ఎమ్బీయస్‌: తమిళ రాజకీయాలు- 59

వాళ్లిద్దరి మధ్య యీ యీక్వేషన్‌ ఎమ్జీయార్‌ అనుచరులకు కంపరంగా వుండేది. మామూలుగానే ఆడవాళ్లంటే చులకన. అందునా యీమె సినిమా నటి. ఎమ్జీయార్‌ వంటి సూపర్‌ హీరో యీమెను నెత్తికెక్కించుకోవడమేమిటి అని వాళ్లకు కోపం. ఎమ్జీయార్‌…

వాళ్లిద్దరి మధ్య యీ యీక్వేషన్‌ ఎమ్జీయార్‌ అనుచరులకు కంపరంగా వుండేది. మామూలుగానే ఆడవాళ్లంటే చులకన. అందునా యీమె సినిమా నటి. ఎమ్జీయార్‌ వంటి సూపర్‌ హీరో యీమెను నెత్తికెక్కించుకోవడమేమిటి అని వాళ్లకు కోపం. ఎమ్జీయార్‌ నిజజీవితంలో కూడా ఎంతో ఉత్తముడంటూ ఎన్నో ఏళ్లగా శ్రమించి, జాగ్రత్తగా బిల్డప్‌ చేసిన యిమేజిని యీమె ధ్వంసం చేస్తోందని మంట. వాళ్లేమనుకుంటున్నారో జయలలితకు తెలిసినా పట్టించుకునేది కాదు. పైగా వాళ్లను వుడికించడానికి తమ సాన్నిహిత్యాన్ని బహిరంగంగా ప్రదర్శించేది. ఆర్‌ ఎమ్‌ వీరప్పన్‌ ఒక జర్నలిస్టుకి చెప్పిన ప్రకారం – సత్యా స్టూడియోస్‌లో ఎమ్జీయార్‌ గదిలో ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశించేందుకు ఎవరూ సాహసించేవారు కారు. జయలలిత నిర్భయంగా తలుపు తట్టకుండానే లోపలకి వెళ్లిపోయేది. బయట నిర్మాతలు, దర్శకులు, రాజకీయనాయకులు గంటల తరబడి వేచి వుంటూంటే యీమె దర్జాగా వచ్చి లోపలకి వెళ్లేది. ఓ అరగంట సేపు వుండి వెళ్లేది, ఆమె వెళ్లిపోయిన మరో అరగంట వరకు ఎమ్జీయార్‌ బయటకు వచ్చేవాడు కాదు. లోపల ఏం జరిగిందో జనాలు వూహించేవారు. బయటకు వెళ్లి మాట్లాడేవారు. అది పేపర్లలో గాసిప్స్‌గా వచ్చేది. ఈ గాసిప్స్‌ను జయలలితే వ్యాపింపచేస్తోందని ఎమ్జీయార్‌ అనుచరులు ఆరోపించేవారు. తమ హీరోకు, జయలలితకు మధ్య బంధం విడగొట్టాలని చాలా ప్రయత్నించేవారు. సత్యా ఫిలిమ్స్‌ బ్యానర్‌ మీద ''రిక్షాకారన్‌'' (1971) సినిమా నిర్మిస్తూ ఆర్‌ఎమ్‌ వీరప్పన్‌ జయలలిత కంటె చిన్న వయసున్న హీరోయిన్‌ కోసం వెతికి ఐదేళ్లు చిన్నదైన మంజులను సెలక్టు చేశాడు. ఆమెతో ఐదేళ్ల కాంట్రాక్టు రాయించుకుని ఎమ్జీయార్‌ పక్కన ఆమెయే నటించేట్లా చూడబోయాడు. 

ఎమ్జీయార్‌ సొంత బ్యానర్‌లో ''ఉలగం సుట్రుమ్‌ వాలిబన్‌'' అనే భారీ బజెట్‌ సినిమా ప్లాను చేశాడు. జపాన్‌లో ఎక్పో 1970 ఎగ్జిబిషన్‌ జరిగితే దాన్ని తన సినిమాలో వాడుకుందామనుకుని ఫిల్మ్‌ యూనిట్‌ను జపాన్‌ తీసుకెళదామనుకున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్‌గా జయలలితను పెడదామనుకుంటే వీరప్పన్‌ అడ్డుపడ్డాడు. ఎందుకంటే అప్పటికే ''నవశక్తి'' అనే కాంగ్రెసు పేపర్లో వచ్చేసింది – సినిమా మిష పెట్టుకుని ఎమ్జీయార్‌ జయలలితను తీసుకుని దేశవిదేశాలు విహారయాత్రకు వెళుతున్నాడని. 'మీరు జయలలితతో ఊరేగబోతే షూటింగు, చట్టుబండలు ఏమీ వుండవు. మేమంతా షూటింగు స్పాటులో వెఱ్ఱిమొహాలు వేసుకుని కూర్చోవాలి.'' అని గట్టిగా వాదించాడు. అతని పోరు భరించలేక ఎమ్జీయార్‌ ఆమె స్థానంలో కొత్త హీరోయిన్‌ కోసం వెతకమన్నాడు. చివరకు లతను సెలక్టు చేశారు. ఆ విధంగా ఆ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు వున్నారు – చంద్రకళ, మంజుల, లత. జయలలితకు వేషం లేదు. ఇక తర్వాతి ఎమ్జీయార్‌ సినిమాల్లో లతను ప్రమోట్‌ చేశారు. ఇది 1973లో రిలీజైంది. రిక్షాకారన్‌ విడుదలయ్యాక ఎమ్జీయార్‌, జయలలిత నటించిన 5 సినిమాలు వచ్చాయి. అవి ముందే ప్లాన్‌ చేసినవి. 1973లో ఆఖరి సినిమా వచ్చింది. 1970 సంవత్సరంలో ఎమ్జీయార్‌ తన ప్రేయసికి, అనుచరులకు మధ్య ఎటు మొగ్గాలో తెలియక కొట్టుమిట్టులాడుతూ వ్యక్తిగతంగా చిక్కుల్లో వున్నాడు. ఇలాటి సమయంలో రాజకీయాల గురించి పట్టించుకునే తీరిక వుండదని, అతన్ని దెబ్బ కొట్టడానికి యిదే సరైన సమయమని కరుణానిధి లెక్క వేశాడు. 1971లో ఎన్నికల ప్రచారానికి రాకుండా చేద్దామనుకుని కుదరక, మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక ఎమ్జీయార్‌ను సినిమా ఆయుధంతోనే కొట్టాలనుకుని 1972లో ముక ముత్తును దింపాడు.

సినిమాతారలకు అభిమాన సంఘాలుండడం హాలీవుడ్‌లో చూడం. హిందీ రంగంలోనూ చూడం. బెంగాలీ, మరాఠీ, పంజాబీ రంగాల్లో కూడా కనబడదు. ఇది తమిళ రంగంలో ప్రారంభమై తెలుగు, కన్నడ రంగాలకు విస్తరించింది. కేరళలో కాస్త కాస్త వుంది కానీ అది చెప్పుకోదగ్గ స్థాయి కాదు. అందుకనే అక్కడి హీరోలు తమకు నచ్చిన పాత్రలు వేస్తూ వుంటారు, 'అభిమానులు ఒప్పుకోరు' వంటి సాకులు చెప్పరు. తమిళరంగంలో రాజకీయాలు, సినిమా పెనవేసుకుని పోయాయి కాబట్టి ఈ సంఘాలను స్టార్స్‌, రాజకీయనాయకులు కలిసి పోషించి పెద్ద చేశారు. 'రసిగర మన్ఱమ్‌' (రసజ్ఞుల సంఘం) పేరుతో వెలసిన యీ ఫ్యాన్‌ క్లబ్స్‌ అభిమాన నటుడి సినిమా రిలీజైనప్పుడు హంగు చేయడమే కాకుండా, అతని పేర జరిగే సాంఘిక కార్యకలాపాలన్నిటిలో పాలుపంచుకునేవారు. ఎమ్జీయార్‌ ఎవరికైనా సహాయం చేద్దామనుకుంటే – ఉదాహరణకు అతని ''రిక్షాకారన్‌'' సినిమా రిలీజైనప్పుడు రిక్షావాళ్లందరికీ 6 వేల రెయిన్‌కోట్లు పంచిపెట్టాడు – అది క్లబ్స్‌ ద్వారా నిర్వహించేవాడు. వాళ్లు ఒక వాలంటీరు ఫోర్సుగా పనిచేసేవారు. అగ్నిబాధితులకు, వరదబాధితులకు సాయపడడం, పౌరసమస్యలను అధికారుల దృష్టికి తేవడం యిలాటివి చేసేవారు. ఈ కార్యకలాపాలకై చందాలు వసూలు చేసేవారు. ఇది ఒక రకంగా గూండాలు వసూలు చేసే హఫ్తా లాటిది. కానీ మరీ అంత దారుణంగా కాకుండా, మెత్తగా అడిగి తీసుకునేవారు. ఎమ్జీయార్‌కు గ్రామగ్రామాన మొత్తం 15 వేల క్లబ్బులుండేవి, దానిలోని సభ్యుల సంఖ్య 18 లక్షలు.  మామూలు రోజుల్లో వీళ్లు డిఎంకె సభలకు పెద్దగా హాజరైనా కాకపోయినా ఎన్నికల సమయంలో డిఎంకెకు ఓట్లేసేవారు. ఎందుకంటే తమ అభిమాన నటుడు ఆ పార్టీ వాడు కాబట్టి! శివాజీకి కూడా క్లబ్స్‌ వుండేవి కానీ ఆ ఫ్యాన్సందరూ కాంగ్రెసుకు వేసేవారన్న దాఖలాలు లేవు. 

ఈ ఎమ్జీయార్‌ క్లబ్స్‌లో సభ్యులు నానాటికీ పెరుగుతూండడం చేత, పార్టీలో ఎమ్జీయార్‌ మాట చెలామణీ అవుతోందని, ఆ బలాన్ని తెగ్గొట్టాలని కరుణానిధి అనుకున్నాడు. ముత్తు హీరోగా వెలువడిన ''పిళ్లయో పిళ్లయ్‌'' (1972) అనే సినిమాకు తనే స్క్రిప్టు రాశాడు. భారీ స్థాయిలో తీసి జనాల మీదకు వదిలాడు. సినిమా రిలీజైన మర్నాటికే రాష్ట్రమంతా ముత్తు ఫ్యాన్‌ క్లబ్స్‌ వెలిశాయి. ఏ నటుడికైనా అంత ఫాలోయింగ్‌ యిన్‌స్టంట్‌గా రావడం అసంభవం. వీళ్లంతా కరుణానిధి వర్గానికి చెందిన డిఎంకె పార్టీ కార్యకర్తలని అర్థం చేసుకోవాలి. ముత్తు ఫ్యాన్‌ క్లబ్స్‌ వెలవడం తరువాయి, అవి ఎమ్జీయార్‌ ఫ్యాన్‌ క్లబ్స్‌తో బాహాబాహీ తలపడ్డాయి. ముత్తు అణువణువునా ఎమ్జీయార్‌ను అనుకరించాడని ఎమ్జీయార్‌ అభిమానులు మండిపడ్డారు. అది చాలనట్లు ముత్తు క్లబ్బు వాళ్లు ఎమ్జీయార్‌ క్లబ్బుల వద్దకు వచ్చి తమలో చేరితే డబ్బిస్తామని, చేరకపోతే పోలీసుల సాయంతో కేసులు పెట్టిస్తామని ఒత్తిడి చేశారు. వారికి పోలీసులు, అధికారులు అండగా నిలిచారు. దాంతో రెండు క్లబ్బుల మధ్య కొట్లాటలు జరిగాయి. ఈ కలహాల గురించి వార్తలు రాగానే కరుణానిధి పోలీసులను దింపి శాంతిభద్రతలు రక్షించలేదు. అన్ని గొడవలకూ మూలం ఫ్యాన్‌ క్లబ్సే కాబట్టి రాష్ట్రం మొత్తంగా ఏ నటుడికీ ఫ్యాన్‌ క్లబ్స్‌ వుండకూడదని చట్టం తెస్తామని, ముందుగా ముత్తు క్లబ్బులు మూసేయమని ఆదేశిస్తున్నాననీ ప్రకటించాడు. ఈ పేరుతో తన క్లబ్బులకు అస్తిత్వం లేకుండా చేస్తున్నారని, ఆ విధంగా తన మూలాలను దెబ్బకొట్టి రాజకీయంగా, వృత్తిపరంగా తనను బలహీనపరుస్తున్నారని ఎమ్జీయార్‌ గ్రహించాడు. నిజానికి ముత్తు సినిమా అట్టర్‌ ఫ్లాపయింది. జనాలు అతన్ని తిరస్కరించారు. అయినా రాత్రికి రాత్రి వేలాది క్లబ్బులు పుట్టుకుని వచ్చాయంటే యిదంతా రాజకీయవ్యూహం కాక మరేమిటి అని అందరూ గ్రహించారు. వెంటనే తిరగబడమని ఎమ్జీయార్‌ తన ్లబ్బులను ఆదేశించాడు. 800 క్లబ్బులు వీధుల్లోకి వచ్చి నిరసన ప్రదర్శనలు జరిపి, తాము డిఎంకె పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని నినాదాలు యిచ్చారు. కరుణానిధి తత్తరపడ్డాడు.

ఇదే అదనని ఎమ్జీయార్‌ కరుణానిధి సారథ్యంలో పార్టీ అవినీతిలో కూరుకుపోయిందని, మంత్రులు, శాసనసభ్యులు తమతమ ఆస్తులను వెంటనే ప్రకటించాలనీ ప్రకటించాడు. పార్టీ సేకరించిన నిధులేమయ్యాయో ప్రజలకు లెక్కలు చెప్పాలన్నాడు. 'నువ్వు కోశాధికారివి, ఆ లెక్కలేవో నువ్వే చెప్పాలి' అని కరుణానిధి అన్నాడు. అతని నేతృత్వంలో పార్టీ కార్యవర్గం సమావేశమై 'పార్టీ వ్యవహారాల గురించి బహిరంగంగా మాట్లాడినందుకు ఎమ్జీయార్‌ క్షమాపణ చెప్పాలి' అని తీర్మానించింది. కానీ ఎమ్జీయార్‌ క్షమాపణ చెప్పనన్నాడు. దాంతో 'నిన్ను పార్టీలోంచి బహిష్కరించాము' అని కార్యవర్గం ప్రకటించింది. 'క్రమశిక్షణారాహిత్యానికి  ఎమ్జీయార్‌ను పార్టీలోంచి తీసి అవతల పారేశాం' అని కరుణానిధి గర్వంగా ఒక మీటింగులో చెప్పాడు. తనను పార్టీలోంచి తీసివేయడంపై ఎమ్జీయార్‌ చాలా భయపడ్డాడని అతని ఆంతరంగికులు చెప్తారు. తన స్టార్‌ యిమేజి అంతా డిఎంకె వలననే వచ్చిందని, పార్టీ అండ లేకపోతే తన సినిమాలు కూడా ఆడవని అతను బెంగపడ్డాడట. ఎమ్జీయార్‌ను అతి సన్నిహితంగా తెలిసిన కరుణానిధి యిది వూహించే అంత ధైర్యంగా పార్టీలోంచి తీసిపారేశాడు. అయితే ఎమ్జీయార్‌ చుట్టు వున్న  సలహాదారులు అతనికి ధైర్యం నూరిపోశారు. సొంతంగా పార్టీ పెట్టు అని ప్రోత్సహించారు. ఎమ్జీయార్‌ తెగించాడు. తనను పార్టీలోంచి బహిష్కరించిన ఒక వారానికి 1972 అక్టోబరు 18న అణ్నాడిఎంకె పేర పార్టీ పెట్టాడు. అచ్చు డిఎంకె జండాలాగానే నలుపు, ఎఱుపుల్లో వుండి మధ్యలో అణ్నా బొమ్మ వుండేట్లా జండాను రూపొందించాడు. డిఎంకె ఎన్నికల గుర్తు ఉదయించే సూర్యుడు కాగా, ఎడిఎంకెకు రెండాకుల గుర్తు కేటాయించారు. ఎడిఎంకె ఏర్పడగానే కరుణానిధి 'ఇది పేకమేడ. త్యాగాలు, సిద్ధాంతాలు, పార్టీ నిర్మాణం లేకుండా ఏ పార్టీ పుట్టలేదు, పుట్టినా మనజాలదు' అన్నాడు. తక్కినవాటి మాట ఎలా వున్నా పార్టీ నిర్మాణానికి వెతుక్కోనవసరం లేకపోయింది. ఎమ్జీయార్‌ ఫ్యాన్‌ క్లబ్బులు ఆటోమెటిక్‌గా ఎడిఎంకె కార్యాలయాలుగా మారిపోయాయి. 

రుణానిధి తన రాజకీయజీవితంలో చేసిన అతి పెద్ద పొరపాటు యిదే. ఎమ్జీయార్‌ను వాడుకుని కూరలో కరివేపాకులా తీసివేయవచ్చని అనుకున్నాడు కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్జీయార్‌ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో దిగి, తనను ముప్పుతిప్పలు పెడతాడని, అతనిపై ఒక ఎన్నిక కూడా గెలవలేకపోతాననీ అనుకోలేదు. పార్టీ పెట్టిన ఐదేళ్లలోపు 1977లో ముఖ్యమంత్రి గద్దెకు వచ్చిన ఎమ్జీయార్‌ బతికున్నంతకాలం ముఖ్యమంత్రిగానే వుండి, కరుణానిధిని ఆ దరిదాపులకు రానీయలేదు. దీన్ని నటుడు, పాత్రికేయుడు అయిన చో రామస్వామి ఎప్పుడో వూహించాడు. తన ''తుగ్లక్‌'' పత్రికలో ''ఇకపై పార్టీ కరుణానిధి పరం, ఓటర్లు ఎమ్జీయార్‌పరం..'' అని రాశాడు. ఎమ్జీయార్‌ మరణానంతరం అతని వారసురాలైన జయలలితతో కూడా కరుణానిధి పోరాడుతూ ఒక్కోసారి ఓడిపోతున్నాడు. నటుడిగానే కాక స్వతహాగా ఎమ్జీయార్‌ మంచివాడు అనే యిమేజి కున్న బలాన్ని కరుణానిధి అంచనా వేయలేకపోయాడు. ఏ పార్టీకి చెందినవాడైనా సరే, సినిమాల్లో శివాజీ క్యాంప్‌కు చెందినవాడైనా సరే, ఎవరైనా దేహి అని వస్తే ఎమ్జీయార్‌ కాదనలేదు. దానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ''పొయ్యి మీద ఎసరు పడేసి బియ్యం కోసం ధీమాగా ఎమ్జీయార్‌ వద్దకు వెళ్లవచ్చు.'' అని ఒక జూనియర్‌ నటుడు అన్నాడు. అంటే ఎమ్జీయార్‌ సాయం చేస్తాడన్న గ్యారంటీ వుందన్నమాట. అతని సినిమాల్లో అనేక పాటలు అతని ఉద్దేశాలను చాటిచెప్పేట్లా రాయించుకునేవాడు. 'నేను పరిపాలించే రోజే వస్తే ఏ పేదవాడి కంట నీరు పెట్టనీయను', 'అడిగినవాడికి లేదనకుండా ఉన్నదంతా యిచ్చేశాను' – యీ తరహా పాటలు చాలా పాప్యులర్‌ అయ్యాయి. బయట కూడా ఎవరు కనబడినా 'భోజనం చేశావా, లేకపోతే మా యింటికి వెళ్లి చేసిరా' అనడం అతని అలవాటు. పేదల్లోంచి వచ్చాను, ఆకలి విలువ తెలుసు అని పదేపదే చెప్పుకునేవాడు. కరుణానిధికి తెలివితేటలున్నా కుతంత్రపు బుద్ధి అని, ఎమ్జీయారైతే స్వచ్ఛమైన  హృదయమున్న బోళామనిషని ముద్ర పడిపోయింది. అందుకే కరుణానిధి రకరకాలుగా అతన్ని తొక్కేయాలని చూసినా ప్రజలు ఎమ్జీయార్‌ వెంట నిలిచారు. (సశేషం) ఫోటో – ఎమ్జీయార్‌, జయలలితల తొలి చిత్రం – ''ఆయిరత్తిల్‌ ఒరువన్‌''

ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015) 

[email protected]

Click Here For Archives