తెలంగాణ రాజకీయాల్లో అధికార భారాస తమ ముద్రతో కూడిన దూకుడును ప్రదర్శిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయాలతో రికార్డు సృష్టించాలని కలగంటున్న భారాస.. ఎన్నికలు ఇంకా దూరం ఉండగానే.. ఎమ్మెల్యేల అభ్యర్థులను ప్రకటించేయాలని తలపోస్తోంది.
దీనివల్ల ఎలాంటి అనుమానాలకు, సందిగ్ధానికి తావు లేకుండా.. అభ్యర్థులు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం మీద ఫోకస్ పెడతారని, అసంతృప్తులు ఏమైనా బయటపడితే.. టైం ఉంటుంది గనుక.. వెంటనే వారిని బుజ్జగించడం సాధ్యమవుతుందని కూడా వారు అనుకుంటున్నారు. అయితే గత ఎన్నికల తర్వాత.. ఇతర పార్టీలనుంచి భారీగా వలసలను ప్రోత్సహించి.. ఆయా పార్టీల నాయకులను తమలో కలుపుకున్న నియోజకవర్గాల్లో మాత్రం గులాబీ పార్టీకి టికెట్ ఎంపిక విషయంలో ఇబ్బందులు తప్పేలా లేదు.
పార్టీకి పూర్తిగా సేఫ్ గా కనిపిస్తున్న నియోజకవర్గాల్లో సిటింగ్ అభ్యర్థులందరినీ ఖరారు చేసేస్తూ ఆగస్టు రెండో వారంలోనే భారాస తొలి జాబితా వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి కేసీఆర్ సిటింగులు అందరికీ టికెట్లు అనే చెబుతున్నారు. కొన్ని చోట్ల మాత్రం సిటింగుల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అలాంటి నియోజకవర్గాల మీద మాత్రమే పునరాలోచన సాగుతోంది. తతిమ్మా సిటింగులకు ఇబ్బంది ఉండకపోవచ్చు.
అలాగే వలస ఎమ్మెల్యేలున్న చోట.. ఇప్పటికే స్థానిక భారాస నాయకులు పక్కదార్లు చూసుకుంటున్నారు. ఉదాహరణకు మహేశ్వరం నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీని వీడుతారని, కాంగ్రెసులో చేరుతారనే ప్రచారం ఉంది. ఇక్కడ వలస వచ్చిన సబితా ఇంద్రారెడ్డి ప్రస్తుతం మంత్రిగా ఉండగా, మళ్లీ టికెట్ ఆమెకే దక్కుతుంది. అయితే తీగల కృష్ణారెడ్డిని ఇప్పటిదాకా బుజ్జగించడానికి ప్రయత్నాలు జరిగినట్టుగా కూడా తెలియడం లేదు. ఏది ఏమైనప్పటికీ.. అసంతృప్త స్థానాలు తప్ప.. తొలి జాబితా వచ్చేస్తుంది.
ముందే అభ్యర్థుల ప్రకటన ద్వారా ప్రత్యర్థి పార్టీలపై పైచేయి సాధించాలనేది భారాస వ్యూహం. వారికి ప్రచారానికి చాలినంత సమయం లేకుండా చేయాలని పార్టీ భావిస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎంత ముందుగా అభ్యర్థులను ప్రకటిస్తే అంత ఎడ్వాంటేజీ ఉంటుందని వారి అంచనా. అదే సమయంలో భారాస జాబితాలు వచ్చేసిన తర్వాత.. ఆయా పార్టీలో అసంతృప్తులు ఎవరైనా తమతో జట్టు కలుస్తారేమో చూసుకుని, ఆ తరువాత అభ్యర్థులను ప్రకటించవచ్చునని బిజెపి నిరీక్షిస్తోంది.
అయినా గులాబీల్లో అసంతృప్తి రేగినా సరే.. వారిలో పలువురికి ప్రధమ ప్రాధాన్యంగా కాంగ్రెసు పార్టీనే కనిపిస్తోందని పలువురు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. వలసనేతలున్న చోట్ల తప్ప.. మిగిలినచోట్ల సునాయాసంగానే భారాస అభ్యర్థుల ఎంపికను పూర్తిచేసి జాబితా విడుదల చేస్తుందని అంచనాలు సాగుతున్నాయి.