రాజధాని ప్రాంతంలో నిరుపేదల ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎట్టకేలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెంకటపాలెంలో నిర్వహించిన బహిరంగ సభలో రాజధానిపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంత కాలం రాజధాని కేవలం చంద్రబాబు సొంత సామాజిక వర్గానికే పరిమితమైందని విమర్శిస్తూ వచ్చిన జగన్, ఇప్పుడు దాన్ని పూర్తిగా మార్చేసినట్టు తెలిపారు.
“పేద వర్గాలపై పెత్తందారుల దోపిడీలను సహించి భరించే కాలం పోయింది. ఈ మార్పు ఇక మీదట రాజకీయాలను శాసిస్తుంది. అలాంటి మార్పులకు మనసా వాచా కర్మణా సహకరించే ప్రభుత్వంగా, మీ అన్నగా … నిరుపేద అక్కచెల్లెమ్మల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనతో సామాజిక అమరావతికి పునాదిరాయి వేస్తున్నా. ఇక నుంచి అమరావతి మనందరిది” అని జగన్ అన్నారు.
సామాజిక అమరావతికి పునాది రాయి వేస్తున్నా, ఇక నుంచి రాజధాని మనందరిది అని జగన్ చెప్పిన మాటల వెనుక మర్మం ఏంటనే కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజధాని అమరావతిలో తనకంటూ బలమైన వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా, పట్టు సాధించానన్న ధీమా జగన్‌లో కనిపిస్తోందా? పరిపాలన రాజధాని కూడా యధావిధిగా కొనసాగనిస్తారా? అనే చర్చకు తెరలేచింది.
మూడు రాజధానులపై ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే త్వరగా విచారణ జరపాలన్న జగన్ సర్కార్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పిటిషన్‌దారులందరికీ నోటీసులు పంపాలంటూ ఏకంగా డిసెంబర్‌కు కేసు విచారణను వాయిదా వేసింది. దీంతో ఇప్పట్లో మూడు రాజధానులపై ముందడుగు పడే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో తమ రాజధానిని లేకుండా చేశారనే ఆగ్రహాన్ని అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో తగ్గించడంతో పాటు నిరుపేదలకు నివాస సముదాల ఏర్పాటుతో బలాన్ని పెంచుకుంటున్నారని చెప్పొచ్చు.
దీంతో అమరావతి రాజధాని మనందరిదీ అనే నినాదాన్ని జగన్ భుజానకెత్తుకున్నారు. జగన్ ఒక మాట అన్నారంటే దాని వెనుక ఏదో వ్యూహం వుంటుంది. ఆ మాటల పర్యవసానం నెమ్మదిగా తెలుస్తుంది. బహుశా అమరావతి ఇక సామాజిక రాజధానిగా ఆయన అన్న మాటల వెనుక లోతైన అర్థం వుందని అంటున్నారు.
ఒకవేళ సర్వోన్నత న్యాయస్థానంలో మూడు రాజధానులపై తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినా, నష్టనివారణకు వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.