నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని అందరూ అంటుంటారు. రాజకీయ నాయకులు కూడా ఈ అక్షర సత్యాన్ని అన్నివేళలా గుర్తుంచుకోవాలి. ఈ సత్యం నేర్పే పాఠం బోధపడకుండా, నోటి దూకుడుతో మాట్లాడితే చేటు తప్పదు! నోటిమీద అదుపు లేనప్పుడు కటకటాలు కూడా లెక్కించాల్సిన దుస్థితి దాపురిస్తుంది.
ప్రస్తుతానికి తనకు పడిన జైలు శిక్ష హోల్డ్ లో ఉండడం వలన బయటి ప్రపంచంలో తిరగ గలుగుతున్నారు గాని, లేకపోతే రాహుల్ గాంధీ ఈసరికి జైలులో ఉండాలి! ఇప్పుడు రాహుల్ వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను పోల్చి చూసినప్పుడు.. జనసేనాని పవన్ కళ్యాణ్ కు కూడా అదే గతి పడుతుందని అనిపిస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించే అత్యుత్సాహంలో రాహుల్ గాంధీ రెచ్చిపోయి మాట్లాడుతూ.. మోడీ అనే ఇంటి పేరు ఉన్న వారందరూ కూడా మనస్థాపానికి గురయ్యేలా వ్యాఖ్యలు చేశారు. ఆ ఇంటి పేరు ఉన్న ఒక వ్యక్తి సూరత్ కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ దావా వేయడంతో రాహుల్ గాంధీకి రెండు సంవత్సరాల జైలు శిక్ష పడిన సంగతి అందరికీ తెలిసిందే! ఆ దెబ్బకు ఆయన ఎంపీ పదవి కూడా అర్థంతరంగా ఊడిపోయింది.
అదే క్రమంలో ఎంపీగా ప్రభుత్వ క్వార్టర్ కూడా ఖాళీ చేయాల్సి వచ్చింది. గుజరాత్ హైకోర్టును ఆశ్రయిస్తే ఊరట దక్కలేదు. ఇప్పుడు సుప్రీం ఎదుటకు అప్పీలు చేసుకుని జైలుకు వెళ్లాల్సిందేనా? తప్పించుకునే అదృష్టం ఉందా? అని ఆయన ఎదురు చూస్తున్నారు!
ఏపీలో పవన్ కళ్యాణ్ వ్యవహారానికి దీనికి చాలా పోలికలు ఉన్నాయి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డిని నిందించాలనే ఆరాటంలో, అత్యుత్సాహంతో వాలంటీరు వ్యవస్థ మీద చాలా నీచమైన వ్యాఖ్యలు చేశారు.
వాలంటీర్లు మహిళల అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు. దీనిమీద పెద్ద రాద్ధాంతమే జరుగుతోంది. ప్రభుత్వం కూడా పవన్ మీద చర్య తీసుకోవడానికి నోటీసులు ఇచ్చి వివరణ తెలుసుకోవడానికి ఆదేశించింది. ఇదిలా ఉండగా ఒక మహిళా వాలంటీర్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తనకు చాలా బాధ కలిగించాయని ఆరోపిస్తూ క్రిమినల్ డిఫమేషన్ చేయడం జరిగింది.
విజయవాడ సిటీ సివిల్ కోర్టులో వేసిన ఈ దావాలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తనకు మానసికంగా ఎంతో బాధ కలిగించాయని, ఎలాంటి ఆధారాలు లేకుండా పవన్ కళ్యాణ్ వాలంటీర్ల మీద అనుచితమైన అసభ్యమైన ఆరోపణలు చేశారని పిటిషన్ లో మహిళా వాలంటీరు ఆరోపించారు.
అచ్చంగా ఇది రాహుల్ మీద నమోదైన కేసు లాగానే కనిపిస్తుంది. ఎవరో ఒక మోడీ కేసు వేయడం వలన రాహుల్ కు జైలు శిక్ష పడింది. ఇప్పుడు అదే మాదిరిగా ఎవరో ఒక మహిళా వాలంటీర్ కేసు వేయడం వలన పవన్ కళ్యాణ్ కూడా అదే రకమైన విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆయనకు కూడా కనీసం రెండేళ్ల జైలు శిక్ష పడవచ్చునని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అదే జరిగితే గనుక ఈ ఎన్నికల్లో గెలిచి ఏకంగా ముఖ్యమంత్రి అయిపోతానని ప్రతిజ్ఞలు పలుకుతున్న పవన్ కళ్యాణ్ జైల్లో కూర్చోవడంతో పాటు మరో ఆరేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా కోల్పోతారు.