నల్గొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తుతం భువనగిరి నుంచి ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల సమయానికి ఎమ్మెల్యేగా పోటీచేయాలనేది ఆయన కోరిక. అయితే ఆయన కోసం నియోజకవర్గాలు ఎక్కడ ఖాళీ ఉన్నాయి? నల్తొండ జిల్లాలొ దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సీనియర్ అభ్యర్థులే ఉన్న నేపథ్యంలో పార్టీలోని ముఠాతగాదాలే ఆయనకు మేలు చేసినట్టుగా కనిపిస్తోంది.
వెంకటరెడ్డి వైరి వర్గానికి చెందిన యాదాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కాంగ్రెస్ కు రాజీనామా చేసి భారాసలోకి వెళ్లారు. జిల్లాలో ఇది చాలా కీలక పరిణామం. జిల్లా కాంగ్రెస్ రాజకీయాలను ప్రభావితం చేయడంతో పాటు, ఫలితాలపై కూడా ప్రభావం చూపిస్తుందనే అంచనాలు సాగుతున్నాయి.
జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డికి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. అనిల్, ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గానికి చెందిన నాయకుడు. ఆయన గత ఎన్నికల్లో భువనగిరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి పైళ్ల శేఖర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.
ఈసారి ఎన్నికల విషయానికి వచ్చేసరికి.. తాను ఎమ్మెల్యేగానే బరిలో ఉంటానని, నియోజకవర్గం ఎక్కడినుంచిచ అనేది ఇంకా తేల్చుకోలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా కాలంగా చెబుతున్నారు. అలాగని మునుగోడు నుంచి ఆయన పోటీచేసే అవకాశం లేదు. అక్కడినుంచి తమ్ముడు రాజగోపాల్ బిజెపి తరఫున పోటీచేసే అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలో భువనగిరి పార్టీ ఇన్చార్జి పక్కకు తప్పుకోవడం అనేది కోమటిరెడ్డికి లైన్ క్లియర్ చేసినట్టుగా అయింది.
అయితే కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరాలు ఇక్కడితో ఆగేలా లేవు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్గం గుంభనంగానే ఉంది. ఆయన తనమీద ఎన్ని పుకార్లు వచ్చినా సరే.. తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదని చాలా సందర్భాల్లో చెబుతున్నారు. అయితే నల్గొండ జిల్లాకు చెందిన ఇంకా అనేకమంది కాంగ్రెస్ నాయకులు, ఆగస్టు 13, 14 తేదీల్లో భారాసలో చేరుతారనే ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది.
కాంగ్రెస్ నుంచి వలసలు వస్తుండడంతో భారాస ఉత్సాహంగా కనిపిస్తోంది. అదే సమయంలో భారాస నుంచి కాంగ్రెసు పార్టీలోకి కూడా వలసలు సాగేలా ఉన్నాయి. నల్గొండ జిల్లా పరిధిలో అయితే.. భారాస నేతలు తమ పార్టీలోకి రావడానికి సుముఖంగా ఉన్నా తాము చేర్చుకోవడం లేదని కాంగ్రెస్ వాళ్లు అంటున్నారు.