ఎమ్బీయస్‌ : యాంకరే న్యూస్‌ అయినవేళ….

''టైమ్స్‌నౌ'' టీవీ ఛానెల్‌లో రాత్రి 9 గంటలకు వచ్చే ''న్యూస్‌అవర్‌'' అత్యధికులు వీక్షించే కార్యక్రమం. మెచ్చుకుంటూనో, తిట్టుకుంటూనో అందరూ దాన్ని చూస్తూ వుంటారు తప్ప దాన్ని విస్మరించలేరు. దానికి ఆ కళ తెచ్చిన వ్యక్తి…

''టైమ్స్‌నౌ'' టీవీ ఛానెల్‌లో రాత్రి 9 గంటలకు వచ్చే ''న్యూస్‌అవర్‌'' అత్యధికులు వీక్షించే కార్యక్రమం. మెచ్చుకుంటూనో, తిట్టుకుంటూనో అందరూ దాన్ని చూస్తూ వుంటారు తప్ప దాన్ని విస్మరించలేరు. దానికి ఆ కళ తెచ్చిన వ్యక్తి దాని యాంకర్‌ లేదా హోస్ట్‌ అర్ణవ్‌(బ్‌) గోస్వామి.  అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి వచ్చినవారిపై అతను విరుచుకుపడి, నంచుకు తినేయడం చూసి ఆనందించడానికి చాలా మంది ఆ టైముకి టీవీ ఆన్‌ చేస్తారు. అది చూస్తే విజ్ఞానం మాట ఎలా వున్నా చూసేవాళ్లు ఉక్కిరిబిక్కిరై పోయేటంత వినోదం మాత్రం ఖాయం. ఎమోషన్స్‌, పంచ్‌ డైలాగ్స్‌, వెక్కిరింతలు, తర్జని చూపుతూ బెదిరించడాలు,  మెలోడ్రామా – దేనికీ లోటుండదు. ఆ ప్రోగ్రాం పేరులో మాత్రమే 'న్యూస్‌..' వుంది. అక్కడ వుండేది న్యూస్‌ కాదు, వ్యూస్‌ మాత్రమే, అవీ అర్ణవ్‌వి. అవి వ్యూస్‌ మాత్రమే కావు, అర్ణవ్‌ యిచ్చే తీర్పులు, ప్రతీ విషయంపై ముందే ఒక నిర్ధారణకు వచ్చేసి, తనకు అడ్డు వచ్చేవాళ్లను మాట్లాడనివ్వకుండా కసిరేసి, అరిచేసి, నిందలు మోపి, తన మాటలు వాళ్లన్నట్లుగా తీర్మానించేసి, తీర్పులిచ్చేసి, శిక్ష కూడా అప్పటికప్పుడు అమలు చేసేసే సర్కస్‌ షో అది. యాంకర్‌ అంటే ప్యానెలిస్టులందరి అభిప్రాయాలూ సేకరిస్తూ, వారి మధ్య సమన్వయం చేస్తూ, వారి నుండి సమాచారం సేకరిస్తూ వుంటాడు అనే భావంలో వుంటూన్న టీవీ ప్రేక్షకులకు యిలా శివతాండవం చేసే యాంకర్‌ ఒక ఎట్రాక్షన్‌ అయిపోయాడు. అదే సమయంలో అతను చర్చనీయాంశం కూడా అయిపోయాడు. అందుకే ''ఔట్‌లుక్‌'' అతనిపై కవర్‌ స్టోరీ వేసింది. ఇంతకీ ఎవరీ అర్ణవ్‌?

వాళ్లది అసాంలో న్యాయవాదుల కుటుంబం. పితామహుడు లాయరు, స్వాతంత్య్రయోధుడు, కాంగ్రెసు పక్షపాతి. మాతామహుడు గౌరీ శంకర్‌ భట్టాచార్య ప్రఖ్యాత రచయిత, అసాంలో ప్రతిపక్ష నాయకుడు. తండ్రి మనోరంజన్‌ కల్నల్‌గా పనిచేసి రిటైరయ్యాక బిజెపిలో చేరాడు. తండ్రి ఉద్యోగాల వలన అర్ణవ్‌ చాలా వూళ్లల్లో చదివాడు. ఢిల్లీలో గ్రాజువేషన్‌, ఆక్స్‌ఫర్డ్‌లో పోస్ట్‌ గ్రాజువేషన్‌ చేశాక 22 వ యేట 1995లో ఎన్‌డిటివిలో డైలీ న్యూస్‌కాస్ట్‌లకు యాంకర్‌గా చేశాడు. తర్వాత న్యూస్‌ ఎడిటరు అయ్యాడు. న్యూస్‌అవర్‌ కార్యక్రమాన్ని ఐదేళ్లపాటు 1998 నుండి 2003 వరకు హోస్ట్‌ చేశాడు. 26/11 ముంబయి దాడుల దగ్గర్నుంచి అనేక ముఖ్య సంఘటనలను లైవ్‌ కవరేజి చేసి పేరు తెచ్చుకున్నాడు. అనేక ఎవార్డులు కూడా తెచ్చుకున్నాడు. అతని తెలివితేటలను, విషయపరిజ్ఞానాన్ని ఎవరూ శంకించలేరు. 2006 నుండి టైమ్స్‌ ఆఫ్‌ ఇండియావారి టైమ్స్‌నౌ ఛానెల్‌కు ఎడిటర్‌ యిన్‌ చీఫ్‌గా పనిచేస్తున్నాడు. రాత్రి 9 గంటలకు వచ్చే ''న్యూస్‌అవర్‌'' కార్యక్రమాన్ని హోస్ట్‌ చేస్తున్నాడు. మనదేశంలోని హేమాహేమీలే కాదు, విదేశీ ప్రముఖుల్లో కొందరు కూడా అతని కార్యక్రమానికి అతిథులుగా వచ్చారు. 

ఇంత పాప్యులర్‌ అయిన కార్యక్రమంపై విమర్శలేల అంటే దాన్ని అర్ణవ్‌ మలచుకున్న తీరు. అతని దృష్టిలో అది ఒక కోర్టు, వచ్చినవారు ముద్దాయిలు. ఇతను ప్రాసిక్యూటరు, జడ్జి, జ్యూరీ, తలారి కూడా! గబగబా ఆరోపణలు చేసి, దానికి అవతలివాళ్లు సమాధానం యిచ్చేలోగానే 'నువ్వు ఏమీ చెప్పలేకపోయావ్‌, నువ్వు తప్పుచేశావని ఒప్పుకున్నావ్‌' అంటూ అరిచేసి కంగారు పెట్టేస్తాడు. ఎదుటివాళ్లు చెప్పేది వినడు. వింటే దానిలోంచి ఏదో ఒకటి సంబంధం లేకుండా లాగుతాడు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల సమయంలో 'కాంగ్రెసు పని అయిపోయింది, దుకాణం మూసేసుకోవచ్చు' అని యితను అంటే అతన్ని ఖండిస్తూ కాంగ్రెసు ప్రతినిథి 'కాంగ్రెసు ఫీనిక్స్‌లా మళ్లీ లేస్తుంది' అన్నారు. వెంటనే యితను 'అంటే రాహుల్‌ గాంధీ కాంగ్రెసును భస్మీపటలం చేశాడని నువ్వు అన్నావన్నమాట, అది రికార్డు చేస్తున్నాను. నిన్ను భవిష్యత్తులో అలా కోట్‌ చేస్తాను.' అంటూ తైతక్కలాడేశాడు. నేను చెప్పేదేమిటి? నువ్వు చెప్పేదేమిటి అని అడిగిందావిడ. 'ఫీనిక్స్‌ అంటే ఏమిటి? భస్మంలోంచి మళ్లీ పునరుజ్జీవం పొందేదే కదా, అంటే కాంగ్రెసు ప్రస్తుతం బూడిదై పోయిందన్న అర్థం దానిలో వుంది కదా, బూడిద చేసిందెవరు? రాహుల్‌ గాంధీ మీ నేత కాబట్టి అతనే! అందువలన రాహుల్‌ గాంధీ కాంగ్రెసును బూడిద చేసేశాడు అని నువ్వు అన్నావన్నమాట' అని అతను లాజిక్‌ లాగాడు. ఆమె మాత్రమే కాదు, వినేవాళ్లూ బిత్తరపోయారు. ఫీనిక్స్‌లా తిరిగిలేవడం అనేది ఒక ఉపమానం. ఎవరైనా ఉపయోగిస్తారు. పైగా రాహుల్‌ కాంగ్రెసు పార్టీ ఉపాధ్యకక్షుడు. పైన సోనియా ఒకామె వుంది. అర్ణవ్‌ రాహుల్‌ మీద ఒక రాయి వేద్దామనుకున్నాడు. వేసేశాడు. దానికి యీవిడను బలిపశువు చేసేశాడు. ఇలాటి చేష్టల వలననే అతని కార్యక్రమంలోంచి కొందరు విసుక్కుంటూ, అతన్ని తిట్టుకుంటూ బయటకు వెళ్లిపోతారు. మళ్లీ ఛస్తే రాం, నీకు రారరాం అంటూ లేఖలు కూడా రాశారు. 

మరి ప్రేక్షకులు ఎందుకు విరగబడి చూస్తున్నారు? అన్నదానికి కొందరు వివరణలు యిచ్చారు. ఏ విషయమైనా నలుపు, తెలుపుల్లో స్పష్టంగా ఎప్పుడూ తెలియదు. ప్రతీదానికీ పలుకోణాలు వుంటాయి. అందుకే టీవీ కార్యక్రమాల హోస్టులు విభిన్న దృక్పథాల వారిని కూర్చోబెట్టి అందరి అభిప్రాయాలను ప్రేక్షకుడికి సమపాళ్లల్లో తెలిసేట్లు చేస్తారు. ఏ అతిథికి అన్యాయం జరగకుండా వారి భావాలు చెప్పనివ్వడమే యాంకర్‌ కర్తవ్యం. అన్నీ విన్నతర్వాత ప్రేక్షకుడు తనంతట తాను ఆలోచించుకుని, వీటిలో ఎవరి దృక్కోణం సమంజసంగా వుందో ఒక అభిప్రాయం ఏర్పరచుకుంటాడు. ఒక్కోప్పుడు విభిన్న దృక్పథాలు నచ్చి అస్పష్టత కూడా ఏర్పడుతుంది. థాబ్దాలుగా ప్రణయ్‌ రాయ్‌ వంటి యాంకర్లు చేస్తూ వచ్చిన పనే యిది. అయితే పోనుపోను టీవీ ప్రేక్షకుడికి మేధోపరంగా బద్ధకం ఎక్కువై పోయింది. చిన్నపిల్లలు చూడండి, తెరమీద ఎవరైనా పాత్ర కనబడగానే తల్లినో, తండ్రినో 'వీడు మంచివాడా? చెడ్డవాడా?' అని అడిగేస్తూ వుంటారు. 'కొన్ని విధాల మంచివాడు, పరిస్థితుల బట్టి అప్పుడప్పుడు చెడ్డగా ప్రవర్తిస్తాడు' అని వివరణ యివ్వబోతే వాళ్ల తలకెక్కదు. అటోయిటో ఏదో ఒకటే చెప్పాలంతే. టీవీ ప్రేక్షకులూ అలా తయారవుతున్నారు. 'ప్రతీ వ్యక్తినీ కూలంకషంగా విశ్లేషించే ఓపిక మాకు లేదు, మంచివాడో చెడ్డవాడో నువ్వే చెప్పేయ్‌' అని అర్ణవ్‌కు ఆ బాధ్యత అప్పగించేశారు. అతను తను చెడ్డవాళ్లనుకున్నవాళ్లని చీల్చి చెండాడుతూంటే పాతకాలంలో క్రైస్తవులను సింహాలకు ఆహారంగా వేసినపుడు రోమన్లు ఎలా చప్పట్లు కొట్టారో అలా కొడుతున్నారు. అర్ణవ్‌ తన అభిప్రాయాలకు జాతీయవాదం కూడా జోడిస్తున్నాడు కాబట్టి అతనెంత పరుషమైన భాషను వుపయోగించినా వీళ్లకు ఎబ్బెట్టుగా తోచడం లేదు. అందుకే యిది న్యూస్‌ కాదు అంటున్నారు యీ రంగంలో చాలాకాలంగా వున్నవారు. కానీ అర్ణవ్‌ పొందుతున్న ప్రజాదరణ చూసి, అతన్ని అనుకరించేవారు పెరిగిపోతున్నారు. అందుకే అర్ణవ్‌ వార్తలు విశ్లేషించే స్థాయి నుండి ఎదిగి వార్తల్లో వ్యక్తి అయ్యాడు. 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మార్చి 2015)

[email protected]