసలే వెళ్లలేదు. 

వ్యాపమ్‌కు 2006 నుండి 2011 వరకు కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామ్స్‌గా  పనిచేసిన సుధీర్‌ సింగ్‌ భడోరియా కూడా పరారీలో వున్నట్టు ఎస్‌టిఎఫ్‌ చెప్తోంది. ఆయన కేంద్రమంత్రి నరేంద్ర సింగ్‌ తోమార్‌కు ఆప్తుడు. అతనే కాదు, వ్యాపమ్‌ అధికారులుగా పనిచేసిన నలుగురు ఐయేయస్‌ అధికారులను కూడా ఎస్‌టిఎఫ్‌ ప్రశ్నించలేదు. పంకజా త్రివేది తను రంజనా చౌధరి అనే ఐయేయస్‌ అధికారిణికి రూ.42 లక్షలు లంచం యిచ్చానని చెపితే ఎస్‌టిఎఫ్‌ ఆమెను 48 గంటల పాటు ప్రశ్నించి చివరకు అప్రూవర్‌గా మార్చుకుంది. ఉమా భారతి కూడా అనేకమంది అభ్యర్థుల పేర్లను లక్ష్మీకాంత్‌కు, శుక్లాకు సిఫారసు చేశారట. ఎక్సెల్‌ షీట్లలో ఆమె పేరు 17 చోట్ల కనబడిందని పేపర్లు రాశాయి. 2013 డిసెంబరులో పేపర్లలో యిది బయటకు వచ్చాక ఉమా భారతి భోపాల్‌ వచ్చి చౌహాన్‌ను కలిశారు. తర్వాత పోలీసు డిజి నందన్‌ పాండే ఆవిడ యింటికి వెళ్లి ఏమీ ప్రమాదం లేదని హామీ యిచ్చారట. ఆ తర్వాత ఆమె పేర్లను వాటిలోంచి తీసేశారని, చాలా డేటాను తొలగించారని ఎస్‌టిఎఫ్‌ కనుగొంది. ఉమా భారతి యిదంతా కుట్ర అనేస్తున్నారు. ఇవన్నీ యిప్పుడు సిబిఐ బయటకు లాగాలి.

దీనిలో చిన్న ఉపకథ ఏమిటంటే – వ్యాపం అంటేనే మిస్టరీ చావుల కథ అయిపోయింది. ఆ కథకు సరైన సెట్టింగు వుండాలంటే దెయ్యం పట్టిన కొంపలోనే విచారణ సాగాలని ఎంపీ ప్రభుత్వం అనుకున్నట్టుంది. 40 మంది సభ్యులున్న సిబిఐ తన ఆఫీసు నడపడానికి భోపాల్‌లో ప్రొఫెసర్‌ కాలనీలో  భూత్‌ బంగ్లాగా పేరు బడిన ఒక బంగళాను వారికి కేటాయించింది. 1949లో కట్టిన ఆ యింట్లో మొదట్లో ఇరిగేషన్‌ శాఖ చీఫ్‌ ఇంజనీరు, నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో పని చేసిన జడ్జి సుఖంగానే జీవించారు. కానీ పోనుపోను దాని మీద దయ్యాల కొంప ముద్ర పడింది. శివరాజ్‌ చౌహాన్‌ కాబినెట్‌లో మంత్రిగా చేసిన లక్ష్మణ్‌ సింగ్‌ గౌడ్‌ 2009 ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అప్పుడు దాన్ని జిల్లా పంచాయితీ శాఖకు కేటాయించారు. అయితే దాని సిఇఓ జ్ఞానేశ్వర్‌ పాటిల్‌ ఒక అసహ్యకరమైన ఆరోపణలో యిరుక్కున్నాడు. ఆఫీసు బాత్‌రూమ్‌లో పాటిల్‌ తనను బలాత్కరించాడని అతని వద్ద పనిచేసే మగ సెక్రటరీ ఆరోపించాడు. దానితో కలకలం చెలరేగి చివరకు ఆ శాఖ ఉద్యోగులు అక్కడ పనిచేయమని మొండికేయడంతో మొత్తం శాఖను వేరే చోటకి మార్చేసి అనురాధా శంకర్‌ అనే సీనియర్‌ ఐపియస్‌ అధికారికి యిచ్చారు. ఆమె కూడా రెండు నెలల తర్వాత కారణాలు ఏమీ చెప్పకుండా యిల్లు మారిపోయింది. ఎవరూ వద్దంటున్నారని ఇంటిలిజెన్సు బ్యూరో స్థానిక ఆఫీసుకి యిచ్చారు. అయితే వాళ్లు 'ఖాళీ స్థలంలో గడ్డి పెరిగింది, బాగు చేయించాలి' అంటూ నెలన్నరగా తాత్సారం చేస్తున్నారు. ఇప్పుడు సిబిఐకు యిచ్చేశారు. వాళ్లు వాస్తు సిద్ధాంతులను పిలుచుకుని వచ్చి చూపించుకుని చేరతారట. సిబిఐకు ఏరికోరి యిలాటి భవంతి యివ్వడమేమిటి?  కేసు సరిగ్గా హ్యేండిల్‌ చేయలేదేమని రేపు కోర్టు వాళ్లు అడిగినపుడు సిబిఐ వారు 'ఫైళ్లు మాయమయ్యాయి, దెయ్యాలు ఎత్తుకుపోయాయి. సాక్షులను పిలిచాం, కానీ వాళ్లు చచ్చి దెయ్యాలైన వారు చుట్టూ తిరగాడుతున్నారనే సాకు చెప్పి నోరు విప్పలేదు.' అని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా సాక్షులను, నిందితులను లేపేస్తున్న ప్రచ్ఛన్న హస్తం, రేపు సిబిఐ మనుష్యుల్ని చంపేసి, ఆ పాపాన్ని దెయ్యాల మీదకు తోసేయవచ్చు. 

ముక్తాయింపుగా – కొందరు జర్నలిస్టులు జైల్లో వున్న లక్ష్మీకాంత్‌ను కలిసినపుడు అతను ''ఒక వ్యక్తి తన క్లీన్‌ యిమేజిని కాపాడుకోవడానికి మా అందర్నీ బలి యిస్తున్నాడని మోదీ గారికి చెప్పండి'' అని ప్రాధేయపడ్డాడు. ఆ వ్యక్తి చౌహాన్‌ అనుకోవచ్చా? సిబిఐ విచారణ సవ్యంగా సాగి, చౌహాన్‌ దోషిగా తిరుగులేని సాక్ష్యాలతో నిరూపించగలిగితే అది మోదీకి రాజకీయంగా లాభం. గుజరాత్‌లో మూడుసార్లు వరుసగా గెలిచిన ఘనత మోదీదైతే రాజస్థాన్‌లో అదే అలాటి ఘనతను సాధించినది చౌహాన్‌. చౌహాన్‌ మధ్య ప్రదేశ్‌ను ప్రగతి బాట పట్టించిన ముఖ్యమంత్రి అని అందరూ ఒప్పుకుంటారు. 2004-05, 2011-12 ల మధ్య దేశంలో జిడిపి వృద్ధి 8.4% కాగా స్టేట్‌ జిడిపిలో వృద్ధి 8.7% ! తలసరి ఆదాయం 2005-06లో రూ.15466 వుండగా 2014-15కు అది రూ.59770 చేరుతుందని అంచనా. గ్రామీణ పేదరికం 2004-05లో 53.6% వుండగా 2011-12 నాటికి అది 36% అయింది. శిశుమరణాలు 2005-06లో 7% కాగా 2011-12 నాటికి అది 5.6% అయింది. 2007 అక్టోబరులో రాష్ట్రంలో విద్యుదుత్పాదన 9458 మెగా వాట్లు కాగా2013-14లో 19869 అయింది. వ్యవసాయాభివృద్ధి 2011-12లో 19%, 2012-13లో 20%, 2013-14లో 25%. ఇవాళ కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు మోదీకి ప్రత్యామ్నాయంగా ఎదిగే స్కోపు వున్నవాడు. ఈ స్కాముతో   అతని మంచి పేరు తుడిచిపెట్టుకుపోయి హరియాణాలో చౌటాలా లాగ జైలుకి వెళితే బిజెపిలో మోదీ మరింత బలపడతాడు. – (సమాప్తం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2015)

[email protected]

Click Here For Archives