ఎమ్బీయస్‌: అమరావతి కథలు- 5

ఇప్పుడు కొన్ని ప్రేమకథలు చెప్తాను. దర్జీ దగ్గర పనిచేసే పదేనేళ్ల కుర్రాడు. పాచిపనిచేసే పద్నాలుగేళ్ల అమ్మాయంటే వాడి కిష్టం. ఆ అమ్మాయికోసం రవిక కుట్టిపెడదామని వాడి ఐడియా. కొలతలు తీసుకుని ఒకేరంగు గల గుడ్డపీలికలన్నీ…

ఇప్పుడు కొన్ని ప్రేమకథలు చెప్తాను. దర్జీ దగ్గర పనిచేసే పదేనేళ్ల కుర్రాడు. పాచిపనిచేసే పద్నాలుగేళ్ల అమ్మాయంటే వాడి కిష్టం. ఆ అమ్మాయికోసం రవిక కుట్టిపెడదామని వాడి ఐడియా. కొలతలు తీసుకుని ఒకేరంగు గల గుడ్డపీలికలన్నీ పోగేసి ఒక్కోటీ కుట్టుకుంటూ వస్తాడు. ఆర్నెల్లకి జాకెట్టు పూర్తయింది. కానీ ఆ అమ్మాయి తొడుక్కుంటే ఆ జాకెట్టు పట్టదు. ఛాతీ కొలతలు మారిపోయాయి మరి. వీడు బిక్కమొహం వేస్తాడు. 'పోన్లే మావా, పిన్నీసెట్టుకుని పైన వోణీ వేసుకుంటాన్లే' అంటుంది ఆ పిల్ల. కథ పేరు 'వయసొచ్చింది'.

గడ్డికోసుకునే లచ్మి కథ 'పచ్చగడ్డి భగ్గుమంది'. ఆ అమ్మాయి అగ్గిలాటి పిల్ల. తండ్రి తాగుబోతు. ఆ అలుసు తీసుకుని ఒకడు గడ్డి కొనడానికి వచ్చినట్టు వచ్చి 'నీ మోపు రూపాయేనేంటే! ఐదు రూపాయలిస్తే తీస్కో' అంటాడు. 'బాబూ గడ్డి గొడ్లకా? మీకా?' అంటుందీమే. అలాటామె రాముల్ని ప్రేమిస్తుంది. కానీ అతను కట్నం కోసం అతను ఇంకోళ్లను పెళ్లాడతాడు. లచ్మి తండ్రి తాగుడు డబ్బుల కాశపడి ఓ ముసలాడికి కట్టబెడతాడు. ఏడాది తిరిగేసరికి ఆమె వితంతువు అయి తిరిగి వస్తుంది. 

ఇంకో కథలో కనకాంగి వేశ్య. గొప్ప అందగత్తె. రాయుడు చేరదీశాడు. అతనితో ఐశ్వర్యం అదీ ముందులో బాగానే వుంటుంది  కానీ అతను అధికారం ప్రదర్శించడంతో విముఖత ఏర్పడుతూ వుంటుంది. ఓ రోజు చాకలి సంగడు బట్టలు తీసుకోవడానికి వస్తే అతణ్ని చూస్తి భ్రమిసింది. కానీ క్లాస్‌ డిఫరెన్స్‌! ఓ సారి పమిట జరీ అంచు సరిగా లేదంటూ పవిట సగం విప్పి చీర అంచు అతని చేతికిచ్చింది. ఇద్దరి ముఖాలూ చేరువలో వున్నాయి. సంగడు కనకాంగిని దగ్గరకు తీసుకుంటే ఏమయ్యాదో తెలియదు. సంగడు ముద్దు పెట్టుకోలేదు. కనకాంగి ముద్దివ్వలేదు. ఇద్దరి కళ్లలో నీళ్లు. ఇదీ సత్యం గారు కథ చెప్పే విధం. కథ పేరు 'ముద్దేలనయ్యా – మనసు నీదై యుండ'!

అమరావతి కథల్లో సామాన్యులు కూడా ఎంతోమంది కనబడతారు. 'తులసి తాంబూలం' కథలో వేణుగోపాలస్వామి గుళ్లో పూజారి. ఉన్న కాస్తమందీ మెయిన్‌ డెయిటీ అమరేశ్వరుడి గుడికి వెళ్లేవాళ్లే కానీ  అదే కాంపౌండులో వున్న క్షేత్రపాలకుడు వేణుగోపాలుడి గుడికి వచ్చేవారు లేరు. ఈయనకు ఆదాయం లేదు.  ఓ వర్షంరోజు. ఇంట్లో అన్నీ నిండుకున్నాయి. భక్తులు ఎవ్వరూ రాలేదు. ఎట్టకేలకు ఒకతను వచ్చి అర్థరూపాయి వేస్తే సెట్టి వచ్చి అది పట్టుకుపోయాడు. పాతబాకీలో జమ వేసుకుంటానంటూ. ఈయన వట్టి చేత్తో యింటికి వచ్చాడు. భార్య సంగతి గ్రహించి తులసితీర్థం యిచ్చింది. తాంబాలంగా తులసిదళం యిచ్చింది. అదీ 'తులసి తాంబూలం' కథ.

అలాగే 'సిరి-శాంతి' కథలో గొల్ల సిద్దయ్యకి పొలంలో ఓ వజ్రం దొరికింది. రత్నవర్తకుడైన ముత్యాలయ్య చేతిలో పెట్టి ఓ పొగాకు కాడ యివ్వండి, ఈ రాయి తీసుకోండి. అన్నాడు. అతను బలే ఛాన్సు అనుకున్నాడు. వేంకటాద్రి నాయుడికి ఈ సంగతి తెలిసి పదిలక్షలిచ్చి అది కొని ఇంకో పదిలక్షలిచ్చి అదెక్కడ దొరికిందో కనుక్కుని సిద్దయ్య పొలానికి వెళ్లి మరిన్ని రత్నాల్ని తవ్వుకున్నాడు. నీకేం కావాలంటే 'నాకేం వద్దు' అన్నాడు సిద్దయ్య. పదెకరాల మాన్యం, బండెడు పొగాకు యిచ్చాడు నాయుడు. సిద్దయ్య జీవితమంతా కమ్మగా తిన్నాడు, పదిమందికి పెట్టాడు హాయిగా చుట్ట కాల్చుకుంటూ. తృప్తిగా వెళ్లిపోయాడు. ఆ తృప్తి నాయుడుకీ, ముత్యాలయ్యకి దొరకలేదు.

స్కూలు మాస్టారు, కోతుల్ని అడించేవాడు, పోస్టుమాస్టరు – వీళ్లందరూ అమరావతి కథల్లో కథానాయకులే! పూలు అమ్మే సుల్తాన్‌ గురించి ఓ కథ. దసరాకి పులివేషం కట్టే నబీ సాయెబు గురించి మరో కథ. అట్లేసే దుర్గాంబ మొగుడు శంకరయ్య భార్యా విధేయత గురించి మరో కథ. వాచీ రిపేరరు చలపతి గురించి కూడా కథే. రిపేరుకు వచ్చిన వాచీలను దానం చేయడం అతని హాబీ. అసలు వాళ్లొచ్చి గోలపెడితే కిరసనాయిల్లో వేశానని డబాయింపు ఒకటి. పోలీసు నిక్కరు వేసుకుని పోట్లాట కెళితే విజయం తథ్యం అని అతనికో సెంటిమెంటు. 

ఇలాటి వాళ్లు మీ వూళ్లోనూ మీకు తగిలే వుంటారు. సత్యంగారు వాళ్ల మీద కథలు కట్టారు. అదీ విశేషం.

అమరావతి కథల గురించి మీకు అన్నీ పూర్తిగా చెప్పటంలేదు.  అవి మీరు స్వయంగా చదవాలని నా కోరిక. కథలకు బాపు గారు వేసిన బొమ్మలు చూసి తరించాలని నా కోరిక. కథలకు, బొమ్మలకు ముళ్లపూడి వెంకటరమణగారు ముందుమాటలో చేసిన వ్యాఖ్యానం చదివి తీరాలని నా కోరిక. అనుభవేక వేద్యం అంటారు చూడండి. కొన్ని అనుభవిస్తేనే కానీ తెలియవంటారు. ఇవీ అలాటివే. 

అన్నీ కథలు కావు. కొన్ని జస్ట్‌ లిరికల్‌ బ్యూటీకి చదవాల్సిందే. స్తంభన అని ఓ స్కెచ్‌. గాలి ఎక్కడెక్కడినుండి వెళుతోందో వర్ణిస్తాడు.

బిలా బిలా గాలి, జల జలా గాలి – అలలు అలలుగా గాలి

లోకమంతా మేల్కొనట్లు – కటిక చీకట్లో గప్పున వెలుగొచ్చినట్లు 

బయ్‌బయ్‌మని గాలి, రయ్‌రయ్‌మని గాలి.

ఆ గాలి కృష్ణకు వెళ్లిందిట. ఆ తరువాత అమరేశ్వర శిఖరం ధ్వజస్తంభాన్ని చుట్టిందట. స్తంభం చిరుగంటలు వూపిందట. పక్కనున్న వేపచెట్టు కొమ్మెక్కి గంతులేసిందట. చిన్నరథం మీది చెక్కిన చిలకల ముక్కులు ఎవరో విరగ్గొడితే వాటిని జాలిగా బుజ్జగించిందట…

శాంపిల్‌ చాలుగా..

ఎమ్వీయల్‌ అన్నారు – 'శంకరమంచి చెప్పాడు, కృష్ణమ్మ వింది, కడుపులో దాచుకుంది, తరతరాలకూ చెబుతుంది' అని. అలాగ ఈ కథలు తెలుగు జాతివి. అందుకే మనం ఎంజాయ్‌ చేస్తాం.

చివర్లో ఎపిలోగ్‌ అంటారుగా అలాగ 'మహారుద్రాభిషేకం' అని  అమరేశ్వరుణ్ని ఉద్దేశించి సత్యం గారు రాశారు.

లే తండ్రీ! లే – తలార తనివితీర స్నానమాడు

స్నానమాడి శాంతించు నరుడా – దీవించు హరుడా

హరహర మహాదేవ – నరహర మహాదేవ (సమాప్తం)

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌

[email protected]