ఏంటి…ఆమెకు ప‌వ‌న్ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌లేదా?

“జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాకు మిత్రుడే. మేమిద్ద‌రం రానున్న ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేస్తాం. ప‌వ‌న్‌కు ఫోన్ చేశాను. అపాయింట్‌మెంట్ ఇవ్వ‌గానే వెళ్లి క‌లుస్తాను” అని ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు పురందేశ్వ‌రి బాధ్య‌త‌లు తీసుకున్న సంద‌ర్భంలో…

“జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాకు మిత్రుడే. మేమిద్ద‌రం రానున్న ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేస్తాం. ప‌వ‌న్‌కు ఫోన్ చేశాను. అపాయింట్‌మెంట్ ఇవ్వ‌గానే వెళ్లి క‌లుస్తాను” అని ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు పురందేశ్వ‌రి బాధ్య‌త‌లు తీసుకున్న సంద‌ర్భంలో అన్నారు. నూత‌న అధ్య‌క్షురాలిగా నియ‌మితులైన పురందేశ్వ‌రికి ప‌వ‌న్ శుభాకాంక్ష‌లు కూడా చెప్పారు. ఇంత వ‌ర‌కూ అంతా బాగుంది.

అయితే త‌న‌ను పురందేశ్వ‌రి క‌లిసేందుకు ప‌వ‌న్‌క‌ల్యాణ్ అపాయింట్‌మెంట్ ఇవ్వ‌లేదా? అంటే… ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ఎన్టీఆర్ త‌న‌య అయిన పురందేశ్వ‌రి అడిగితే అపాయింట్‌మెంట్ ఇవ్వ‌క‌పోవ‌డానికి త‌న ద‌త్త తండ్రి నుంచి ఇంకా గ్రీన్ సిగ్న‌ల్ ల‌భించ‌లేదేమో అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల ముంగిట పురందేశ్వ‌రి నియామ‌కం కొత్త చ‌ర్చ‌కు తెర‌లేచింది. క‌మ్మ‌-కాపు కాంబినేష‌న్ కోస‌మే బీజేపీ వ్యూహాత్మ‌కంగా పురందేశ్వ‌రికి నాయ‌క‌త్వ బాధ్య‌త‌లు అప్ప‌గించింద‌నే చ‌ర్చ న‌డుస్తోంది.

అయితే త‌న తండ్రి స్థాపించిన టీడీపీని దెబ్బ తీయ‌డానికి పురందేశ్వ‌రి ప‌ని చేస్తారా? అనే అనుమానం బీజేపీ నేత‌ల్లో వుంది. టీడీపీ, జ‌న‌సేన‌ల‌ను క‌లుపుకుని వెళ్లేందుకే ఆమె ప్ర‌య‌త్నిస్తార‌ని చెబుతున్నారు. అప్పుడే త‌న‌కు కూడా రాజ‌కీయ భ‌విష్య‌త్ వుంటుంద‌ని పురందేశ్వ‌రి భావిస్తున్నార‌ని స‌మాచారం. 

ఏపీ బీజేపీ నూత‌న అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన మొద‌లుకుని వైసీపీ ప్ర‌భుత్వంపై ఆమె విరుచుకుప‌డుతున్నారు. ఇంత వ‌ర‌కూ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీపై ఒక్క‌టంటే ఒక్క విమ‌ర్శ కూడా చేయ‌లేదు.

పురందేశ్వ‌రి భ‌విష్య‌త్ అడుగుల‌ను గ‌మ‌నించి, ఆ త‌ర్వాతే క‌లిసి ప‌ని చేయాల‌ని ప‌వ‌న్ ఆలోచిస్తున్నారా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. ప‌వ‌న్ ఢిల్లీ వెళ్లి వ‌చ్చిన త‌ర్వాత ఆయ‌న‌లో మార్పు క‌నిపిస్తోంది. ఏపీలో ఎన్డీఏ స‌ర్కార్ వ‌స్తుంద‌ని చెబుతున్నారు. అయితే ఏపీ బీజేపీ నేత‌ల‌తో ఇంకా ఆయ‌న క‌లిసి ప‌ని చేయ‌డం లేదు. పైగా పురందేశ్వ‌రి ఫోన్ చేసి అడిగినా ఇంకా క‌ల‌వ‌డానికి ఆయ‌న ముందుకు రాక‌పోవ‌డం స‌రికొత్త చ‌ర్చ‌కు దారి తీసింది.