ఎమ్బీయస్‌: లలిత్‌ మోదీ గాథ- 3

బిసిసిఐను అప్రతిహతంగా ఏలుతున్న శ్రీనివాసన్‌కు, లలిత్‌కు పేచీ వచ్చింది. బిసిసిఐ ఎన్నడూ చూడనంత ఆదాయం సమకూరుస్తున్నానన్న అహంకారంతో లలిత్‌ అందరినీ అవమానించడంతో, ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌తో కూడా పొగరుగా వుండడంతో బిసిసిఐ కమిటీ సభ్యులకు…

బిసిసిఐను అప్రతిహతంగా ఏలుతున్న శ్రీనివాసన్‌కు, లలిత్‌కు పేచీ వచ్చింది. బిసిసిఐ ఎన్నడూ చూడనంత ఆదాయం సమకూరుస్తున్నానన్న అహంకారంతో లలిత్‌ అందరినీ అవమానించడంతో, ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌తో కూడా పొగరుగా వుండడంతో బిసిసిఐ కమిటీ సభ్యులకు ఒళ్లు మండింది. అతని దోషాల కోసం వెతికారు. ఐపియల్‌ బిసిసిఐకు అనుబంధంగానే పనిచేస్తున్నా, దాన్ని అడక్కుండా లలిత్‌ ఐపియల్‌ రూల్సు మార్చివేయసాగాడు. 100 మిలియన్‌ డాలర్ల గ్యారంటీ యివ్వగలిగిన వారే టెండర్లు వేయాలని రూలు పెట్టి, యితరులందరినీ తరిమివేసి అడానీ గ్రూపుకు, వీడియోకాన్‌ గ్రూపుకు టెండర్లు దక్కాక ఆ రూలు మార్చేసి 10 మిలియన్‌ డాలర్ల గ్యారంటీ యిస్తే చాలన్నాడు.  కేరళలోని కోచి టస్కర్స్‌ ఫ్రాంచైజ్‌ను ఐపియల్‌లో చేర్చడానికి శశి థరూర్‌ ప్రయత్నించాడు. తనకు అందులో పెట్టుబడలు లేవని లలిత్‌కు చెప్పాడు. 2010 ఏప్రిల్‌లో బిసిసిఐ-కోచి ఫ్రాంచైజ్‌ ఒప్పందం జరిగాక స్వెట్‌ యీక్విటీ హోల్డర్‌ ఎవరిదని లలిత్‌ అడిగితే వాళ్లు నసిగారు. అప్పుడు థరూర్‌ ఫోన్‌ చేసి దాని గురించి మరీ గట్టిగా అడగవద్దని కోరాడు. దాంతో లలిత్‌కు అనుమానం వచ్చి విచారిస్తే శశికి అప్పటి ప్రియురాలైన సునంద పుష్కరే హోల్డర్‌ అని తెలిసింది. దాన్ని ట్వీట్‌ చేసి లోకానికి చెప్పేశాడు. అంటే ఫ్రాంచైజ్‌ భాగస్వాములు తమకు ఒప్పందం కుదిర్చిపెట్టినందుకు శశికి చెల్లించుకున్న ముడుపును అలా సునందకు వాటాలుగా చూపించారన్నమాట. ఇది బయటకు రావడంతో శశి రాజీనామా చేయవలసి వచ్చింది. కోచీ ఫ్రాంచైజ్‌ వారు లలిత్‌కు వ్యతిరేకంగా బిసిసిఐకు ఫిర్యాదు చేశారు. 

అతనికి ముకుతాడు ఎలా వేయాలా అని చూస్తున్న బిసిసిఐకు యిది అక్కరకు వచ్చింది. 22 అభియోగాలు చేసి అతన్ని సస్పెండ్‌ చేశారు. 2010లో మూడో ఐపియల్‌ ఏప్రిల్‌ 24 న ముగిసింది. ఏప్రిల్‌ 21, 22 న ఇడి-ఇన్‌కమ్‌ టాక్స్‌ వాళ్లు ప్రశ్నించడం మొదలుపెట్టారు. మే 12 న దేశం విడిచి పారిపోయాడు. ఎంత పిలిచినా రాలేదు. 10 నెలల తర్వాత 2011 మార్చి 3 న అతని పాస్‌పోర్టును రద్దు చేశారు. 2013 మేలో చిదంబరం మోదీని తిప్పి పంపమని బ్రిటిషు ఛాన్సలర్‌కు రాసినా వాళ్లు పట్టించుకోలేదు. 2013 సెప్టెంబరులో  బిజెపికి చెందిన అరుణ్‌ జైట్లే, కాంగ్రెసు నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలోని బిసిసిఐ క్రమశిక్షణా సంఘం 8 కేసుల్లో మోదీని తప్పుపట్టింది. 

ఇడి లలిత్‌పై నాలుగు కేసులు మోపింది. 1) 2009లో ఐపియల్‌ను సౌత్‌ ఆఫ్రికాలో నిర్వహించినపుడు రూ.1350 కోట్లు విదేశాలకు బదిలీ చేసినపుడు రిజర్వ్‌ బ్యాంకు అనుమతి తీసుకోలేదు. అక్కడ టిక్కెట్ల అమ్మకం ద్వారా సంపాదించిన ఫారిన్‌ ఎక్స్‌ఛేంజిని ఏడాది లోపుగా వెనక్కి దేశంలోకి తేలేదు. అనుమతి తీసుకోమని లలిత్‌కు చెప్పామని బిసిసిఐ అంటోంది. అతను అదేమి పట్టించుకోకుండా సౌత్‌ ఆఫ్రికా క్రికెట్‌ అసోసియేషన్‌కు  బదిలీ చేశాడు. 2) ఐపియల్‌ టెలికాస్ట్‌ హక్కులను సోనీ అనుబంధ సంస్థ అయిన మల్టీ స్క్రీన్‌ మీడియాకు యిచ్చి వున్నారు. కానీ ఐపియల్‌ కమిషనర్‌ హోదాలో లలిత్‌ ఆ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసి 2009 మార్చి 15 న మారిషస్‌కు చెందిన వరల్డ్‌ స్పోర్ట్‌స్‌ గ్రూపుకు యిచ్చేశాడు. కానీ ఆ గ్రూపు సబ్‌ కాంట్రాక్టులను తెచ్చుకోలేక పోయింది. రూ.335 కోట్ల బ్యాంకు గ్యారంటీ కూడా యివ్వలేకపోయింది. అప్పుడు లలిత్‌ సోనీతో మాట్లాడి, వారం రోజుల్లో వాళ్లిద్దరి మధ్య ఒప్పందం కుదిర్చాడు. సోనీయే టెలికాస్ట్‌ చేస్తుంది కానీ స్పోర్ట్‌స్‌ గ్రూపుకు రూ.425 కోట్లు 'ఫెసిలిటేషన్‌ ఫీ'గా యిస్తానంది. ఇదంతా గోల్‌మాల్‌ వ్యవహారంలా తోచింది ఇడికి. 3) 2008 ఐపియల్‌ గేమ్స్‌లో ఆటగాళ్లకై సమకూర్చవలసిన గ్యారంటీగా రూ.160 కోట్ల చెల్లింపుకై రిజర్వ్‌ బ్యాంకు అనుమతులు తీసుకోకపోవడం. 4) విదేశాలలో టెండరింగ్‌, సెక్యూరిటీ, మీడియా కాంపెయిన్‌కై విదేశీ కన్సల్టెంట్లకు యిచ్చిన రూ.88.5 కోట్ల చెల్లింపు విషయాల్లో రిజర్వ్‌ బ్యాంకు అనుమతులు తీసుకోకపోవడం. మొత్తం రూ.1975 కోట్లకు సంబంధించిన కేసులు. ఇడి 2013-2015 మధ్య 15 షోకాజ్‌ నోటీసులు పంపింది. లలిత్‌ ఒక్కదానికీ సమాధానం యివ్వలేదు. ఇది కాకుండా రూ.1206 కోట్ల మనీ లాండరింగ్‌ చేశాడని శ్రీనివాసన్‌ అతనిపై ఫిర్యాదు చేశాడు.  

లండన్‌ పారిపోయిన లలిత్‌ అక్కడ ఐదంతస్తుల, 7000 చ.అ., 8 బెడ్‌రూముల భవంతిలో వుంటున్నాడు. 2010-14 మధ్య మోదీ తన భార్య పిల్లలతో బ్రిటన్‌లోనే వుండిపోయాడు. క్రికెట్‌ మ్యాచ్‌లో చూడడం మానేశాడు కానీ యితర ఆటలు చూడడానికి వెళ్లేవాడు. 2013 అసెంబ్లీ ఎన్నికల నాటికి లలిత్‌ వసుంధరకు వ్యతిరేకంగా ట్వీట్లు రాయసాగాడు. వసుంధర, అరుణ్‌ జైట్లే, జైట్లే అనుచరుడు, మోదీకి, ఆరెస్సెస్‌కు మధ్య వారధిగా పని చేసే భూపేంద్ర యాదవ్‌లో టిక్కెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించాడు. 2013 డిసెంబరులో రాజస్థాన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఎన్నికలు జరిగాయి. లలిత్‌ లండన్‌ నుంచే పోటీ చేశాడు. కిశోర్‌ రుంగ్‌టా, బిసిసిఐ సుప్రీం కోర్టుకి వెళ్లడంతో ఫలితాలు 6 సార్లు వాయిదా పడ్డాయి. చివరకు 2014 మే 6 న లలిత్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. బిసిసిఐ ఆర్‌సిఎను బహిష్కరించి ఒక తాత్కాలిక కమిటీని నియమించింది. లలిత్‌ కోర్టుకి వెళ్లి మళ్లీ అధ్యక్షుడయ్యాడు. 2015 మార్చిలో అమీన్‌ పఠాన్‌ అతనిపై అవిశ్వాస తీర్మానం పెట్టి 16 ఓట్ల తేడాతో నెగ్గాడు. మోదీ సమర్థకుల్లో 12 మందిని ఆలస్యంగా వచ్చారంటూ యీ సమావేశానికి రానీయలేదు. (దారిలో వాళ్ల వాహనాలు ఆపేసి, వాళ్లను చావగొట్టారు) ఓట్లేసిన వారిలో అతనికి అనుకూలంగా పడిన 5 ఓట్లు పరిగణించలేదు. ఈ వ్యవహారంలో వసుంధర తనకు సాయం చేయలేదని లలిత్‌ ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఆమె తనకు సహాయం చేసిందంటూ ట్వీట్లు పెట్టి యిరకాటంలో పెట్టాడు. (సశేషం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2015)

[email protected]

Click Here For Archives