సీట్లు అడగడం ఓకే.. గెలిచేవే కావాలనడం కామెడీ!

తెలంగాణ కాంగ్రెసు పార్టీ బోలెడు ఆశలతో ఇప్పుడు ఎన్నికలకు సన్నద్ధం అవుతోంది. ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్గగలం అనుకుంటోంది. అధికారంలోకి రాగలమనే కలల్లో ఉన్నారు. అందుకు సంబంధించి కసరత్తు చేస్తున్నారు. సాధారణంగా ముఠా…

తెలంగాణ కాంగ్రెసు పార్టీ బోలెడు ఆశలతో ఇప్పుడు ఎన్నికలకు సన్నద్ధం అవుతోంది. ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్గగలం అనుకుంటోంది. అధికారంలోకి రాగలమనే కలల్లో ఉన్నారు. అందుకు సంబంధించి కసరత్తు చేస్తున్నారు. సాధారణంగా ముఠా కక్షలకు నిలయమైన కాంగ్రెసు పార్టీలో ఈ దఫా కాస్త జాగ్రత్తగానే వ్యవహరిస్తున్నారు. వాటన్నింటినీ సర్దుబాటు చేసుకునే సమయానికి ఇప్పుడు.. బీసీల గొడవ ప్రారంభం అవుతున్నట్టుగా ఉంది.

ఎన్నికలకు సన్నాహక సమావేశం ఇటీవల నిర్వహించారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోనూ రెండేసీ అసెంబ్లీ స్థానాలను బీసీలకు కేటాయించాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. గత ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఉన్న మొత్తం 119 స్థానాల్లో కాంగ్రెస్ బీసీలకు కేవలం 28 స్థానాలు మాత్రమే కేటాయించింది. ఆ నెంబరుతో పోల్చినప్పుడు.. ఇప్పుడు వారికి ప్రాతినిధ్యం పెంచుతున్నట్టే లెక్క. కానీ కాంగ్రెసు బీసీల్లో అప్పుడే అసంతృప్తి స్వరం వినిపిస్తోంది.

ఒక్కో ఎంపీ స్థానానికి రెండుకాదు మూడేసి సెగ్మెంట్లను బీసీలకు ఇవ్వాలని అంటున్నారు. మొత్తం 119 లో 50 స్థానాలకు తగ్గేదే లేదని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో బీసీలు 56 శాతం ఉన్నారని, కనీసం 50 సీట్లు కేటాయించకుండా బీసీలను ఆకట్టుకోవడం కష్టం అనేది వారి వాదన. అదే సమయంలో.. కర్ణాటకలో కూడా బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే పార్టీ సునాయాసంగా అధికారంలోకి వచ్చిందని కూడా కొత్త పాట పాడుతున్నారు.

సీట్లకు సంబంధించిన డిమాండ్ ఎలా ఉన్నప్పటికీ.. వారి సరికొత్త డిమాండ్ కామెడీగా ధ్వనిస్తోంది. బీసీలకు 50 సీట్లు ఇవ్వాలని అడగడం మాత్రమే కాదు.. అన్నీ గెలిచేసీట్లనే ఇవ్వాలట. బీసీలకోసం ఇచ్చే సీట్లలో గెలిచే నాయకులు ఉంటేనే తీసుకోవాలి.. లేదా, గెలిచేలా వాళ్లు పరిస్థితులు తయారుచేసుకోవాలి గానీ.. పార్టీ గెలిచే సీట్లన్నీ బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ చాలా కామెడీగా ఉంది.

ఎందుకంటే.. ఒక పార్టీ ఒక చోట గెలుస్తున్నదంటే.. అది కేవలం పార్టీని చూసి వేసే ఓట్లు మాత్రమే కాదు. ఆయా నియోజకవర్గాల్లో కీలక నాయకుడి రెక్కల కష్టం కూడా దాని వెనుక ఉంటుంది. బీసీల డిమాండ్  ఎలా ధ్వనిస్తున్నదంటే.. ఎవరిదో కష్టం వలన పార్టీ బలపడిన నియోజకవర్గాల్లో ఇప్పుడు తాము పోటీచేసి నెగ్గతాం అని అంటున్నట్టుగా ఉంది.

మొత్తానికి కాంగ్రెసు పార్టీలో ఎన్నికలు ఇంకా దగ్గర పడుతున్న కొద్దీ, అభ్యర్థుల జాబితాలను ప్రకటించేదాకా.. ఇలాంటి చిన్న చిన్న తలనొప్పులు బోలెడు వస్తూనే ఉంటాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.