ఇదంతా ఐతిహ్యం. దీనికి పెద్దగా ఆధారాలేవీ లేవు. బ్రిటన్‌లో జనావాసాలు ఎప్పణ్నుంచో వున్నమాట, అక్కడి జనం యూరోప్‌లోని తక్కిన ప్రాంతాల వారితో వాణిజ్యసంబంధాలు పెట్టుకున్న మాట మాత్రం వాస్తవం. బ్రిటన్‌పై విదేశీయులు వరుసగా దండయాత్రలు చేయడం, కొందరు అక్కడే స్థిరపడడం వలన మిశ్రమ జాతులు ఏర్పడడం, స్థానికులు విదేశీయుల ఆచారవ్యవహారాలను అవలంబించడం, అనుసరించడం జరిగింది. క్రీ.పూ.55 ప్రాంతంలో గాలిక్ యుద్ధాల్లో భాగంగా జూలియస్ సీజర్ బ్రిటన్‌పై దండెత్తి అక్కడ సామంతరాజును నియమించి వెళ్లాడు. అగస్టస్ దండెత్తుదామని అనుకుని వాయిదా వేస్తూ పోయాడు. క్రీ.శ. 40లో కాలిగ్యులా 2 లక్షలమందిని సమీకరించాడు కానీ దండెత్తలేదు. మూడేళ్ల తర్వాత పదవీభ్రష్టుడైన బ్రిటన్ రాజును మళ్లీ సింహాసనంపై కూర్చోబెట్టడానికి క్లాడియస్ దండెత్తి బ్రిటన్ను తమ రోమన్ సామ్రాజ్యంలో భాగంగా చేసుకున్నారు. క్రమేపీ ఉత్తరదిశగా విస్తరిస్తూ పోయారు. కానీ స్కాట్లండ్ పూర్తిగా వారి అధీనంలోకి రాలేదు. 2 వ శతాబ్దపు చక్రవర్తులు స్కాట్లండ్ దాడులను తట్టుకోవడానికి బ్రిటన్ మధ్యలో రెండు గోడలు కట్టి ఎగువ బ్రిటన్, దిగువ బ్రిటన్లుగా (బ్రిటానియా సుపీరియర్, బ్రిటానియా ఇన్ఫీరియర్) విభజించారు. తర్వాత మరిన్ని భాగాలుగా విడగొట్టారు. రోమన్ సామ్రాజ్యం బలహీనపడుతున్న దశలో అనాగరికులైన బార్పేరియన్లు (బర్బరులు అందాం) బ్రిటన్‌పై దండెత్తి కొన్ని ప్రాంతాలు ఆక్రమించసాగారు. క్రీ.శ. 410 నాటికి రోమన్లు బ్రిటన్ వదిలి వెళ్లిపోయారు. రోమన్ల కారణంగా బ్రిటన్‌లో వ్యవసాయం, నగర నిర్మాణం, పారిశ్రామికోత్పత్తి, శిల్పకళ మెరుగుపడ్డాయి. రోమన్లు తమ స్నానాలకోసం కట్టిన స్విమ్మింగ్ పూల్‌లను యిప్పటికీ చూడవచ్చు. వాటి కోసమే కాబోలు 'బాత్' అనే నగరం లండన్ సమీపంలో వుంది.
రోమన్ల తర్వాత బ్రిటన్ను ఆక్రమించిన జాతుల్లో శాగ్జన్లు ముఖ్యులు. వీళ్ల ప్రభావం క్రీ.శ. 5 వ శతాబ్ది నుండి 11 వ శతాబ్దం వరకు వుంది. వీళ్లు జర్మన్ జాతికి చెందినవారు. వారి కంటె కాస్త ముందుగా జర్మనీ నుంచి వచ్చి బ్రిటన్‌లో స్థిరపడిన ఏంగ్లిస్తో కలిసి ఏంగ్లో-శాగ్జన్లుగా పిలవబడ్డారు. 1066లో నార్మండీ పాలకుడైన రాజైన విలియం ద కాంకరర్ చేతిలో పరాజయం పొందేవరకు వీరే పాలకులు. ఆ తర్వాతి నుండి నార్మన్లు పాలకులై యితరులను అదుపు చేయసాగారు. శాగ్జన్-నార్మన్ల కలయికతోనే ఆధునిక ఇంగ్లీషు జాతి ఏర్పడిందని చెప్పాలి. నార్మన్లు వచ్చేందుకు, శాగ్జన్లు వచ్చిన తర్వాత కింగ్ ఆర్థర్ కథ జరిగింది. శాగ్జన్లు అనేక దేశాలపై దాడి చేసి విజేతలుగా నిలిచారు. బ్రిటన్‌కు మొదట్లో కిరాయి సైనికుల్లా (మెర్సినరీలు) వచ్చారు. బ్రిటన్ అప్పుడు అనేక ప్రాంతాలుగా విడిపోయి, ఒకరితో మరొకరు యుద్ధాలు చేసుకుంటూ వుండేవారు. సాటి దేశస్తులను ఓడించడానికి విదేశీయుల సాయం అర్థించడం అనాదిగా వున్న పద్ధతే. తమ శత్రువులను నిలవరించడానికి బ్రిటన్ రాజులు శాగ్జన్ల భుజబలాన్ని ఉపయోగించుకుని దానికి ప్రతిఫలంగా కొంత భూమిని యిచ్చేవారు. వీళ్లు రాజుకు నచ్చచెప్పి తమ జాతి వారిని అధికసంఖ్యలో తెచ్చుకుని స్థిరనివాసం ఏర్పడేట్లు చూసుకున్నారు. కొన్నాళ్లకు రాజు బలహీనపడ్డాక తామే రాజులయ్యారు. ఇలాటి ఒక కథతో ఆర్థర్ కథ ప్రారంభమవుతోంది. ఆర్థర్ కథలో ముఖ్యపాత్ర మెర్లిన్ అనే మంత్రగాడిిది. అతను జోస్యాలు చెపుతాడు, శకునాలు చెప్తాడు, మందులు తయారుచేస్తాడు, మంత్రాలు చదువుతాడు. అతను ఆర్థర్ తండ్రి ఊథర్కి కూడా సలహాదారుడే. ఆంగ్లసాహిత్యంలో ఐంద్రజాలికుడు అంటే మెర్లిన్ పేరే చెప్తారు. పిల్లల కథల్లో, మాయామంత్రం సినిమాల్లో కూడా అతని పాత్ర వుంటుంది.
మెర్లిన్ వెలుగులోకి వచ్చిన వైనం చెప్పాలంటే వోర్టిజెర్న్ కథతో మొదలుపెట్టాలి. ఈ వోర్టిజెర్న్ బ్రిటన్ను ఏలిన చివరితరం రోమన్ పాలకుడైన కాన్స్టాంటైన్ 3 వద్ద పనిచేసేవాడు. ఇతని సేవలు మెచ్చి అతను బ్రిటన్‌లో బలమైన జాతిగా వున్న పిక్ట్లను పారద్రోలి యితనికి సింహాసనం అప్పగించాడు. వోర్టిజెర్న్ పాలిస్తూండగానే అతనికి పిక్ట్లతో, స్కాట్లండ్ వారితో తగాదాలు వస్తూండేవి. వారిని అణచడానికి యితను తన మావగారైన హెంగిస్ట్ అనే శాగ్జన్ రాజును జర్మనీ నుంచి సైన్యంతో పిలిపించాడు. అతను మొదట్లో సాయం చేసి, ఆ తర్వాత శాంతి చర్చలకు వచ్చినట్లు నటించి, యితని సేనలను మట్టుపెట్టి యితని రాజ్యం, అప్పటిదాకా నిర్మించిన పటిష్టమైన కోటలు లాక్కున్నాడు. ప్రాణభిక్ష పెట్టి పొమ్మన్నాడు. ఆ పరిస్థితిలో వోర్టిజెర్న్ కాంబ్రియా ప్రాంతానికి వచ్చేసి తన రక్షణ కోసం ఎరిర్ పర్వతంపై ఒక దృఢమైన స్తూపం కట్టాలని నిశ్చయించుకున్నాడు. అయితే ఎంత ప్రయత్నించినా పునాదులు నిలవటం లేదు. అప్పుడు ఆస్థాన జోస్యులను పిలిచి పరిష్కారం ఏమిటని అడిగాడు. 'తండ్రి ఎవరో తెలియని పిల్లవాణ్ని చంపి, వాడి రక్తాన్ని పునాదిరాళ్లపై చిలకరిస్తే అవి నిలబడతాయని వాళ్లు చెప్పారు. అలాటి పిల్లవాడి కోసం వెతకమని అనుచరులను ఆదేశించాడు రాజు. ఒక వూళ్లో యిద్దరు పిల్లలు పోట్లాడుకుంటూ వుంటే వారిలో ఒకడు 'నువ్వేమిట్రా నాతో దెబ్బలాడేది, నేను రాజవంశీకుణ్ని, నీకు మీ నాన్నెవరో కూడా తెలియదు' అని తిట్టడం వీళ్ల చెవిన పడింది. రాజుకి చేరవేస్తే ఆయన ఆ అబ్బాయిని, అతని తల్లిని తన వద్దకు రప్పించాడు. 'చూడబోతే ఉత్తమకుల సంజాతలా వున్నావు. మీ అబ్బాయి తండ్రి ఎవరో నీకు తెలియదన్నమాట వాస్తవమేనా?' అని అడిగాడు. 'అవును, అతను ఎవరో గంధర్వుడిలాటి వాడు. ఒక్కొక్కప్పుడు కనబడతాడు, మరోసారి కనబడడడు. అప్పుడప్పుడు మనుష్యరూపంలో నాతో కూర్చుని కబుర్లు చెపుతాడు. నాతో శయనిస్తాడు. ఫలితంగానే యీ మెర్లిన్ పుట్టాడు. అతనెవరో, వూరుపేరు ఏమిటో నాకు తెలియదు.' అందామె. భూమికి, చంద్రుడికి మధ్య వున్న అంతరాళంలో యిలాటి జీవులు సంచరిస్తూ వుంటాయని, వాటిలో సగం దైవాంశ, సగం మానవాంశ వుంటుందని, నచ్చిన మనుష్యులతో కలిసి అసాధారణ ప్రజ్ఞావంతుల పుట్టుకకు కారకులవుతారని ఆస్థాన మాంత్రికులు రాజుకి చెప్పారు.
సంభాషణంతా విన్న మెర్లిన్ 'ఇంతకీ మమ్మల్ని పిలిపించిన కారణం ఏమిటి?' అని ధైర్యంగా రాజును అడిగాడు. రాజు వున్నదున్నట్టు చెప్పాడు. అప్పుడు అతను 'మీ జోస్యులను పిలిపించండి, వారిని ప్రశ్నలు అడగాలి.' అన్నాడు. వాళ్లు వచ్చాక 'పునాదులు నిలవటం లేదంటే ఆధారం సరిగ్గా లేదని అర్థం. స్తూపం కట్టదలచిన ప్రదేశం కింద ఏముందో తవ్వి చూశారా?' అని అడిగాడు. వాళ్లు లేదని తెల్లమొహాలు వేశారు. రాజు తవ్వించి చూస్తే అక్కడ ఒక సరస్సు కనబడింది. 'చూశారా, అది గమనించకుండా నా ఉసురు తీద్దామని చూశారు. ఇప్పుడు ఆ సరస్సు కింద ఏముందో చెప్పగలరా?' అన్నాడు మెర్లిన్. చెప్పలేం అన్నారు జోస్యులు. 'బోలుగా వున్న రెండు శిలలు వుంటాయి. వాటిలో నిద్రిస్తున్న రెండు రాకాసులు వుంటాయి. కావాలంటే పరీక్షించండి' అన్నాడు మెర్లిన్. రాజు సరస్సు ఖాళీ చేయించి, శిలలు పగలగొట్టేసరికి ఆ రాకాసులు రెండూ బయటకు వచ్చి తలపడ్డాయి. తెల్ల రాకాసి, ఎఱ్ఱ రాకాసిని వెంటాడి సరస్సు అంచుదాకా తరిమితరిమి కొట్టింది. ఎఱ్ఱ రాకాసి కాస్సేపటికి సేదదీరి తెల్ల రాకాసిపై తిరగబడింది. 'ఇది దేనికి సంకేతం?' అని అడిగాడు రాజు. 'ఎఱ్ఱ రాకాసి బ్రిటన్లు, తెల్ల రాకాసి శాగ్జన్లు. శాగ్జన్లు బ్రిటన్లను ఓడించి కొన్ని శతాబ్దాల పాటు పాలిస్తారు. కొంతకాలానికి తమ శక్తి చూపించి అంతిమంగా బ్రిటన్లు విజయం సాధిస్తారు.' అని చెప్పాడు మెర్లిన్. రాజు నిట్టూర్చాడు. మెర్లిన్‌ను తన ఆస్థాన ఐంద్రజాలికుడిగా వుంచుకున్నాడు. అతని చేత జోస్యాలు చెప్పించుకునేవాడు.(సశేషం)
(చిత్రం – రోమన్ స్నానఘట్టాలు, యిప్పటికీ లండన్ పరిసరాల్లో వున్న బాత్ పట్టణంలో వీటిని చూడవచ్చు, రోమన్లనుండి శాగ్జన్లు ఆక్రమించిన కోట ప్రివెన్సే కేసిల్, ఈస్ట్ ససెక్స్‌లో యిప్పటికీ వుంది)
– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2015)