తెలంగాణ కమ్యూనిస్టుల పరిస్థితి చూస్తోంటే అయ్యోపాపం అనిపిస్తోంది. ఒకప్పుడు అటు విప్లవనేపథ్యంతో పాటు, పార్టీలుగా ప్రజాదరణ పరంగా కూడా.. వైభవం వెలగబెట్టిన తెలంగాణలో ప్రస్తుతం రెండు వామపక్ష పార్టీలూ కేవలం అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తంటాలు పడుతూ ఉన్నాయి. మళ్లీ శాసనసభలో కూడా అడుగుపెట్టి.. తమ పార్టీలను కాపాడుకోవాలనే ఆరాటం వారిలో పుష్కలంగా ఉంది. కానీ.. అందుకు సరైన మార్గం ఏమిటో వారికి తోచడం లేదు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న భారాసతో కలిసి ఎన్నికలబరిలోకి దిగితే ప్రయోజనం ఉంటుందని రాష్ట్ర పార్టీలు తలపోస్తున్నాయి. కేసీఆర్ తో కలవాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు బహుకాలం నుంచి రకరకాల ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ వారికి అపాయింట్మెంట్ దొరకడం లేదు. వారి వినతులు, పబ్లిక్ లో వారు పొత్తు పట్ల వెలిబుచ్చుతున్న ఆశలను కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
మహారాష్ట్ర నుంచి వార్డుమెంబరుగా కూడా నెగ్గలేని ఒక మామూలు వ్యక్తి వచ్చినా సరే.. ప్రగతి భవన్ లో గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించే కేసీఆర్.. ఈ వామపక్షాల వారిని అస్సలు దరికి రానివ్వడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఇంకా భారాస ప్రాపకం కోసమే వామపక్షాలు ఆరాటపడుతూ ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
గత ఎన్నికల సమయానికి వీరి మధ్య పొత్తు బంధాలు లేవు. అయితే ఇటీవలి మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా.. అక్కడ కాంగ్రెసు నుంచి రాజీనామా చేసి, బిజెపి తరఫున పోటీచేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కోడానికి భారాస కాస్త భయపడింది.
ఎందుకైనా మంచిదని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కార్యకర్తల బలం ఉన్న వామపక్ష పార్టీల సాయం తీసుకుంది. పొత్తు అనే మాట కూడా ప్రకటించింది. ఈ పొత్తుబంధం కేవలం మునుగోడు వరకు పరిమితం కాదని, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఉంటుందని వారు చెప్పారు. అదే ఆశతో ఎర్రపార్టీలు ఉన్నాయి. కేసీఆర్ తో పొత్తుల్లో ఉంటే కొన్ని సీట్లు అయినా నెగ్గుతామని, సభలో అడుగుపెట్టవచ్చునని వారు ఆశిస్తున్నారు. భారాస మాత్రం పట్టించుకోవడం లేదు.
‘తాజాగా వామపక్షాలకు మనుషులూ లేరు, కార్యకర్తలూ లేరు. వారి ఉచ్చులో పడొద్దు’ అంటూ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు పాపం వారికి మనస్తాపం కలిగించాయి. మేము లేకపోతే మునుగోడులో భారాస గెలవగలిగేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇండియా కూటమిలో వామపక్షాలు ఉండడం అనేది అసెంబ్లీ ఎన్నికల్లో భారాసతో స్నేహానికి ఇబ్బంది కాదని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇన్నిమాటలు చెబుతున్న కమ్యూనిస్టులు.. ఒకవేళ కేసీఆర్ వారిని ఆదరించినా సరే.. అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందుతారు సరే.. పార్లమెంటు ఎన్నికల సమయానికి భారాసకు హ్యాండ్ ఇవ్వకుండా ఉంటారా? ఇండియా కూటమిలో వారు ప్రధానంగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ కు సహకరించకుండా ఉంటారా?
అసలే క్లిష్టంగా ఉన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమీకరణాల్లో.. ఫలితాల తర్వాత.. వామపక్షాలకు పొత్తులతో దక్కే కొన్ని సీట్లు అయినా సరే.. కీలకంగా మారితే.. ఆధారపడవలసినంతగా మారితే.. అయిదేళ్ల పాటు కేసీఆర్ సర్కారుకు పూర్తిగా సహకరిస్తారా? అనే అనేక రకాల భయాలున్నాయి. ఈ భయాలవల్లనే కేసీఆర్.. వారితో స్నేహం కొనసాగించడం గురించి నోరు మెదపడం లేదని తెలుస్తోంది.