సినిమాలు ఎక్కువై, థియేటర్లు తక్కువై, అన్నింటికీ మించి చిన్న సినిమాలకు, పెద్ద సినిమాలకు, సోలో గా రావాలన్న యావ ఎక్కువై విడుదలలు అయోమయంలో పడుతున్నాయి. పైగా ఏ సినిమాకూ ఓపెనింగ్స్ అంతగా వుండడంలేదు. త్రిపుర లాంటి చిన్న సినిమా, అఖిల్ లాంటి పెద్ద సినిమా కూడా ఈ సమస్యను ఫేస్ చేసాయి. అందుకే ఇప్పుడు రిలీజ్ కు రెడీగా వున్న సినిమాలు కిందామీదా అవుతున్నాయి. 20న రెండు సినిమాలు ఫిక్స్ అయిపోయాయి. కమల్ చీకటి రాజ్యం, సుకుమార్ కుమారి 21ఎఫ్ రెడీ అయ్యాయి. 27న సైజ్ జీరో ఫిక్స్ అయింది. అదే రోజు బెంగాల్ టైగర్ కూడా విడుదల కావాల్సి వుంది. 26న లేదా 27న అన్నది ఇంకా తేల్చుకోలేకపోతున్నారు.
20న రెండు సినిమాలు, 27న ఒక సినిమా ఫిక్స్ అయిన తరువాత మరి థియేటర్లు ఏ మేరకు దొరుకుతాయి అన్నది అనుమానం. అందుకే బెంగాల్ టైగర్ సినిమా విడుదల మళ్లీ వెనక్కు వెళ్తున్నట్లు వినికిడి. వాస్తవానికి ఈ సినిమా ఈ నెల 11న విడుదల కావాల్సి వుంది. కానీ అఖిల్ సినిమా కారణంగా 20కి అట్నుంచి 27కు వెళ్లింది. కానీ ఇప్పుడు సైజ్ జీరో అడ్డం పడుతోంది.
నైజాం బయ్యర్ సునీల్ థియేటర్లు అడ్జస్ట్ చేయలేను అనడంతో డిసెంబర్ 4 లేదా 10,11 ల వైపు చూస్తున్నారట. అయితే ముందే కోన వెంకట్ అడిగి మరీ తన శంకరాభరణం సినిమాకు డిసెంబర్ ఫస్ట్ వీక్ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు. దాంతో ఇక ఆ తరువాతి వారం తప్ప మార్గం కనిపించడం లేదు. అంటే అనుకున్న నవంబర్ ఫస్ట్ వీక్ కు బదులు, డిసెంబర్ ఫస్ట్ వీక్ కు వెళ్లాల్సి వస్తోంది.