మహా నగరం ఆకాశాన్ని అందుకునే బహుళ అంతస్తులు మెరిసిపోయే నిర్మాణాలు, వాటి మధ్య తిరుగుతూ ఉంటే అమెరికాలో ఉన్నామా? స్వర్గంలో ఉన్నామా? అన్న అనుభూతి కలుగుతుంది. స్వర్గం కనిపించే చోటే చిన్న వర్షానికి నరకం చూడాల్సిన పరిస్థితి ఎందుకు? స్వర్గం – పక్క పక్కనే ఉండటం ఏమిటి? ప్రస్తుతం హైదరాబాద్‌లో కురిసిన వర్షాలకు ట్రాఫిక్ అవస్థలు నరకానుభూతిని కలిగిస్తున్నాయి.
హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం ఏమిటి అన్న దానిపై చర్చ సాగుతోంది. అది హైదరాబాద్ సమస్య. కానీ హైదరాబాద్ లాంటి మహానగరం మాకూ కావాలని మోజు పడుతున్న ఆంద్రప్రదేశ్ ప్రజలు ఏమి నేర్చుకోవాలి? అలాంటి నగరం మనకు అవసరమా? మహానగరం లేకుండా హైదరాబాద్‌ను మించి అద్భుతాలు ఏపీలో చేయవచ్చు. కాకపోతే మహానగరం పైత్యం నుంచి బయటకు వస్తే కనపడుతుంది.
విభజన ఏపీకి తీవ్ర నష్టం చేసింది. అది ముగిసిన అధ్యాయం. విజ్ఞత కలిగిన సమాజం వాటి నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. మనకున్న స్వాభావిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మన నమూనాను రూపొందించుకోవాలి. కానీ అనుకరించకూడదు. అనుకరించడం మానవ బలహీనత. అందులోనూ ఏపీ అగ్రగామి. హైదరాబాద్ నమూనా రాష్టానికి అవసరమా? సాధ్యమా? రెండింటికీ సమాధానం అవసరం లేదు, సాధ్యం కాదు.
ఇప్పటికే విశాఖ, విజయవాడలో 25 లక్షల జనాభా దాటింది. గుంటూరు, కర్నూలు, నెల్లూరు, తిరుపతి 10 లక్షల వైపు వెళుతున్నాయి. మరో వైపు కాకినాడ, రాజమండ్రి, ఒంగోలు, కడప, హిందూపురం నగరాల స్వభావాన్ని కలిగి ఉన్నాయి. నిజానికి ఈ పరిస్థితులు అత్యంత అనుకూల వాతావరణం. సాధారణంగా రాష్ట్రంలో అభివృద్ధి ఒక చోట కేంద్రీకృతమై లేకుండా చేయడం పాలకుల బాధ్యత. కానీ అదృష్టవశాత్తు అలాంటి వాతావరణం ఏపీలో సహజసిద్ధంగా ఉండటం. పాలకుల పని దానికి ఆటంకం లేకుండా చూడటం. విజయవాడ- గుంటూరు, విశాఖ, తిరుపతి మూడు పెద్ద నగరాలుగా ఎలాగూ అభివృద్ధి చెందుతాయి. మిగిలిన నగరాలు అందుబాటులోకి వస్తాయి.
అంతర్జాతీయ అవకాశాలను…
ప్రధానంగా మహానగరం అనగానే ఉపాధి పెట్టుబడుల ఆకర్షణ ప్రధాన ఉద్దేశం. పారిశ్రామికంగా ఇప్పటికే విశాఖ అభివృద్ధి చెందింది. ప్రభుత్వం చేయాల్సింది విస్తరణ కాదు అంతర్గత అభివృద్ధి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై మహా నగరాలు ఏపీ చుట్టూ ఉండటం మనకు ప్రతికూలంగా ఉంటుంది. ఏ కొత్త అవకాశాలు వచ్చినా ఆ నగరాలు వైపు చూస్తారు. వరదలు వస్తే చెన్నై అతలాకుతలం నిన్నటి మాట. వర్షం వచ్చినా నరకమే అన్నది హైదరాబాద్‌ను చూసిన తర్వాత నేటి మాట. అలాంటి పరిస్థితుల్లో ఈ నగరాలకు అత్యంత సమీపంలో ఉన్న నగరాల వైపు ఎవరయినా చూస్తారు.
బెంగళూరు- హైదరాబాద్‌కు మధ్యలో ఉన్న కర్నూలు, బెంగళూరుకు కూత వేటు దూరంలో ఉన్న హిందూపురం – పుట్టపర్తి, చెన్నై అవకాశాలను అందిపుచ్చుకునే తిరుపతి నగరాలపై కొంత శ్రద్ద పెడితే అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోలేమా? ఈ నగరాలను ఆనుకుని లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నది. ప్రకృతి వైపరీత్యాలకు దూరం తిరుపతి, హిందూపురం. అయితే హైదరాబాద్‌లో వాతావరణ సమతుల్యత ఉంది. కానీ పాలకులు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మీద శ్రద్ద కన్నా, ఆచరణ సాధ్యం కాని, అవసరం లేని అద్భుతాలను సృష్టించడానికి మొగ్గు చూపుతున్నారు.
వర్షం కారణంగా హైదరాబాద్‌లో ఏర్పడిన ప్రతికూల అనుభావాలను దృష్టిలో పెట్టుకొని ఏపీ ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మహానగరాలుగా మారిన విశాఖ, విజయవాడ- గుంటూరులో విస్తరణకు స్వస్తి పలికి అంతర్గత అభివృద్ధిపై దృష్టి సారించాలి. తిరుపతి – నెల్లూరు మధ్య అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకునే వసతులు కల్పించాలి.
బెంగళూరు, హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉన్న కర్నూలు, హిందూపురం- పుట్టపర్తి లో వాటి అవకాశాలను అందిపుచ్చుకునే ఏర్పాట్లు చేయాలి. విశాఖకు అనుబంధంగా కాకినాడను అభివృద్ధి చేయాలి. పెద్ద వ్యయప్రయాసలతో పని లేకుండా మనసుతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటే హైదరాబాద్ లాంటి మహానగరం లేకుండానే ఏపిలో అద్భుతాలు చేయవచ్చు హైదరాబాద్ నగరంలోని కష్టాల నుంచి ఏపీ ప్రజలను దూరంగా ఉంచవచ్చు.
రాజధాని నుంచే అడుగులు వేయాలి
రాజధాని చుట్టూ పేర్లను పక్కన పెట్టి సాధారణ పరిపాలనకు అవసరం అయిన ఏర్పాట్లు ఒక నగరంలో చేపట్టాలి. సాధారణ రోజువారీ పాలనతో (పర్యవేక్షణ) సంబందం లేని పదుల సంఖ్యలోని కార్యాలయాలను రాష్ట్రంలోని వివిధ నగరాల్లో ఏర్పాటు చేయాలి. తద్వారా కేంద్రీకృతమైన అభివృద్ధిని నిరోధించొచ్చు. ఇదే సమయంలో అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకుంటూనే మహానగర కష్టాల నుంచి ఏపీ ప్రజలను శాశ్వతంగా దూరంగా ఉంచవచ్చు.
మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి. సమన్వయ కర్త, రాయలసీమ మేధావుల ఫోరం