ప‌వ‌న్‌తో పొత్తు కుద‌ర‌క‌పోతే…టీడీపీ అంత‌ర్మ‌థ‌నం!

ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు 2024 ఎన్నిక‌లు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌వి. ముఖ్యంగా టీడీపీకి ఈ ఎన్నిక‌లు చావోరేవో అనేలా ఉన్నాయి. అందుకే ఏ చిన్న అవ‌కాశాన్ని కూడా జార‌విడుచుకోవ‌ద్ద‌ని టీడీపీ భావిస్తోంది. ముఖ్యంగా జ‌న‌సేన‌తో…

ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు 2024 ఎన్నిక‌లు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన‌వి. ముఖ్యంగా టీడీపీకి ఈ ఎన్నిక‌లు చావోరేవో అనేలా ఉన్నాయి. అందుకే ఏ చిన్న అవ‌కాశాన్ని కూడా జార‌విడుచుకోవ‌ద్ద‌ని టీడీపీ భావిస్తోంది. ముఖ్యంగా జ‌న‌సేన‌తో పొత్తు విష‌య‌మై ఆ పార్టీ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న‌ప‌డుతోంది. ఒకే ఒక్క‌సారి జ‌న‌సేనాని ప‌వ‌న్‌కు చంద్ర‌బాబు క‌న్ను గీటారు. ఆ త‌ర్వాత ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌దేప‌దే పొత్తుల‌పై మాట్లాడుతున్నారు.

ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు చీల‌నివ్వ‌న‌ని, దానికి తాను నాయ‌క‌త్వం వ‌హిస్తాన‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. దీంతో ఏపీలో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ మ‌ధ్య పొత్తు కుదురుతుంద‌నే ప్ర‌చారం ఊపందుకుంది. కానీ టీడీపీతో పొత్తు కుదుర్చుకోడానికి బీజేపీ ససేమిరా అంటోంది. ఇటీవ‌ల ఎన్డీఏ మిత్ర‌ప‌క్షాల స‌మావేశానికి టీడీపీకి ఆహ్వానం అంద‌లేదు. జ‌న‌సేనకు మాత్ర‌మే ఆహ్వానం అంద‌డం, ప‌వ‌న్‌క‌ల్యాణ్ వెళ్లి రావ‌డం జ‌రిగిపోయాయి.

ఢిల్లీ నుంచి ప‌వ‌న్ వ‌చ్చీ రాగానే ఏపీలో ఎన్డీఏ అధికారంలోకి వ‌స్తుంద‌ని ప్ర‌క‌టించ‌డంతో టీడీపీ ఆలోచ‌న‌లో ప‌డింది. టీడీపీతో సంబంధం లేకుండా బీజేపీ-జ‌న‌సేన కూట‌మి మాత్ర‌మే ఎన్నిక‌ల‌కు వెళుతుందా? అనే చ‌ర్చ తెర‌పైకి వ‌చ్చింది. ఒక‌వేళ ఇదే జరిగితే ఏపీలో మ‌రోసారి వైసీపీనే అధికారంలోకి వ‌స్తుంద‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. ప‌వ‌న్‌ను న‌మ్మ‌డానికి వీల్లేద‌ని అన్ని పార్టీల‌కు తెలుసు.

అలాంట‌ప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను తూర్పార‌ప‌డుతున్నార‌నే ఏకైక కార‌ణంతో ప‌వ‌న్‌కు విప‌రీత‌మైన ప్రాధాన్యం ఇవ్వ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్‌? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ప‌వ‌న్ వారాహి యాత్ర‌, ఆయ‌న ప్రెస్‌మీట్ల‌కు అధిక ప్రాధాన్యం ఇస్తుండ‌డంతో ఏపీలో జ‌గ‌న్ వ‌ర్సెస్ జ‌న‌సేనాని అనే ర‌కంగా సంకేతాలు వెళుతున్నాయి. చంద్ర‌బాబునాయుడు, నారా లోకేశ్ ఊసే లేకుండా పోయింది. ఇది టీడీపీకి రాజ‌కీయంగా న‌ష్టం క‌లిగిస్తుంద‌నే ఆందోళ‌న ఆ పార్టీ శ్రేణుల్లో నెల‌కుంది.

ప‌వ‌న్‌తో పొత్తు కుద‌ర‌క‌పోతే, ఆయ‌న‌కు ఇచ్చిన ప‌బ్లిసిటీ వ‌ల్ల చివ‌రికి టీడీపీకే న‌ష్టం వాటిల్లుతుంద‌నే భ‌యం ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీని వెంటాడుతోంది. ప‌వ‌న్‌తో పొత్తు విష‌య‌మై స్ప‌ష్ట‌త రాకుండానే, ఆయ‌న్ను భుజానెత్తుకుని మోయ‌డం అవ‌స‌ర‌మా? అనే అంత‌ర్మ‌థ‌నం టీడీపీలో జ‌రుగుతోంది. గౌర‌వ ప్ర‌ద‌మైన సీట్లు ఇస్తేనే టీడీపీతో పొత్తు వుంటుంద‌ని ప‌వ‌న్ అంటున్నారు. వారాహి యాత్ర‌తో ప‌వ‌న్‌లో కాన్ఫిడెన్స్ పెరిగింద‌ని, 50 సీట్ల‌కు త‌క్కువైతే ఆయ‌న ఒప్పుకునే ప‌రిస్థితి లేద‌ని జ‌న‌సేన నాయ‌కులు చెబుతున్నారు.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ భ‌విష్య‌త్‌లో ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో తెలియ‌కుండా, ఊరికే ఆయ‌న్ను వెన‌కేసుకు రావ‌డంపై టీడీపీ పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్టు స‌మాచారం. చంద్ర‌బాబును విమ‌ర్శించ‌నంత మాత్రాన రాజ‌కీయంగా వ‌చ్చే లాభం ఏమీ లేద‌నేది టీడీపీ భావ‌న‌. అంతిమంగా నామమాత్ర‌పు సీట్ల‌లో జ‌న‌సేన‌ను నిలిపి, సంపూర్ణ మద్ద‌తు ఇస్తేనే ప్ర‌యోజ‌నం వుంటుంద‌ని టీడీపీ నేత‌లు అంటున్నారు. దీంతో ప‌వ‌న్‌కు ఎల్లో మీడియాలో విస్తృత‌మైన క‌వ‌రేజ్‌పై కోత విధించే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.