సోషల్ మీడియాలోని నగ్న దృశ్యాలు

మీడియాకి ఫోర్త్ ఎస్టేట్ అని పేరు. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జుడీషియరీతో పాటు మీడియా దేశానికి నాలుగో మూలస్తంభం. కానీ మిగిలిన మూడు వ్యవస్థలూ ఈ నాలుగో వ్యవస్థని చిన్నచూపు చూస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇది…

మీడియాకి ఫోర్త్ ఎస్టేట్ అని పేరు. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జుడీషియరీతో పాటు మీడియా దేశానికి నాలుగో మూలస్తంభం. కానీ మిగిలిన మూడు వ్యవస్థలూ ఈ నాలుగో వ్యవస్థని చిన్నచూపు చూస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇది ఆ మూడింటిలాగ వ్యవస్థీకృతమైనది కాదు. రాజ్యాంగం కల్పించిన వాక్స్వాతంత్ర్యాన్ని అనుసరించి ఎవరైనా ఎప్పుడైనా మీడియాలోకొచ్చి ఈ ఫోర్త్ ఎస్టేట్ లో భాగమైపోవచ్చు. పైనున్న మూడు వ్యవస్థల్నీ ప్రశ్నించొచ్చు. వాళ్ల తప్పుల్ని ఎండగట్టొచ్చు. 

వ్యవస్థ అంటే పేరుకే గానీ వాటిని నడిపేది మనుషులే. అందుకే ఒక వర్గం తమ స్వేఛ్చని చాటుకుంటూ వాక్స్వాతంత్ర్యాన్ని చూపిస్తే, పై వర్గాలు తమ పవర్ ని వాడుకుని కేసులు పెట్టో, ఇబ్బందులు పెట్టో ఈ నాలుగో వ్యవస్థని ఆడుకుంటాయి. 

సామ,దాన,బేధ,దండోపాయాల్ని మీడియాపై చూపిస్తూ ఎన్నో దశాబ్దాలుగా రాజకీయం ఈ దేశాన్ని ఏలుతోంది. కుదిరితే దువ్వడం, కుదరకపోతే బెదరగొట్టడం…అయితే ఈ తంతు ఒక్క మెయిన్ స్ట్రీం మీడియా వరకే చేయగలుగుతోంది ప్రభుత్వం. 

ఈ సోషల్ మీడియా యుగంలో ప్రతి పౌరుడు ఒక మీడియా సంస్థగా పరిణమించిన సందర్భంలో ప్రభుత్వం ఏం చేయగలుగుతోంది?

సోషల్ మీడియాలో విజ్ఞత, సభ్యత ఏ మాత్రం లేని ఎందరో సమాజాన్ని డిస్టర్బ్ చేస్తున్నారు. 

ఉదాహరణకి మణిపూర్ ఉదంతాన్ని అన్ని మీడియా సంస్థలు వీడియోల్ని బ్లర్ చేసి చూపిస్తే ట్విట్టర్, ఫేస్బుక్కుల్లో కొందరు బ్లర్ చేయకుండా యథాతథంగా వీడియోలు అప్లోడ్ చేసేసారు. “అయ్యో అయ్యో” అంటూనే, ఆ దమనకాండని నిరశిస్తూనే చూపించకూడనిది చూపించేసారు. ఇదెక్కడి అజ్ఞానం? స్త్రీల మానాన్ని కాపాడడం అంటే ఇదా? అలాంటి వీడియోల్ని అప్లోడ్ చేసినవాళ్లు కూడా అపరాధులే. వాళ్ల మీద కఠినమైన కేసులు పెట్టాలి? అంతమందిని జల్లెడ పటి పట్టుకోగలదా? మనసుంటే మార్గముంటుంది..ఆ మనసే లేని ప్రభుత్వం మరి! 

అమెరికాలో కూడా భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. కానీ అక్కడి సోషల్ మీడియా ఇక్కడున్నంత విషపూరితంగా లేదు. కారణం అక్కడ ఎంత స్వేచ్ఛున్నా గీత దాటితే తొక్క తీస్తారు. ఇండియాలో ఆ పరిస్థితి లేదు. దానికి తోడు అమెరికా జనం కొంత సంస్కారం చూపిస్తారు. మన దేశంలోని సోషల్ మీడియాలో సంస్కారహీనుల సంఖ్య ఎక్కువగా ఉంది. 

తమ ప్రభుత్వాన్ని తిడితే కేసులు పెట్టో, తమ అధినేత మీద నెట్-ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీ వస్తే వెంటనే బ్యాన్ చేయించుకునో భాజపా తన శక్తిని చాటుకుంది. మరి అదే ప్రభుత్వం ఈ మణిపూర్ స్త్రీలకి అటువంటి న్యాయం చేయదెందుకు? మరీ అంత సిగ్గుమాలిన నియంతృత్వ పోకడలో ఉందా భాజపా ప్రభుత్వం?

నిర్భయ కేసు దెబ్బ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంపై పడింది. అపరాధుల్ని శిక్షించడంలో జాప్యాన్ని సహించలేక ప్రజానీకం ప్రభుత్వాన్ని అసహ్యించుకున్నారు. ఇప్పుడు భాజపా ప్రభుత్వం మీద అటువంటి అసహ్యమే కలుగుతోంది జనానికి. 

కనీసం మణిపూర్ ముఖ్యమంత్రిని సస్పెండ్ చేసే పనైనా చెయ్యాలి కదా మన ప్రధాని నరేంద్రమోడీ! అసలాయన ఈ ఘటనమీద స్పందించడానికే చాలా రోజులుపట్టింది. 

ప్రపంచ మీడియా ప్రచారం వేరుగా ఉంది. భారతదేశంలో హిందువులు క్రైస్తవుల మీద చేస్తున్న అఘాయిత్యంగా దీనిని చెబుతున్నాయి. మణిపూరులో చాలామంది తెగల వాళ్లు క్రైస్తవాన్ని స్వీకరించి ఉండొచ్చు. కానీ వాళ్ల పోరు తమ తెగకు సంబందించిన హక్కులు, రిజర్వేషన్స్ గురించి. ప్రాశ్చాత్య మీడియాకి అదంతా అనవసరం. దీనిని మతపరమైన దృక్కోణంలోనే చూస్తున్నాయి.

ఈ మణిపూర్ విషయమొక్కటే కాదు…సోషల్ మీడియాలో వస్తున్న అశ్లీలభాష, దృశ్యాలు అనేకం. వాటిపై కఠినమైన చర్యలు తీసుకోలేని ప్రభుత్వం ఎందుకు దండగ? టెక్నికల్ గా వాటిని నిలువరించడం కష్టమనుకుంటే పైన చెప్పుకున్నట్టు ప్రభుత్వ వ్యతిరేక డాక్యుమెంటరీలను ఎలా బ్యాన్ చేయగలుగుతోంది? యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి కంపెనీలు ఇండియాలో ఉన్నాయి. వాటికి కఠినమైన నిబంధనలు పెట్టి అశ్లీల, అసభ్య, నగ్న దృశ్యాలు కనపడకుండా చేసే బాధ్యతను అప్పగించవచ్చు కదా. ఈ దేశంలో యూజర్స్ తమకి ఉండాలంటే ఈ రూల్స్ పాటించాల్సిందేనని చెప్పలేని ప్రభుత్వం ఇంకెందుకు?

అలా చేయడం భావప్రకటనస్వేఛ్చకి అడ్డనుకుంటే ఇక ఫ్రీడం ఆఫ్ ప్రైవసీకి సమాధానమేంటి? సినిమాలకి సెన్సార్ ఉన్నప్పుడు ఓటీటీలకి, సోషల్ మీడియాకి పెట్టడానికి బద్ధకమేంటి? 

“భారతమాతాకి జై” అని నినదిస్తూ “జై శ్రీరాం” అంటూ ఊగిపోయే ప్రభుత్వం కూడా ఈ నగ్నత్వాన్ని, అశ్లీలాన్ని ఆపకపోతే ఇక హిందుత్వవాదులు సైతం చేతకాని దద్దమ్మాల్లా కూర్చోవడం మంచిది. 

పద్మజ అవిర్నేని