బిహార్‌లో నీతీశ్ కూటమి విజయం నుండి మన తెలుగునేతలు నేర్చుకోవలసిన విషయం ఒకటి కనబడుతోంది. నేల మీద నిలబడే వారినే జనాలు నమ్ముతున్నారని బిహార్ ఫలితం చూపిస్తోంది. అఫ్‌కోర్స్, విజయాన్ని కానీ వైఫల్యాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా విశ్లేషిస్తారు. గుజరాత్‌లో 'ప్రభుత్వ వ్యతిరేకత' (యాంటీ ఎస్టాబ్లిష్‌మెంట్) అంశాన్ని అధిగమించి మోదీ మూడు సార్లు గెలిస్తే దాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం వలన వచ్చిన ఫలితమని విశ్లేషించినవారే అదే అంశాన్ని అధిగమించి నీతీశ్ కూటమి గెలిస్తే కులంబలంతో గెలిచారని తేల్చేశారు. మరి కితం ఏడాది పార్లమెంటు ఎన్నికల సమయంలో యీ బలం ఏమైందో తెలియదు. కులసమీకరణల లెక్కలు కొంతమేరకే ఉపయోగపడతాయి కానీ పబ్లిక్‌లో జనరల్ మూడ్ అంటూ ఒకటి వుంటుంది. అది గెలిచే కూటమికి విన్నింగ్ మార్జిన్‌ను ప్రసాదిస్తుంది. పార్లమెంటు ఎన్నికల సమయంలో మోదీ హవా నడిచింది కాబట్టి అన్ని సీట్లు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికల సమయంలో లాలూ, నీతీశ్ కలిసి పోటీ చేసినా మోదీని నిలవరించగలిగేవారు కాదని గ్రహించాలి. కానీ ఏ హవా కూడా ఎక్కువకాలం నిలవదు, నిలిచినా అంతే ఉధృతిలో నిలవదు అనేది ప్రకృతి సహజమైన నియమం. పైగా అసెంబ్లీ ఎన్నికలలో మోదీ అభ్యర్థి కాదు. కానీ అతని బలాన్ని ఎదుర్కోవడానికి తానొక్కడూ చాలడని నీతీశ్ గ్రహించాడు కాబట్టే ఒకప్పటి బద్ధశత్రువు లాలూతో, కాంగ్రెసుతో చేతులు కలిపి బిజెపి-వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా చూశాడు. ఇది రాజకీయంగా అవలంబించిన స్ట్రాటజీ అయినా అతని గెలుపుకు అదొక్కటే కారణం కాదు. ప్రధానమంత్రిగా మోదీ, ముఖ్యమంత్రిగా నీతీశ్ వుంటే మంచిదనుకున్నారు అధికాంశం బిహారీలు. వాళ్లను అలా అనుకునేట్లా చేయవడానికి నీతీశ్ అవలంబించిన స్ట్రాటజీ ఏమిటి?
మొదటగా కొట్టవచ్చినట్లు కనబడేది వినయం. మోదీ-అమిత్ షా హైఫై కాంపెయిన్‌కు పూర్తి వ్యతిరేకంగా నీతీశ్ కాంపెయినింగ్ సాధారణ స్థాయిలో జరిగింది. వాళ్లవి భారీ బహిరంగసభలైతే, నీతీశ్ తన తరఫున మహిళా కార్యకర్తలను సైకిళ్లిచ్చి యింటింటికీ పంపాడు. వాళ్లవి భారీన్నర వాగ్దానాలైతే యితనివి సీదాసాదా వాగ్దానాలు. బిజెపి మానిఫెస్టో కలర్ టీవీల గురించి, మోటార్‌సైకిళ్ల గురించి, లాప్‌టాప్‌ల గురించి మాట్లాడితే జెడియు మానిఫెస్టో సైకిళ్ల గురించి, మరుగుదొడ్ల గురించి మాట్లాడింది. బిజెపి లక్షన్నర కోట్ల ప్యాకేజీ యిస్తామన్నా బిహార్‌లో మెజారిటీ ఓటర్లు చలించలేదు. ఎందుకు, ఏమిటి అనే వివరాల్లోకి వెళితే అది ఎన్నికల విశ్లేషణలోకి వెళుతుంది. నా టాపిక్ అది కాదు. బిహార్ ఓటరు హైఫై మానిఫెస్టో కంటె లో-కీ మానిఫెస్టోని నమ్మాడనే నేను భావిస్తున్నాను. మానిఫెస్టో ఎవరూ చదవరు అంటారేమో, ఓకే ఎన్నికల వాగ్దానాలు అందాం. అవైతే వింటారు కదా. నీతీశ్‌ది సింపుల్‌గా వున్నా జరుగుతాయన్న నమ్మకం వారికి కలిగింది. బిజెపి వాగ్దానాలు కంటికి, చెవికి యింపుగా వున్నా జరుగుతాయన్న నమ్మకం కలగలేదు. ఎందుకంటే బిజెపి పార్లమెంటు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు అమలు కాలేదు. ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూ.ల మాట ప్రతిపక్షనాయకులందరూ ఎత్తి చూపి ఎద్దేవా చేశారు. పప్పు ధాన్యాల అధికధరలు, అంతర్జాతీయంగా పెట్రోలు ధరలు తగ్గుతున్నా పెట్రోలు ధర పెంచడం.. యిలా అనేక విషయాలలో బిజెపి చెప్పినది ఒకటి, చేస్తున్నది మరొకటి అని జనం నమ్మారు. అయినా లాలూ, నీతీశ్ కంటె బిజెపియే బెటరు అనుకున్నవారు బిజెపి కూటమికి వేశారు. కానీ వారి సంఖ్య చాలలేదు కాబట్టి ఓటమి సంభవించింది.
ఈ ఒక్క అంశం మన తెలుగు నేతలిద్దరూ ఒంటబట్టించుకుంటే చాలు. 2014 ఎన్నికల సమయంలోనే ఇంటికో ఉద్యోగం వంటి అలవికాని వాగ్దానాలు ఎడాపెడా చేసేశారు. నెగ్గాక చేసిన వాగ్దానాల్లో కొన్నిటిని అమలు చేద్దామని చూసినా సరిపోతుంది. వాటిని అమలు చేయకపోగా, వాటిని నీరుకార్చారు. వాటి సంగతి అలా వుండగానే కొత్త వాగ్దానాలు చేశారు. అవి కూడా చిన్నా, చితకా కాదు. ఋణమాఫీయే పెనుభారం. ఏ మేరకు మాఫీ చేస్తారో ముందులో చెప్పలేదు. ఎన్నికల తర్వాత కెసియార్ లక్ష అంటే బాబు రెండాకులు ఎక్కువ చదివినట్లు లక్షన్నర అన్నారు. ఉద్యోగుల జీతాల పెంపూ అంతే, పోటీలు పడి పెంచేశారు. కులాల పేర, మతాల పేర భవనాలకు స్థలప్రదానాలు, కార్పోరేషన్లు సంతర్పణ చేశారు. ఇక ప్రాజెక్టుల సంగతి చెప్పనే అక్కరలేదు. కెసియార్ వరస చూస్తే ఏ కొత్త ప్రాజెక్టు ఎప్పుడు మొదలెడతారో, దేని డిజైన్ ఎప్పుడు మార్చేస్తారో, దేన్ని రద్దు చేస్తారో ఎవరికీ తెలియదు. అటు ఆంధ్రలో పట్టిసీమ ప్రాజెక్టు అప్పటికప్పుడు ఎందుకు పుట్టుకువచ్చిందో తెలియదు. ఎన్నికల మానిఫెస్టోలో యివేమీ లేవు. తెరాస మానిఫెస్టోలో సెక్రటేరియట్ తరలింపు, ఆసుపత్రి తరలింపు, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన యిలాటివి లేవు. అధికారంలోకి వచ్చాక అవన్నీ పెట్టుకున్నారు. అవేనా, మల్టీ లేయర్ ఫ్లయిఓవర్లు, హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు, మెట్రో రూటు మార్చినందుకు అదనపు ఖర్చులు.. ఒకటా రెండా, ఏ వూరు కనబడితే దాన్ని డెవలప్ చేసేస్తామంటారు. పోలిక కూడా ఏ సింగపూరుతోనో వుంటుంది. అటు ఆంధ్రలో కూడా డిటోడిటో. ప్రతీ జిల్లాకు ఎయిర్‌పోర్టు అంటారు. దేనికో ఓ దానికి హబ్ అంటారు. అన్ని హంగులు యిప్పటికే వున్న హైదరాబాదును డెవలప్ చేయడానికే తెరాసకు శక్యం కాకుండా వుంటే ఏ హంగూ లేని ఆంధ్ర రాజధాని పేరు చెప్పి అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు బాబు. ఈ అమరావతిని చూసి అసలు అమరావతి కుళ్లుకునే లెవెల్లో రంగుల కలలు చూపిస్తున్నారు.
కలలు కనడానికి కూడా కాస్త ముడిసరుకు వుండాలి. విభజనలో ఆంధ్ర నష్టపోయింది. ఆంధ్రది లోటు బజెట్. కేంద్రం ఆదుకోవడం లేదు. మోదీ మొండిచెయ్యి చూపిస్తున్నాడు. బిహారుకి లక్షన్నర కోట్లు, కశ్మీర్‌కు ఎనభైవేల కోట్లు చులాగ్గా యిచ్చేసిన మోదీ ఆంధ్రకు వచ్చేసరికి మట్టిపొట్లాం చాలన్నాడు. రాజధానికి ఏమిస్తారో ఎవరికీ తెలియదు. పదేళ్లదాకా ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు వున్నా, రాజకీయ కారణాల వలన తరలింపు మొదలెట్టారు. అదో పెనుభారం. ఉద్యోగుల హిరణ్యాక్షవరాలు తీర్చడం దగ్గర్నుంచి, కొత్త చోట ఏర్పాట్ల దాకా ఎన్నోవాటికి తడుముకోవాలి. ఇవన్నీ ప్రజలకు తెలుసు. ఉన్న పరిస్థితులకు అనుగుణంగానే మనం చిన్నగా చేసుకుందాం, పొదుపుగా వుందాం, కష్టపడి పైకి వద్దాం అంటే జనాలు అర్థం చేసుకుంటారు. అది మానేసి మనకు కేంద్రం నుంచి నిధులు వస్తాయి, ప్రత్యేక హోదా వస్తుంది అంటూ మభ్యపెడుతూ ఆ నిధులను యిలా ఖర్చుపెడతాం, అలా వినియోగిస్తాం అంటూ వూరించడం దేనికి? హోదా విషయంలో హామీ యిచ్చిన మోదీ మొన్న అమరావతి శంకుస్థాపన సమయంలో ఏమన్నారు? 'చట్టంలో వున్నవాటిని అమలు చేస్తాం' అన్నారు. చట్టంలో హోదా లేదుగా, అంటే హుళక్కి అనేగా అర్థం. అబ్బే కాదు, బిహార్ ఎన్నికల తర్వాత ప్రకటిస్తారు అన్నారు. ఏదీ ప్రకటన? పవన్ కళ్యాణ్‌ను అడిగితే 'ఇవ్వలేదని అనలేదుగా..' అంటూ నాన్చారు. కాంగ్రెసు కూడా యిలాగే చేసింది. 'సమైక్యంగా వుంచండి' అని అడగడానికి వెళ్లినందరికీ తల వూపుతూ వచ్చారు. ఉంచం అని చెప్పలేదు. చివరకు తాము చెయ్యాలనుకున్నది చేశారు. మోదీ ఐదేళ్లూ యిలాగే గడిపేస్తే అప్పుడు పవన్‌గారు ఎప్పుడు అడుగుతారట? సభాముఖంగా హామీ అమలు చేస్తామని చెప్పిన జనసేనాధిపతి యిప్పుడు అడగడానికే జంకుతున్నాడు. ఈయన పూచీత్తు చూసి మోసపోయినవారు లబోదిబో మనాలి. హోదాతో ఏం పని, నిధులు వస్తే చాలుగా అంటున్నారు. పోనీ నిధులు మాత్రం వచ్చాయా? ఇంత స్పష్టంగా పరిస్థితి కళ్లకు కట్టినట్లు కనబడుతూంటే యింకా ఎవరిని బుకాయిస్తారు?
ప్రజలను ఏమారుస్తున్నామనుకుంటూ తెలుగేశులిద్దరూ తామే ఏమారిపోతున్నారు. ప్రజల్లో విపరీతంగా ఆశలు పెంచాక, వాళ్లు నిలదీయడం మొదలెడుతున్నారు. వరంగల్ ఉపయెన్నికలో చూస్తున్నాం. ఒక్కో హామీ గురించి అడుగుతూంటే తెరాస నాయకులు ఏం జవాబు చెప్పాలో తెలియక తెల్లమొహం వేస్తున్నారు. రాష్ట్ర నాయకులకు వచ్చిన విద్య ఒక్కటే – కేంద్రాన్ని నిందించడం. వాళ్లు డబ్బులివ్వలేదు అందుకని చేయలేకపోయాం అని చెప్పుకుంటారు. తెరాస అదైనా చెప్పుకోగలదు కానీ టిడిపికి ఆ సౌకర్యమూ లేదు. బిజెపి మిత్రపక్షమై కూర్చుంది. గట్టిగా అడగలేం, మెత్తగా అడిగాం, ..వస్తోంది, వచ్చేస్తోంది, నీతి ఆయోగ్ అధ్యక్షుడికి కామెర్లు వచ్చాయి, వాళ్ల అత్తారింట్లో పెళ్లవుతోందిట, ఇంకో నెల్లాళ్లల్లో ముల్లె వచ్చేస్తుంది అని చెప్పుకుంటూ కాలం గడపాలి. జనం ఎన్నాళ్లు నమ్ముతారు? దేశం మొత్తం మీద సర్వశక్తిమంతుడైన మోదీ యిచ్చిన హామీలనే బిహారు వాళ్లు నమ్మలేదు, అంతకంటె ప్రాక్టికల్‌గా మాట్లాడిన నీతీశ్‌ను నమ్మారు. టిడిపి, తెరాసల మాటలు తెలుగు జనాలు నమ్మేసి ఓట్లు కురిపిస్తారని అనుకోవడం భ్రమ. వాళ్లు స్కైస్క్రాపర్లు, ఫ్లయిఓవర్లు అడగలేదు. ఉపాధి అవకాశాలు కల్పిస్తే చాలంటున్నారు. ఎప్పుడో వచ్చే పెద్ద ప్రాజెక్టులలో రాబోయే ఉద్యోగం కంటె ప్రస్తుతం భుక్తి గడవడానికి కాటేజీ యిండస్ట్రీ పెట్టుకునే సౌకర్యం కల్పిస్తే మహబాగు. ప్రాజెక్టు పెద్దదయిన కొద్దీ కోర్టులో కేసులు ఎక్కువవుతాయి. అవి ఒక పట్టాన తేలవు. మధ్యలో ప్రభుత్వం మారుతుంది. డిజైన్ మార్చాలంటారు. మళ్లీ జాప్యం. ప్రభుత్వం చిన్న చిన్న పనులు చేసి చూపించినా జనం సంతోషిస్తారు. నీతీశ్ తన మొదటి టర్మ్‌లో కాలువలపై వంతెనలు కట్టించి, చిన్న చిన్న వూళ్లవారికి రవాణా సౌకర్యాలు కల్పించాడట. స్కూలుకి వెళ్లే ఆడపిల్లలకు సైకిళ్లు యిప్పించి డ్రాపౌట్లు తగ్గించాడట. నిజానికి నీతీశ్ రెండో టెర్మ్ మొదటి దానంత బాగా లేదని విశ్లేషకులు చెప్తున్నారు. అయినా ఆ మాత్రానికే మురిసిన ప్రజలు మూడోసారి పట్టం కట్టారు. ఇది మన పాలకులు గుర్తించాలి. చిన్న పనులే చేపట్టండి. పూర్తి చేసి చూపండి. జనాలకు కాస్త ఆలంబన కలిగిస్తే చాలు, వాళ్ల బతుకులు వాళ్లే బతుకుతారు. పంజాబ్‌లా, హరియాణాలా యిల్లిల్లూ కార్ఖానాలా మార్చుకుని అందరూ కష్టపడి పైకి వస్తారు.
అలా కాకుండా 'విదేశాలు వెళ్లి పెట్టుబడులు తెస్తాం, రాష్ట్రం రూపురేఖలే మార్చేస్తాం, విదేశీయులతో చేసుకున్న ఒప్పందాలను బయటపెట్టం, టెండర్ పద్ధతిన కాకుండా నామినేషన్ పద్ధతిన పనులు చేసేస్తూంటాం, ఏం చేసినా మీ బాగు కోసమే, మీ బంగారు భవిష్యత్తు కోసమే..' అని చెపుతూ నేల విడిచి సాము చేస్తే ప్రజలు ఎంతకాలం ఓర్చుకుంటారు? గట్టిగా అడిగితే 'మా కింకా మూడున్నరేళ్ల వ్యవధి వుంది. వెంటనే ఫలితాలు రావు, బిడ్డ పుట్టాలన్నా 9 నెలలు ఆగాలిగా' అని వాదిస్తూన్నారు అధికారపక్షం వారు. తొమ్మిదీ తొమ్మిదీ పద్ధెనిమిది నెలలయింది. ఇప్పటిదాకా ప్రామిస్‌లు డెలివర్ కాలేదు. ఇప్పటికైనా ప్రామిస్‌లు ఆపండి. ప్రగల్భాలు మానండి. చిన్న స్థాయిలో కొంచెమైనా చేసి చూపండి. ప్రజలు ఆమోదిస్తారు.
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2015)